4, జనవరి 2023, బుధవారం

Thirunangur Divya Desams

                                  తిరునాంగూర్  దివ్యదేశాలు - 1


గతంలో ఒకసారి చెప్పుకొన్నాము శ్రీహరి ఇలలో కొలువైన నూట ఎనిమిది దివ్యదేశాలను నాటి భౌగోళిక పరిస్థితుల ప్రకారం చోళనాడు, పాండ్యనాడు, మలై నాడు, తొండై నాడు నాడు నాడు గా విభజించారు అని. 
ఆయా ప్రాంతాలలోని  వివిధ ప్రదేశాలలో శ్రీమన్నారాయణుడు కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. 
కానీ ఒకే క్షేత్రంలో ఎక్కువగా దివ్యదేశాలు కనిపించేది రెండు చోట్ల మాత్రమే ! మొదటిది కాంచీపురం. ముక్తి క్షేత్రం అయిన కంచిలో శివ మరియు విష్ణు కంచి ఉంటాయి. రెండు ప్రదేశాలలో కలిపి మొత్తంగా పదిహేను దివ్యదేశాలు కనిపిస్తాయి. 
రెండవ క్షేత్రం చిదంబరానికి చేరువలో ఉన్న తిరునాంగూర్. ఇక్కడ పదకొండు దివ్య దేశాలు కనిపిస్తాయి. 
కంచిలోని దివ్యదేశాల గురించి చాలా మంది ఆళ్వార్లు పాశురాలు గానం చేశారు. తిరునాంగూర్ లోని ఆలయాలకు దివ్యదేశాల హోదా రావడానికి కారణం "తిరుమంగై ఆళ్వార్ గానం చేసిన పాశురాలే కారణం. 

తిరుమంగై ఆళ్వార్ 

పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వార్లలో ఆఖరివాడుగా గుర్తింపబడిన ఈయన అసలు పేరు "కాళియన్". చోళ రాజుల సైన్యంలో దళాధిపతి. ఈయన జన్మస్థలం తిరునాంగూర్ కు సమీపంలోని  తిరుక్కురయలూర్ కావడం చెప్పుకోవలసిన విషయం. అతని ధైర్యసాహసాలకు, అందించిన విజయాలకు మెచ్చి రాజు అతనిని "తిరుమంగై" అనే ప్రాంతానికి అధిపతిని చేశారు. అప్పటి నుండి తిరుమంగై మారన్ అని తరువాత తిరుమంగై ఆళ్వార్ అని పిలవబడినారు. 
కుముదవల్లి అనే వైష్ణవ బాలికను వివాహం చేసుకోడానికి ఆమె పెట్టిన షరతులకు అంగీకరించి వైష్ణవునిగా, విష్ణు భక్తునిగా మారారు. 
శ్రీరంగ ఆలయ ప్రాకారాలతో ఒక దానిని ఈయన కట్టించారని చెబుతారు. మధురకవి ఆళ్వార్ తరువాత ఎక్కువగా దివ్యదేశ సందర్శన చేసిన ఆళ్వార్ తిరుమంగై. ఈయన మొత్తం ఎనభై ఎనిమిది దివ్యదేశాలను దర్శించుకున్నారు. 

 తిరునాంగూర్ దివ్యదేశాలు 

చోళరాజుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయాలు అన్నీ అత్యంత పురాతనమైనవి. వీటిల్లో కొన్ని ఎనిమిది లేక తొమ్మిదవ శతాబ్దాలలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. 
మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న దివ్యదేశాలకు సరిసమానమైన శివాలయాలు ఉండటం. అంతేకాదు ఈ విష్ణు, శివ ఆలయాలు తమిళనాడుతో సహా దేశంలో నెలకొని ఉన్న ప్రముఖ ఆలయాలకు ప్రతిరూపాలుగా కీర్తించబడటం. అంటే శ్రీరంగం, అయోధ్య, వారణాసి, తిరువణ్ణామలై ల సమానమైనవిగా గుర్తించి గౌరవించడం. 
మరో ముఖ్య విషయం ఏమిటంటే శ్రీవైష్ణవులకు అత్యంత పవిత్ర సందర్శనాక్షేత్రాలు శ్రీ రంగం, తిరుమల మరియు కంచి. ఆ మూడు క్షేత్రాలలో కొలువైన శ్రీవారు ఇక్కడ కూడా కొలువై ఉండటం. అనగా స్వామి ఇక్కడ స్థానక, ఉపస్థిత మరియు శయన భంగిమలలో దర్శనమిస్తారు. 
పద్మపురాణంలో ఈ పదకొండు దివ్యదేశాల గురించి "పలస వన మహత్యం" అనే కాడంలో వివరించినట్లుగా తెలుస్తోంది. 

తిరునాంగూర్ గరుడ సేవ 

ఆళ్వారులలో అగ్రగణ్యుడైన నమ్మాళ్వార్ జన్మస్థలమైన "ఆళ్వార్ తిరునగరి" లో వైశాఖ మాసంలో చుట్టుపక్కల ఉన్న తొమ్మిది దివ్యదేశాల ఉత్సవమూర్తులను గరుడ వాహనాల మీద తీసుకొని వస్తారు. నాటి రాత్రి ఒక్కో పెరుమాళ్ వద్ద నమ్మాళ్వార్ గానం చేసిన పాశురాన్ని గానం చేస్తారు. తమిళనాడులో చాలా ప్రసిద్ధి చెందిన ఉత్సవం ఆళ్వార్ తిరునగరి గరుడ సేవ. 
దానిని చూసి సుమారు నూట ముప్పైసంవత్సరాల క్రిందట తిరుమంగై ఆళ్వార్ శిష్యులు అదే మాదిరి గరుడ సేవను తిరునాంగూర్ లోని పదకొండు దివ్యదేశాలను అనుసంధానిస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. 
పుష్యమాస అమావాస్య మరుసటి రోజు రాత్రి ఘనంగా వేడుకగా ఈ గరుడ సేవను నిర్వహిస్తారు. 
తమిళనాట ఆళ్వార్ తిరునగరి గరుడసేవ ఎంతటి గుర్తింపును పొందినదో అంతటి ఆదరణ తిరునాంగూర్ గరుడసేవ పొందుతోంది. 
ఆ రోజున పదకొండు దివ్యదేశాల ఉత్సవమూర్తులు తిరుమణి మాడ కోయిల్ కు విచ్చేస్తారు. ఒకరి తరువాత ఒకరుగా తిరుమంగై ఆళ్వార్ విగ్రహం వద్దకు వస్తారు. అప్పుడు ఆళ్వార్ ఆ పెరుమాళ్ ను కీర్తిస్తో గానం చేసిన పాశురాలను పాడుతారు. ఇలా పదకొండు ఉత్సవ మూర్తుల పాశురగానం సాగుతుంది. అనంతరం తిరుమంగై ఆళ్వార్ శిష్యుడైన శ్రీ మానవళ మహర్షి తన గురువును ప్రశంసిస్తూ రాసిన కీర్తనలను గానం చేస్తారు. 
నాటి రాత్రి తిరుమంగై ఆళ్వార్ తో సహా గరుడవాహనాసీనులైన పందకొండు మంది పెరుమాళ్ళతో పెద్ద ఊరేగింపు జరుగుతుంది. 
మరుసటి రోజు తిరుమంగై ఆళ్వార్ మరియు ఉత్సవ మూర్తులు తమ తమ నిజ వాసాలకు తరలి వెళతారు. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగే తిరునాంగూర్ గరుడసేవ జీవితంలో ఒకసారి అయినా చూడవలసిన ఉత్సవం.  

క్షేత్ర గాథ 

ఒకే ప్రదేశంలో సమాన సంఖ్యలో విష్ణు, శివ ఆలయాలు ఉండటం అంటే ఆ క్షేత్రం మహామహిమాన్వితమైనది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాంగూర్ ఇంతటి కీర్తిని స్వంతం చేసుకోడానికి సంబంధించిన గాథ ప్రళయ కాలం నాటిదిగా తెలుస్తోంది. 
ప్రళయకాలంలో కావేరి నదీ తీరంలోని ఈ ప్రాంతం నీటిలో మునిగిపోలేదట. పునః సృష్టి ఆరంభించడానికి సృష్టికర్త సిద్దపడసాగారట. కానీ సాధ్యపడటానికి సహకరించే మహావిష్ణువు, మహేశ్వరుడు కైలాస వైకుంఠాలలో లేరట. 
అదే సమయంలో దేవతలు అసుర దాడులను ఎదుర్కొనే పరిస్థితి వచ్చినదట. రాక్షసుల మూలాన మహర్షులు యజ్ఞయాగాదులను చేయలేని పరిస్థితి తలెత్తినది. బ్రహ్మ దేవునితో కలిసి దేవతలు, మునులు వెతుకగా ఈ క్షేత్రంలో యోగధ్యానంలో ఉన్న హరిహరులను కనుగొన్నారట. 
ఏమి చేయాలో తెలియక వారందరు సమీపంలోని మాతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్లి ఆయన సహాయం అర్ధించారట. కారణం ఆయన సుదీర్ఘ కాలంగా శ్రీహరిని ధ్యానిస్తూ ఉండటమే !
ఆయన ప్రార్థనలకు సంతుష్టులైన వైకుంఠ వాసుడు దివ్యమంగళ రూపంలో సాక్షాత్కరించారట. 
అదే సమయంలో కైలాసనాధుడు కూడా వారికి దర్శనం ప్రసాదించారట. 
దేవతల ప్రార్ధన మేరకు ఇరువురూ పదకొండు రూపాలను ధరించి రాక్షస సంహారం చేశారట. పార్వతీదేవి అంశ అయిన మాతంగ మహర్షి కుమార్తెను పరమేశ్వరుడు  సమస్త దేవతలు, మహర్షుల సమక్షంలో వివాహమాడినది కూడా నాంగూర్ లోనే అని క్షేత్ర గాథ తెలుపుతోంది. 
త్రిమూర్తులు, దేవతలు, మహర్షులు నడయాడిన పవిత్ర తీర్థస్థలి కావడాన పవిత్ర శబ్దం తిరు చేర్చి   "తిరునాంగూర్" అని పిలవసాగారు. 
తిరునాంగూర్ లోని పదకొండు దివ్యదేశాలు పదకొండు పవిత్ర వైష్ణవ క్షేత్రాలతో సమానం. అవి ఏమిటో చూద్దాము. వీటిని సందర్శించడం వలన ఆ క్షేత్ర సందర్శనా ఫలం పొందవచ్చునన్నది భక్తుల విశ్వాసం. 

1 తిరుమణి మాడ కోయిల్  :

తిరుమణి మాడ కోయిల్ సందర్శన బదరీనాధ్ దర్శించిన ఫలితాన్ని ఇస్తుంది అంటారు. 
ఈ క్షేత్రంలో కొలువైన స్వామిని "నారాయణన్ పెరుమాళ్ " అని పిలుస్తారు. క్షేత నాయకి "పుండరీకవల్లి తాయారు" విడిగా సన్నిధిలో కొలువై ఉంటారు. 
స్వామి ఉపస్థిత భంగిమలో తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. శ్రీవారు ఇక్కడ రుద్రునకు, ఇంద్రునకు దర్శనం అనుగ్రహించారన్నది క్షేత్ర కధనం.
ఆలయ పుష్కరణి రుద్ర తీర్ధం వద్ద మహేశ్వరుడు అశ్వమేధ యాగం చేశారని కూడా తెలుస్తోంది. 
ఆలయ ప్రాంగణంలో తొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఒకటవ పరాంతక చోళ చక్రవర్తి ఆలయ నిర్వహణ నిమిత్తం సమర్పించిన ధనం తాలూకు శాసనం అన్నింటి లోనికి పురాతనమైనది. 
విశేష శిల్ప సంపద కనిపించని ఆలయంలో ఒక విశేషం మాత్రం నిత్యం కనిపిస్తుంది. 
ఉత్తరాయణ దక్షిణాయన అన్నది లేకుండా గర్భాలయ ద్వారానికి పైన ఉన్న మూడు రంధ్రాల నుండి ప్రతి నిత్యం సూర్యోదయంలో ప్రత్యక్షనారాయణుని తొలి కిరణాలు నారాయణ పెరుమాళ్ శిరస్సును తాకుతాయి. ఈ అరుదైన నిర్మాణ ప్రక్రియ చేసిన శిల్పులు నిజంగా మేధావులు. 
తిరుమంగై ఆళ్వార్ శ్రీ నారాయణ పెరుమాళ్ ని కీర్తిస్తూ పన్నెండు పాశురాలను గానం చేసారు. 
తిరుమణి మాడ కోయిల్ శిర్కాలి కి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
చిదంబరం లేదా శిర్కాలి నుండి సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చును. 

2. తిరు అరిమేయ విన్నగరం 

తిరునాంగూర్ దివ్యదేశాలలో రెండవది తిరు అరిమేయ విన్నగరం. ఈ క్షేత్ర సందర్శన శ్రీ కృష్ణుని బాల్యం గడచిన గోవర్ధన క్షేత్రంతో సమానంగా చెబుతారు. గోవర్ధనంతో అనేక బాల కృష్ణుని లీలలు ముడిపడి ఉన్నాయి కదా ! అందుకే ఈ క్షేత్రానికి ఈ పేరు. తిరు అరిమేయ విన్నగరం అంటే వర్ణించలేని మహత్యం గల ప్రదేశం అని అర్ధం. 
స్వామివారి వాహనమైన గరుత్మంతుడు తల్లి దాస్య విముక్తి కొరకు తెచ్చిన అమృత భాండాన్ని  నాగులకు దక్క కుండా శ్రీహరి చేసినది ఇక్కడేనంటారు. అలా అమృత భాండాన్ని స్వర్గ లోకం చేర్చిన ఆనందంతో స్వామి నృత్యం చేశారట. అందుకే స్వామిని "కోడమాడు కూతర్" అని పిలుస్తారు. ఉపస్థిత భంగిమలో ఒక పాదం పాత్ర మీద పెట్టి కనపడతారు. 
అమ్మవారు శ్రీ అమృతకాడవల్లి తాయారు". 
శిర్కాలి కి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యదేశ పెరుమాళ్  గురించి తిరుమంగై ఆళ్వార్ పది పాశురాలను గానం చేసారు. 

నమో నారాయణాయ !!!! 

 

  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...