12, జనవరి 2023, గురువారం

Thirunangoor Divya desams - 2

                             తిరునాంగూర్ దివ్యదేశాలు - 2



ఒకే ప్రదేశంలో అధిక సంఖ్యలో దివ్యదేశాలు ఉన్న ప్రాంతాలలో రెండవది అయిన తిరునాంగూర్ లో నెలకొన్న వాటిల్లో మూడవది తిరువెళ్ళం కుళం. స్థానికంగా అన్నన్ కోయిల్ గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం శిర్కాలి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

తిరు వెళ్ళం కుళం (అన్నన్ కోయిల్)

దక్షిణ తిరుమలగా పిలవబడే ఈ క్షేత్రంలోని ప్రధాన అర్చనామూర్తి "శ్రీనివాస పెరుమాళ్". స్థానక భంగిమలో దర్శనమిస్తారు. అమ్మవారు "అలిమేలుమంగ తాయారు ". 
ఎవరైతే తిరుమల వెళ్ళలేరో వారు వారి మొక్కుబడులను ఇక్కడ తీర్చుకోవచ్చును అన్నది స్థానిక విశ్వాసం. తిరుమంగై మరియు నమ్మాళ్వార్ లు గానం చేసిన పాశురాలలో తిరు వెళ్ళం కుళం పెరుమాళ్ ను తిరుమల స్వామికి పెద్దన్న క్రింద అభివర్ణించడం వలన స్వామిని "అన్నన్ " అని స్థానికంగా పిలుస్తారు. అలా "అన్నన్ కోయిల్" గా పిలవబడుతోంది. 
అగస్త్య మహర్షి ఈ క్షేత్ర గాధను ఉపరిచరవాసుకు చెప్పినట్లుగా పద్మ పురాణం పేర్కొంటోంది. 

పురాణ గాధ 

గతంలో "డుండు మారన్ " అనే సూర్యవంశం రాజు ప్రజలను కన్నబిడ్డల వలె పాలించేవారట. ఆయనకు లేకలేక ఒక పుత్రుడు జన్మించాడట. మహదానందం పొందిన రాజు కుమారునికి శ్వేత రాజు అని నామకరణం చేసారట. కులగురువైన వసిష్టునికి కుమారుని జాతక చక్రం వేయమని అర్ధించారట. ఆయన రాజకుమారుడు అల్పాయుష్కుడు అని తెలిపి, దీర్గాయువు పొందడానికి మార్గం తెలుపమని పలసవనం లో ఉన్న మహర్షులను కోరారట. వారిలో ఒకరైన "మరుత మహర్షి"
సమీపంలోని పుష్కరణి ఒడ్డున బిల్వ వృక్షం క్రింద తదేక దీక్షతో మహా మృత్యుజయ మంత్రాన్ని జపిస్తూ పక్కనే ఆలయంలో కొలువైన శ్రీనివాస పెరుమాళ్ ను భక్తితో ఒక మాసం సేవిస్తే తప్పక దీర్గాయుష్మంతుడు అవుతారని తెలిపారట. 
దాని ప్రకారం కార్తీక మాసంలో చేసిన శ్వేతరాజు శ్రీనివాస పెరుమాళ్ సాక్షాత్కారం, దీర్గాయుషు  పొందారట. రాజకుమారుని కోరిక మేరకు ఎవరైతే జాతకరీత్యా మృత్యు భయం కలిగి ఉంటారో  లేక వైద్యం లేని రోగంతో బాధ పడుతుంటారో వారు ఇక్కడ ఒక నెల (కార్తీకం) నియమంగా మహా మృత్యుంజయ మంత్రం పఠిస్తూ శ్రీనివాస పెరుమాళ్ ని సేవించుకొంటే  వారు వారి బాధల నుండి విముక్తి పొందుతారని స్వామివారు వరమిచ్చారట. 
ఈ క్షేత్ర సందర్శన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంతో సమానం అని పురాణాలు తెలుపుతున్నాయి. 
రాజకుమారుడు నిత్యం స్నానం చేసిన కోనేరును ఆయన పేరుతో శ్వేత పుష్కరణి (వెళ్ళం కుళం) అని పిలుస్తారు. ఆ పుష్కరణి పేరుతోనే గ్రామాన్ని కూడా తిరు వెళ్ళం కుళం అని పిలవసాగారు. 
తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే శ్రీనివాస పెరుమాళ్ న కీర్తిస్తూ పది పాశురాలను గానం చేశారు. మరో విశేషం ఏమిటంటే తిరు వెళ్ళం కుళం తిరుమంగై ఆళ్వార్ భార్య అయిన కుముదవల్లి నాంచారి పుట్టిన ఊరు. 

4. తిరు కవళంపాడి 

శిర్కాలికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ దివ్యదేశం. 
మూలవిరాట్టు రుక్మిణీ సత్యభామ సమేత  శ్రీ గోపాల కృష్ణ స్థానక భంగిమలో దర్శనమిస్తారు. హరిమిత్రన్ అనే భక్తుని తపస్సుకు మెచ్చి శ్రీహరి గోపాలునిగా కనిపించి మోక్షం ప్రసాదించారట. అనంతర కాలంలో శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుడు ఇదే క్షేత్రంలో నాడు హరిమిత్రన్ కు కనిపించిన రూపంలో దర్శనం పొందాలన్న ఆశయంతో తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకొన్నారన్నది స్థల పురాణం. 
తిరు కవళం పాడి గోపాల కృష్ణ దర్శనం ద్వారకాధీశుని దర్శనంతో సమానం అంటారు. 
తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే శ్రీ గోపాల కృష్ణ పెరుమాళ్ ను కీర్తిస్తూ పది పాశురాలను గానం చేశారు. 

5. తిరు థెట్రిఆంబలం 

 శ్రీ మహాలక్ష్మి తపస్సు చేసిన స్థలమైనందున "లక్ష్మీ రంగం " అని పురాణాలు పేర్కొన్నాయి. 
పలస వనంలో మహర్షులను ఇక్కట్లకు గురి చేస్తున్న అసురుని సంహరించడానికి దేవతల అభ్యర్ధన మేరకు భూలోకానికి తరలి వచ్చారట శ్రీహరి. 
ఆ స్వల్ప వియోగాన్ని తట్టుకోలేక శ్రీ మహాలక్ష్మి మరియు ఆది శేషుడు కూడా భూలోకానికి వచ్చి పలస వనం లోనే తపస్సు చేయసాగారట. 
రాక్షస సంహారం తరువాత వారి వద్దకు వెళ్లిన శ్రీమన్నారాయణుని వారు ఇక ముందెన్నడూ ఎలాంటి ఎడబాటు ఉండరాదని కోరారట. వారి కోరికను మన్నించిన వైకుంఠ వాసుడు అక్కడే శేషతల్పం మీద శయనించారట. పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి ఉపస్థితులై కనపడతారు. స్వామిని శ్రీ లక్ష్మీ రంగన్ అని పిలుస్తారు. స్వామి దర్శనం శ్రీ రంగ నాథ స్వామి దర్శనం ఒకటే అంటారు. 
శ్రీ మహాలక్ష్మి విడిగా శ్రీ సెంగమాల వల్లి అన్న పేరుతొ విడిగా కొలువై ఉంటారు. 
ఆది శేషుడు తపస్సు చేసిన  కోనేరును శేష పుష్కరణి అని, మహాలక్ష్మి తపమాచరించిన కోనేరును లక్ష్మీ పుష్కరణి అని నేటికీ పిలుస్తున్నారు.  
తిరుమంగై ఆళ్వార్  ఒక్కరే శ్రీ లక్ష్మీ రంగన్ ను కీర్తిస్తూ పది పాశురాలను గానం చేశారు. 

6.తిరువాన్ పురుషోత్తమన్ కోయిల్ , తిరునాంగూర్ 

అయోధ్యా రాముని దర్శనంతో సమానమైన శ్రీ పురుషోత్తముడు కొలువైన ఆలయం తిరునాంగూర్ 
లోనే ఉంటుంది. శ్రీ మహావిష్ణువు తమిళనాడులో కొలువైన అనేక ఆలయాలలో శ్రీ పురుషోత్తమునిగా పిలవబడే ఆలయం ఇదొక్కటే !
తిరునాంగూర్ దివ్యదేశాలలో చాలా ముఖ్యమైన ఆలయంగా ప్రసిద్ధి చెందినది. తొలినాటి ఆలయం ఇటుకలతో నిర్మించబడినదట. శ్రీ రామ భక్తుడైన తిరుమంగై ఆళ్వార్ రాతితో పునః నిర్మించారని తెలుస్తోంది. 
శ్రీవారు ఈ క్షేత్రంలో ఉత్తంగ మహర్షికి సాక్షాత్కరించారట. అదే విధంగా వ్యాఘ్రపాద మహర్షి కుమారుని ఆకలి తీర్చడానికి పాల సముద్రాన్ని భూమి మీదకు రప్పించారని అంటారు. నేటికీ  నాంగూర్ లో కనిపించే పెద్ద చెరువును "తిరుప్పార్కడల్"(పాల సముద్రం) అని పిలుస్తారు. కార్తీక మాస  ఏకాదశి, ద్వాదశి రోజులలో ఈ కోనేటిలో స్నాన మాచరిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి అని విశ్వసిస్తారు. 
శ్రీ పురుషోత్తమ పెరుమాళ్ స్థానక భంగిమలో దర్శనం ప్రసాదిస్తారు. అమ్మవారు శ్రీ పురుషోత్తమ నాయకి విడిగా సన్నిధిలో కొలువై ఉంటారు. 
తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే శ్రీ పురుషోత్తమ పెరుమాళ్ ను కీర్తిస్తూ పది పాశురాలను గానం చేశారు. 

ఓం నమో నారాయణాయ !!!! 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...