దయగల దైవం ధభళేశ్వరుడు
ఉత్కళ దేశం జగన్నాథ భూమిగా ప్రసిద్ధి. ఒరియా ప్రజల ఆరాధ్య దైవం శ్రీ జగన్నాధుడు. వారి తల్లి తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే ! వారి విశ్వాసానికి తగినట్లుగానే జగన్నాధుడు సోదర సోదరీ సమేతుడై తన ప్రజల గృహాల వద్దకు రధారూరుడై తరలి వెళతారు. ప్రతినిత్యం తనకు నివేదించే భోజనాన్ని తన వారందరికీ మహాప్రసాదం క్రింద అందచేస్తారు.
కానీ చిత్రమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో అధికంగా ఆది దంపతులైన శ్రీ దుర్గ మహేశ్వరుల ఆలయాలు కనపడటం.
మొత్తంగా యాభై ఒకటి శక్తి పీఠాలు భారత దేశం తో పాటు పక్కన ఉన్న దేశాలలో ఉన్నాయన్నది పురాణాలు తెలుపుతున్న విషయం. వీటిల్లో పద్దెనిమిది "అష్టాదశ శక్తి పీఠాలు"గా ప్రసిద్ధి. అవి కాకుండా మరో నాలుగు మహా లేక ఆది శక్తి పీఠాలు కూడా ఉన్నాయి అంటారు. వాటిల్లో రెండు, అష్టాదశ పీఠాలలో ఒకటి ఒడిశాలో ఉండటం చెప్పుకోవలసిన విశేషం.
ఇక కైలాసనాధునికి అనేక ప్రసిద్ధ ఆలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.
ఇవన్నీ కూడా తమవైన పురాణ చారిత్రక నేపధ్యం కలిగి ఉండటం ప్రస్తావించవలసిన అంశం.
అలాంటి వాటిలో ఒకటి శ్రీ ధభళేశ్వర మహాదేవ మందిరం.
కటక్ ఉత్కళ దేశ ఒకప్పటి రాజధాని. కథజొరీ మరియు మహానదుల మధ్య నెలకొని ఉన్న ద్వీపాన్ని గతంలో "కటకం" అని పిలిచేవారు. మనదేశం లోని పురాతన నగరాలలో ఒకటిగా పేరొందిన కటక్ పట్టణానికి సమీపంలో మహానది మధ్యలో ఏర్పడిన చిన్న ద్వీపంలో ఉంటుంది శ్రీ ధభళేశ్వర మహాదేవ మందిరం.
ఆలయ గాథ
కొన్ని శతాబ్దాల క్రిందట ఈ ప్రాంతంలో పశువుల దొంగలు ఎక్కువగా ఉండేవారట. వారి బారి నుండి తమ పశువులను కాపాడుకోడానికి ప్రజలు చాలా అప్రమత్తులై ఉండేవారట. దొరికిన చోరులను కఠినంగా శిక్షించేవారట.
అలాంటి సమయంలో భార్యా బిడ్డలను పోషించడానికి తప్పక దొంగతనానికి బయలుదేరాడట ఒక చోరుడు. అతను నిత్యం శివపూజ చేసే వాడట. అతికష్టం మీద ఒక నల్ల కొయ్య దూడను దొంగిలించగలిగాడట. దానిని రహస్యంగా తీసుకొనివెళుతున్న సమయంలో కాపలాదారుల కంట పడ్డాడట. వేరేదారి లేక ఆలయం లోనికి వెళ్లి గర్భాలయంలో దాక్కున్నాడట.
కాపలావారు ఆలయం చుట్టూ ఉండి దొంగ బయటికి వస్తే పట్టుకొని శిక్షిద్దామని ఎదురుచూస్తుండి పోయారట. పరిస్థితి అర్ధమైన చోరుడు తన ఆరాధ్య దైవానికి మొరపెట్టుకొన్నాడట. తనను కాపాడితే ఇకపైన దొంగతనాలు చేయకుండా కస్టపడి జీవితాన్ని గడుపుతానని, ఆయన పాదాలను వదలనని ప్రమాణం చేసాడట.
అదే సమయానికి వెలుపల కాపలాదారుల వద్దకు ఒక సాధువు వచ్చారట. వారిని విషయం అడిగి తెలుసుకొని లోపల ఉన్నది దొంగ కాదని, అతని దగ్గర ఉన్నది నల్ల కొయ్యదూడ కాదన్నారట. దానికి ఆగ్రహించిన కాపలావారు అదే నిజమైతే అతనిని విడిచిపెడతాం అన్నారట.
సాధువు లోనికి వెళ్లి దొంగను దూడతో పాటు వెలుపలికి తీసుకొని వచ్చారట. ఆయన చెప్పినట్లుగా అది తెల్లటి కొయ్య దూడ.
ఆశ్చర్యపోయి చూస్తుండగానే సాధువు మాయమై పోయారట.
దొంగతో సహా అందరికీ అర్థమైనది ఆయన స్వయం సర్వేశ్వరుడు అని!
నాటి నుండి నల్ల కొయ్యదూడను తెల్లగా మార్చిన స్వామిని శ్రీధభళేశ్వర మహాదేవుడు అని గౌరవంగా పిలవసాగారు. దొంగ తన ప్రమాణం ప్రకారం మారిపోయాడు అన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
ఈ గాధకు ప్రమాణంగా గర్భాలయ ద్వారానికి రెండుపక్కలా తెల్ల నల్ల నందులను ఉంచారు.
ఆలయ విశేషాలు
మహానదిలో సహజంగా ఏర్పడిన ద్వీపం "ధభళేశ్వర్". ధభళేశ్వరుడు కొలువైనందున అదే పేరుతో పిలుస్తున్నారు.
పై సంఘటన జరిగింది తొమ్మిదో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన సోమవంశీల కాలంలో జరిగిందని శాసనాలు చెబుతున్నాయి. నాటి పాలకుడైన "యయతీ కేసరీ వర్మ" ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. కాలక్రమంలో వివిధ రాజవంశాల వారు చేసిన మార్పులు, అభివృద్ధి కారణంగా ప్రస్తుత రూపంలో దర్శనమిస్తుంది.
శ్రీ గణపతి, శ్రీ హనుమంతుడు, శ్రీ భద్రకాళి ఉపాలయాలలో దర్శనమిస్తారు. శ్రీ పార్వతీ దేవి విడిగా కొలువుతీరి ఉంటారు.
గర్భాలయంలో శ్రీ ధభళేశ్వర మహాదేవుడు స్వయంభూ లింగ రూపంలో దర్శనమిస్తారు.
ఆలయ ఆకర్షణలు
సుందర ఆహ్లాదకరమైన పరిసరాలు. నిరంతరం ప్రవహించే జీవనది. స్వచ్ఛమైన చల్లని గాలి. మనస్సులను మురిపిస్తాయి.
రెండు దశాబ్దాల క్రిందట పడవలలో చేరుకోవలసి వచ్చేది. తరువాత వ్రేలాడే తీగల వంతెన నిర్మించారు. దాని మీద నడుచుకుంటూ ఆలయాన్ని చేరుకోవడం ఒక చక్కని అరుదైన అనుభూతి.
ప్రతి నిత్యం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం మూడు నుంచి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉండే ఆలయంలో దేవతామూర్తులకు అనేక రకాల అభిషేకాలు, అలంకరణలు, ఆరగింపులు మరియు పూజలు చేస్తారు.
ప్రతి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. కార్తీక, శ్రావణ మాసాలలో వేలాదిగా భక్తులు విచ్చేస్తారు. సోమవారాలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా పౌర్ణమి రోజులలో విశేష పూజలు జరుపుతారు. పూష పూర్ణిమ, డోల పూర్ణిమ ఇలా ప్రతి నిండు పున్నమి రోజులలో ప్రతేకమైన అలంకరణ, పూజలు నిర్వహిస్తారు.
కార్తీక మరియు శ్రావణ పౌర్ణమి నాడు, శివరాత్రికి పెద్ద ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు తరలి వస్తుంటారు.
ఒడిశా రాష్ట్రంలోని అనేక శివాలయాలలో శ్రీ ధభళేశ్వర మహాదేవుడు కొలువు తీరిన ఈ క్షేత్రం ప్రత్యేకమైనదిగా పేర్కొనబడుతోంది.
ఈ క్షేత్రానికి కటక్ నుండి ప్రెవేటు వాహనాల ద్వారానే చేరుకొనే అవకాశం మాత్రమే ఉన్నది. అదే విధంగా కటక్ మరియు మరికొన్ని తీర ప్రాంత గ్రామాల నుండి నీటి మార్గంలో కూడా ఇక్కడికి చేరుకోవచ్చును.
చక్కని వసతి సౌకర్యాలు కటక్ నగరంలో లభిస్తాయి.
దేశం నలుమూలల నుండి కటక్ రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి