Peroor Sri Krishna Swamy Temple, Tiruvananthapuram


        పేరూర్ శ్రీ కృష్ణ స్వామి ఆలయం, అంబలముక్కు 





అనంత శయనుడు  కొలువైన తిరువనంత పురంలో ఎన్నో అద్భుత, అరుదయిన ఆలయాలున్నాయి. అన్నీ కూడా అరుదైనవి, తప్పనిసరిగా దర్శించతగినవి. తిరువనంతపురం రాజులు విష్ణు భక్తులు కదా ! అందుకే కేరళ రాజధానిలో అధికశాతం శ్రీ విష్ణు రూపాల ఆలయాలే కనపడతాయి. శ్రీ పరశురామ, శ్రీ నారసింహ, శ్రీ వరాహ ఇత్యాది ఆలయాల వరుసలో ఒకటి శ్రీ పేరూరు శ్రీ కృష్ణ స్వామి ఆలయం. 
వీటిల్లో కొన్నిటిని ఇంతకు  ముందు ఈ బ్లాగ్ లో ప్రచురించడం జరిగింది. 
అవన్నీ ముందుగా తెలుసుకొని తరువాత అనుకోని సందర్శించినవి. 
అనుకోకుండా దర్శించుకొన్న క్షేత్రం "పేరూర్ శ్రీ కృష్ణ స్వామి ఆలయం". 
తిరువనంతపురం రైల్వే స్టేషన్ కు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న "అంబళం ముక్కు" లో ఉంటుంది ఈ ఆలయం.  





మలయాళంలో అంబళం అంటే ఆలయం. ముక్కు అంటే ప్రదేశం. 
అంటే శ్రీ కృష్ణ స్వామి ఆలయం వలన ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చినట్లుగా అర్ధం చేసుకొనవచ్చును. 






వెయ్యి సంవత్సరాల క్రిందట ఈ ప్రాంతం చిన్న పల్లెటూరు.
వ్యవసాయం మరియు ఇతర పనులు చేసుకొంటూ ఇక్కడి ప్రజలు ఆనందంగా జీవిస్తుండేవారు.
కాకపొతే భగవద్దర్శనం కొరకు అప్పట్లో దూరంగా ఉన్న నగరానికి వెళ్ళాల్సివచ్చేది.
తమ గ్రామం లోనే లోక పాలకుడైన భగవంతునికి ఒక ఆలయం నిర్మించు కొవాలన్న ఆలోచన వారి మనస్సుల్లో మొలకెత్తినది.











అంతా రైతులు. రెక్కాడితే డొక్కాడని బ్రతుకులు. ఏమి చేయాలి అని ఆలోచించి చివరకు మహారాజు వద్దకు వెళ్లి తమ ఆకాంక్షను వెల్లడించారు. పరమ దైవ భక్తుడైన మహారాజు 
వారి దైవ భక్తికి సంతసించి ఆలయ నిర్మాణం కొరకు కావలసిన ధనం మరియు నిపుణులైన శిల్పులను పంపారు. 
అలా గ్రామస్తుల కల వారి సదుద్దేశ్యంతో మహారాజు సహకారంతో నిజమైనది.
నాటి నుండి అక్కడి ప్రజలు భక్తిశ్రద్దలతో నిత్య పూజలతో కొలువైన శ్రీ కృష్ణ స్వామిని                      కొలుచుకొంటున్నారు.







 కాలం ప్రశాంతంగా గడిచిపోయినది. కాలక్రమంలో పురాతన నిర్మాణం శిథిలావస్థకు చేరుకొన్నది. దానితో 2003 వ సంవత్సరంలో ట్రావెంకూర్ దేవస్వం బోర్డు వారు పూనుకొని  శిధిలమైన ఆలయాన్ని పునః నిర్మించారు.





సువిశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవతా మూర్తుల సన్నిధులతొ సర్వాంగ సుందరంగా ఆధ్యాత్మిక వాతావరణం నిండి  ఉంటుందీ ఆలయం. అన్నీ కూడా కేరళ సంప్రదాయ నిర్మాణ శైలిలో  ఉండటం  విశేషం. 




తూర్పు, పడమరలలో  ప్రవేశ ద్వారాలున్నాయి. 
తూర్పు నుండి ప్రాంగణం లోనికి వెళితే ఎదురుగా ధ్వజస్తంభం మరియు బలి పీఠం కనపడతాయి. ఆగ్నేయంలో ఆలయ కార్యాలయము, పాక శాల ఏర్పాటు చేసారు. 
ఈ దిశ లోనే ప్రాంగణం వెలుపల పుష్కరణి కలదు.

  
 


ప్రదక్షణా పదంలో దక్షిణ దిక్కులో చక్కని దశావతార మండపం నిర్మించారు. 
స్తంభాలపైన దశావతార మూర్తులతో పాటు మొదటి నాలుగు స్థంబాల పైన  ద్వార పాలకులు, గరుడ, హనుహ విగ్రహాలను కూడా ఉంచారు. 
మండప పై భాగాన వివిధ వర్ణభరిత విష్ణు లీలా చిత్రాలను మనోహరంగా చిత్రీకరించారు. వీటిల్లో అనంత శయన విష్ణు, కాళియ మర్దన కృష్ణ మరియు గజేంద్ర మోక్ష ఘట్టం రమణీయంగా ఉంటాయి. 





























మండపం దాటిన తరువాత వినాయక ఉపాలయము, నాగ ప్రతిష్టలు, ఆలయ వృక్షం ఉంటాయి. 
వాయువ్య భాగంలో వేదిక, పక్కనే హరిహర పుత్రుడైన శ్రీ ధర్మ శాస్త సన్నిది. కేరళ ఆలయాలలో నాగ ప్రతిష్టలు, శ్రీ ధర్మశాస్త సన్నిధి తప్పనిసరి. 





ఈశాన్యంలో శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి. చిత్రమైన విషయం ఏమిటంటే సహజంగా విష్ణు ఆలయాలలో శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి మరియు నవగ్రహ మండపం ఉండవు. 
కానీ పేరూర్ ఆలయంలో సుబ్రహ్మణ్య ఉపాలము పక్కనే నవగ్రహ మండపము ఉంటుంది. అరుదైన విషయం. 
ఇందులో నవగ్రహాలు సతీ సమేతంగా కొలువుతీరి ఉండటం మరో ఆసక్తికర అంశం. 
రాహుకేతు పూజలకు, నవగ్రహ హోమం, గణేష హోమం, సుదర్శన హోమం, మహా మృత్యుంజయ హోమం, నవగ్రహ శాంతి పూజలుజపాలకు ఈ ఆలయం ప్రసిద్ది. 








గర్భాలయం వర్తులాకారంలో ఉంటుంది. 
అక్కడి మెట్ల వద్ద కైలాస వాసుడు లింగ రూపంలో కొలువైవుంటారు. 
గర్భాలయంలో సుందర చందన, పుష్ప అలంకరణ లో ద్వారకనాధుడు దర్శనమిస్తారు. 
అసలు విషయం ఏమిటంటే మూలవిరాట్టు చతుర్భుజాలతో ఉన్న శ్రీహరే !
కానే అలంకరణ అంతా యశోదా తనయునిది. 
బాలకృష్ణ , గోపాలకృష్ణ, రాధ కృష్ణ, వెన్నముద్ద ధరించిన కృష్ణ ఇలా రోజుకొక విశేష అలంకరణ జరుపుతారు. చూడటానికి నేత్రపర్వంగా ఉంటాయి అలంకరణలు. రోహిణి నక్షత్రం రోజు, అష్టమి తిధి నాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆలయంలో. 
నిత్యం నాలుగు పూజలు నియమంగా జరిగే శ్రీ కృష్ణ స్వామి ఆలయానికి  అన్ని హిందూ మరియు స్థానిక పర్వదినాలలో విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారు. 
శ్రీ కృష్ణ జన్మాష్టమి అత్యంత ఘనంగా జరుపుతారు. దాని తరువాత అంత వైభవంగా మీనం మాసం (మార్చి - ఏప్రిల్ )లో పది రోజుల పాటు ఆలయ ఉత్సవాలను నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తం నుండి భక్తులు తరలివస్తారు.  ఈ రెండు ఉత్సవాల సందర్భంగా అంబళం ముక్కు ప్రాంతం పండగ వాతావరణం సంతరించుకొని సందడిగా కనిపిస్తుంది. 
ఒకప్పుడు నగరానికి దూరంగా ఉండే ఈ ప్రాంతం ప్రస్తుతం తిరువనంతపురంలో కలిసిపోయింది. 
నగర సరిహద్దులలో ప్రధాన రహదారికి అతి సమీపంలో అత్యంత ప్రశాంత ఆద్యాత్మిక వాతావరణం నిండి వుండే పేరూర్ శ్రీ కృష్ణ స్వామి ఆలయం తిరువనంతపురంలో తప్పక సందర్శించాల్సిన క్షేత్రం. 
శ్రీ అనంత పద్మనాభ ఆలయం వద్ద నుండి అంబల ముక్కుకు నేరుగా సిటీ బస్సులు లభిస్తాయి. 


కృష్ణం వందే జగద్గురుం !!!!!























కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore