15, డిసెంబర్ 2014, సోమవారం

Sri Govardhan Swamy Temple, Nadendla

                             శ్రీ గోవర్ధన స్వామి ఆలయం, నాదెండ్ల 

ఆంధ్ర దేశం వివిధ రాజ వంశాల పాలనలో అన్ని విషయాలలో సర్వతోముఖాభివృద్ది చెందినది.
ముఖ్యంగా ఆధ్యాత్మిక అంశంలో మిగిలిన ప్రాంతాలతో పోల్చుకొంటే ఒకడుగు ముందే ఉన్నదని మారు మూల ఉన్న చిన్న చిన్న గ్రామాలలో నెలకొల్పబడిన విశిష్ట ఆలయాలను సందర్శిస్తే అర్ధమవుతుంది.
ఒకప్పుడు అత్యున్నత ప్రాధాన్యత కలిగి నేడు ఒక గ్రామం ఉన్న "నాదెండ్ల" పైన తెలపబడిన దానికి ప్రత్యక్ష సాక్ష్యం అని గ్రహించ వచ్చును.
ఎందరో రాజ వంశాలు పాలించిన "నందవరం" నేటి నాదెండ్ల నందవంశ రాజుల మరియు రెడ్డి రాజుల కాలంలో చాలా ప్రాముఖ్యం కలిగిన ఊరు.
నందవంశ రాజుల కులదైవం శ్రీ గోవర్ధన స్వామి పేర్ల మీద నంద పురం గా పిలవబడి కాల క్రమంలో నాదెండ్ల గా మారిందని చెబుతారు.
ఈ గ్రామంలో సందర్శించవలసిన పురాతన మరియు నూతన ఆలయాలు ఆరు ఉన్నాయి.
ప్రధానమైనది శ్రీ గోవర్ధన స్వామి ఆలయం.
పదహారవ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించే వరకు గ్రామం మధ్యలో ఉన్న "తాత కొండ" మీద ఉండేదిట ఆ ఆలయం. నేటికీ కొండ మీద ఆ శిధిలాలు కనపడతాయి.












ప్రాంతంలో సామరస్యం నెలకొన్న తరువాత కొండ క్రింద ఉన్న శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయంలో పునః ప్రతిష్టించారు. 
ప్రధాన అర్చనా మూర్తి శ్రీ చెన్న కేశవుడు అయిన ఆలయానికి, ఆలయ ఆస్తులకు, మాన్యాలకు అధిపతి శ్రీ గోవర్ధనుడే !
శ్రీ గోవర్ధన స్వామి ఆలయాన్ని సుమారు ఎనిమిది వందల పురాతనమైనదిగా పేర్కొంటారు.
తూర్పు ముఖంగా ఉన్న ఆలయానికి మూడు అంతస్తుల రాజగోపురం ఉంటుంది.













ఆలయానికి ఎదురుగా రధం, పక్కనే శ్రీ వీరాంజనేయ స్వామి మరియు శ్రీ రామ స్వామి మందిరం ఉంటాయి. 
చైత్ర మాసంలో జరిగే స్వామి వారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా పౌర్ణమి నాడు రధోత్సవం జరుపుతారు. 
1924లో నిర్మించిన శ్రీ వీరాంజనేయ ఆలయం వెనుక ఆసక్తికరమైన కధనం స్థానికంగా వినిపిస్తుంది. 
గ్రామంలో ఒక భక్తునికి స్వప్నంలో వాయునందనుడు కనపడి తాను దాపున ఉన్న పర్వతాలలో కొలువైఉన్నానని తెలిపారట. 
గ్రామస్తులంతా కలిసి గ్రామం చుట్టూ ఉన్న కొండలను గాలించగా ఒక చోట పెద్ద రాతి మీద స్వామి వారి దివ్య మూర్తి చెక్కబడి కనపడినదట. తీసికొనివచ్చి కొండ క్రింద ప్రతిష్టించారట.  











రాజగోపురం గుండా సువిశాల ప్రాంగణం లోనికి వెళితే ధ్వజస్తంభం, బలి పీఠం, ఎడమ పక్కన పాక శాల, దాని పైన చక్కని మండపం  శ్రీ గరుత్మంతుని సుందర విగ్రహం కనపడతాయి.














ప్రదక్షణ చేస్తున్నప్పుడు దక్షిణ వాకిలి, ఎదురుగా ఉత్సవ మండపం,ఆలయ వెనుక గుట్టలు గుట్టలుగా'పర్వతం ఉంటాయి. 
వాయువ్యం లో శ్రీ హనుమంతుని సన్నిధి ఈశాన్యంలో యాగ శాల ఉంటాయి.  













ఉత్తర ద్వారం పైన నారద తుంబుర గానం వింటూ శేష తల్పం పైన శయనించిన శ్రీ అనంత పద్మనాభుని విగ్రహం రమణీయంగా దర్శనమిస్తుంది. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం ఈ ద్వారం గుండానే లభిస్తుంది. 


















రంగ మండపం దాటి ముఖ మండపం లోనికి వెళితే వర్ణమయ రూపాలతో ద్వార పాలకులు జయ విజయులు నిలబడి ఉంటారు. 
ఇవి ఒక్కప్పుడు కొండవీటి కోట ఖజానాకు నాలుగు పక్కలా ఉన్న విగ్రహాలట. కోట పూర్తిగా శిధిలమైన తరువాత రెండింటిని ఇక్కడకు తెచ్చారట. 

















ఆలయ అంతర్భాగంలో ప్రధాన అర్చనా మూర్తి శ్రీ చెన్న కేశవ స్వామి చతుర్భుజాలతో, ఇరువైపులా శ్రీదేవి భూదేవి లతో స్థానక భంగిమలో రమణీయ అలంకరణలో దర్శనమిస్తారు. పక్కనే ఆళ్వార్ సన్నిధి, ఇటుపక్కన శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ గోవర్ధన స్వామి వేణు ధరునిగా స్థానక భంగిమలో భక్తులను అనుగ్రహిస్తారు. 
ఆ పక్కనే శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారి సన్నిధి ఉంటుంది. 
ప్రతి రాత్రి స్వామి వారికి పవళింపు సేవ నియమంగా జరుపుతారు. 













ధనుర్మాసం, వైకుంఠ ఏకాదశి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ రామనవమి  ఘనంగా నిర్వహిస్తారు.అన్ని హిందూ పర్వదినాలలో స్థానిక, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామివారి దర్శనార్ధం తరలి వస్తారు. 










ముఖ్యమైన శ్రీ గోవర్ధన స్వామి ఆలయానికి ఎదురుగా చిన్న కొండ మీద శ్రీ సీతారామ లక్ష్మణ ఆలయం.
మెట్ల మార్గంలో ఆ చిన్న కొండ ఎక్కితే ఉత్తర ముఖంగా ఉన్న ప్రధాన ఆలయం మరో రెండు ఉపాలయాలు దర్శమిస్తాయి. 
 ధ్వజస్తంభం వద్ద ముకుళిత హస్తాలతో శ్రీ భక్తాంజనేయుడు కొలువై ఉంటారు. 
ఒకప్పుడిది శ్రీ కోదండ రామ స్వామి కోవెల. సుల్తానుల కాలంలో విగ్రహాలను భిన్నం చేయగా తరువాత కొత్త వాటిని ప్రతిష్టించారు. 
గమనించాల్సిన అంశం ఏమిటంటే జానకీ దేవి రాముల వారి వామాంకము మీద కూర్చొని ఉండగా కుడివైపున లక్ష్మణ స్వామి నిలబడి కనపడతారు. 
అచ్చం భద్రాచలంలో మాదిరిగానే ... కాకపోతే భద్రాచలంలో లక్మణుడు ఎడమవైపున ఉంటారు. 










చక్కని రాతి నిర్మాణం ఈ ఆలయం. 
తదనంతర కాలంలో శ్రీ చెన్న కేశవ స్వామిని, కలియుగ వరదుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టించారు. 










ఈ రెండు ఆలయాలకు, శ్రీ వీరాంజనేయ మందిరానికి పూజాదికాలు నిర్వహించే అర్చక స్వామి శ్రీ శ్రీనివాసాచార్యులు ఆలయానికి పక్కనే నివసిస్తుంటారు. 










నాదెండ్ల గ్రామంలో మరో ముఖ్య పురాతన ఆలయం శ్రీ గంగా మీనాక్షీ సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం.
నంద రాజుల కాలంలో నిర్మించిన ఆలయమని అంటారు.
మరో అంశం ఏమిటంటే అన్ని ఆలయాలలో ప్రాంగణంలో ఆగ్నేయ మూల ఎత్తులో సుందర మండపం నిర్మించడం.













వినాయక, కుమార స్వామి, నవగ్రహ మండపం అమ్మవారి ఉపాలయాలు ఉంటాయిక్కడ. 
ఈ ఆలయానికి కూడా పెద్ద రధం ఉన్నది. 
వైశాఖ మాసంలో శ్రీ మూలస్థానేశ్వర స్వామి కల్యాణం తో పాటు పౌర్ణమి నాడు రధోత్సవం జరుపుతారు. 
వినాయక చవితి, నవ రాత్రులు, శివరాత్రి, కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు. 










ఇవి కాక మరో పురాతన ఆలయం శ్రీ సిద్ది వినాయకునిది. 
నూతనంగా నిర్మించినవి శ్రీ కోదండ రామ స్వామి ఆలయం మరియు శ్రీ షిరిడి సాయి నాధ మందిరం. 
ఈ ఆలయాలన్నీ పక్క పక్కనే కాలి నడకన వెళ్లి దర్శించుకొనే దూరంలో ఉంటాయి. 









నాదెండ్ల లో  సందర్శకులు ఉండటానికి తగిన ఏర్పాట్లు లేవు.
ఉదయాన్నే వెళ్లి దర్శన తరువాత దగ్గర లోని చిలకలూరిపేట లేదా గుంటూరు చేరుకోవడం మంచిది. ఈ రెండు చోట్ల నుండి చక్కని బస్సు సౌకర్యం ఉన్నది.

కృష్ణం వందే జగద్గురుం !!!!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...