11, డిసెంబర్ 2014, గురువారం

Sri Trivikrama (Ulaganda Perumal )Temple, Tirukovilur

          ఉలగండ పెరుమాళ్ ఆలయం, తిరుకొవిలుర్



ఎన్నో పౌరాణిక చారిత్రిక విశేషాలకు మరో చిరునామా తిరుకోవిలుర్ ! 
సుమారు వెయ్యి సంవత్సరాల క్రిందట నాటి తమిళ నాడులో పెద్ద నగరాలైన కంచి, మదురై మరియు తంజావూరుల సరసన నిలిచిన ఊరు తిరుకొవిలురు.
చోళ రాజులలో ప్రముఖులైన "రాజరాజ చోళుడు" అతని తమ్ముడు " ఆదిత్య పరాంతక చోళుడు" జన్మించినది తిరుకోవిలుర్ లోనే !!
వీరి తల్లి "వానవన్ మాదేవి" తిరుకోవిలుర్ రాజు "మలయమాన్ తిరుముడి కారి " కుమార్తె !
ఎడతెరపి లేకుండా అధికారం కోసం జరిగిన యుద్దాల వలన క్రమంగా తన ప్రాతినిద్యాన్ని కోల్పోయి నేడొక చిన్న పట్టణంగా మిగిలిపొయినది తిరుకోవిలురు.








శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాలలో నలభై రెండో స్థానంలో ఉన్న క్షేత్రం "తిరుకొవిలుర్". 
అంతే కాదు ఈ క్షేత్రం శైవులకు కూడా ఏంతో పవిత్రమైనది. 
సదాశివుడు దుష్ట సంహారం చేసిన ఎనిమిది (అష్ట వీరట్ట) ప్రదేశాలలో నలభై రెండవది తిరుకోవిలుర్.
 శివ కేశవులు ఇద్దరూ కొలువుతీరిన తిరుకోవిలూర్ హరిహర క్షేత్రం.
ఉలగండ పెరుమాళ్ ని ఆళ్వార్లు తమ పాసుర గానంతో కీర్తించారు. దివ్య దేశం హోదా పొందేలా చేసారు.
శ్రీ వీరట్టేశ్వర స్వామిని నయమ్మార్లు తమ పాటికాలతో ప్రస్తుతించారు. పడాల్ పెట్ర స్థలం గా పెర్కొనేలా చేసారు.
మధ్వ సిద్దాంతాన్ని పాటించే వారికి కూడా తిరుకోవిలుర్ పవిత్ర దర్శనీయ క్షేత్రం!
ఇక్కడికి అతి సమీపం లో ఉన్న "మనంపూండి" గ్రామంలో శ్రీ రఘుత్తమ తీర్థ మరియు శ్రీ సత్యప్రమోద తీర్థ " మూల బృందావనాలు ఇక్కడే ఉన్నాయి.
తెన్ పెన్నా నదీ (దక్షిణ పినాకిని)తీరంలో ఉన్న ఊరికి  రెండు ఆలయాలు ఒకటి తూర్పున మరొకటి పడమర నెలకొల్పబడినాయి.








అనేకానేక విశేషాల సమాహారం  "ఉలగండ పెరుమాళ్ కోవెల". 
వామన మూర్తిగా బలి చక్రవర్తి ని మూడు అడుగుల నేల దానంగా అడిగి త్రివిక్రమునిగా మారి దానమిచ్చిన దానవేంద్రుని పాతాళానికి పంపిన వాడే ఉలగండ (లోకాలకు ) పెరుమాళ్. 
తమిళనాడులో రెండు చోట్ల ఉలగండ పెరుమాళ్ కోవెలలు ఉన్నాయి. 
ఒకటి ఇది. రెండవది కంచి లో శ్రీ కామాక్షీ అమ్మవారి ఆలయానికి దారిలో ఉన్న ఉలగండ  పెరుమాళ్ కోవెల. అక్కడ విగ్రహం సుమారు యాభై అడుగుల ఎత్తుతో అద్భుతంగా ఉంటుంది.
తిరుకొవిలుర్ ఆలయం లోని పెరుమాళ్ సుమారు పదిహేను అడుగుల ఎత్తుతో నయనమనోహర అలంకరణతో కుడి కాలు పైకెత్తి ఉంటారు. గర్భాలయంలోని ఆ మూల పైన కొలువైన  బ్రహ్మ ఆ పాదాన్ని కడుగుతుంటారు. ఎడమ పాదం వద్ద శరణాగతి కోరుతున్న బలి చక్రవర్తి. 
మూల విరాట్టు పక్కన ఇక్కడ మంగళ శాసనాలు (పాశుర గానం ) చేసిన "మొదళ్ ఆళ్వారులు " ( మొదటి ఆళ్వారులు) అయిన "పోయిగై, భూతత్తి  మరియు పైఆళ్వార్ విగ్రహాలు ఉంటాయి.
మరో విశేషం ఏమిటంటే గర్భాలయం లోని అన్ని దారు విగ్రహాలు కావడం. 
గర్భాలయంలో కనిపించే ఈ అరుదైన విగ్రహాల వెనుక దాగివున్న గాధ భగవంతుడు ఎంతటి భక్తవత్సలుడో తెలుపుతుంది.









అసలు పన్నిద్దరు ఆళ్వారులు గానం చేసిన నాలుగు వేల పాశురాల ఆరంభం ఇక్కడే ప్రారంభం అయ్యింది.
ఈ పునాదికి మూలం గాన ప్రియుడైన శ్రీ హరే !
ఎలాగంటే ఒక వర్షపు రాత్రి కాంచీ పురానికి చెందిన "పోయిగై ఆళ్వార్" వర్షపు ధాటికి తట్టుకోలేక కనిపించిన పూరి గుడిసె వద్దకు వెళ్లి వసారాలో తల దాచుకోడానికి అనుమతి కోరి అక్కడ కూర్చున్నారు. కొద్దిసేపటికి మహాబలిపురానికి చెందిన "భూతత్తి ఆళ్వార్" అక్కడికి వచ్చారు.







అక్కడ ఉన్న చిత్రమైన పరిస్థితి ఏమిటంటే ఉన్న స్థలంలో ఒకరు పడుకోవచ్చు. ఇద్దరైతే కూర్చోవచ్చు.మరి కొద్ది సమయానికి మైలాపూర్ ( చెన్నై) చెందిన "పేయి  ఆళ్వార్" అక్కడికి చేరుకొన్నారు.కూర్చోడానికి స్థలం చాలనందున ముగ్గురూ నిలుచున్నారు.
ఒకరికొకరు పరిచయమైన తరువాత వారివారి ఆధ్యాత్మిక అనుభవాలు  పంచుకొంటున్న సమయంలో వారికి తామే కాక మరొకరు అక్కడ ఉన్న అనుభూతి కలిగింది.
ఎవరు అన్నది తెలియ లేదు.పోయిగై ఆళ్వార్ ఒక అర్ధవంతమైన కవితను తెలిపారు.
వెనువెంటనే భూతత్తి ఆళ్వార్ కూడా తన వంతుగా కవితను పలికారు. ఇద్దరి కవితలలోని భావం ఒకటే ! "మనస్సును స్థిరపరుచుకొని అజ్ఞానాన్ని పారద్రోలే జ్ఞాన జ్యోతి ని వెలిగించుకోవాలి" అన్నది వారు తమ తమ పద్దతిలో వెల్లడించారు.
అంతే అలముకొన్న చీకటి హటాత్తుగా తొలగిపోయింది. ఆ అద్భుతమైన వెలుగులో పేయి  ఆళ్వార్ పెరుమాళ్ ని వీక్షించ గలిగాడు. పరమాత్ముని దివ్య దర్శనంతో పరవశించిన ఆయన తన సహచరులకు భగవంతుని రూప వర్ణన చేస్తుండగానే మిగిలిన ఇద్దరూ కూడా దేవదేవుని కాంచగలిగారు.వళ్ళు తెలియని ఆనందంతో వారు శ్రీహరి దివ్య మహిమలను వంద కీర్తనలో ఆశువుగా చెప్పారు.అవే పన్నిద్దరు ఆళ్వార్లు గానం చేసిన నాలుగువేల పాశురాలలో తొలి భాగం అయిన     "ఐయర్పా". అలా దివ్య ప్రభంధానికి బీజం ఇక్కడ పడినది.
శ్రీ మన్నారాయణ త్రివిక్రమ రూపం సందర్శించదలచి అచంచల  దీక్షతో తపమాచరించిన "మృకుంద మహర్షి"కి స్వామి ఇక్కడే ఆ రూపాన్ని చూపించారు.










తెన్ పెన్నా తీరంలోని అయిదు కృష్ణ క్షేత్రాలలో తిరుకోవిలూర్ ఒకటి. 
మూలవిరాట్టు శ్రీ త్రివిక్రముడే అయినా శ్రీ కృష్ణునునికే ప్రాధాన్యత. 
ఆలయంలో కుడిపక్కన రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది. ఈయనే క్షేత్రాదిపతి. చాలా సుందర రూపంతో స్థానక భంగిమలో స్వామి దర్శనమిస్తారు. 
పద్మపురాణంలో ఆలయ పౌరాణిక గాధ విపులీకరించబడినది. 








ప్రస్తుతం పరిమిత స్థలంలో  ఆలయ సముదాయమే ఉండటంతో చాలా ఉపాలయాలతొ కిక్కిరిసినట్లుగా కనపడుతుంది. ( ఆలయం నలువైపులా ఉన్న రహదారులు అత్యంత జనసమూహాలతో, దుకాణాలతో,వాహన రాకపోకలతో హడావుడిగా ఉంటాయి).
ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ సన్నిధులు నాలుగుంటాయి.
శ్రీ గరుడ, శ్రీ రామ, శ్రీ లక్ష్మి నారాయణ, శ్రీ లక్షి వరాహ, శ్రీ లక్ష్మి నారసింహ, శ్రీ వరద రాజ, శ్రీ చక్రత్తి ఆళ్వార్, శ్రీ రామానుజ, శ్రీ మానవల్ మహర్షి, తాయారు( శ్రీ పూం కోవిల్ నాంచారి ), విష్వక్సేన మరియు ఆళ్వార్ సన్నిధి గర్భాలయ నలుదిశలా నెలకొల్పబడినాయి.









గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ విష్ణు దుర్గ దర్శనమిస్తారు. ఈ దేవికి మంగళ మరియు శుక్ర వారాలు రాహు కాలంలో పూజలు చేస్తే సమస్త కోరికలు నెరవేరతాయి అని భక్తులు విశ్వసిస్తారు.
గర్భాలం వెనుక ఛత్రం ధరించిన బాల వటువు రూపంలో శ్రీ వామనుడు ఉంటారు. మొదట ఇలా కనపడిన స్వామి దానవ రాజు దానం ఇచ్చిన తరువాత త్రివిక్రమునిగా మారారని . కానీ ఈ వామన సన్నిధి మంగళ, శుక్ర వారాలలోనే దర్శించుకొనే అవకాశం ఉన్నది.









గర్భాలయంలో ముందుగా చెప్పుకొన్నట్లుగా అన్నీ దారు విగ్రహాలే!!
ఇక్కడ నయనమనోహర మూలవిరాట్టుతో పాటు నాటి బలి చక్రవర్తి పాతాళ లోక యాత్రా దృశ్యం కనుల ముందు ఆవిష్కృతం అవుతుంది.నిలువెత్తు రూపంలో శ్రీ త్రివిక్రమ స్వామి తూర్పు ముఖంగా కుడి కాలితో ఆకాశాన్ని కొలుస్తుండగా గర్భాలయ నైరుతిలో పైన కూర్చొని సృష్టి కర్త బ్రహ్మ ఆ పాదాన్ని కడుగుతుంటారు. నేలను ఆక్రమించుకొన్న ఎడమ పాదాన్ని బలి, ఆయన కుమారుడు నముచి, ప్రహ్లాదుడు, శ్రీ లక్ష్మి పూజిస్తుంటారు. మరో పక్కన రాక్షస గురువు శుక్రాచార్యులు, మృకుంద మహర్షి దంపతులు, గరుడుడు మరియు మొదల్ ఆళ్వార్లు ఉంటారు
నిలువెత్తు విగ్రహాన్ని మూడు కోణాలలో చూడాలి. లోకాలను కొలిచిన స్వామి కదా!
మరో విశేషమేమిటంటే శంఖం కుడి చేతిలో ఉండటం. తన భక్తులకు జ్ఞాన భోధ చేయుచున్నాను అని తెలుపుతున్నారు స్వామి. మెడలో నూట ఎనిమిది సాల గ్రామాల హారం, నడుముకు దశావతార ఒడ్డాణం ఇతర ఆభరణాలుధరించి నేత్ర పర్వంగా కనిపించే శ్రీ త్రివిక్రముని చూడ రెండు నేత్రాలు చాలవు. దారు రూపం కావడంతో అభిషేకాలుండవు. 
ఉత్సవ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేత దేహళీక స్వామి కే అన్ని అభిషేకాలు జరుపుతారు.










ఆలయానికి నాలుగు పక్కలా ఉన్న గోపురాల వద్ద  కావలి దేవత శ్రీ హనుమంతుని సన్నిధులు కనపడతాయిగోపురాలలో అన్నిటికన్నా పెద్దది తూర్పున ఉన్న పెరియ గోపురం యొక్క ఎత్తు  192 అడుగులు.అన్ని గోపురాల మీదా కృష్ణ లీలలను సుందరంగా చెక్కి నిలిపారు.
ఎన్నో మండపాలు వసంత, పార్వేటి,ఏకాదశి, శ్రీ రంగ, పాండియన్ లాంటివి ఒకో ఉత్సవానికి ఒకొక్కటిగా నిర్మించారు.తూర్పు ద్వారం వద్ద ఎనిమిది ఎత్తైన ఉట్టి మండపాలుంటాయి. కృష్ణాష్టమికి ఉట్టి  వీటికే కడతారు.
కోవెలకు ఎడమ పక్కన జీయరు స్వామి మఠం ఉంటుంది. అయిదు వందల సంవత్సరాల నుండి ఆలయ నిర్వహణ ఈ మఠం చేస్తోంది.ప్రతి నిత్యం భక్తులతో కళకళ లాడే తిరుకోవిలుర్ ఆలయంలో ధనుర్మాసం, వైకుంఠ ఏకాదశి, కృష్ణాష్టమి, శ్రీ రామ నవమి, శ్రీ వామన జయంతి ఘనంగా నిర్వహిస్తారు.













పౌరాణికంగా చారిత్రకంగా విశేష ప్రాముఖ్యత కలిగిన తిరుకోవిలుర్ ప్రముఖ శైవ క్షేత్రం తిరువన్నామలై ( అరుణాచలం) కి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. చెన్నై, విల్లుపురం, నుండి కూడా నేరుగా బస్సులలో చేరుకొనవచ్చును.
ఓం నమో నారాయణాయ నమః !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...