7, డిసెంబర్ 2014, ఆదివారం

Sri Jwalamukhi Temple, Nellore.

          శ్రీ జ్వాలా ముఖి అమ్మవారి దేవస్థానం, నెల్లూరు 




అమ్మల కన్నఅమ్మ ముగురమ్మల మూలపుటమ్మ జగన్నాయకి కొలువైన క్షేత్రాలు దేశ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. 
వివిధ రూపాలలో అమ్మవారు త్రిలోక పావని తన నెలవులులో వెలసి భక్తులను కాపాడుతున్నారు. 
విశేష చరిత్ర కలిగి ఉంది కూడా స్థానికంగానే పరిమిత ప్రాచుర్యం పొందిన ఒక శక్తి ఆలయం నెల్లూరు పట్టణ శివారులలో ఉన్నది.










  




నెల్లూరు నగరం నుండి కృష్ణ పట్నం వెళ్ళే దారిలో కాకుపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వరిగొండ గ్రామంలో ఉంటుంది  "శ్రీ జ్వాలా ముఖి అమ్మవారి దేవాలయం "








శాఖోపశాఖలుగా పెరిగిన పెద్ద వట వృక్షం క్రింద అనేక మండపాలు, ఉపాలయాలతో అలరారే ఈ ఆలయ చరిత్ర సుమారు నాలుగు శతాబ్దాల నాటిదిగా చెబుతారు.
అసలు శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్ర కి సమీపంలో ఉంటుంది. యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో దాక్షాయణి నాలిక పడినట్లుగా స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ ఎలాంటి అర్చామూర్తి ఉండదు. సంవత్సరాలుగా నిరంతరాయంగా వెలుగుతున్న జ్వాలకి పూజలు చేస్తారు.  అత్యంత ప్రశాంత సుందర వాతావరణంలో నెలకొన్న శ్రీ జ్వాలా ముఖి అమ్మవారి ఆలయం సందర్శకులకు కావలసిన మానసిక శాంతిని ప్రసాదిస్తుంది.








నాలుగు శతాబ్దాల క్రిందట నేటి ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామ దేవత ఈమె.గ్రామస్తులు వారి రక్షకురాలైన తనని నిర్లక్ష్యం చేస్తున్నారని అలిగినదట.
ఒక నాటి రాత్రి గ్రామ పెద్దకు కలలో కనపడి తన నిర్ణయాన్ని తెలిపినదట.నిద్ర నుండి లేచి అమ్మవారి నిర్ణయాన్ని అర్ధం చేసుకొని కంగారుగా ఆలయానికి చేరుకొన్న పెద్దకు అక్కడ అమ్మవారి రూపులు కనపడలేదట.








అప్పట్లో వస్తు మార్పిడి ఎక్కువగా అమలులో ఉండేదిట.ఒంగోలు ప్రాంతం నుండి ధనియాలను తీసుకొని వెళ్లి నెల్లూరులో ధాన్యం తో మార్పిడి చేసుకోనేవారట.
నాటి రాత్రి కొందరు రైతులు ఎప్పటి మాదిరిగా ధనియాల బస్తాలను తీసుకొని ఈతముక్కల నుండి బయలుదేరి ఇక్కడికి చేరుకొన్నారట.అప్పటికి రాత్రి కావడంతో సరుకును బండ్లలో ఉంచి ఒక చెట్టు క్రింద నిద్ర పోయారట.










తెల్లవారిన తరువాత బస్తాలను దించుతుంటే ఒకటి విపరీతమైన బరువుండటంతో భయపడిన వారు అందరూ కలసి అతి కష్టం మీద దూరంగా విసిరేసారట.
అలా ఆ బస్తా వచ్చి ఈ వట వృక్షం క్రింద పడినదట.ఇక్కడి  గ్రామ  పెద్దకు అమ్మవారు తరలి వచ్చిన విషయం స్వప్న సందేశం ద్వారా తెలిసి, వచ్చి రూపం లేకుండా ఒక బింబం మాదిరిగా   దర్శనమిచ్చిన నలుచదరపు పలకను  అమ్మవారి ప్రతిరూపంగా గుర్తించి ప్రతిష్టించారట.
నాటి నుండి పల్లె ప్రజలు భక్తి శ్రద్దలతో అమ్మవారిని సేవించుకొంటున్నారు.











నడిచే దైవంగా పేరొందిన కంచి కామ కోటి పీఠం అధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర స్వరస్వతి స్వామి తమ యాత్రలో ఈ క్షేత్రానికి విచ్చేశారట. అమ్మవారి రూపాన్ని వివరించి, విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం కూడా నిర్ణయించారట.అలా వివరించిన రూపు రేఖలతో విగ్రహాన్ని చెక్కించి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదగా ప్రతిష్ట పెద్ద స్వామి  నిర్ణయించిన ముహూర్తానికి జరిగింది. నాటి నుండి  శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అర్చారూపాన్ని సేవించుకొంటున్నారు భక్తులు. గర్భాలయంలో చతుర్భుజాలతో ఉపస్థితః భంగిమలో కొలువై త్రిశూలం, ఢమరుకం, ఖడ్గం ధరించి వరద ముద్రలో రమణీయ పుష్పాలంకరణలో దర్శనమిచ్చే మూలవిరాట్టు భక్తుల హృదయాలలో కోరుకొనే అభయాన్ని కలిగిస్తుంది.
అమ్మవారు తమ భక్తులను కాపాడిన విశేషాల గురించిన గాధలు ఎన్నో స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి.గత రెండు దశాబ్దాలలో ఆలయ అభివృద్ధి, నిర్మాణాలు చోటుచేసుకొన్నాయి.











సువిశాల ప్రాంతంలో గణేష, నాగ ప్రతిష్టలు, శ్రీ ఆంజనేయ ఉపాలయాలు ఉంటాయి.
శ్రీ జ్వాలా ముఖి ఆలయానికి పక్కనే చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి ఆలయాన్ని నిర్మించారు. మూలా నక్షత్రం రోజున తమ బిడ్డలకు అక్షరాభ్యాసం చేయించుకోడానికి భక్తులు తరలి వస్తుంటారు. ప్రాంగణంలో శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ మురళీకృష్ణ స్వామి ఆలయం కూడా ప్రాంగణంలో దర్శనమిస్తుంది.













జ్వాలా ముఖి అమ్మవారి ఆలయం మండప స్తంభాల మీద చెక్కిన "ఎలి " నోట్లో తిరిగే రాతి బంతి ఒక అద్భుత నిర్మాణ విన్యాసం. ఇది చాలా అరుదుగా కలిపించే శిల్పకళా విన్యాసం. అతి కొద్ది ఆలయాలలోనే కనిపిస్తుంది.
అమ్మవారిని అర్చించిన కుంకుమ ఇక్కడికి వచ్చే భక్తులు చిటికెడు నోట్లో వేసుకొంటే నాలుకకు తెలిసే రుచి వారి మనః, దేహ, గ్రహ, ఆర్ధిక పరిస్థితులను తెలుపుతుంది. (స్వానుభవం )















నవ రాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వినాయక చవితి, శ్రీ రామ నవని, శివరాత్రి, ఉగాది, శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ సుబ్రమణ్య షష్టి  ఇలా అన్ని హిందూ పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. వేలాదిగా భక్తులు పాల్గొంటారు. ఆలయ పూజారి శ్రీ. జానకి రామయ్య ఆలయం పక్కనే నివసిస్తుంటారు. 
కాకపోతే నిర్ణయించిన సమయాలలోనే ఆలయాన్ని తెరుస్తారు. 
వి ఆర్ సి సెంటర్ నుండి కృష్ణపట్నం వెళ్లే బస్సులు లభిస్తాయి. అందులో కాకుపల్లి దాకా ప్రయాణించి అక్కడ నుండి ఆటోలో ఆలయం వద్దకు చేరుకోవచ్చును. నెల్లూరుకు చేరుకోడానికి రాష్ట్రం లోని అన్ని జిల్లాల నుండి బస్సు మరియు రైళ్లు లభిస్తాయి.  

జై జగన్మాత !!!!!





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...