16, డిసెంబర్ 2014, మంగళవారం

Sri Veeratteshwara swami Temple, Tirukovilur

            శ్రీ వీరట్టేశ్వర స్వామి ఆలయం, తిరుకోవిలూర్ 


 


లింగ రాజుగా అనేకానేక క్షేత్రాలలో కొలువుతీరిన సర్వేశ్వరుడు వర్తులాకార లింగంలోనే ఎన్నో భిన్నరూప విశేషాలను ప్రదర్శిస్తారు.ఆయనకున్నన్ని గొలుసుకట్టు ఆలయాలు  అంటే పంచారామాలు, పంచ నాట్య సభలు, పంచ భూత స్థలాలు ఇలా ఎన్నో ! మనకు అంతగా పరిచయంలేని అష్ట వీరట్ట స్థలములు తమిళనాడులో ఉన్నాయి.అవి తంజావూరు, తిరువారూర్, విల్లుపురం  జిల్లాలో కలవు.
ఈ ఎనిమిది స్థలాలలో ముక్కంటి లోకకంటకులను సంహరించి తన రుద్ర రూపాన్ని చూపుతారు. అది ఆయా స్థలాల ఉత్సవ మూర్తులైన నటరాజ స్వామిలో కనపడతుంది.
ఇంతటి వైవిధ్యం ఉన్న ఉత్సవ మూర్తులను మరెక్కడా చూడలేవు. అద్భుతంగా ఉంటాయి. అవి తిరువదిగై, తిరుక్కోవిలూర్, తిరుఖండియూర్, తిరుపరియాల్, తిరువిర్కుడి, తిరువళువు, తిరుకోరుక్కై, తిరుకడయూర్. ఈ ఎనిమిది క్షేత్రాలలో పరమశివుడు త్రీవ్ర రూపం దాల్చి అసురసంహారం చేసినట్లుగా క్షేత్ర గాధలు తెలుపుతున్నాయి.

అష్ట వీరట్ట స్థలాల గురించి నేను వివరించిన వీడియో (www.youtube.com/watch?v=Ol8IZ84eap8)ఈ లింక్ ద్వారా చూడవచ్చును

వీటిల్లో రెండవది తెన్ పెన్నా నది ( దక్షిణ పినాకిని)తీరంలో ఉన్నతిరుక్కోవిలూర్ లో కొలువైన శ్రీ వీరట్టేశ్వర స్వామిని "అంధకాసుర సంహార మూర్తి" అని పిలుస్తారు.












శివ పురాణం ప్రకారం ఒకసారి ధ్యానంలో ఉన్న సదాశివుని కనులను పార్వతీ దేవి సరదాగా మూసినదట.లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్య చంద్రులకు ప్రతిరూపాలైన వాటిని మూసివేయడంతో లోకాలన్నీ అంధకారంలో మునిగిపోయాయట.అమ్మవారి చేతుల నుండి ఉద్భవించిన స్వేదం మహేశ్వరుని తాకుతూ నేలను తాకగా వికృత రూపంలో ఉన్న శిశువు జన్మించాడు.చీకటిలో పుట్టడం వికృత రూపం తో పాటు అంధత్వం కూడా ఉన్న ఆ బాలుని సంతానం కొరకు శివ యాగం చేస్తున్న హిరణ్యాక్షునికి ఇచ్చారట. కైలాస వాసుని ప్రసాదంగా ఆ దానవ రాజు ఆ శిశువుకు అంధకాసురుడు అని నామకరణం చేసి  ప్రేమగా పెంచాడు.














శ్రీ వరాహ స్వామి చేతిలో హిరణ్యాక్షుడు హతుడైనడు. దత్త పుత్రునిగా సింహాసనానికి అధినేత అందకాసురుడే ! కానీ మిగిలిన అసురులు అతను దేవతల సంతానంగా పేర్కొంటూ అధికారం ఇవ్వకుండా రాజ్యం నుండి  వెళ్ళగొట్టారు.తీవ్ర ఆగ్రహంతో అంధకుడు సృష్టి కర్త అనుగ్రహం కోరుతూ ఘోర తపస్సు చేసాడు.సంత్రుప్తుడైన విధాత ప్రత్యక్షమై అతనికి సుందర రూపం, దృష్టి ప్రసాదించి, అజేయుడయ్యే వరం ఇచ్చారు.కాకపోతే నంది వాహనుని చేతుల్లో హతమవుతాడని తెలిపారు.దానిని లెక్క చేయలేదు అంధకాసురుడు. రాజ్యం చేరి తనను అవమానించిన వారిని అంతం చేసి అధికారం చేపట్టాడు.














ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తూ రాక్షస పాలన ఆరంభించాడు. " లోకాలన్నింటిలో శక్తిమంతుడు అవ్వాలంటే ఏం చెయ్యాలి ?" అని తన మంత్రులను అడిగాడట. వారిలో ఒకరు "సర్వ శక్తులను కలిగి ఉండటం" అంటూ "అలా ఉండాలంటే  జగన్మాత అయిన పార్వతీ దేవిని సొంతం చేసుకోవాలి" అన్నాడు. మరో ఆలోచన లేకుండా అంధకుడు దేవదేవిని తనకు అప్పగించమని అర్ధనారీశ్వరునికి కబురు పంపాడు. తిరస్కరించిన త్రినేత్రుని మీదకు దండయాత్రకు తరలి వెళ్ళాడు. 








రాక్షస సైన్యాన్ని శివ గణాలు అంతం చేసాయి. ముఖాముఖి పోరులో గాయం అయ్యి నేలకు రాలిన ఒక్కో రక్త బిందువు నుండి ఒక్కో అంధకుడు ఉద్భవించసాగాడు. అప్పుడు అమ్మవారు రక్తం నేలకు చేరకుండా 64 చిన్న చిన్న పాత్రలను పెట్టినది. సదా శివుడు సృష్టించిన బైరవులు ఆ రక్తాన్ని తాగేసారు. చతురస్రాకారంలో 64 గడులలో నేడు చాలా చోట్ల చేస్తున్న వాస్తు శాంతి కొరకు భైరవ పూజ ఇక్కడ ఇలా మొదలైనది అంటారు. ఆలయ ఉత్సవిగ్రహం ఈ సమర సన్నివేశానికి సరిగ్గా సరి పోతుంది.





  





నది ఒడ్డున సువిశాల ప్రాంగణంలో స్వాగత ద్వారం దాటిన తరువాత పక్కపక్కనే రెండు ఆలయాలు ఉంటాయి. ఒక దానిలో శ్రీ అంధకాసుర మూర్తి, మరో దానిలో పెరియనాయకి లేదా శివానందవల్లి కొలువై ఉంటారు. 










ప్రధాన ఆలయంలో శ్రీ వీరట్టేశ్వర స్వామి పెద్ద లింగ రూపంలో దర్శనమిస్తారు. 
ముఖ మండపంలో, గర్భాలయ వెలుపల ప్రదక్షిణ పదంలో శ్రీ దక్షిణా మూర్తి, విష్ణు దుర్గ, లింగోద్భవ మూర్తి, తాండవ గణపతి, చండికేశ్వర, శ్రీ భైరవ, అనేక లింగాలు మరియు అరవై మూడు మంది నయమ్మార్లు కొలువుతీరి ఉంటారు. 
శ్రీ వీరట్టేశ్వర స్వామి భైరవ శక్తి అధికంగా కలిగి ఉండటం వలన దుష్ట శక్తుల ప్రభావంతో మరియు జాతకరీత్యా గ్రహదోషాలతో భాద పడుతున్నవారు, వాస్తు దోషాలకు ఇక్కడ అభిషేకాలు చేస్తే త్వరితగతిన శుభం కలుగుతుందని స్థానిక విశ్వాసం. ఆ విధంగా తిరుక్కోవిలూర్ పరిహార క్షేత్రం. 
 అష్ట భుజాలతో దర్శనమిచ్చే శ్రీ విష్ణు దుర్గ వద్ద శుక్రవారాలలో రాహు కాలంలో ( మధ్యాహాన్నం మూడు నుండి నాలుగు గంటల వరకు) నిమ్మ దొప్పలలొ నేతి దీపాలు వెలిగిస్తే ఉద్యోగ మరియు వివాహరీత్యా ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలగిపోతాయి అని విశ్వసిస్తారు.  














ఇక్కడే అత్యద్భుతమైన పంచలోహ నటరాజ ఉత్సవమూర్తి ప్రత్యేక పీఠం మీద ఉంచబడినది.
పక్కనే ఉత్సవిగ్రహ చిత్ర పటం, ఆలయ వెలుపల రాతి విగ్రహం కూడా కనపడతాయి.
ఈ కోవెలలో కొలువైన శ్రీ పెరియ గణపతి, శ్రీ షణ్ముఖ ప్రార్ధించినంతనే కృపా కటాక్షాలను కురిపించేవారిగా ప్రసిద్ది.












భక్తులు ముఖ్యంగా గ్రహ దోషాల మూలంగా ఆర్ధిక, ఉద్యోగ, వివాహలలో ఇబ్బందులు ఎర్కొంటున్న వారు, వాస్తు సంబంధిత ఆటంకాలకు నివృతి కోసం వచ్చి శ్రీ వీరట్టేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేయిస్తారు.














పక్కనే ఉన్న దేవదేవి కోవెల సాదా సీదాగా ఉంటుంది. ప్రతి నెలా ఒక ఉత్సవం జరుపుతారు. 
మాసి (ఫిబ్రవరి- మార్చి) నెలలో పది రోజుల పాటు ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక మాస పూజలు వైభవంగా జరుగుతాయి. గణేష పూజ, షణ్ముఖ షష్టి, నవరాత్రులు, శివ రాత్రి ఇతర స్థానిక పర్వదినాలలో జరిగే ప్రత్యేక ఉత్సవాలలో రాష్ట్రం నుండే కాక పక్కనున్న రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారు. 













గాయక శివ భక్తులైన నాయన్మారులలో  ప్రముఖులైన "సంబందార్, అప్పార్, సుందరార్ తమ తేవరాలతో ( పది కీర్తనలను లేదా పాటికాలను ఒక తేవరం అంటారు) తిరుకోవిలుర్ క్షేత్రానికి రెండువందల డెబ్భై అయిదు పడాల్ పెట్ర స్థలాలలో ఒకటిగా శాశ్విత స్థానం ఏర్పరచారు.












ఆలయ వెలుపలి గోడలపైన వివిధ కాలాలకు చెందిన చోళ రాజుల  శాసనాలు కనపడతాయి.
వైష్ణవులకు పవిత్రమైన దివ్య దేశాలలో ఒకటిగా, శైవులకు పూజ్యనీయమైన పెట్ర స్థలంగా పేరొందిన తిరుకోవిలుర్ తమిళనాడు లోని విల్లుపురం జిల్లాలో ఉన్నది.చెన్నై నుండి విల్లుపురానికి రైలు, బస్సు సౌకర్యం లభిస్తుంది.యాత్రికులకు కావలసిన వసతి సదుపాయాలు తగుమాత్రంగా ఉంటాయి.
ప్రముఖ శైవ క్షేత్రం తిరువన్నామలై( ముప్పై అయిదు కిలోమీటర్లు) నుండి కూడా ఇక్కడికి చేరుకొనవచ్చును.

నమః శివాయ !!!!  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...