18, డిసెంబర్ 2014, గురువారం

Sri Bollumora Prasanna Venkateswara Swami Temple, Kondaveedu

           శ్రీ బొల్లుమోర ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, కొండవీడు 

అబ్బా దేవుడు కొండల మీద ఎందుకు ఉంటాడు ?
ప్రతి ఒక్కరూ కొండ ఎక్కడానికి ఆపసోపాలు పడుతూ అడిగే ప్రశ్న.
కానీ పైకి చేరుకొన్నాక అక్కడి ప్రశాంత వాతావరణం, పచ్చని పరిసరాలు అన్నిటికి మించి ఇవన్ని మనకు అందించిన భగవంతుని సన్నిధి ఎలాంటి వారినైనా మరపిస్తాయి. కొండ ఎక్కేటప్పుడు కలిగిన కష్టాన్ని మరిచిపోయేలా చేస్తాయి. 


ఒక నాడు పని మీద కొండవీడు మీదగా వెళుతున్నప్పుడు శ్రీ బొల్లుమోర వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తాలూకు బోర్డు చూసాను.
అడిగితె శని లేక ఆదివారం ఉదయాన్నే వస్తే కొండ ఎక్కవచ్చు అని అప్పుడు పూజారి గారు కూడా ఉంటారు అన్నారు స్థానికులు.






విషయం తెలిసిన తరువాత ఎక్కువ రోజులు ఆగలేకపోయాను.
నాలుగు రోజుల తరువాత ఆదివారం నాడు పొద్దున్నే విజయవాడ నుండి బయలుదేరి దారిలో గుంటూరులో ఉన్న ఆప్త మిత్రుడు ఏకా ప్రసాదు ను కలుపుకొని తొమ్మిది కంతా ఫిరంగిపురం చేరుకొన్నాము.
పుట్టకోట గ్రామం అక్కడికి సుమారు ఏడు కిలోమీటర్లు ఉంటుంది.
 వచ్చేదారిలో వేములూరిపాడులో ఆగి మరో తెలిసిన మిత్రుడైన సుబ్రహ్మణ్యం హోటల్ లో మంచిగా పలహారం (డబ్బులిచ్చేసుమా ) చేసి వచ్చాము.






వాటర్ బాటిల్ మాత్రం కొనుక్కొని వాహనం పుట్ట కోట దిశగా నడిపాము.
ఊరిలో దాక రోడ్ బాగుంది.
మార్గం కొనుక్కొని ఊరి చివరకు వెళ్లి కొండల  వైపుకు ఉన్న మట్టి రోడ్లో ఒక కిలోమీటర్ ప్రయాణించి కొండ దగ్గరకు చేరాము.





అక్కడ తెలిసింది అంతకు ముందు మీము విన్నది నిజం కాదని.
మోటార్ సైకిల్ పోవడానికి దారి ఉందన్నారు కానీ ఆ మధ్య కురిసిన వర్షాలకు కొండ దారి కొట్టుకు పోయిందిట.
పైకి చూడగానే బాటిల్ నీళ్ళు తాగేయ్యాలి అనిపించే ఎత్తు ( సుమారు రెండువేల అడుగులు ఉండవచ్చును ).
వాహనాన్ని కడుతున్న సత్రం దగ్గర పెట్టి కాళ్ళకు పని చేప్పాము.






మార్గశిర మాస వాతావరణం చల్లగా హాయిగా ఉన్నది.
కనపడుతున్న పర్వతాలు చలి కాలపు బద్దకాన్ని వదలక మంచు దుప్పటి కప్పుకొని కనపడుతున్నాయి.
దారి పూర్తిగా ధ్వంసం.
పైనుండి వచ్చిన వర్షపు నీటి వరవడికి పడిన పెద్ద పెద్ద గుంటలు.
తలెత్తి చూస్తే నిటారుగా ఉన్న కొండ కొమ్ము మీద ఆలయం కనపడుతోంది.
యెంత దూరం ఏమిటి అడుగుదామంటే మనిషన్నవాడు కనుచూపు మేరలో కనపడట్లేదు.


కొంచెం నడవటం ఆగటం ఎత్తు నుండి దూరంగా కనపడుతున్న పచ్చని పొలాలను, బొమ్మల కొలువులా ఉన్న గ్రామాన్ని చూడటం. ఒక సారి పైకి చూసి తిరిగి నడవడం !











కొండ శిఖరం సుమారుగా అయిదు వందల అడుగుల దూరంలో ఉన్నదనగా వెనక నుండి చిన్న పిల్లల అరుపులూ నవ్వులు వినిపించాయి. 
వెనక ఎవరో వస్తున్నారు అన్న విషయం కొత్త ఉత్సాహం నింపింది. 








అది కొద్ది సేపే !
ఆ పిల్లలు పర్వతం పైన కనపడి అరుస్తూ, చప్పట్లు కొడుతూ మమ్మల్ని ప్రోత్సహించడం మొదలు పెట్టారు.
కొట్టుకు వచ్చిన చెట్ల గింజలు దారి మధ్యలో మొలకెత్తి నిలువెత్తు పెరిగాయి. దారి కనపడదు.
తెగించి పోదామన్నా పురుగూ పుట్రా ఉంటాయేమో అన్నశంక ఒకటి.







మొదలు పెట్టిన తరువాత ఏమైనా పూర్తి చెయ్యాలి కదా భగవంతుని మీద భారం వేసి చిట్టడివిలా ఉన్న దారిలో ముందుకు సాగాము.






ఎట్టకేలకు పైకి చేరుకొన్నాము.
మా ఇద్దరినీ చూడగానే పిల్లలు దగ్గరికి వచ్చారు. ఆడా మగా కలిపి ఎనిమిది మంది ఉంటారు. పది పదిహేనేళ్ళ మధ్యలో ఉన్నారు.
"అంకుల్ ఏ ఊరు?"
"చుట్టూ తిరిగి ఎందుకు వచ్చారు ?"
"నీళ్ళు కావాలా?"
ఆఖరి ప్రశ్న అమృతం లా వినిపించింది. "దోన లోని నీళ్ళు చల్లగా ఉంటాయి" అంటూ ఒక కుర్రాడు కొద్దిగా ఆకు పచ్చగా ఉన్న నీళ్ళతో నిండిన సీసా ఇచ్చాడు.
గబగబా త్రాగము.
కొద్దిగా తెప్పరిల్లిన తరువాత ప్రసాదు " మీరు మాకన్నా ముందు ఎలా వచ్చారు?' అనడిగాడు.






"మెట్ల దారిలో! చాలా దగ్గర ! ఇదో ఇక్కడ !" అంటూ పక్కనే ఉన్న లోయలోకి చూపించాడు.
"పదిహేను నిమిషాల్లో కిందకి వెళ్ళచ్చు!" ఇంకో కుర్రాడు అన్నాడు.
"అరె అరె !" అనుకోని గుడి వైపుకు కదిలాము.







చిన్న దేవాలయము, ద్వజస్థంభం కనపడ్డాయి.
ప్రాంగణంలో ఉన్న పచ్చికలో కొందరు మగవారు పడుకొని ఉన్నారు.
పక్కనే ఉన్న చిన్న గది లాంటి దాంట్లో ఆడవారు రాళ్ళు పెట్టి కట్టెల మంట మీద వంట చేస్తున్నారు.
మమ్ములను చూడగానే మగవారు లేచి "రండి సార్ !" అంటూ ఆహ్వానం పలికారు.
తరువాత వరసగా వచ్చిన ఏ ఊరు ఏంటి లాంటి వాటికి సమాధానం ఇచ్చి, వారి గురించి ఆలయం గురించి విచారించాము.







కొద్దిగా పెద్ద వయస్సు లో నీరసంగా కనపడుతున్న ఆయనను చూపించి "మాది కొండవీడు. వ్యాపారం. ఆయన మా అన్నయ్య. క్రిందటి సంవత్సరం చాలా సీరియస్ అయ్యింది. మొక్కుకున్నాము. వేంకటేశుని దయ వలన తగ్గింది. మొక్కు తీర్చుకొందామని వచ్చాము." అన్నాడొకాయన.
 ఫోటోలు తీసుకొంటూ చెప్పేది విన్నాము.
"లోపలికి వెళ్లి దర్శనం చేసుకోండి, మహిమ గల దేవుడు.  ఎప్పుడో ఏడు వందల సంవత్సరాల క్రిందట వెలసిన స్వామి." చెప్పాడు రెండో ఆయన.








కొండ రాళ్ళతో కట్టిన గుడి లోనికి ప్రవేశించాము.
తొలుత ఆకర్షించినది పైన తగిలించిన గంటలు. అది కూడా ఏదన్నా మొక్కు అనుకొన్నాము. 







ముందున్న మండపంలో గర్భాలయ ద్వారానికి ఇరుపక్కలా కొన్ని విగ్రహాలు ఉన్నాయి.






చీకటిగా ఉన్న చిన్న గది లాంటి దానిలో పెద్ద కొండరాతి మీద శంఖు చక్రాలు ధరించి వరద కటి హస్తాలతో నిలువెల్లా పసుపు కుంకుమ అలంకరణతో స్థానక భంగిమలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారు. 









సుమారు వంద సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయం నిర్మించ బడినదట. అంతకు ముందు చిన్న మండపం లాంటిది ఉండేదట.
ప్రస్తుతం ప్రదక్షిణా పధం మూసివేసి ఉన్నది.
నాప రాళ్ళ మీద ఆలయ అభివృద్దికి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు చెక్కారు. 









ఆలయానికి వెలుపల కొండ రాతి మీద శ్రీ ఆంజనేయ స్వామిని లోపల ఉన్న స్వామి వారికి నమస్కరిస్తున్న భంగిమలో చెక్కారు.








ఉత్తరం పక్క పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి.








పైకి ఎక్కి మరి కొన్ని ఫోటోలు తీసుకొంటూ చూసాను.
పాచి పట్టిన నీటితో నిండిన గుంత కనపడింది.
టక్కున బుర్రలో మెరిసింది. "దోనేలో నీరు చల్లగా ఉంటుంది" నీళ్ళు ఇచ్చిన కుర్రాడి మాటలు మదిలో మెదిలాయి.  




ఎప్పుడూ సీసాలలో అమ్మే నీరు త్రాగే మనలాంటి వారికి ఆ దోనేలోని నీరు భయపెడుతుంది. 
అదే జరిగింది. 
కానీ మార్గం లేదు. 








క్రిందకు దిగి మేమూ పచ్చికలో కూలబడ్డాము.
పిచ్చాపాటి మొదలు.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో రెండు రోజుల పాటు తిరనాళ్ల ఘనంగా జరుపుతారట.
కొండలన్నీ జనాలతో నిండిపోతాయట.
దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణ లో ఉన్న ఆలయానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు  కొద్ద్దిగా దూరంగా ఉన్న ప్రత్తి పాడు లాంటి గ్రామాలలో కూడా విలువ గలిగిన ఎన్నో ఎకరాల భూమి ఉన్నదట.
అవన్నీ మూడు వందల సంవత్సరాల క్రిందట ధనవంతులైన వ్యాపారులు స్వామికి ఇచ్చినవి.
మొదట చూసిన బోర్డు మీద పదమూడో శతాబ్దానికే "శ్రీ రామ చంపూ" అన్న కావ్యంలో ఈ స్వామి ప్రస్థాపన ఉన్నాదని  రాసారు.






శ్రీ రామ చంపూ ఏమిటో తెలుసుకోవాలి అనుకొన్నాను. 
ఇది ఒక రకమైన కావ్య రచనా విధానం. నన్నయ లాంటి వారు ఆరంభించారని తెలిసింది. అంతే !






పూజారి గారు ఫిరంగి పురంలో ఉండి ప్రతి శని వారం వస్తారట. భక్తులు వీరి మాదిరి వచ్చి వంటలు చేసుకొని నైవేద్యం పెట్టి ఆరగించి సాయంత్రానికి క్రిందకి వేళతారట.  అంతకు మించి వివరాలు లభించ లేదు.






పరవాన్నం వాసన కమ్మగా నాశికను తాకింది.
ఎక్కడంలో పొద్దున్న తిన్న పలహారం ఎప్పుడో అరిగిపోయింది.
కమ్మని వాసన వానర మూకను కూడా లాగినట్ట్లుగా ఉన్నది. ఎక్కడి నుండో గుంపులు గుంపులుగా కోతులు తరలి వచ్చి చెట్ల మీద, గోడల మీద తాపీగా కూర్చున్నాయి.
పెద్ద వాళ్ళలో ఒకాయన కర్ర పుచ్చుకొన్నారు.





పిల్లల జాడ లేదు కానీ దూరంగా వారి మాటలు అరుపులు వినిపిస్తున్నాయి.
ఎక్కడికి వెళ్ళారా అని అడిగితె అటు పక్కన ఉన్న కోనేరు వద్దకు వెళ్ళారని పెద్దల సమాధానం.
వెళదామా అనిపించింది.
శరీరం బద్దకించింది.
అటువైపు చూసాను. శిధిల కట్టడాలు కనపడ్డాయి.
బహుశా కొండవీటి కోట తాలూకు గోడలవి అయ్యుంటాయి.






క్రిందకి వెళ్ళడానికి లేచాము.
మొక్కు తీర్చుకోడానికి వచ్చిన కుటుంబం ఒప్పుకోలేదు.
ప్రసాదం తీసుకొనే వెళ్లాలని పట్టుపట్టింది.






పావు గంటలో నివేదన పూర్తి చేసి పళ్ళాలలో పెట్టి అందించారు.
రుచి అద్భుతం.
పైగా ఆకలి. మొహమాటం లేకుండా తిని, స్వామికి మరో మారు మొక్కి,  ఆతిద్యానికి కృతజ్ఞతలు తెలిపి, వారు చూపించిన మెట్ల మార్గంలో దిగడానికి సిద్దమయ్యాము.
ఎక్కడ నుండి వచ్చాడో మొదటి కుర్రాడు.
"అంకుల్! దారి తప్పారు. పసుపు కుంకుమ రాసిన రాళ్ళ దారిలో వెళ్ళండి. కాకపొతే మాకు  వచ్చేటప్పుడు రెండు పాములు కనపడ్డాయి. జర్రి పోతులు. భయం లేదు. కొండ చిలువలు కూడా ఉన్నాయి. మన పాదాల శబ్దానికి బయటికి రావు. " వాడి మాటల్లో మోహంలో కొంటెదనం తొంగి చూసింది.






నవ్వి ముందుకు నడిచాము.
కొండ మీద ఆంజనేయ, గరుడ, శంఖు, చక్రాల తో పాటు శ్రీ వారి పాదాలు చెక్కారు.








ఎవరు చేసారో గానీ ఏంతో శ్రమ పది రాళ్ళను ఒక పద్దతిలో మెట్ల మాదిరి అమర్చారు. వారికి కృతజ్ఞతలు.  
పిల్లాడు చెప్పినట్లే రాళ్ళ మీద పసుపు కుంకుమ రాసి ప్రస్పుటంగా కనపడుతోంది. 
కాకపొతే పక్కల పెరిగిన గడ్డి, మొక్కలు మార్గాన్ని మూసేసాయి. 
జర్రి పోతు మాట కూడా కొద్దిగా గుబులు రేపింది. 
కొద్దిగా క్రిందకి దిగిన తరువాత శ్రీ రామ చంపూ కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తాపన ఉన్నది నిజమే అనిపించే దాఖలాలు కనిపించాయి. 
సాష్టాంగ ప్రమాణం చేస్తున్న భక్తుని శిల్పం, చక్కగా రాతి మీద చెక్కిన మెట్లు కనిపించాయి.  











కబుర్లు చెప్పుకొంటూ చాలా తొందరగా క్రిందకి దిగాము. ఎక్కేటప్పుడు గంటన్నర పట్టింది.
మెట్ల మార్గంలో అరగంటలో క్రింద ఉన్నాము.






పూర్తిగా దిగిన తరువాత మరో సారి పైకి చూసి జగన్నాయకునికి నమస్కరించుకొని వాహనాన్ని గుంటూరు వైపు కదిలించాము.
కుదిరితే ఏప్రిల్ లో జరిగే ఉత్సవాలకు హాజరు కావాలని నిర్ణయించుకొన్నాము.




"వినా వెంకటేశం ననాదో నానాద - సదా వెంకటేశం స్మరామి స్మరామి
హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయస్థ ప్రయస్థ " 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...