22, డిసెంబర్ 2017, శుక్రవారం

Sri Rangam

                          భూలోక వైకుంఠం - శ్రీ రంగం 


శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో అగ్ర స్థానంలో ఉన్నక్షేత్రం  శ్రీ రంగం. తమిళులు గంగా దేవికి ప్రతిరూపంగా భావించే కావేరీనదీ తీరంలో ఉన్నది. కావేరీ తన ఉపనది అయిన కొల్లిడంతో కలిసి శ్రీరంగ క్షేత్రానికి అందమైన జల హారంలాగా ప్రవహించడం వలన శ్రీ రంగం ఒక ద్వీపంలాగా మారిపోయింది. 
శ్రీరంగం అగ్రస్థానంలో ఉండటానికి కారణం ఒక క్షేత్రానికి ఉండవలసిన మూడు లక్షణాలు కలిగి ఉండటమే! అవే  క్షేత్ర, మూర్తి మరియు తీర్థ విశేషాలు.
భువిలో శ్రీ మహా విష్ణువు స్వయంవ్యక్తగా ప్రకటితమైన క్షేత్రాలు ఎనిమిది ఉన్నాయి. అవి శ్రీ రంగం,  తిరువేంగడం(తిరుపతి), శ్రీ ముషినం (చిదంబరం దగ్గర),సాలగ్రామం( ముక్తినాథ్, నేపాల్), వనమామలై (తిరునెల్వేలి జిల్లా), నైమిశారణ్యం (ఉత్తరప్రదేశ్), పుష్కరం (పుష్కర్, రాజస్థాన్), బద్రికాశ్రమం (బద్రీనాథ్). వీటిల్లో తొలిస్థానం శ్రీరంగానిదే !
నూట యాభై మంది వివిధ కాలాలకు చెందిన కవులు రాసిన పద్యాలను, కవితలను ఏర్చి కూర్చిన సంకలనం "అహానానూరు" అనే ఒకటో శతాబ్దానికి చెందిన గ్రంధంలో శ్రీరంగ ప్రస్థాపన అక్కడ పెరుమాళ్ కి జరిగే ఉత్సవాల గురించి ఉన్నట్లుగా తెలుస్తోంది. క్రీస్తుశకం ఒకటో శతాబ్దం నాటి సంకలనం అంటే అందులోని రచనలు ఏ  కాలం నాటివి ?. తమిళ భాషలో అత్యంత ప్రామాణ్య గ్రంధంగా పేర్కొనే "శిలప్పాధికారం"లో శ్రీ రంగనాధ స్వామి ఆలయం గురించి విపులంగా వివరించబడినది. రామాయణ, మత్స్య, పద్మ పురాణాలలో కూడా శ్రీ రంగ క్షేత్రం గురించి తెలుపబడినది.  









పురాతన సంస్కృత గ్రంధం "ప్రపన్నామృతం"లో శ్రీ రంగనాధ స్వామి వారు కొలువైన ఆలయం గురించి సంపూర్ణంగా, సోదాహరణంగా పేర్కొనబడినది. పన్నెండు మంది ఆళ్వారులు శ్రీ రంగనాథుని కీర్తిస్తూ పాశుర గానం చేసినవారే ! ఇలా అనేక గ్రంధాలలో, కావ్యాలలో సవిస్తారంగా పేర్కొనబడ్డ దివ్యక్షేత్రంలో, శ్రీ రామానుజాచార్యులు,మానవళ మహాముని, నాదముని, తొండరడిప్పొడి ఆళ్వార్ (విప్రనారాయణ),  తిరుప్పాన్ ఆళ్వార్  నివసించారు. పెరుమాళ్ సేవలో తరించారు. క్షేత్ర అభివృద్ధికి కృషి చేసారు.  
ఇవన్నీ కాకుండా ఆలయంలో జరిగిన సంఘటనలను ఎప్పటికప్పుడు "కోయిల్ ఒలుగు" (ఆలయ సమాచారం)లో లిఖించేవారట. ఈ పుస్తకంలో  కొన్ని వందల సంవత్సరాల విశేషాలు నిక్షిప్తం చేసినట్లుగా తెలుస్తోంది.
ఇన్ని గ్రంధాలలో కీర్తించబడిన శ్రీ రంగనాథుడు ఇక్కడ కొలువు తీరడానికి సంబంధించిన విశేషం త్రేతాయుగం నాటిదిగా అవగతమౌతోంది. ఈ పౌరాణిక ఉదంతం బ్రహ్మాండ పురాణంలో వివరించబడినది.
భూమి మీద తొలి అర్చామూర్తిగా పేర్కొనే శ్రీ రంగనాథుని విగ్రహం తొలుత సృష్టికర్త బ్రహ్మదేవునికి శ్రీమన్నారాయణునిచే ప్రసాదించబడినది. శ్రీ హరే తనకు జరగవలసిన పూజా విధానం ఎలా ఉండాలో పద్మసంభవుడికి వివరించారట. ఆ ప్రకారం విధాత  సత్య లోకంలోని విరజా నదీ తీరంలో  ప్రతిష్టించి భక్తి శ్రద్దలతో నిత్యం స్వామిని ఆరాధించేవారట .
ఇక్ష్వాకు వంశ మూలపురుషుడైన ఇక్ష్వాకు మహారాజు తపస్సుతో బ్రహ్మను మెప్పించి శ్రీ రంగ విమానం కావాలని కోరారట. వైకుంఠవాసుని అనుమతితో హంస వాహనుడు ఇక్ష్వాకుకు శ్రీ రంగనాథుని విమానం అనుగ్రహించారట. అలా స్వామి సరయూ తీరంలోని అయోధ్య చేరారు.
రావణ సంహారం తరువాత సపరివారంగా అయోధ్య చేరి పట్టాభిషిక్తులు అయిన తరువాత శ్రీ రామచంద్ర ప్రభువు అందరికీ కానుకలు ఇవ్వసాగారట. ఆ సమయంలో విభీషణుడు శ్రీ రంగ విమానం మరియు శ్రీ రంగనాథ మూర్తి కోరుకొన్నారట. శ్రీ రాముడు ఇక్ష్వాకు 'వంశ కుల దానం' గా పిలవబడే శ్రీ రంగ విమానాన్ని లంకాధిపతి అయిన విభీషణునికి కానుకగా ఇచ్చేసారట.
పరమ పవిత్రమైన శ్రీ రంగనాథుని విగ్రహాన్ని తీసుకొని కాలినడక లంకానగరానికి ప్రయాణం ఆరంభించాడట విభీషణుడు. తరువాత పెరుమాళ్ళు ఇక్కడ కొలువు తీరడం గురించి ఎన్నో గాధలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ప్రామాణికంగా తీసుకొన్న దాని ప్రకారం ఆ సమయంలో ఈ ప్రాంతాన్నిధర్మవర్మ అనే చోళ రాజు పాలించేవారట. విభీషణుడు శ్రీ రంగ విమానంతో తన రాజ్యం గుండా వెళుతున్నాడన్న వార్త విన్న ధర్మవర్మ తన మంత్రి సామంతులతో వెళ్లి కలిసి కొంత కాలం కావేరీ తీరంలో విడిది చేయమని, దాని వలన తన ప్రజలు స్వామి వారిని దర్శించుకొనే  భాగ్యాన్ని పొందుతారని అభ్యర్ధించారట. రాజు యొక్క కోరికను తిరస్కరించలేని లంకాధిపతి అంగీకరించారట.








రాజ్యవాసులందరు శ్రీ రంగనాథుని దర్శించుకున్న తరువాత విభీషణుడు విమానాన్ని తరలించడానికి ప్రయత్నించగా అవి కదల్లేదట. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిందట. అంది వచ్చిన అదృష్ట్టం చేజారి పోవడంతో ఖిన్నుడైనాడట  విభీషణుడు.
విలపిస్తూ వినమ్రంగా విష్ణు దేవుని వేడుకొన్నాడట. ఆయన ప్రత్యక్షమై ఒకసారి నేలకు తాకిన శ్రీ రంగ విమానాన్ని తరలించడం సాధ్యపడదని, భాధ పడవలదని, తాను  నిరంతరం అతని రాజ్యం వైపే దృష్టి నిలిపి ఉంటానని ఓదార్చారట. ఏమీ చెయ్యలేక విషణ్ణ వదనంతో వెడలాడట విభీషణుడు. పరమాత్మ ప్రసాదించిన వరం కారణంగా పెరియ కోవెల దక్షిణ ముఖంగా అంటే శ్రీ లంక వైపు తిరిగి ఉంటుంది.
అనుకోకుండా లభించిన అదృష్టానికి పొంగిపోయిన ధర్మవర్మ స్వామికి ఆలయం నిర్మించారట.
కాలం గడచి పోయింది. నదుల మధ్య నిర్మించిన ఆలయం ఇసుక మేటలచే కప్పబడినది. తరాలు మారిపోయాయి. అందరూ ఆలయం గురించి మర్చిపోయారు. అలాంటి సమయంలో రాజ్య పాలకుడైన చోళుడు నదీతీరానికి విహారానికి వెళ్ళాడట. అప్పుడొక చిలక సమీపంలో వ్రాలి
" సత్యలోకంలో ఉన్న విరజా నది ఎంతటి పవిత్రమైనదో, అంతే పావనమైనది కావేరీ. శ్రీ రంగ విమానం సాక్షాత్తు వైకుంఠమే! అందులో కొలువైన రంగనాథుడు స్వయం శ్రీమన్నారాయణుడే!ఆ ఆలయం ఇక్కడే ఉన్నది" అంటూ పాడసాగిందట. చోళునికి అర్ధం కాలేదు. రాజభవనానికి తిరిగి వచ్చినా  చిలక పాటే అంతరంగంలో మెదలసాగిందట. మరునాడు మనుషులను పంపి ఆ ప్రాంతమంతా తవ్వించగా కాంతులీనుతూ శ్రీ రంగ విమానం వెలుపలకు వచ్చినదట. మహదానందంతో చోళుడు ఆలయాన్ని నిర్మించాడట. ప్రత్యేకంగా గర్భాలయానికి పక్కన ఒక సుందర మండపాన్ని నిర్మించాడట. దీనిని ఆయన పేరుతోనే కిళి మండపం అని పిలుస్తారు. నేటికీ చూడవచ్చును. చిలక పాట విని ఆలయాన్ని కట్టించినందున ఈయనను కిళి (చిలక)చోళుడు అని పిలవసాగారు. ఈ ఉదంతం "కోవెల ఒలుగు" లో పేర్కొనబడినది.
తదనంతర కాలంలో వివిధ రాజ వంశాల వారు, ఆచార్యులు, ఆళ్వారులు పెక్కు నిర్మాణాలను చేపట్టారని శాసనాల ఆధారంగా తెలుస్తున్నది.
పదునాలుగో శతాబ్దంలో జరిగిన ఢిల్లీ సుల్తానుల దండయాత్రలతో శ్రీ రంగ ఆలయ శోభ తగ్గసాగింది. కొంతకాలం పాటు ఆలయం మూత పడటమే కాక  ఉత్సవమూర్తులను తిరుమల శ్రీ వారి ఆలయంలో భద్రపరచారని ఆధారాలు తెలుపుతున్నాయి. శ్రీ వారి ఆలయంలో నేడు రంగ మండపంగా పిలిచే మండపంలోని శ్రీ రంగనాథుని కొలువు తీర్చారట ఆ సమయంలో !
విజయనగర రాజుల ఆగమనంతో ఆలయం పునర్వైభవాన్ని తెచ్చుకున్నది. చోళులు, పాండ్యులు, హొయసలలు, విజయనగర, నాయక రాజులు అమిత భక్తిప్రపత్తులతో ఆలయ నిర్మాణానికి తమ వంతు కృషి చేశారు.
 సుమారు నూట అరవై ఎకరాల సువిశాల ప్రదేశంలో సప్త ప్రకారాలతో, నాలుగుదిక్కులా నాలుగు  రాజ గోపురాలతో, ఇరవై ఒక్క విమానాలతో, తొమ్మిది కోనేరులతో, యాభై   ఉపాలయాలతో, వెయ్యి కాళ్ళ మండపంతో సహా పెక్కు మండపాలతో భూలోక వైకుంఠం అన్న పేరును సార్ధకం చేసుకొనేటట్లుగా ఉంటుంది ఆలయ సముదాయం.
దక్షిణం వైపున ఉన్న ప్రధాన రాజగోపురం రెండు వందల ముప్పైఆరు అడుగుల ఎత్తుతో, విష్ణు చరిత్రను తెలిపే వర్ణ శిల్పాలతో సుందరంగా ఉంటుంది. ఆసియాలో కెల్లా అతి ఎత్తైన గోపురం ఇదే !










వెలుపల నుంచి మొదలు పెట్టి ప్రతి ప్రాకారాన్నీ  ఒక లోకంతో పోలుస్తారు. మన పురాణాలు సప్త లోకాల గురించి చెబుతున్నాయి కదా ! అవి భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జన లోకం, తపోలోకం మరియు సత్యలోకం. పరమాత్మ ఉండేదక్కడే కదా !  శ్రీ రంగనాధుడు శ్రీ రంగ విమానం క్రింద శేష పాన్పు పైన శయన భంగిమలో దర్శనమిస్తారు.
శ్రీ రంగనాయకి తాయారు ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. గర్భాలయంలో మూడు అమ్మవారి విగ్రహాలు ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
స్వామివారి మీద అవ్యాజమైన భక్తిని ప్రేమను పెంచుకున్న చోళరాజ పుత్రి చోళుకుల వల్లి, (ఈమెనే ఉరయూరు నాంచారి అని కూడా అంటారు), కులశేఖర  రాజ కుమార్తె వల్లి, ఢిల్లీ సుల్తాను పుత్రిక తురక నాంచారి, ముగ్గురూ స్వామి వారిలో ఐక్యం అయిన క్షేత్రం ఇది. తురక నాంచారి సన్నిధి అర్జున మండపంలో ఉన్నది. ఆమె స్మృత్యర్థం తిరుమంజనం సమయంలో స్వామి వారికి గళ్ళ లుంగీ అలంకరిస్తారు. చపాతీ, పాలు నివేదన చేస్తారు.
అందరికన్నా విశేష ప్రేమ గోదాదేవిది. స్వామి వారిని వివాహం చేసుకొన్నది. భూదేవి అంశగా పేర్కొంటారు. పన్నెండు మంది ఆళ్వారులలో ఈమె ఒకరు. ఆండాళ్ గా ప్రసిద్ధురాలైన ఈమె రాసిన "తిరుప్పావై" ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ ఆలయంలో గానం చేస్తారు. ప్రతి విష్ణు ఆలయంలో ఆండాళ్ సన్నిధి ఉంటుంది. శ్రీ విల్లిపుత్తూరు దివ్య దేశం పెరియాళ్వార్ మరియు ఆండాళ్ తో ముడిపడి ఉన్నది.
శ్రీ రంగం ఆలయంలో ఉపాలయాలలో శ్రీ వినాయక,శ్రీ రామ, శ్రీ కృష్ణ, శ్రీ లక్ష్మీ నారసింహ, శ్రీ హయగ్రీవ, శ్రీ ధన్వంతరి   కొలువై ఉంటారు.
శ్రీ రామానుజ, శ్రీ మనవాళ మహర్షి లాంటి శ్రీ వైష్ణవ గురువుల సన్నిధులు కూడా ఉంటాయి.
అద్భుత శిల్పాలకు నిలయం పెరియ కోయిల్. కానీ అన్ని గోపురాలు వర్ణభరిత శిల్పాలతో నిండి ఉండగా తూర్పు వైపున ఉన్న గోపురం ఎలాంటి వర్ణాలు లేకుండా ఉండటం అబ్బురాన్ని కలిగిస్తుంది. పైగా దీనిని తెల్ల గోపురం అని పిలుస్తారు.









అయిదో ప్రాకారంలో ఉన్న పన్నెండు అడుగుల ఎత్తు గల గరుడాళ్వార్ విగ్రహం ఒక విశేషం. ఇంత పెద్ద గరుడ విగ్రహం మరెక్కడా కనపడదు.
ఆలయ ప్రాంగణ ఈశాన్య దిశలో ఉన్న చంద్ర పుష్కరణి తో పాటు మరో ఎనిమిది కోనేరులుంటాయి.ఆలయానికి ఎనిమిది దిక్కులలో నెలకొల్పబడ్డ  ఉలగండ పెరుమాళ్ (త్రివిక్రమ), నరసింహ, దుర్గ, వరద నారాయణ, దశావతారాలు, ఆదికేశవ, లక్ష్మీనారసింహ, కోదండ రామ ఆలయాలను  కావలి దేవతల సన్నిధులు అని పిలుస్తారు.
శ్రీ రంగనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ మాసంలో నిర్వహిస్తారు. కానీ శ్రీ రంగనాథుని ప్రతి నిత్యం ఓ బ్రహ్మోత్సవమే ! దేశం నలుమూల నుండి వేలాది మంది భక్తులు శ్రీ వారి దర్శనానికి తరలి వస్తుంటారు. ప్రతి మాసం ఒక ఉత్సవం జరుగుతుందీ ఆలయంలో.
ఆళ్వారులు తమ పాశురాలలో శ్రీ రంగనాథుని, శ్రీ రంగ వైభవాన్ని ఎంతో కీర్తించారు. తిరుప్పాన్ ఆళ్వార్ శ్రీ రంగనాథుని సమక్షంలోనే పది పాశురాలను గానం చేసి సశరీరంగా స్వామిలోఐక్యం అయ్యారు.
ఆలయం పెద్దది, పెరుమాళ్ పెద్దవాడు (అధిపతి అని అర్ధం), పెద్ద గరుడుడు, పెద్ద గోపురం, పెద్ద మేళం, భక్తుల సంఖ్య పెద్దది, ఉత్సవాలు పెద్దవే  వెరసి  శ్రీ రంగం ఆలయం పెరియ (పెద్ద) కోవెల గా ప్రసిద్ధి.
శ్రీ రంగం తిరుచ్చి(తిరుచురాపల్లి) పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరుచ్చి వెళ్లే అన్ని రైళ్లు శ్రీ రంగంలో ఆగుతాయి. తమిళనాడు లోని అన్ని నగరాల నుండి బస్సులలో తిరుచ్చి చెరుకోవచ్చును. తిరుచ్చిలో విమానాశ్రయం కలదు. తిరుచ్చిలో రాక్ ఫోర్ట్ తప్పక చూడవలసిన ప్రదేశం.
శ్రీ రంగంలో యాత్రీకులకు కావలసిన వసతి సదుపాయాలూ అందుబాటు ధరలలో లభిస్తాయి.

నమో నారాయణాయ నమః !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...