17, డిసెంబర్ 2017, ఆదివారం

Sri Dharmasastha Temple, Sasthamcotta

                         శ్రీ ధర్మశాస్త ఆలయం, శాస్తంకొట్ట 







వైకుంఠ వాసుని ఆరో అవతారమైన శ్రీ పరుశురాముడు, సముద్రుని నుండి నేటి కేరళ ప్రాంతాలను స్వీకరించారు. అనేక శివాలయాలను, దేవీ క్షేత్రాలను స్థాపించారు. వాటికి క్షేత్రరక్షకునిగా శ్రీ ధర్మశాస్త ను నియమించారు. ఈ కారణంగా కేరళను దేవతల స్వస్థలంగా పేర్కొంటారు. 
ఆ విధంగా భార్గవ రాముడు స్థాపించిన నూట ఎనిమిది ధర్మశాస్త ఆలయాలలో స్వామి వివిధ భంగిమలలో కొలువై ఉంటారు. ప్రతి క్షేత్రం ఒక విశేష పురాణ గాధతో ముడిపడి ఉంటాయి. 
శ్రీ ధర్మశాస్త ఆలయాలలో ప్రసిద్ధి చెందినవి కుళత్తపుళ (బాల్యానికి), అరియంగావు (కౌమారానికి), అచ్ఛంకొయిల్ (యవ్వనానికి), శబరిమల(వానప్రస్థానికి) ప్రతీకలు కాగా గృహస్థాశ్రమానికి ప్రతీక శాస్తంకొట్ట. 
ఈ ఆలయం గురించి భక్తులకు తెలిసినది చాలా కొంచెం. 
మూడు యుగాలలో అవతార పురుషుల పాదధూళితో పవిత్రతను సంతరించుకున్న శాస్తంకొట్ట, అందమైన ప్రకృతికి ప్రతిరూపంగా పేరొందినది. 

   

















రావణ సంహారం తరువాత శ్రీ రామచంద్ర మూర్తి, సీత దేవితో పాటు వానర సేనతో అయోధ్య వెళుతూ మార్గమధ్యలో శాస్తంకొట్ట లో ఆగి శ్రీ ధర్మశాస్త కు పూజాదికాలు నిర్వహించారని క్షేత్రగాధ తెలుపుతోంది. 
ఆలయ పరిరక్షణ మరియు స్వామి సేవల కొరకు నీలుని నేతృత్వంలో కొంతమంది వానర వీరులను నియమించారట.  
యుగాలు గడిచిపోయాయి. ఆలయం శిధిలమై, మట్టితో కప్పబడిపోయింది. 
కాయంకుళం రాజకుమారిని పరిణయమాడిన పందళ రాజకుమారుడొకరు, అత్తవారింటనే ఉండసాగాడట. దీనితో అతను ప్రతి సంవత్సరం చేసే శబరి యాత్రకు విఘాతం కలిగింది. రాజ్యములో అనేక సమస్యలు తలెత్తాయి. ఇవన్నీ శ్రీ ధర్మశాస్త ఆగ్రహానికి నిదర్శనాలుగా భావించిన అతను శబరిమల వెళ్ళాడు. అక్కడ ధ్యానంలో ఉండగా శ్రీధర్మశాస్త కనిపించి, "నీవు శ్రమపడి ఇక్కడికి రానవసరం లేదు. నీ రాజ్యానికి సమీపంలోనే నేను కొలువై ఉన్నాను. అదే శాస్తంకొట్ట. అక్కడ నన్ను సేవించుకో !" అని తెలిపారట. 
తేరుకున్న రాజకుమారునికి శాస్తంకొట్ట తన రాజ్యంలో ఎక్కడ ఉన్నదో తెలీయలేదు. కొందరిని ప్రత్యేకంగా ఆ పని మీద నియమించాడు. కొంతకాలానికి రాజ్యంలో నిర్వహించిన విలువిద్యా పోటీలలో ఒక యువకుడు సంధించిన బాణం ఎవరికీ కనపడకుండా పోయిందట. అది వెళ్లిన దిశగా రాజ పరివారం వెళ్లగా వారికి ఒక సుందర సరోవరం, దాని మధ్యలో ఏపుగా పెరిగిన వృక్షాలతో నిండిన దీవి కనపడ్డాయి. దీవిని చేరుకొని చూడగా వానర పూజలందుకొంటున్న శ్రీ ధర్మశాస్త విగ్రహం, పక్కనే శరం అగుపించాయి. 
రాజ కుమారుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శాస్త ధ్యానంలో తెలిపిన శాస్తంకొట్ట ఇదే అని అర్ధమయ్యి, చక్కని ఆలయాన్ని నిర్మించారు. 




















సువిశాల ప్రాంగణంలో నిర్మించబడిన ఆలయంలో, స్థానిక మరియు ద్రావిడ నిర్మాణ శైలులు కనపడతాయి. శ్రీ అయ్యప్ప జీవిత గాథను తెలిపే శిల్పాలతో నిర్మించిన ప్రవేశ ద్వారం ఆకర్షణీయంగా ఉంటుంది. 
వర్తులాకార శ్రీ కోవెలలో చందన పుష్పాలంకృతులై శ్రీ ధర్మశాస్త నేత్రపర్వంగా దర్శనం ప్రసాదిస్తారు. 
కుళత్తపుళలో పులివాహనునిగా, అరియంగావు లో గజవాహనునిగా పూర్ణదేవితో, పూర్ణపుష్కల నాధునిగా అచ్చెంకోవిల్ లో కరి వాహనము మీద దర్శనమిచ్చే శ్రీ ధర్మశాస్త శాస్తంకొట్ట లో దేవేరి ప్రభ, కుమారుడు సత్యకన్ తో కలిసి అశ్వవాహనునిగా కొలువై ఉంటారన్నది స్థానిక నమ్మకం. 
వాస్తవానికి ఆలయంలో ఎక్కడ ప్రభాదేవి, సత్యకన్ ఉండరు. కానీ యుగాల క్రిందట దేవభాషలో రచించిన "సుందర రూపంలో, భార్య ప్రభ, పుత్రుడు సత్యకన్ తో కలిసి శాస్తంకొట్ట గృహంగా చేసుకొన్నశ్రీ ధర్మశాస్త నీకు మేము మొక్కుతున్నాము" అన్న అర్ధం వచ్చేధ్యాన శ్లోకం ఈ విశ్వాసానికి మూలం. 
పరివార దేవతలలో శ్రీ గణపతి, శ్రీ శివ, శ్రీ నాగరాజు, యక్షిణీ, నాగ యక్షిణీ, మదన స్వామి, ఋషీశ్వర, భూతనాధుడు కొలువై ఉంటారు. 
అందరికీ చేసే పూజలు, విధానం ఒకటే అయిన సమర్పించుకొని నైవేద్యాలు మాత్రం వేరువేరుగా, భక్తుల కోర్కెల ప్రకారం ఉండటం విశేషము. 
ఓనం, నవరాత్రులు, గణేశపూజ, మండల పూజలు, మకర జ్యోతి ఉత్సవం, శివరాత్రి లాంటివే కాకుండా స్థానిక పర్వదినాలైన "పైకున్ని ఉత్తరం, పాత ముదయం" లాంటివి కూడా ఘనంగా జరుపుతారు. కుంభం (ఫిబ్రవరి-మార్చి)నెలలో పదిరోజుల పాటు నిర్వహించే ఆలయ ఉత్సవాలు ముఖ్యమైనవి. సాంప్రదాయబద్దంగా అలంకరించబడిన గజరాజుల కోలాహలం చూడముచ్చటగా ఉంటుంది. ప్రత్యేక ఆకర్షణ కూడా !!


















\


ఆలయంలో, ఊరిలో ఇష్టారాజ్యంగా విహరించే కపి సేనను, శ్రీ రాముడు నీలుని నాయకత్వంలో నియమించిన వానరుల వారసులుగా స్థానికులు భావిస్తారు. వాటి పట్ల గౌరవం చూపుతారు. ప్రతి నిత్యం ఒక ప్రత్యేక స్థలంలో ఆహారాన్ని ఉంచుతారు. ఎలాంటి గొడవలు లేకుండా కోతి మూక క్రమశిక్షణతో ఆహారాన్ని స్వీకరిస్తాయి. పర్వదినాలలో, ముఖ్యమైన రోజులలో భక్తులు తమ మొక్కుబడిలో భాగంగా అన్ని అధరవులతో కూడిన పంక్తి భోజనం అందిస్తారు. 
చక్కగా పద్దతిగా వానరాలు భోజనము చేసేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. 
అందుకే ఇక్కడ కోతులు మిగిలిన ఆలయాలలో మాదిరి భక్తులు తీసుకెళ్లే పూజాసామాగ్రి మీద దండయాత్ర చేయవు. 
ఆహారం గురించి ఎలాంటి భయం లేకపోవడంతో నిర్భయంగా అవి చేసే చిత్రమైన విన్యాసాలు ఆకట్టుకొంటాయి. 

















శాస్తంకొట్ట గ్రామాన్ని ఒక ద్వీప కల్పంగా మార్చిన మంచినీటి సరోవరం నుండి  కేరళలోని సగం జిల్లాలకు మంచినీరు సరఫరా అవుతుంది. లోతెంత అన్నది తెలీని ఈ సరస్సులో సంవత్సరమంతా నీరు ఒకే పరిమాణంలో ఒకే స్థాయిలో ఉంటుంది.  ఈ నీటిలో ఎన్నో వనమూలికలు సారం నిండి ఉంటుందని,ఆరోగ్యప్రదాయిని అని స్థానికుల నమ్మకం.
స్వఛ్ఛగా, తీయగా ఉండే నీటిని ఆధునిక సాంకేతిక పద్దతులతో మరింత శుభ్రపరచి సరఫరా చేస్తారు.
జలాశయాలు ఎక్కడ ఉంటే అక్కడ టక్కున వాలిపోయే మత్స్యకారులు ఇక్కడ కనపడరు. సరస్సులో చేపలు ఉండవేమో అనుకోకండి. "ఎట్టా " అనే ఒక అరుదైన చేపలు ఈ చెరువులో నివసిస్తుంటాయి. వీటిని శ్రీ ధర్మశాస్త సృష్టించారని చెబుతారు. తమ ఆరాధ్య దైవం సృష్టించిన వాటిని చంపడానికి ఇష్టపడరు.
లక్షలమంది దాహాన్ని తీర్చే సరస్సు కాలుష్యం బారిన పడకుండా పెక్కు జాగ్రత్తలు తీసుకొంటారు. స్నానాదులు నిషేధం. ఒక్క స్వామివారి ఆరట్టు మాత్రం నిర్వహిస్తారు. నౌకావిహారం చేయవచ్చును. కానీ తెడ్డు వేసి నడిపే పడవలను మాత్రమే అనుమతిస్తారు.
ఖరీదు కొద్దిగా ఎక్కువ.
సుందర పరిసరాల శాస్తంకొట్ట, సరస్సు సినిమా చిత్రీకరణలకు ప్రసిద్ధి. పెక్కు మళయాళ, తమిళ, తెలుగు, హిందీ సినిమాల చిత్రీకరణ జరిగింది. జరుగుతోంది కూడా !!










ఆలయ గజరాజు నీల కంఠన్ 



సత్యకన్, ప్రభ తో శ్రీ ధర్మశాస్త  




శాస్తంకొట్టకు కొల్లం, పట్టణంతిట్ట, చెంగనూరు నుండి బస్సులు లభిస్తాయి. శబరిమల మండల మరియు మకర జ్యోతి రోజులలో ఎరుమేళి నుండి పంబ నుండి కూడా ఇక్కడికి నేరుగా చేరుకోడానికి బస్సులు దొరుకుతాయి.
 అలెప్పి, తిరువనంతపురం, కొచ్చిన్, నుండి  రైలు సౌకర్యం కూడా కలదు.
పరిమిత వసతులు లభిస్తాయి.

స్వామియే శరణం అయ్యప్పా !!!!





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...