22, డిసెంబర్ 2017, శుక్రవారం

Sri Dharmasastha Story

                          శ్రీ ధర్మశాస్త చరిత్ర - శబరి యాత్ర 









శ్రీ ధర్మశాస్త త్రిలోక పూజ్యుడు. హరహర సుతుడు కావడం వలనా ? కాదు జన్మతః ధర్మ మార్గాన్ని బోధించే గురువు గా పరిగణించడం వలన. .
అన్ని లోకాలలోని వారు ధర్మం తప్పకుండా ఏర్పాటు చేసుకొన్నమార్గాన నడుచుకొనేందుకు, వారు తెలిసీ తెలియక చేసే పాప కార్యాల నుండి రక్షించేవానిగా శ్రీ ధర్మశాస్త ప్రసిద్ధి. ఈయన దేవేరులు పూర్ణ మరియు పుష్కళ. నమ్మి కొలిచిన వారికి పుష్కలంగాను, పరిపూర్ణంగాను తన అనుగ్రహాన్ని అందించే స్వామి. భార్గవ రాముడు తొలి యుగంలోనే శబరిమలలో శ్రీ ధర్మశాస్త ఆలయాన్నినిర్మించారని కూడా పురాతన గ్రంధాలు తెలియజేస్తున్నాయి.
అంటే కాదు తానూ సముద్రుని నుండి స్వీకరించిన భూమికి పరశురాముడు శ్రీ శాస్తా ను క్షేత్ర  రక్షకునిగా నియమించారు.
శ్రీ మణికంఠ స్వామి లోకరక్షకుడా ? నిస్సందేహంగా !! లోకాలను దుష్ట మహిషి అల్ల కల్లోలం చేస్తున్నప్పుడు  దేవతలు,మునులు సామాన్య ప్రజలు భీతిల్లిపోయారు.దుష్ట మహిషిని శివకేశవ పుత్రుడే సంహరించగలడు. అందుకని శ్రీ ధర్మశాస్త మణికంఠునిగా ఆ ప్రాంత రాజుకు అడవిలో లభించాడు.సకల విద్యలు అభ్యసించి పులిపాలు  తెచ్చే వంకతో అడవికి వెళ్లి రాక్షసిని వధించి,అవతార పరిసమాప్తి చేశారు.పొన్నంబల మేడు చేరుకొని శ్రీ ధర్మశాస్తలో  ఐక్యం అయ్యారు.
మరి శ్రీ అయ్యప్ప స్వామి ఎవరు ? కలియుగంలో ప్రజలను ధర్మమార్గంలో నడిపిస్తూ, వారికి కలిగే ఆపదలను తొలగించే వారు. లోక సంరక్షకుడు.
శ్రీ ధర్మశాస్త, శ్రీ మణికంఠ, శ్రీ అయ్యప్ప వేరువేరా ?
అవును అనే అంటున్నాయి పురాతన మళయాళ గ్రంధాలు. ముగ్గురూ వేరువేరు కాలాలకు చెందిన వారు.  అయినప్పటికీ శ్రీ ధర్మశాస్త, శ్రీ మణికంఠుడిగా, శ్రీ అయ్యప్పగా తానూ ధరించిన మూడు అవతారాలలో శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేశారని గ్రంధాలు తెలుపుతున్నాయి.శరణ ఘోషలోని ఎన్నో నామాలకు సంబందించిన వివరాలు శ్రీ అయ్యప్ప చరిత్రలో కనిపిస్తాయి.వీటన్నింటినీ తెలుసుకోవాలంటే ఆర్య కేరళ వర్మ చరిత్ర తెలుసుకోవాలి. పాండ్య రాజుల వంశస్థులలో కొందరు నేటి కేరళ లోని ఈ ప్రాంతాలకు వలస వచ్చి తమ సామ్రాజ్యాన్ని స్థాపించారని చరిత్ర తెలుపుతోంది.
పదకొండో శతాబ్ద తొలినాళ్లలో "ఉదయనన్" అనే బందిపోటు తన అనుచరులతో నేటి కేరళ ప్రాంతాలైన పందళం, ఇంజిపర, కరిమల లాంటి ప్రాంతాల ప్రజలను దోచుకొనేవాడు. అతను శబరి కొండలలో ఉన్న శ్రీధర్మశాస్త ఆలయాన్ని ధ్వంసం చేసి పూజారిని కిరాతకంగా సంహరించాడు.పూజారి కుమారుడైన జయంతుడు తండ్రి మరణానికి ప్రతీకారం చేయాలన్న తలంపుతో, యుద్ధ విద్యలు నేర్చుకొని గొప్ప వీరునిగా పేరొందాడు. ఉదయనన్ని అంతం చేయడానికి సహాయం కొరకు ఎందరో రాజులను సంప్రదించాడు. వారంతా ఉదయనన్ క్రూరత్వానికి, అతని అనుచర బలానికి బెదరి ముందుకు రాలేదు. జయంతుడు శబరిమల చేరుకొని ఆ దేవదేవుని సహాయం కొరకు తపస్సు ప్రారంభించాడు. అదే సమయంలో పందళ రాజకుమార్తె అందచందాల గురించి విన్న ఉదయనన్ రాజభవనం మీద దాడి చేసి ఆమెను అపహరించి, ఒక చీకటి గుహలో ఉంచాడు.నాటి రాత్రి జయంతుని కలలో "శాస్త" దర్శనమిచ్చి రాజకుమార్తెను దాచి ఉంచిన ప్రదేశము యొక్క ఆనవాళ్లు తెలిపి,ఆమెను రక్షించి వివాహమాడమని తెలిపారు.వారికి తాను కుమారునిగా జన్మించి ఉదయనన్ బారి నుండి ప్రజలను రక్షిస్తానని తెలిపారు. అలాంటి స్వప్నమే బందీగా ఉన్న రాజకుమార్తెకు వచ్చినది. అందుకే ఆమె అర్ధ రాత్రి వచ్చి కావలి వారిని హతమార్చిన జయంతుని వెంట ఎలాంటి సందేహం లేకుండా పొన్నాంబలమేడు చేరుకొంది. ఆ పవిత్ర ప్రదేశంలో వారు వివాహమాడి దంపతులైనారు.నేటికీ అక్కడి గుహలో శ్రీ ధర్మశాస్త విగ్రహం ఉన్నది అని చెబుతారు. కొంతకాలానికి వారికి శ్రీ ధర్మశాస్త అంశతో ఒక కుమారుడు జన్మించాడు. "ఆర్యన్" అన్న పేరు పెట్టి తనకు తెలిసిన అన్నివిద్యలలో శిక్షణ ఇచ్చాడు జయంతుడు. బాలునికి పదేళ్ల వయస్స రాగానే గతమంతా తెలిపి అతనిని పందళ రాజ్యము పంపాడు.














ఆప్యాయంగా ఆహ్వానించిన రాజు సంగతి అంతా తెలుసుకొని మనుమడికి ఆర్య కేరళ వర్మ అన్న పేరు పెట్టి మరికొంత యుద్ధవిద్యలలో శిక్షణ నిమిత్తం గురునాధన్ గురుకులానికి పంపారు.పందళం రాజభవనానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో అచ్చన్ కోవెల్  నదీ తీరాన నాటి గురుకులం "గురునాధన్ ముఖాడి" ఉన్నది.దర్శనీయ స్థలం. కాలరి పట్టు లాంటి స్థానిక పోరాట విద్యలను చేరన్ చేర ఆశ్రమం, చేర్తల (కొల్లం జిల్లా)లో అభ్యసించారు. అన్ని యుద్ధ ప్రావీణ్యం సాధించి తిరుగులేని వీరాధివీరునిగా రూపొందిన ఆర్యన్ ను ప్రజలు ప్రేమగా"అయ్యప్పన్" (అయ్యా) అని పిలిచేవారు.
అన్నింటా అమోఘ మైన ప్రతిభ ప్రదర్శిస్తున్న అయ్యప్పన్ కీర్తి అన్ని ప్రాంతాలకు వ్యాపించినది. ప్రజలను పీడిస్తున్నఉదయనన్ ని అంతం చేయాలన్నఆయన ఆకాంక్ష, దానికి తగిన సైన్యం తయారు చేస్తున్నారు అన్న విషయం తెలిసి ఎందరో ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తరలి వచ్చారు.అదే సమయంలో సముద్ర దొంగ "వావరు" తీర ప్రాంతాల మీద దాడి చేస్తున్నాడు అన్న వార్త వచ్చినది. తన శౌర్య ప్రతాపాలతో, దివ్య మహిమలతో వావరుని ఓడించి తన అనుంగు అనుచరునిగా చేసుకొన్నారు అయ్యప్ప.
ఈ సంగతి తెలిసి చుట్టుపక్కల రాజ్యాల రాజులు తమ సేనలను పంపడానికి సిద్ధమంటూ వర్తమానం పంపారు.
వివిధ విద్యలలో ప్రావీణ్యులైన యోధులు తమంతట తాము వచ్చిసేనలో చేరారు.ఖడ్గ విద్యలో ప్రతిభావంతులైన   కూచు కడుత్త స్వామి,విలు విద్యలో నేర్పరులైన విల్లన్, మారన్, కాలరీ పట్టు విద్యలో నిష్ణాతులైన చేరిన్ చెర నాయకుడు మరియు వావరు లాంటి వారెందరో!
ఈ సైన్యం అడవులలో, కొండలలో ఉదయనన్ ముఠా గురించి అన్వేషణ  ప్రారంభించింది. అది తెలుసుకొన్న ఉదయనన్ అనుచరులతో కలిసి దొంగ చాటుగా దాడులు చేసి చీకాకు పరచసాగాడు. అయ్యప్ప తన సేనలను మూడు భాగాలుగా విభజించారు. ఇంతలో ఉదయనన్  చేరన్ చేర ఆశ్రమ నాయకుని కుమార్తెను అపహరించి కిరాతకంగా సంహరించాడు. దానితో అయ్యప్ప తన సేనలను ఎరుమేళిలో విడిది చేయించి అందరూ మండల కాలం దీక్ష వహించేలా ఆజ్ఞాపించారు. నలభై ఒక్క రోజులు పూర్తి అయిన తరువాత ఎరుమేళిలో "కిరాతక ధర్మశాస్త"ను స్థాపించి పూజించి, దుండగీయుని అంతం సమీపించింది అన్న ఆనందంతో రంగులు పూసుకొని నృత్యాలు చేసి (అదే నేటి పేట్టతుళ్ల)  ఇనుమడించిన ఉత్సాహంతో అయ్యప్ప నాయకత్వంలో అరణ్యము లోనికి ప్రవేశించారు.






శ్రీ అయ్యప్ప ఉపయోగించిన ఖడ్గం (పూతన వీడు)

వావరు స్వామి మసీదు 

ఎరుమేలి శ్రీ ధర్మశాస్త ఆలయం 









దొంగలు దాగి ఉన్న స్థావరాలను కనిపెట్టి దొరికిన చోరులను దొరికినట్లుగా యమపురికి పంపారు.చివరకి ఉదయనన్  హతుడయ్యాడు.విజయం సాధించి ససైన్యంతో అయ్యప్ప శబరిమల ఆలయానికి చేరుకొన్నారు.శబరీ కొండలు ఆలయం పరమ పవిత్రమైనవి గనుక అయ్యప్ప తన సేనను ఆయుధాలను ఒక వట వృక్షం వద్ద పెట్టామన్నారు. అదే నేటి "శరంగుత్తి". ఆలయం వద్ద పందళ రాజు సారధ్యంలో పండితులు నూతన శ్రీ ధర్మశాస్త విగ్రహ ప్రతిష్ట నిర్వహించడానికి  సిద్ధంగా ఉన్నారు.ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుండగా "మణి మండపం" (నేటి మాలికాపురం ఆలయం వెనక  ఉంటుంది)లో  ధ్యానంలో కూర్చున్న అయ్యప్ప సశరీరంతో శ్రీ ధర్మశాస్తలో ఐక్యం అయ్యారు.
ఆలా ఆయన ఐక్యం అయిన రోజున  పొన్నాంబలమేడు నుండి హారతి ఇస్తారు. అదే మకర జ్యోతి.
అలా మండల కాల దీక్ష, ఎరుమేళిలో పేట్టతుళ్ల చేయడం ( ఎరుమేళి శ్రీ ధర్మశాస్త స్థానిక భంగిమలో ధనుర్భాణాలను ధరించి ఆటవిక(కిరాతక) వేష ధారణలో ఉంటారు), ఎరుమేలి చేస్తావే, కడుత్త స్వామి, వావరు స్వామి, విల్లాలి వీర లాంటి శరణ ఘోష నామాలు శ్రీ అయ్యప్ప సేన చేసిన దీక్ష సందర్బంగా ఉద్భవించినవే !
అలా ప్రతి అవతారంలో కూడా తనను నమ్మి కొలిచిన వారిని కాపాడుతూ వస్తున్నారు హరిహర పుత్రుడైన శ్రీ ధర్మ శాస్త.  అందుకే దీక్షను శ్రద్దగా పాటించి, ప్రకృతి మరియు పరమాత్మల మీద భక్తి గౌరవాలతో శబరి యాత్ర చేయాలని పెద్దలు, గురుస్వాములు చెబుతారు.

పందళ రాజ భవనం 

చారిత్రక ఆధారాల ద్వారా మధురై ని పాలించిన పాండ్య రాజవంశస్థులలో కొందరు వివిధ కారణాల మూలంగా సుమారు క్రీస్తు శకం పదో శతాబ్దము లో ఈ ప్రాంతాలకు వలస వచ్చారని తెలుస్తోంది. స్థానికంగా  "అయిరూరు స్వరూపం(వంశం) "గా పిలవబడే ఈ రాజులు అప్పట్లో విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి పాలించారని కూడా తెలియవస్తోంది. ఎడతెరపి లేని దండయాత్రల మూలంగా ఆర్ధికంగా బలహీనపడి పంతొమ్మిదో శతాబ్ద చివరికి ట్రావెంకూర్ రాజులకు సామంతులుగా స్థిరపడ్డారు. 
వీరు పదో శతాబ్దంలో నిర్మించిన పందళ గ్రామంలో రాజ భవన సముదాయాన్నిరెండు భాగాలుగా అచ్చన్ కోవెల్  నదీ తీరానికి ఇరుపక్కల నిర్మించారు. కాల గతిలో చాలా నిర్మాణాలు శిధిలం కాగా ప్రస్తుతం నదికి ఎడమ పక్కన వలియ కోయిక్కాల్ ఆలయం, భక్తులు సేద తీరడానికి, భజనలు చేసుకోడానికి  నిర్మించిన తేవరపురాస్, రాజశేఖర రాజు శ్రీ అయ్యప్పకు చేయించిన ఆభరాణాలను ఉంచే "స్రంపికాల్ భవనం" ఉంటాయి. రాజశేఖర రాజు ఉదయనన్ శ్రీ ధర్మశాస్త లో లీనమైన తరువాత ఆయనను కుల దేవతగా భావించి వలియ కోయిక్కాల్ ఆలయం   నిర్మించారని అంటారు. విషు పర్వదినాన(కేరళ ఉగాది), శ్రీ అయ్యప్ప జన్మదినమైన ఫల్గుణి ఉత్తరం  నక్షత్రం రోజున( మార్చి నెలలో) ఈ ఆలయం లోని  శ్రీ అయ్యప్ప విగ్రహానికి తిరువాభరణాలు అలంకరిస్తారు. శబరిమలలోని ప్రధాన అర్చనామూర్తికి  కాకుండా ఇక్కడ మరియు చెంగనూర్ నుండి పంబ వెళ్లే మార్గంలో వచ్చే "రేణి పేరునాడ్"లో కొలువైన శ్రీ ధర్మశాస్త కు  మాత్రమే తిరువాభరణాలను అలంకరిస్తారు.






పందళం రాజభవనం 

సంప్రిక్కల్ భవనం 


మంగళ తంబురాతి 







నదికి కుడి వైపున కైప్పుళ ఆలయ ప్రాంగణం మరియు పూతేన్ కోయిక్కాల్ భవనం ఉంటాయి. ఈ భవనానికి ఉన్న పద్దెనిమిది మెట్ల మార్గం గుండానే పందళ  రాజు తిరువాభరణాలతో శబరి యాత్ర సందర్బంగా రాజ భవన వెలుపలికి వస్తారు. కైప్పుళ ఆలయ ప్రాంగణంలోశ్రీ మహాదేవ, శ్రీ కృష్ణ ఆలయాలలు మరియు శ్రీ గణపతి, శ్రీ షణ్ముఖ, శ్రీ భగవతి ఆదిగా గల ఉపాలయాలు ఉంటాయి. దక్షిణ ఉత్తర భాగాలను కలుపుతూ నది మీద చక్కని వంతెన నిర్మించారు. 
ఇది కాకుండా దక్షిణం పక్కన పందాల రాజ భవనంగా పిలవబడే మరో పురాతన భవనం ఉంటుంది. నేడు ఇందులో పందళ వంశానికి చెందిన "మంగళ తంబురాతి " అని పిలవబడే వయో వృద్ధురాలు దర్శనానికి వచ్చే భక్తులను ఆశీర్వదిస్తుంటారు.మకర విళక్కు కు తిరువాభరణాలను తీసుకు వెళ్లే రాజు ఈమె ఆశీర్వాదం తీసుకొన్న తరువాతనే శబరిమలకు బయలుదేరుతారు. ఈమె తన జీవిత కాలంలో శబరిమల దర్శించారట !
అదే విధంగా పందాల వంశం లో పురుషులు ఉపనయనానికి ముందు శబరిమల యాత్ర చేపట్టరు. మకరవిళక్కును ఎప్పుడూ దర్శించుకోరు. పందాల రాజు ఇరుముడి కట్టు లేకుండానే పదునెట్టాంబడి ఎక్కవచ్చును దిగవచ్చును. మిగిలిన కుటుంబ సభ్యులు పక్కన ఉన్న మార్గం గుండా వెళ్లి శ్రీ ధర్మశాస్తాను సేవించుకొంటారు.  

తిరువాభరణం 

నలభై ఒక్క రోజుల దీక్ష చేసి, ఎరుముడితో శబరిమల చేరుకొన్న భక్తులకు మకర సంక్రాంతి నాడు సర్వాభరణ భూషితులై కనిపించే శ్రీ ధర్మ సంస్థ దర్శనం అమిత ఆనందదాయకం. 
అసలు ఈ తిరువాభరణాలు ఏమిటి ? అంటే వీటిని పందళ రాజు వెయ్యి సంవత్సరాల క్రిందట చేయించారు అని తెలుస్తోంది. సంవత్సరకాలం అంతా పందళ రాజ ప్రసాదంలోని "స్రంపికల్ భవనం"లో  అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచబడతాయి.మకర జ్యోతి కి వెళ్ళలేని భక్తులు ఈ ఆభరణాలను మండలపూజా  సమయంలో ఇక్కడ  దర్శించుకోవచ్చును. 
మళయాళ పంచాగం(కొల్ల వర్షం) లోని ధనుర్మాసం ఇరవై ఎనిమిదో రోజున అంటే జనవరి పన్నెండో తారీఖున తిరువాభరణ మూడు పెట్టెలకు ప్రత్యేక పూజల చేస్తారు. ఈ మూడు పెట్టెలలో అన్నిటికన్నా పెద్దది  అయిన  తిరువాభరణం పెట్టిలో బంగారు కిరీటాలు, కవచం, హారాలు, ఉంగరం, లక్ష్మీ రూపు, పెద్ద, చిన్న ఖడ్గాలు, పూలు ఉంచడానికి వాడే పళ్ళెము, స్వామి వాహనాలైన గజము, పులి బంగారు బొమ్మలు ఉంటాయి. 
రెండోది  అయిన కొడి పెట్టిలో  స్వామి వారి ధ్వజాలు, అన్నిటికన్నా చిన్నదైనా "వెళ్లి పెట్టి"లో వెండి పూజా సామాగ్రి ఉంటాయి.
















అనంతరం తెల్లవారు జాము నాలుగు గంటలకు పందళ రాజు నియమించిన అధికారి ఆధ్వర్యంలో మూడు తిరువాభరణ  పెట్టెలను దీక్షలో ఉన్న స్వాములు శిరస్సున ధరించి నడుచుకొంటూ శబరిమల బయలు దేరుతారు.వీరిని అనుసరిస్తూ వేలాది మంది భక్తులు, కాపలాగా రక్షక భటులు ! 
వారి తొలి మజిలీ ఆరన్ముల శ్రీ పార్ధసారధి ఆలయం. తిరువాభరణ యాత్ర అక్కడికి చేరుకొనే సరికి మధ్యాహన్నం అవుతుంది. సరిగ్గా అదే సమయానికి సన్నిధానం పైన ఒక "కృష్ణ పక్షి" (గరుడ)ఎగురుతుంది. పక్షి రాకతో తిరువాభరణాలు బయలుదేరాయి అన్న సంకేతం ఆలయం వద్ద ఉన్న వారికి అందుతుంది. ఈ ఎనభై మూడు కిలోమీటర్ల దారిలో వచ్చే గ్రామస్థులు మహదానంతో స్వామి వారి ఆభరణాలకు ఘన స్వాగతం పలుకుతారు. 
మార్గ మధ్యలో విశ్రాంతికి, భోజనాదులకు ఆలయాలలో విడిది చేస్తారు. ఇలా తిరువాభరణ యాత్ర మకర సంక్రాంతి నాటి మధ్యాహన్నం పంబా తీరం చేరుతుంది. అక్కడ స్నానాదులు, పూజలు పూర్తి చేసుకొని సాయంత్రం అయిదు గంటలకు సన్నిధానం చేరుకొంటాయి. తిరువాభరణాలు ఆలయం చేరిన దగ్గర నుండి భక్తులలో  మరి కొద్దీ సేపట్లో మకర జ్యోతి దర్శనం, అనంతరం తిరువాభరణ దారి అయిన శ్రీ ధర్మశాస్త దర్శనం చేసుకోబోతున్నామన్నసంతోషం మొదలవుతుంది. సంధ్యా చీకట్లు ఆవరించుకొంటున్న సమయంలో స్వర్ణాభరణ భూషితులైన శ్రీ మణికంఠ స్వామికి మేల్ సంతి హారతి ఇస్తారు. వెంటనే పొన్నాంబల మేడు నుండి మకర జ్యోతి కనిపిస్తుంది. అవధులు దాటిన ఆనందంతో లక్షలాది మంది భక్తులు "స్వామి శరణం!అయ్యప్ప శరణం!" అంటూ చేసే శరణ ఘోషతో శబరి కొండలు మారు మోగుతాయి. 
శ్రీ ధర్మశాస్త ఈ ఆభరణాలను ధరించి ఐదు రోజుల పాటు దర్శనమిస్తారు. చివరి రోజున పందళ రాజు పూజ చేసుకొన్న తరువాత ఆలయాన్ని మరుసటి నెల పూజల దాకా మూసివేస్తారు.పందళ రాజు తిరువాభరణాలతో తిరుగు ప్రయాణం మొదలుపెడతారు.మార్గ మధ్యలో వచ్చే రేణి పేరునాడ్  గ్రామంలో ఉన్న శ్రీ ధర్మశాస్త కి తిరువాభరణాలను ఒక రోజు అలంకరిస్తారు. ఇక్కడి ఆలయం శబరిమల ఆలయం ఒక్కసారే నిర్మించారని అంటారు. జనవరి ఇరవై మూడో తారీఖు నాటికి తిరువాభరణాలు పందళ రాజా భవనం లోని "స్రంపికల్ భవనం". చేరుకొంటాయి. తిరిగి వీక్షించాలంటే సంవత్సరం పాటు ఎదురు చూడాల్సినదే!!

పెరియ పాదం 

శబరిమల శ్రీ ధర్మశాస్త దర్శనం అభిలషించే దీక్షాధారులు ఎరుమేళి చేరి పెట్ట తుళ్ళి నృత్యం చేసి, ఎరుమేళి శ్రీ ధర్మశాస్త ను సేవించుకొని, అక్కడ నుండి రెండు దారులలో పవిత్ర పంబా తీరం చేరుకోవచ్చును. 
మొదటిది వాహనంలో వెళ్లవచ్చును. పంబ నుండి సన్నిధానం ఆరు కిలోమీటర్లు. రెండోవది సంప్రదాయ మార్గము. రహదారి లేని రోజుల నుండి స్వాములు ఈ దారి లోనే ప్రయాణించేవారు. ఎరుమేళి నుండి పంబ మీదగా సన్నిధానం చేరుకోడానికి అరవై కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాలి. 
మార్గమంతా అనేక విశేషాలతో నిండి మార్గాయాసం తెలియకుండా నిజ భక్తుల హృదయాలలో ఆధ్యాత్మిక భావాలను నింపుతుంది.    
ఎరుమేళి శబరి యాత్రకు ప్రధాన ద్వారం. శ్రీ అయ్యప్ప తన అనుచరులతో ఇక్కడే తొలి దీక్షకు శ్రీకారం చుట్టారు. స్వామి ప్రతిష్ఠిత శ్రీ ఎరుమేళి ధర్మశాస్త, అనుంగు అనుచరుడు శ్రీ వావరు స్వామి మసీదు ఇక్కడే ఉంటాయి. మతసామరస్యాన్ని ప్రతిబింబించే స్థలము. ఇక్కడ ఉన్న పూతేన్ వీడులో శ్రీ అయ్యప్ప దుష్ట సంహారానికి ఉపయోగించిన ఖడ్గాన్ని వీక్షించవచ్చును. 
సన్నిధానానికి చేరువగా వచ్చాము అన్న సంతోషంతో భక్తులు శరీరమంతా రంగులు పూసుకొంటారు. తరువాత "స్వామి తిందగ తోమ్ ! అయ్యప్ప తిందగ తోమ్ !" అంటూ మేళానికి అనువుగా నృత్యాలు చేస్తారు. 
పెట్ట శాస్త దర్శనం అనంతరం కాలకృత్యాలు తీర్చుకొని, భజనలు చేసి, ఫలహారం చేసి చీకట్లో అరణ్యం లోనికి నడవడం మొదలుపెడతారు. 
పెరియపాదంగా పిలిచే ఈ దారిలో మొదట వచ్చేది "పెరూర్ తోడు" అనే నీటి ప్రవాహం. అయ్యప్ప ఇక్కడ విశ్రాంతి తీసుకొన్నారన్నది భక్తుల నమ్మకం. కొంత తడవు విశ్రాంతి తీసుకొని వనమూలికలు సారంతో నిండిన నీటిలో స్నానాదులు,దానధర్మాలు చేస్తారు. 
ఇక్కడ నుండి అయ్యప్ప స్వామి "పూంగావనం" (ఉద్యానవనం) ఆరంభం అవుతుంది. 
 శ్రీ మణికంఠ స్వామి మహిషితో సాగించిన పోరాటాన్ని ఆదిదంపతులు కాలకెట్టి దగ్గర నుండి వీక్షించారట.ఇక్కడ నంది (కాల)ని చెట్టుకు కట్టి(కట్టి) మహిషి అంతాన్ని కుమారుని విజయాన్ని చూసిన  దానికి గుర్తుగా ఇక్కడొక పురాతన శివాలయం ఉంటుంది. రెండు కిలోమీటర్లు నడిచిన తరువాత వచ్చేది అళుదానది. మహిషి కన్నీటి నుండి పుట్టినదిగా పేర్కొనే ఈ నదీతీరాన ప్రిత్రు దేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు.  స్నానాదులు చేసి రెండు రాళ్లను తీసుకొని దగ్గర ఉంచుకొంటారు. అళుదా మేడు (కొండ) ఎక్కిన తరువాత "కల్లడం కుండ్రు ". అళుదా నది నుండి సేకరించిన రాళ్లను ఇక్కడ ఉంచుతారు. ఇది దుష్ట మహిషి శరీరం అని తిరిగి లేవకుండా ఈ రాళ్లను ఉంచుతారు. ఇంకా పైకి ఎక్కితే అళుదా శిఖరం  లేదా ఉదుంబర మల. కొండ దిగితే ముక్కులి. విశ్రాంతి ప్రదేశం. అళుదా ఎక్కి దిగడంవలన కలిగిన అలసట ఇక్కడ తీర్చుకోవచ్చును. దీని తరువాత వచ్చేది కరిమల. ఏనుగులు ఎక్కువగా తిరిగే ప్రదేశం కావడంతో ఈ పేరు వచ్చినది. కష్ట సాధ్యమైన ఈ పర్వతాన్ని ఎక్కిన భక్తులు అక్కడ ఉన్న నళికిన్నారు అని పిలవబడే సహజ సిద్ద నీటి కోనేరులో స్నానం చేసి భజనలు చేస్తారు. 
ఇక్కడికి పంబ అయిదు కిలోమీటర్ల దూరం. కరిమల ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే !
పంబ చేరుకొన్న స్వాములు  పవిత్ర ప్రవాహంలో స్నానం చేసి, త్రివేణి సంగమంలో పెద్దలకు తర్పణాలు విడిచి, పంబ సద్ది చేసి సన్నిధానం వైపుకు సాగుతారు. పంబ తీరాన శ్రీ గణపతి, శ్రీ పార్వతి, శ్రీ నాగరాజు, శ్రీ రామ మరియు శ్రీ ఆంజనేయ మందిరాలు నెలకొల్పబడినాయి. 
కొబ్బరికాయ కొట్టి అందరికీ మొక్కి నీలిమల, అప్పాచిమేడు, శబరి పీఠం మరియు శరంగుత్తి మీదుగా సన్నిధానం చేరి పదునెట్టాంబడి ఎక్కి భక్తి శ్రద్దలతో నెయ్యాభిషేకం చేసుకొని, మాలికాపురత్తమ్మను సేవించుకొని, యత్రానుభూతులను తలచుకొంటూ తిరుగు ప్రయాణం అవుతారు. 


స్వామియే శరణం అయ్యప్ప !!!!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...