22, డిసెంబర్ 2017, శుక్రవారం

Alwars

                                భక్తి కి మరో పేరు  ఆళ్వార్లు 



భక్తి సాహిత్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన గాయక భక్తులు ఆళ్వారులు మరియు నయమ్మారులు కలిసి ఎన్నో మరుగున పడిపోయిన మహా పుణ్య క్షేత్రాలను వెలుగులోనికి తెచ్చారు.
ఆళ్వారులు ఆశువుగా గానం చేసిన పాశురాల  ద్వారా నూట ఎనిమిది శ్రీహరి ఆలయాలు దివ్యదేశాలు అన్న గౌరవం దక్కించుకున్నాయి. అదే విధంగా నయమ్మారులు తమ పాటికాల ద్వారా రెండు వందల డెబ్భై అయిదు కైలాసనాధుడు కొలువైన పవిత్ర ఆలయాలకు  "పడాల్ పెట్ర స్థలాలు" అన్న గుర్తింపు తెచ్చారు.  అంతే కాకుండా తమ పాటికాలలో పేర్కొన్న మరో   నూట అరవై ఎనిమిది శైవ క్షేత్రాలకు "తేవర వైపు స్థలములు"గా అరుదైన గుర్తింపును తెచ్చారు.
పరిపూర్ణ భక్తికి నిదర్శనం వీరు. అందుకే ఆలయాలలో కొలువైన వారిని ఆరాధిస్తున్నాము. వారు గానం చేసిన కీర్తనలను పాడుకొంటున్నాము.
ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తోంది. శ్రీ మహావిష్ణుకు  ప్రీతికరమైన మాసం. నాదముని ద్వారా మనకందించిన "నళయర దివ్య ప్రబంధం" లో ఆళ్వారులు గానం చేసిన నాలుగు వేల పాశురాలను విష్ణు ఆలయాలలో నియమంగా గానం చేస్తారు. ముఖ్యంగా ఆండాళ్ రచించిన తిరుప్పావై ప్రతి నిత్యం శ్రీ వారి సన్నిధిలో గానం చేస్తారు.
తిరుప్పావై అంటే తిరుమల శ్రీనివాసునికి ప్రీతి. ఈ కారణంగా తిరుమలలో ధనుర్మాసంలో సుప్రభాతం బదులు స్వామివారిని తిరుప్పావైతో మేలుకొలుపుతారు.
భక్తులు నళయర దివ్య ప్రబంధం తమిళ వేదంగా పరిగణిస్తారు.





నాదముని 

108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలు 




ఆళ్వార్ అంటే "నిరంతరం శ్రీహరి సేవలో నిమగ్నమైనవాడు" అని అర్ధం. అందుకే సుదర్శన చక్రాన్ని "చక్రత్తి ఆళ్వార్" అని గరుడుడిని "గరుడాళ్వార్" అని పిలుస్తారు. 
ఆశాశ్వితమైన మానవ జన్మ ఎత్తిన, ప్రాపంచిక ప్రలోభాలకు లోనవ్వక జగద్రక్షకుడైన జగన్నాధుని తమ హృదయ పీఠాలలో నిలుపుకొని ఆయన దివ్య చరితాన్ని, మహత్తును తమ పాశురాలు ద్వారా లోకానికి తేలినందున వీరు ఆళ్వారులుగా కీర్తించబడుతున్నారు. 
వీరికి తల్లి, తండ్రి, గురువు, సహోదరుడు, సఖుడు, మార్గదర్శి, ధన్వంతరీ, పరమపదాన్ని ప్రసాదించే పరంధాముడు అన్నీ నీలమేఘశ్యాముడే !!
అనంతునికి సంబంధించినది ఏదైనా ఆళ్వార్ కు అతి పవిత్రము, అమూల్యం, పూజనీయం. 
అందుకే తమ పాశురాలలో శ్రీ వారి రూపం, విగ్రహ సౌందర్యం, అలంకారం, దేవేరి. ఆయుధాలు, శేష పాన్పు, పాలకడలి, శ్రీ వైకుంఠం, భక్తవత్సలత, లీలా విలాసాలు ఇలా అన్నింటినీ ఉదహరించారు. 
నిరంతరం హరినామ స్మరణ చేస్తూ, పూజించుకొంటూ ఆళ్వార్ అన్న పదానికి పర్యాయపదంగా నిలిచారు. 
ఆళ్వారులలో అగ్రవర్ణాల వారొక్కరే కాదు నాటి సమాజంలోని అంటరానివారి దాకా అన్ని వర్ణాలకు వర్గాలకు చెందినవారు ఉండటం విశేషం !!
జన్మతః లేదా పెరిగిన వాతావరణం వలన వర్ణ వత్యాసాలు ఏర్పడినాయి కానీ అందరూ అంతర్యామి ఆశీర్వాదం తో జన్మించినవారే కదా !!
ఆళ్వారులు ఒక మహిళతో కలిపి మొత్తం పన్నెండు మంది. 
పొయిగై ఆళ్వార్ , భూతత్తి (పూతత్తి)ఆళ్వార్ , పెయాళ్వార్, తిరుమలై సై ఆళ్వార్ , నమ్మాళ్వార్,
మధురకవి ఆళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, కులశేఖర ఆళ్వార్, తొండర డిప్పొడి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ మరియు తిరుప్పాన్ ఆళ్వార్.  
అందరూ శ్రీహరి పరమ భక్తులే ! అందరి పాశురాలు సుమధురాలే ! అయినా పన్నిద్దరిలో నమ్మాళ్వార్ మరియు ఆండాళ్ ప్రసిద్ధులు. నలయిర దివ్య ప్రబంధం మనకు అందించిన  నాద ముని నమ్మాళ్వార్ ని ప్రార్ధించి  మొత్తం నాలుగు వేల పాశురాలను పొందినది. 
ఈ నాలుగు వేలలో నమ్మాళ్వార్ గానం చేసినవే వెయ్యికి పైగా పాశురాలు  !!
పెరియాళ్వార్ దత్త పుత్రిక ఆండాళ్ , గోదాదేవి(భూమినుండి పుట్టినది)గా ప్రసిద్ధురాలు. ఈమె రచించినదే "తిరుప్పావై". ఈమె భూదేవి అంశగా పేర్కొంటారు. 
కులశేఖర ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ ఇద్దరూ పాలకులు. తొండర డిప్పొడి ఆళ్వార్ విప్రనారాయణ గా అందరికీ తెలిసినవారే ! 
ఆళ్వారులలో ఒక్క తిరుమంగై ఆళ్వార్ మాత్రమే  మొత్తం నూట ఎనిమిది దివ్యదేశాలను సందర్శించారు. 
ఉత్తర భారత దేశంలోనికి దివ్యదేశాలను తొలి సారిగా దర్శించుకొన్నది మధురకవి ఆళ్వార్. 
మిగిలిన వారు కొన్ని క్షేత్రాలను దర్శించి, మరి కొన్నింటిని మనోదృష్టితో వీక్షించి, తరించి, తద్వారా పొందిన ప్రేరణతో మంగళ శాసనాలు గావించారు. 
 తిరుప్పాన్ ఆళ్వార్ పది పాశురాలను మాత్రమే గానం చేశారు.వాటిల్లో శ్రీ రంగనాథుని రూప అలంకరణలను అద్భుతంగా వర్ణించారు. 
కారణజన్ములైన వీరు నేటికీ వైష్ణవ ఆలయాలలో కొలువై కనిపిస్తారు. 
మానవ జన్మ అర్ధం పరమార్ధం మాధవ సేవకే ! అన్న సత్యాన్ని లోకానికి చాటిచెప్పిన ఆళ్వారుల నిత్య స్మరణీయులే కాదు పూజ్యనీయులు. మహనీయులు భక్తికి మరో పేరు అయిన వారి జీవిత విశేషాలను తెలుసుకొందాం. 







పన్నిద్దరు ఆళ్వారులు 





పొయిగై  ఆళ్వార్, భుతత్తి ఆళ్వార్,పెయాళ్వార్ ఈ ముగ్గురినీ  మొదల్ ఆళ్వారులు అని అంటారు. పరమాత్మను కీర్తిస్తూ పాశుర గానం చేయడం అన్నది వీరితోనే మొదలవడం వలన ఈ ముగ్గురిని మొదటి ఆళ్వారులు గా పరిగణించారు. వీరి ఒక సమయంలో అదీ నేటి చెన్నై చుట్టుపక్కలే నివసించేవారు అని గ్రంధాలు తెలుపుతున్నాయి. 
ముగ్గురూ ఎప్పుడైనా కలిసారా ? అన్నాడని గురించి స్పష్టమైన సమాచారమేదీ లభించలేదు. కానీ వీరి పరోపకార గుణం భగవత్సాక్షాత్కారం లభించేలా చేసింది అని తెలిపే ఒక గాధ ప్రచారంలో ఉన్నది. 
ఒకనాటి రాత్రి పొయిగై ఆళ్వార్ వెళుతుండగా వర్షం మొదలైనది. దగ్గరలో ఉన్న చిన్న కుటీరం బయట ఉన్న అరుగు మీద ఆయన శయనించారట. అర్ధరాత్రి భీకర వాన బారిన పడకుండా ఆ మాత్రపు ఆశ్రయం  చూపిన లీలా స్వరూపుని స్మరించుకుంటూ ఉన్నారట. ఇంతలో భుతత్తి ఆళ్వార్ వచ్చి, "వర్షంలో తడవకుండా కాస్త ఆశ్రయం ఇవ్వగలరా ?" అని అడిగారట. "తప్పకుండ రండి ఇందారం చక్కగా కూర్చోవచ్చును ఇక్కడ !" అన్నారట పొయిగై. ఇద్దరూ కూర్చొని భగవన్నామస్మరణలో ఉండగా "వర్షం వెలిసేంత వరకు ఇక్కడ కూర్చోవచ్చునా ?" అని అడిగారట అక్కడికి చేరుకొన్న పెయాళ్వార్.  "నిస్సందేహంగా ! ఇక్కడ ముగ్గురు కూర్చునేంత స్థలం ఉంది" అన్నారట లోపల ఉన్న ఇద్దరు ఆళ్వారులు. 
అలా ముగ్గురూ కారు చీకటిలో, హోరుమంటూ కురుస్తున్న వానలో ఒకరికొకరు చూడలేని పరిస్థితులలో ఆ కొద్దిపాటి స్థలంలో సర్దుకొని ఎవరి మానాన వారు శ్రీనివాసుని నమ జపం చేసుకొంటున్నారట. ఇంతలో "లోనికి రావచ్చునా ? వర్షంలో అవస్థపడుతున్నాము !" అన్న మాట వినిపించిందట. 
"ఒక్క క్షణం ఆగండి. నేను వెలుపలికి వస్తాను. తమరు లోనికి రావచ్చును. " అని పలుకుతూ ముగ్గురూ ఒకేసారి బయటి వచ్చారట. అంతే వాన నిలిచిపోయింది. చల్లటి వెన్నెల, మెరుస్తూ నక్షత్రాలు కనిపించాయట. ఎదురుగా అద్భుత కాంతులీనుతూ శ్రీ వైకుంఠవాసుడు వారి ఎదుట సాక్షాత్కరించారట. 
స్వార్ధంతో నేను, నాది అన్న స్వలాభ సిద్దాంతంతో జీవిస్తున్న మనం ఈ సంఘటన నుంచి ఎంతో గ్రహించవలసి ఉన్నది. 

పొయిగై ఆళ్వార్ 

సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది  ఆలయాల నగరం కాంచీపురం. ఎన్నో శివ మరియు విష్ణు ఆలయాలఉన్నాయక్కడ. వాటిల్లో ఒకటి "తిరువెక్క".  యధోత్కరి పెరుమాళ్ కొలువైన ఈ ఆలయ పుష్కరిణిలోని పుష్పాల మధ్య కనిపించిన పసిబాలకుడే "పొయిగై ఆళ్వార్" 
పుష్పాల మధ్య జన్మించినందున అందరు అలా పిలవసాగారు. 
ఆళ్వారుల పరంపరకు శంఖం పూరించి ఆద్యుడైన ఈయన నిరంతరం శ్రీవారి హస్తాలలో ఉండే శంఖం అయిన "పాంచజన్యం" అంశగా భావిస్తారు.
పొయిగై ఆళ్వార్ గానం చేసిన వంద పాశురాలను "మొదల్ తిరువందాది"గా పేర్కొంటూ నలయిరదివ్యప్రబంధం తొలి పుటలలో స్థానం పొందినది. 

భూతత్తి ఆళ్వార్  (పూదత్తి ఆళ్వార్)

పౌరాణికంగా, చారిత్రకంగా విశేష గుర్తింపు కలిగిన సాగర తీర ప్రాంతం "మామల్లపురం". అదే నేటి మహాబలిపురం. శ్రీమన్నారాయణుడు వామనుడు  బలి చక్రవర్తిని త్రివిక్రమ రూపంలో పాతాళానికి పంపిన ప్రదేశమిదే అని అంటారు. ఈ పేరు వెనుక ఉన్న కధ అదే !!
పల్లవ రాజుల కాలం నాటి ఆలయాలు, ఇతర నిర్మాణాలు ఈ నాటికీ తమ శిల్ప సౌందర్యంతో ఆకట్టుకొంటాయి.ఇక్కడ ఉన్న దివ్యదేశం శ్రీ స్థలశయనపెరుమాళ్ కొలువైన "తిరుక్కాడమలై".   
 స్వామి అనంతశయనుడు. ఆయన పూజ కోసం సిద్ధం చేసిన పూలలో లభ్యమైనందున "పూదత్తి ఆళ్వార్"గా పిలిచేవారు. అదే భూతత్తి గా మారింది. 
తన జీవితాన్ని సంపూర్ణంగా సర్వాంతర్యామి సేవకు అంకితం చేసిన మహనీయుడు శ్రీ భూతత్తి ఆళ్వార్. ఎలాంటి ఆర్భాటాలు, హడావుడి, హంగామా లేకుండా అత్యంత సాధారణ జీవితం గడిపినవాడు. ఈయన గానం చేసిన వంద పాశురాలను "ఇరండం తిరువందాది"గా పేర్కొంటారు. 

పెయాళ్వార్ 

చెన్నై పట్టణం లోని శ్రీ కపాలేశ్వర స్వామి ఆలయం ఉన్న మైలాపూర్ చాలా ప్రసిద్ధి. ఇక్కడే ఉంటుంది "శ్రీ ఆది కేశవ పెరుమాళ్"కొలువైన ఆలయం. ఆలయ పక్కన ఉన్న "మణి కైరవేణి "
గా పిలిచే బావిలో లభ్యమయ్యాడట  శ్రీవారి ఖడ్గం నందకం  అంశతో జన్మించిన పెయాళ్వార్. 
చిన్నతనం నుండి పరంధాముని స్మరిస్తూ ఉండేవాడు. అద్భుత శక్తులను పొందాడు. తన దగ్గరకు వచ్చే ప్రజలకు భగవంతుని దర్శనం లేదా అనుగ్రహం పొందడానికి ఆయన సూచించే విధానాలు ఆచరణ సాధ్యం కానివిగా తలచిన స్థానికులు ఆయనను "పెయాళ్వార్" (పిచ్చిఆళ్వార్ )  అని పిలిచేవారు. అలా ఆ పేరే స్థిరపడిపోయినది. 
"మూన్ఱామ్ తిరువందాది"గా ఈయన గానం చేసిన పాశురాలను సంకలనం చేసారు. 



మొదల్ ఆళ్వారులు 




మొదల్ ఆళ్వారులు అయోనిజలుగా జన్మించి, శ్రీహరి సేవే తమ జీవితాలకు సార్ధకత అన్న ఒకే ఒక్క భావనతో ఎలాంటివో ప్రచార పటాటోపం లేకుండా గడిపారు. 
తదనంతర ఆళ్వారులు భిన్నమైన మార్గాలలో సమాజానికి తమ ఉనికిని పెద్ద ఎత్తున చాటారు. 
వారిలో కొందరు తాత్కాలికంగా మానవ సహజమైన వ్యామోహాలకు లోనై, పెరుమాళ్ దయతో తిరిగి ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. ఎందరికో మార్గదర్శకులైనారు. 

తిరుమలై సై ఆళ్వార్ 

కాంచీపురానికి సమీపంలోని "తిరుమలై సై" అనే గ్రామంలో నివసించేవారు భార్గవ ముని దంపతులు. సంతానాన్ని అపేక్షిస్తూ యాగం చేయగా కాళ్ళు చేతులు లేకుండా, చలనం లేని శిశువు జన్మించాడు. 
ఆ పసివాడిని మృత సమానునిగా భావించి వెదురుపొదల వద్ద వదిలేసారు. అలా పడివున్న బిడ్డడిని స్వయంగా మహా లక్ష్మి సమేతంగా శ్రీ మహావిష్ణువు చేరదీసి అవయవ ప్రదానం చేశారు. 
చలనం పొందిన పసివాడిని చూసి చేరదీసాడు "తిరువాలన్". బిడ్డలు లేని ఆయన ప్రేమగా సాకి అన్ని విద్యలలో శిక్షణ ఇప్పించాడు. కానీ కారణజన్ముడైన తిరుమలై సై అన్ని విద్యలలో ప్రావీణ్యం సంపాదించినా,ఎం ఆధ్యాత్మిక వేదాంత విషయాల పట్ల మక్కువ పెంచుకొని భక్తిమార్గం వైపుకు మళ్ళాడు. 
ఈయన సతతం శ్రీవారి హస్తాలలో ఉండే సుదర్శన చక్రం అంశగా చెబుతారు. 
తిరుమలై సై లభించిన తరువాత తిరువాలన్ దంపతులకు "కణ్ణి కన్నన్"  ఒక కుమారుడు జన్మించాడు. అతను కూడా అన్న దగ్గర ఎన్నో విషయాలను నేర్చుకొని ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించాడు. 
మరో విషయం ఏమిటంటే మొదట తిరుమలై సై శివభక్తుడు. పెయాళ్వార్ ఉపదేశాలతో శ్రీ వైష్ణవునిగా మారాడు.అతని అచంచల విష్ణు భక్తిని చూసి ప్రజలు "భక్తిసారుడు"అని పిలిచేవారు. 
ఈయన కొంతకాలం కాంచీపురం లోని తిరువెక్క అనే దివ్యదేశంలో నివసించారు. కొలువైన శ్రీ యధోత్కరి పెరుమాళ్"ని నియమంగా కొలిచేవారు. ఆ సమయంలో ఆయనకు కావలసినవి అందించేది ఒక వృద్ధురాలు. ఆమె నిస్వార్ధ సేవకు సంతసించిన తిరుమలై సై, ఆమె కోరిక మేరకు సుందర యువతిగా మార్చారు. ఆ సౌందర్యరాశిని చూసి మోహించిన రాజు వివాహమాడాడు. 
సంవత్సరాలు గడిచి పోయాయి. రాజును వృద్దాప్యం కబళించసాగింది. కానీ రాణీ సౌందర్యం ఏమాత్రం మారలేదు. కాలం ఆమె మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. రాజు రాణీని ప్రశ్నించగా, తిరుమలై సై విషయం తెలిసింది. ఆయనను పిలిపించిన రాజు తన మీద కూడా కాల ప్రభావం లేకుండా చేయమని ఆదేశించారు. నిరాకరించడంతో తిరుమలై ని రాజ్యము నుండి   బహిష్కరించాడు. వెళ్ళిపోతూ ఆయన యధోత్కరి పెరుమాళ్ ను "నేను ఉండని రాజ్యములో నీకు ఏమిటి పని. నాతో రా !" అన్నారు.  భక్తసులభుడు, ఆదిశేషునితో పాటు భక్తుని కోరిక మేరకు అతనిని అనుసరించారు. వారు వెళ్లిపోవడంతో రాజ్యమంతా చీకట్లు ఆవరించాయి. ప్రజలు తల్లడిల్లి పోయారు. తిరుమలై సై రాజ్యం విడిచి పోవడం దీనికి కారణంగా గుర్తించిన రాజు వెళ్లి తన తప్పును క్షమించమని, తిరిగి రాజ్యానికి రమ్మని ప్రార్ధించాడు. 
ఈ సంఘటనకు గుర్తుగా తిరువెక్క దివ్యదేశంలోని యధోత్కరి పెరుమాళ్ వ్యతిరేక దిశలో అంటే కాళ్ళు ఆదిశేషుని  పడగల క్రింది పెట్టి ఎడమ చేతి మీద శయనించి దర్శనమిస్తారు. నాటి నుండి స్వామివారిని "సున్న వినం సైద పెరుమాళ్"(చెప్పినది చేసే పెరుమాళ్)అని పిలవసాగారు భక్తులు. 
కంచి నుండి కుంభకోణం మరియు శ్రీరంగాలలో నివసిస్తూ ఎన్నో కీర్తనలను రాసారు. వాటిల్లో ఉన్నతమైనవే భావితరాలకు అందాలన్న కోరికతో కీర్తనలను రాసిన తాళపత్రాలను కావేరీ ప్రవాహంలో వదిలేశారు. ఒడ్డుకు తిరిగి వచ్చిన నూట ఇరవై పాశురాల సంకలనం " తిరుచ్చెండ విరుదం" మరియు తొంభై పాశురాల "నాన్ ముగం తిరువందాది" మనకందించారు. 

నమ్మాళ్వార్ మరియు మధురకవి ఆళ్వార్ 

తిరునెల్వేలి జిల్లాలోని పక్కపక్క దివ్యదేశాలైన "తిరుకురుగూర్" (ఆళ్వార్ తిరునగరి) మరియు "తిరుక్కోలూర్" లకు చెందిన ఈ ఇద్దరు గురు శిష్యులు. 
తనకన్నా వయస్సులో చిన్నవాడైనా అతనిలో తనకు కనిపించిన దైవత్వాన్ని గమనించిన మధురకవి ఆయనను గురువుగా స్వీకరించారు. 
సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన మధురకవి, సంస్కృత తమిళ భాషలలో చక్కని ప్రావీణ్యంతో పాటు ఆధ్యాత్మిక భావాలు కలిగిన మధురకవి, ఉత్తర భారత దేశంలోని అయోధ్య, మధుర ఆదిగా గల దివ్యదేశాలను దర్శించిన తొలి ఆళ్వార్. 
ఆయన అక్కడ ఉండగా దక్షిణదిశలో ఆకాశంలో ఒక అద్భుత కాంతి పుంజం దర్శనమైనది. అది ఒక శుభ పరిణామానికి చిహ్నం అని అర్ధం చేసుకొన్న ఆయన దానిని అనుసరించి, తిరుకురుగూరు చేరుకొన్నాడు. అక్కడ చింతచెట్టు తొర్రలో మౌన దీక్షస్వీకరించి ధ్యానంలో ఉన్న "మారన్"ని చూడగానే ఆకర్షితుడయ్యారు. కారణజన్ముడు అని అర్ధం చేసుకొన్నారు. 
ఆయన గురించి మరింత తెలుసుకోవాలని "సేంతిన్ వయట్రిల్ సిరియాదు పిరండల్- ఏతం తిండ్రు ఎంగే కిడక్కుమ్"(దేహంలోని చిన్న జీవి (ఆత్మ)ఆ దేహం మరణిస్తే ఏమి తింటుంది ? ఎక్కడ ఉంటుంది ?).  
దానికి పుట్టిన తరువాత మొదటిసారి పలికిన "ఏతం తిండ్రు అంగే కిడక్కుమ్! ( ఏమి తినాలో అదే తింటుంది అక్కడే ఉంటుంది )అన్నారు మారన్. 
 ఈ ప్రశ్న సమాధానాలలో గొప్ప అర్ధం ఉన్నది. మధురకవి పరమాత్మను చేరే మార్గం గురించి ప్రశ్నించగా, మారన్ అది ప్రాప్త కర్మల మీద ఆధారపడి ఉంటుంది అని తెలిపారు. 
అలా వారి గురుశిష్య బంధం ఆరంభం అయ్యింది. మధురకవి తన గురువును కీర్తిస్తూ పదకొండు పాశురాల "కన్నినిన్  సిరుతంబు" గానం చేశారు. ఈయన విష్వక్సేనుని సహచరుడైన "కుముద గణేష" అంశగా చెబుతారు.  
ఇవే కీర్తనలను కొన్ని వేలసార్లు అదే చింతచెట్టు క్రింద స్మరించి, నమ్మాళ్వార్ దర్శనం మరియు అందరు ఆళ్వారులు గానం చేసిన పాశురాలను పొందారు నాదముని. 
ఆళ్వార్ అందరిలోకి ప్రసిద్ధుడు నమ్మాళ్వార్. ఈయన శ్రీ మహావిష్ణువు సర్వసేనాధిపతి అయిన "విష్వక్సేను"ని అవతారంగా విశ్వసిస్తారు. 
పుట్టినప్పటి నుండి ఒక్క మాట్లాకుండా, నిరంతరం ధ్యానంలో ఉండే పిల్లవాడిని ఆలయం వద్ద వదిలేసారట. తల్లితండ్రులు పెట్టిన పేరు మారన్. శఠగోపన్ అని కూడా పిలుస్తారు.
విష్ణు ఆలయాలలో భక్తులకు పెట్టె శఠారి ఈయన పేరు మీద వచ్చింది అంటారు. 
 ఈయన పాశురాలకు ముగ్ధులైన ప్రజలు ప్రేమగా "నమ్మాళ్వార్"(మన ఆళ్వార్)అని పిలుచుకొనేవారు. అదే స్థిరపడిపోయింది. 
చింత చెట్టు తొర్రలో నిరాహారంగా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకొన్నారు. తొలిసారి మాట్లాడింది మధురకవి తోనే !! 
తిరుకురుగూర్ నుండి బయటికి వెళ్ళినది లేదు. తన దివ్య దృష్టి తో అనేక క్షేత్రాలను సందర్శించి, వెయ్యికి పైగా పాశురాలను గానం చేసారు. మధురకవి వాటినన్నిటినీ గ్రంధస్తం చేసారు. నమ్మాళ్వార్ పాశురాలను తమిళ వేదాలుగా కీర్తిస్తారు. అవే "తిరు విరుతం"(ఋగ్వేదం)
తిరుఅశిరియం(యజుర్వేదం), "పెరియ తిరువందాది(అధర్వణ వేదం), "తిరువాయ్ మూంజి (శ్రీ వైష్ణవ వేదసారం). నమ్మాళ్వార్ తపస్సు చేసిన చింతచెట్టును నేటికీ  తిరుకురుగూర్ దివ్య దేశం లో చూడవచ్చును. 
ఇక్కడ మధురకవికి  తన గురువు ఆదేశం మేరకు తమిరపారాణి నది నీటిని తెర్ల బెట్టడం ద్వారా  
లభించిన నమ్మాళ్వార్ లోహ మూర్తిని కూడా వీక్షించవచ్చును. 
తిరుకురుగూర్(ఆళ్వార్ తిరునగరి) శ్రీవైష్ణవ నవగ్రహాల క్షేత్రాలలో గురుక్షేత్రం), తిరుక్కోలూర్ నవగ్రహ క్షేత్రాలలో అంగారక క్షేత్రం. 
తమిరపారాణి నదీ తీరంలో నవ తిరుపతులు మరియు నవ కైలాసాల పేరిట తొమ్మిది విష్ణు మరియు తొమ్మిది శివాలయాలు ఉంటాయి.
మధురకవి ఆళ్వార్ రచించిన కన్నినిన్  సిరుతంబు అన్న పాశురాలను , నాదముని ఆళ్వార్ తిరునగరి లోని చింతచెట్టు క్రింద కొన్ని వేల సార్లు పఠించి నమ్మాళ్వార్ దర్శనం పొంది, మొత్తం పన్నెండుమంది ఆళ్వారులు గానం చేసిన నాలుగు వేల పాశురాలను పొందారు. వాటిని ఆయన నళరియ  దివ్య ప్రబంధం పేరు మీద మనకందించారు. 




నమ్మాళ్వార్ మరియు మధురకవి ఆళ్వార్ 



పెరియాళ్వార్

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీవిల్లి పుత్తూరు లో, శ్రీమన్నారాయణుని వాహనమైన గరుడుని అంశతో జన్మించారు పెరియాళ్వార్  గా ప్రసిద్ధులైన విష్ణుచిత్తుడు. 
అన్ని విద్యలలో ప్రావీణ్యం సంపాదించారు. సదా విష్ణు చింతనలో ఉండేవారు. అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువును అలంకరించడానికి ప్రత్యేకంగా ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. చక్కని పూలదండలతో శ్రీ వటపత్రశాయి పెరుమాళ్ ని అలంకరించి సంతృప్తి చెందేవారు. 
పెరుమాళ్ పెరియాళ్వారుతో సంభాషించేవారని చెబుతారు. 
పాండ్య రాజు ఏర్పాటు చేసిన వేదాంత సభలో పాల్గొని వేదాంత సారం, పరమాత్మ తత్వం, మానవజన్మ పరమార్థం గురించి వివరించి గొప్ప సన్మానం పొందాడు. దానిని వీక్షించడానికి శ్రీవారు సకల దేవతలతో వచ్చి ఆకాశవీధులలో నిలిచారట. అది చూసి పెరియాళ్వార్ ఆయన దివ్యమంగళ రూపానికి  ప్రజలదృష్టి తగులుతుందని భయపడుతూ గానం చేసిన "తిరు పల్లాండు" మరియు "పెరియ ఆళ్వార్ తిరుమూళి" రెండు మధుర పాశురాలు సంకలనాలు. 

ఆండాళ్

సాక్షాత్ భూదేవి అంశ. జనకమహారాజుకు జానకీ దేవి లభించినట్లు, పెరియాళ్వార్ పెరుమాళ్ అలంకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన నందనవనం లో పూల మొక్కల క్రింద లభించినది. 
ప్రేమానురాగాలతో ఆమెను పెంచసాగారు పెరియాళ్వార్. చిన్నతనం నుండి తండ్రి చెప్పిన శ్రీకృష్ణుని దివ్య గాధలు విని ఆయనే తన భర్త గా భావించుకోసాగింది. తనను తాను ఒక గోపిక లాగ, బృందావనంలో గోపీమనోహరునితో విహరిస్తునట్లుగా ఊహించుకోసాగింది. 
ఊహల లోనే కాదు నిజజీవితంలో కూడా తాను  ఆయనకు తగిన వధువునా కాదా అన్నది తేల్చుకోడానికి తండ్రి కట్టే దండలను ధరించుకొని చూసుకొని మురిసిపోయేది. ఆమె ఆ నాడు తన ప్రతి బింబం చేసుకొన్న కన్నాడి (అద్దం) బావి నేటికీ శ్రీ విల్లిపుత్తూరు లోని ఆలయంలో చూడవచ్చును. తెలియక పెరియాళ్వార్ ఆ దండలనే శ్రీ వటపత్ర సాయి పెరుమాళ్ కి సమర్పించుకొనేవాడు. 
ఈ కారణంగా ఈమెకు ఆముక్త మాల్యద అన్న పేరొచ్చినది. శ్రీ కృష్ణదేవరాయలు ఈ పేరుతొ శ్రీ ఆండాళ్ చరిత్రను తెలుగులో రచించారు. 
ఒకనాడు దండ లో కనిపించిన శిరోజాన్ని చూసి, అది తన కూతురిది అని గ్రహించిన పెరియాళ్వార్ ఇంతకాలం ఆమె ధరించిన దండలను స్వామికి సమర్పించినందుకు వగచి నాడు దండలు ఆలయంలో ఇవ్వలేదు. అదే రోజు రాత్రి శ్రీ రంగనాధుడు కలలో కనిపించి తనకు ఆండాళ్ ధరించిన దండలే ఇష్టమని తెలిపి, తాను ఆమెను వివాహం చేసుకొంటానని తెలిపారు. 
ఇదే విషయాన్ని పాండ్య రాజుకు స్వప్నము లో కనిపించి ఆండాళ్ కొరకు పల్లకీ పంపమని  సందేశాన్ని ఇచ్చారు. రాజు శ్రీరంగం నుండి శ్రీవిల్లిపుత్తూరు కు పల్లకీ పంపారు. ఆనందంగా వచ్చిన గోదాదేవి గర్భాలయం లోని శ్రీరంగనాధునిలో ఐక్యం అయిపోయింది. 
ధనుర్మాసంలో వచ్చే భోగినాడు గోదా కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. 
ఈమె గానం చేసిన "తిరుప్పావై" ధనుర్మాసంలో అన్ని విష్ణు ఆలయాలలో నియమంగా గానం చేస్తారు. ప్రతి దివ్యదేశంలోనే కాదు అన్ని వైష్ణవ ఆలయాలలో ఈమె ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. 
ఈమె రచించిన మరో పాశుర సంకలనం  "నాంచారీ తిరుమూళి" . 
శ్రీవిల్లిపుత్తూరు దివ్యదేశం ఆండాళ్ తో ముడిపడి ఉన్నది. 






నమ్మాళ్వార్ తపమాచరించి చింతచెట్టు (ఆళ్వార్ తిరునగరి)

పెరియాళ్వార్ (విష్ణుచిత్తుడు)





కులశేఖర ఆళ్వార్ 

చేరరాజ వంశంలో జన్మించిన కులశేఖర ఆళ్వార్ శ్రీహరి కౌస్తభ అంశగా పేర్కొంటారు. 
గొప్ప యోధుడు. ఎన్నో యుద్దాలలో విజయాన్ని సాధించి రాజ్యాన్ని విస్తరించాడు. ఈయన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు.  ఆయన్ని ఆదర్శంగా చేసుకొని ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. దశరధనందనుని మీద అమిత ప్రేమ మరియు భక్తి. 
ఎంతగా అంటే సీతాపహరణం దాకా రామాయణం విని, జానకి మాతను అపహరించిన రావణుని మీద యుద్దానికి సైన్యాన్ని సిద్ధం చేసేంత !!
బిడ్డ మీద ఒక తల్లికి ఎలాంటి ప్రేమ, అనురాగం మరియు ఆప్యాయత ఉంటాయో అలాంటిదే కులశేఖరుడు శ్రీరాముని పట్ల కలిగి ఉండేవాడు. 
ఈ అచంచల వాత్సల్య పూరిత భక్తిని ఆయన తన "పెరుమాళ్ తిరుమూళి "లో సుందర లలితమైన పదాలలో తెలిపారు. 




గోదాదేవి (ఆండాళ్) శ్రీవిల్లిపుత్తూరు 



ఆముక్త మాల్యద 




 కన్నాడి బావి 




తొండర డిప్పొడి ఆళ్వార్  

సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు విప్రనారాయణ. వేదవేదాంగాల అధ్యనం, భాషా పాండిత్యంలో కృషి చేసిన విప్రనారాయణ శ్రీరంగనాథుని అలంకరణ నిమిత్తం ఒక చక్కని ఉద్యానం అభివృద్ధి చేసాడు. ఈ కారణంగానే కామోసు ఈయన వైజయంతి మాల అంశ అని అంటారు. 
ప్రతి నిత్యం పూలను సేకరించి స్వామికి అలంకరించి ఆనందపడటం విప్రనారాయణ దినచర్య.  కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా !
అందగాడు అయిన విప్రనారాయణ దేవదాసి దేవదేవి పన్నిన మాయలో పడి ఆమెకు దాసుడై పోయాడు. అతనిని తిరిగి భక్తి మార్గం లోనికి మళ్లించడానికి పరమాత్మ పన్నిన పన్నాగమో మరొకటో చెయ్యని దొంగతనానికి చెరసాల పాలయ్యాడు విప్రనారాయణ. అక్కడ తన తప్పు తెలుసుకొన్నాడు. క్షమించి కరుణించమని కమలాక్షుని కోరాడు. నిజం తెలుసుకొన్న రాజు ఆయనను విడుదల చేసాడు. 
చేసిన తప్పుకు ప్రాయక్షిత్తార్ధం  శ్రీవైష్ణవ గురువుల పాదపూజ చేసి, వారి పాదధూళిని శిరస్సున ధరించి తొండర డిప్పొడి ఆళ్వార్ గా ప్రసిద్ధుడు అయ్యారు. 
"తిరుమలై" మరియు "తిరుపళ్లి మళుచ్చి" అనే పాశుర గ్రంధాలు తొండర డిప్పొడి ఆళ్వార్ విష్ణు భక్తికి నిదర్శనంగా నిలిచాయి. 




పెరియాళ్వార్ నందనవనం 






తిరుప్పాన్ ఆళ్వార్ 

దివ్యదేశాలలో అగ్ర స్థానం పొందిన శ్రీరంగం కావేరీ నదికి ఒక ఒడ్డున ఉండగా మరో ఒడ్డున ఉంటుంది చోళరాజుల ఒకప్పటి రాజధాని మరియు ఒక దివ్య దేశం అయిన ఉరయూరు. 
ఆ ప్రాంతానికి అన్నదాత  కావేరీ. అలాంటి సస్యశ్యామల భూమిలో వరికంకుల మధ్య "మాతా దాసు" ( మాల దాసరి/ బాణర్) అనే అంటరాని కులానికి చెందిన వ్యక్తికి లభించాడు బోసినవ్వులు చిందించే పసిబాలుడు. 
సంతతి లేని మాతా దాసు బాలుని ప్రేమగా పెంచాడు. అప్పట్లో ఈ కులం వారికి ఆలయ ప్రవేశమే కాదు కావేరీ నదిలో స్నానం కూడా నిషేధమే !!
కానీ ఆలయ ఉత్సవాలలో, ఊరేగింపులలో వీరు ఉండవలసినదే ! శ్రీ మహావిష్ణువును కీర్తిస్తూ కీర్తనలను పాడటంలో  వీరు నేర్పరులు. మానవులు దూరం పెట్టినా మధురమైన గళం ప్రసాదించి దగ్గరకు చేర్చుకున్నారు పరమాత్మ. తనకు పుష్ప పత్ర అర్చన కంటే గాత్రార్చనే ప్రీతికరమని పెరుమాళ్ ఈ విధంగా తెలియచెప్పాడు.  
చక్కని స్వరంతో మధురంగా హరికీర్తనలు గానం చేస్తూ నిరంతరం వీణ ధరించి కనపడటం వలన తిరుప్పానన్ అని పిలిచేవారు. 
ప్రతి రోజు ఉషోదయానికి ముందే కావేరి ఒడ్డున నిలిచి శ్రీరంగ విమానం వైపు చూస్తూ శ్రీరంగనాథుని కీర్తిస్తూ,  తనకెప్పటికైనా ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించే భాగ్యం ఉన్నదా అని భాధపడుతుండే వాడు. 
కానీ అతని సమక్షం ఆలయపూజారులకు కంటగింపుగా ఉండేది. తమ మడి ఆచారాలు అతని వలన మంట కలుస్తున్నాయి అన్న వంకతో ఒకనాడు అతని మీద రాళ్ళు విసిరారు. తల పైన గాయం అయ్యి బాధతో పక్కకు తప్పుకొన్నాడు తిరుప్పానన్. పూజారులు ఆలయానికి చేరుకొని చూడగా తిరుప్పానన్ కి ఎక్కడైతే గాయం అయ్యిందో అక్కడే మూలవిరాట్టు కు రక్తస్రావం అవుతూ కనిపించింది. నిర్ఘాంతపోయారు. నాటి రాత్రి శ్రీ రంగనాధుడు ఆలయ ప్రధాన పూజారి సారంగ నాధునికి స్వప్నంలో కనిపించి తనకు రక్తం కారడానికి కారణం తెలిపి, తిరుప్పానన్ ని తన సమక్షానికి తీసుకొని రమ్మన్నారు.
పరంధాముని ఆనతి మేరకు వెళ్లిన సారంగనాధుడు యెంత బ్రతిమాలినా భయంతో రానన్న తిరుప్పానన్ ను బలవంతంగా తన భుజాల మీద కూర్చోబెట్టుకొని గర్భాలయం చేరుకొన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం రావడం కనుల ముందు ఆరాధ్య దైవం రూపం. ఆనందాన్ని అణుచుకోలేని తిరుప్పానన్ స్వామిని కీర్తిస్తూ పది పాశురాలను గానం చేసి సశరీరంగా శ్రీ రంగనాధునిలో ఐక్యం అయ్యాడు ధన్యజీవి తిరుప్పాన్ ఆళ్వార్. 
ఈయన గానం చేసిన పది పాశురాల సంకలనాన్ని "శ్రీ అమలానంద పిరన్" అని అంటారు. 


తిరుమంగై ఆళ్వార్    

శ్రీ వైష్ణవ గాయక భక్తులైన ఆళ్వారుల పరంపరలో ఆఖరి వాడైన తిరుమంగై శ్రీవారి ధనుస్సు అయిన సారంగి అంశ అంటారు. తల్లితండ్రులు పెట్టిన పేరు కలియన్ లేదా నీలన్ .  గొప్ప యోధుడు. చోళరాజుల సైన్యాధిపతి. 
రాజాభిమానం సంపాదించి అల్లినాడు ప్రాంతానికి సామంత రాజుగా నియమితుడయ్యాడు. తిరుమంగై ని రాజధానిగా చేసుకొని పాలించడం వలన తిరుమంగై అని పిలవబడినాడు.
ఆస్థాన ధన్వంతరి, కుమార్తె అయిన కుముదవల్లి ని చూసి మోహించాడు. అతనిని  వివాహం చేసుకోడానికి శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే ఆమె కొన్ని షరతులను విధించింది. 
శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించాలని, నిత్యం వంద మంది వైష్ణవుల పాదపూజ చేయాలనీ, అదే విధిగా ప్రతి రోజు వెయ్యి ఎనిమిది మంది విష్ణు భక్తులకు భోజనం పెట్టాలని. అన్నింటికీ అంగీకరించి కళ్యాణం చేసుకొన్నాడు. 
నాటి నుండి ఏనాడూ ఇచ్చిన మాట తప్పలేదు. మహారాజుకు చల్లించవలసిన కప్పాన్ని కూడా దానధర్మాల క్రింద ఖర్చు చేసాడు. మహారాజు నుండి తాఖీదులు రావడంతో ఈ ధనం చెల్లించడానికి దారి దోపిడీలకు పాల్పడ్డాడు. పెరుమాళ్ మారువేషంలో వచ్చి అతను అనుసరిస్తున్న మార్గం సరైనది కాదని తెలిపి అష్టాక్షరీ మంత్రం ఉపదేశించారు,
తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే భువిలో ఉన్న నూట ఆరు దివ్యదేశాలను సశరీరంగా సందర్శించారు. అక్కడ కొలువైన నీలమేఘశ్యాముని కీర్తిస్తూ వెయ్యికి పైగా పాశురాలను గానం చేసాడు. 
ఈయన ఆధ్వర్యంలోనే శ్రీరంగ ఆలయ ప్రాకారాల నిర్మాణము  జరిగినట్లుగా తెలుస్తోంది. 

  

  
శ్రీ విల్లిపుత్తూరు ఆలయ రాజ గోపురం 


మహా గాయక భక్తులు ఆళ్వారులు 




నిష్కల్మష హృదయం, నిర్మల భక్తితో నారాయణా అంటే చాలు ఆదుకొనే ఆది దేవుడు శ్రీమన్నారాయణుఁడు. ఆ విషయాన్ని తమ భక్తి పాశురాలు ద్వారా తెలిపిన ఆళ్వారులు అందరికీ మార్గదర్శకులు. 

జై శ్రీమన్నారాయణ  !!!! 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...