18, డిసెంబర్ 2017, సోమవారం

Sri Ananthapadmanabha swamy temple, Tiruvanantapuram

 శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం, తిరువనంతపురం 







స్వయం శ్రీమన్నారాయణుడు శ్రీ అనంత పద్మనాభునిగా కొలువైన పవిత్ర క్షేత్రం తిరువనంతపురం. స్వామివారి పేరు మీదనే నగరానికి ఆ పేరు వచ్చినది. నేటి కేరళ రాజధాని. నాటి ట్రావెంకూర్ రాజుల రాజధాని. ఆలయం చుట్టూ నగరం క్రమక్రమంగా విస్తరించింది.
ఏనాడో సత్య యుగంలో స్వామి ఇక్కడ స్థిరనివాస మేర్పరచుకొన్నారని స్థల పురాణం పేర్కొంటున్నది.
బ్రహ్మాండ, భాగవత, పద్మ, నారద, వాయు, విష్ణు, వామన పురాణాలలో వివరించిన ప్రకారం శ్రీ అనంత పద్మనాభుడు భక్తవత్సలుడు.
శ్రీ మహావిష్ణు ఎనిమిదో అవతారమైన బలరామ దేవుడు, తన పుణ్యక్షేత్ర సందర్శనలో ఇక్కడికి వచ్చి, స్వామిని సేవించుకొన్నట్లుగా భాగవతం తెలుపుతోంది.
కేరళ, పక్కనే ఉన్న తమిళ నాడు లోని కన్యాకుమారీ ప్రాంతాన్నీకలిపి గతంలో మలై నాడు అని పిలిచేవారు. ఈ ప్రాంతంలో ఉన్న పదమూడు శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రముఖమైనది తిరువనంతపురం.





తిరువళ్లం శ్రీ పరశురామ ఆలయం  

అట్టుక్కాల్ భగవతి అమ్మన్ కోవెల 






ఆలయ పౌరాణిక విశేషాలు తెలుసుకొనే ముందు తప్పక గ్రహించుకోవలసినది ఆలయ నిర్మాణ విశిష్టతలు. సుమారు ఏడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆలయానికి నాలుగు పక్కల గోపురాలు ఉంటాయి. ఇవే కాకుండా మరో అయిదు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వీటిని మానవ శరీరంలో ఉన్న నవరంధ్రాలతో పోలుస్తారు.
ఆలయంలో స్థానిక మరియు ద్రావిడ నిర్మాణ శైలుల మేలు కలయిక. వంద అడుగుల ఎత్తుకలిగిన తూర్పు రాజ ద్వారం 1566వ సంవత్సరంలో నిర్మించబడినది.  ఏడు అంతస్థులు పూర్తిగా విష్ణు పురాణ గాధలను తెలిపే శిల్పాలతో నిండి ఉంటుంది.
ఈ ద్వారం వద్ద మీనం (మార్చి-ఏప్రిల్), తులం(సెప్టెంబర్ - అక్టోబర్ ) మాసాలలో పది రోజుల పాటు నిర్వహించే "ఆలపాశి ఉత్సవం" సందర్బంగా రాత్రి పూట కథాకళి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు.
రాజా వీర మార్తాండ వర్మ 1375వ సంవత్సరంలో ఈ ఉత్సవాన్ని ఆరంభించారు. ఆలయ సముదాయాన్ని మొత్తం  వీక్షించే సదుపాయం గర్భాలయాన్ని చుట్టివున్న శ్రీ బలి పుర మండపం కల్పిస్తుంది. రెండు వేల అడుగుల పొడుగు గల ఈ మండపం 365 స్తంభాల మీద నిర్మించబడినది. ఒక్కో స్థంభానికి ఒక్కో దీప కన్యను చెక్కారు. వీరి చేతిలోని ప్రమిదలలో నూనె  పోస్తే  నాలుగు గంటల దాక దీపం వెలుగుతుంటుంది. ముఖ్య పర్వదినాలలో వెలిగిస్తారు. ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. గమనించదగిన విశేషం ఏమిటంటే ఏ రెండు బొమ్మలు ఒక్కలాగ ఉండక పోవడం! గొప్ప నిర్మాణ చాతుర్యం !!
1425 వ సంవత్సరం నుండి ఆలయ వివరాలను గ్రంధస్తం చేస్తున్న "గ్రంథ పుర" లోని తాళ పత్రాలు ముఖ్య ఉత్సవాల సందర్బంగా ఒకే సారి మూడు వేల మంది ఒకే సారి శ్రీ బలి పుర మండపంలో భోజనం చేసేవారట !















ఇరవై ఎనిమిది స్తంభాల మీద నిర్మించబడిన "కులశేఖర మండపం" అద్భుత శిల్పాలను ప్రదర్శిస్తుంది. ఏక శిల మీద చెక్కిన ఒక గుత్తిలాగా లేదా ఒకే స్తంభం లాగా ఉండే సన్నని స్తంభాల మీద తట్టితే సప్త స్వరాలను పలుకుతాయి.
నలుచదరపు గర్భాలయానికి ఎదురుగా ఇరవై అడుగుల పొడుగు, వెడల్పు, అయిదు అడుగుల ఎత్తు  గలిగిన ఒట్టుక్కాల్ మండపం పైనుండి మూడు ద్వారాల గుండా మూలవిరాట్టును దర్శించుకొని అవకాశం లభిస్తుంది.
పక్కనే ఉంటుంది అభిస్వరణ మండపం. ఇక్కడ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
పన్నెండు అడుగుల శ్రీ అనంత పద్మనాభ స్వామి దివ్య విగ్రహాన్ని జననం, స్థితి మరియు మరణం అనే ముఖ్యమైన మూడు  దశలకు నిదర్శనంగా చూపే మూడు ద్వారాల గుండా వీక్షించాలి. గర్భాలయాన్ని త్రిమూర్తి నిలయంగా పేర్కొనవచ్చును. స్వామి వారి కుడి చేతి క్రింద లయకారకుడు కైలాసనాధుడు లింగ రూపంలో, స్వామి వారి నాభి నుండి వెలువడిన కమలంలో  సృష్టి కర్త బ్రహ్మ దేవుడు కొలువై ఉంటారు.
అనంత శేషుడు తన శరీరాన్ని మూడుచుట్లుగా చుట్టి, తన అయిదు శిరస్సులను ఛత్రంగా చేసిన పాన్పు మీద శ్రీ పద్మనాభుడు అనంతశయనునిగా మొదటి ద్వారం గుండా తన సుందర ముఖారవిందాన్ని,  లింగరాజును, మధ్య ద్వారం ద్వారా నాభి కమలం లో ఉపస్థితుడైన విధాతను, ఉత్సవ మూర్తులను, ఆఖరి ద్వారం నుండి బ్రహ్మ కడిగిన శ్రీవారి దివ్య పాదపద్మాలను భక్తులకు కన్నుల పండుగగా దర్శనం ప్రసాదిస్తారు.








శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయ తూర్పురాజగోపురం 





స్వామి వారి దివ్యమంగళ విగ్రహాన్ని 12008 సాలగ్రామ శిలలతో "కడు శక్కెర" విధానంలో 1730వ సంవత్సరంలో మలచబడినది. అంతకు పూర్వం ఇప్ప చెట్టు కాండంతో చెక్కబడిన మూలవిరాట్టు ఉండేది. 1686వ సంవత్సరంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అప్పటి ఆలయం పూర్తిగా కాలిపోయింది. అప్పుడు రాజా మార్తాండ వర్మ ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారు.
పన్నెండు సాలగ్రామాలు ఒక్క చోట ప్రతి నిత్యం పూజింపబడితే అది మహా క్షేత్రంగా పిలవబడుతుంది. మరి మూలవిరాట్టు 12008 సాలగ్రామ శిలలతో నిర్మించబడి విశేష పూజలందుకొంటుంటే ఆ క్షేత్రాన్ని ఏమని పిలవాలి ?
మహా మహా క్షేత్రం శ్రీ అనంత పద్మనాభ పురం లేదా తిరువనంతపురం అని చెప్పాలి.
కేరళకే ప్రత్యేకమైన కడు శక్కెర విధానంలో చేసిన విగ్రహం కావడాన అభిషేకాలు ఉండవు. అన్నీ ఉత్సవమూర్తులకే !!!
ప్రాంగణంలో పరివార దేవతలైన శ్రీ క్షేత్రపాలకుడు ఉత్తరాన, దక్షిణాన విష్వక్సేనుడు, సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర మూర్తి, శ్రీ యోగనారసింహ, శ్రీ ధర్మశాస్త, పడమరలో శ్రీ తిరువంబాడి శ్రీకృష్ణ, వంటశాల వద్ద అగరశాల శ్రీ గణపతి కొలువై ఉంటారు.
శ్రీ అనంత పద్మనాభుని తరువాత ముఖ్యమైన సన్నిధులు శ్రీ యోగనారసింహ, శ్రీ రామచంద్ర. రామాయణానికి కేరళలో విశేష ఆదరణ ఉన్నది. జులై మరియు ఆగస్టు నెలలలో వచ్చే మలయాళ ఆఖరి మాసం అయిన "కర్కాటకం" నెలంతా నియమంగా రామాయణ పారాయణం చేస్తారు. శ్రీ రామచంద్రుని ఆలయాలను సందర్శిస్తారు. కేరళలో దశరథ తనయులైన రామ, భారత, లక్ష్మణ, శత్రుఘ్నలకు విడివిడిగా నాలుగు జిల్లాలలో ఆలయాలు ఉన్నాయి. త్రిసూర్ మరియు కొచ్చి, కొట్టాయం, ఎర్నాకుళం మరియు కొట్టాయం, మలప్పురం జిల్లాలలో కలిపి మొత్తం నాలుగు జతల ఆలయాలున్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి త్రిసూర్ కొచ్చి లలో ఉన్న త్రిప్రయార్, తిరుమూళికుళం, ఇరాంజలికుడ మరియు పయమ్మాళ్ ముఖ్యమైనవి. నళంబల  (నాలుగు ఆలయాల)యాత్ర లో ఉదయం నుండి రాత్రి లోపల నాలుగు ఆలయాల సందర్శన పూర్తి చేయాలి.
 శ్రీ అనంత పద్మనాభ ఆలయం తెరిచేటప్పుడు రామాయణ శ్లోకాలను పఠిస్తారు.
తిరువంబడి శ్రీ కృష్ణ ఆలయం పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి విడిగా ధ్వజస్థంభం, బలిపీఠాలతో  ఉంటుంది.
శ్రీ అష్టాంగ గరుడుడు, శ్రీ ఆంజనేయ స్వామి ఎనభై అడుగుల స్వర్ణ ధ్వజస్థంభం దగ్గర కొలువై ఉంటారు. ఇక్కడ పైకప్పుకు మహా మేరు శ్రీ చక్రాన్ని చెక్కారు.







పలవంగాడు శ్రీ మహా గణపతి ఆలయం 

మిత్రానంద పురం త్రిమూర్తి కోవెల





ట్రావెంకూర్ రాజ భవనం నేటి కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ కి సమీపంలోని పద్మనాభ పురం లో ఉన్నది. ఇక్కడికి చేరువలోనే ఉంటుంది తిరువట్టార్. శ్రీ ఆదికేశవ పెరుమాళ్ కొలువైన ఈ క్షేత్రం ఒక దివ్యదేశం. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం పూర్తిగా ఈ ఆలయ నమూనాలోనే నిర్మించబడినది. ఆది కేశవ పెరుమాళ్ కూడా అనంత శయనుడే!! కాకపోతే తిరువట్టార్ ఆలయం చిన్నది. అంతే తేడా !!
శ్రీ అనంత పద్మనాభుని అమితంగా విశ్వసించే రాజా మార్తాండ వర్మ 1750వ సంవత్సరంలో తమను పద్మనాభ దాసులుగా ప్రకటించి, సమస్త సంపదలను శ్రీవారి పరం చేసారు.
అప్పటి నుండి స్వామివారి తరపునే పాలన సాగించారు.
ఇంతటి  చారిత్రక విశేషాల నిలయం అయిన శ్రీ అనంత పద్మనాభ ఆలయం గత మూడు యుగాలుగా ఉన్నదని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి.
స్వామి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకోడానికి సంబంధించిన పురాణ గాధలు ఆలయ"గ్రంథ పుర "లో లిఖించబడినాయి.
ఎనిమిదో శతాబ్దానికి చెందిన శ్రీ విల్వ మంగళ మహర్షి గొప్ప శ్రీకృష్ణ భక్తుడు. నేటి కాసరగోడ్ జిల్లా లో నెలకొని ఉన్న అనంత పుర గ్రామంలోని శ్రీ అనంత పద్మనాభుని నిమయంగా సేవించుకొంటుండేవారట. కేరళ రాష్ట్రంలో ఉన్న ఒక అరుదైన ఆలయం. కోనేరు మధ్యలో ఉంటుంది. స్వామి ఉపస్థిత భంగిమలో ఉంటారు. బాబియా అనే మొసలి ఎప్పుడూ కోనేరులో నివసిస్తుంటుంది.
ఒకనాడు ముద్దులొలికే బాలుడొకడు ఆయన వద్దకు వచ్చాడట. వానిని చూసి కలిగిన అనురాగంతో తనతో ఉండమని అడిగారట.  సరేనన్న బాలకుడు, తనను అవమానిస్తే మాత్రం ఉండను అన్నాడట. అతని షరతుకు అంగీకరించారు మహర్షి. ద్వాపర యుగంలో, గోపాలకృష్ణుడు తన చిలిపి చేష్టలతో గోకులంలో ఎంతటి పండగ వాతావరణం సృష్టించాడో అలా తన అల్లరితో మహామునిని అలరించేవాడట. ఒక్కోసారి శృతి మించినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి పోయేవారు విల్వమంగళులు.
ఒకనాడు ఆయన నియమంగా ఎంతో పవిత్రంగా భావించి పూజించే సాలగ్రామాలను తన నోటిలో పెట్టుకొన్నాడట. ఆగ్రహం అదుపు తప్పడంతో చెంప దెబ్బ కొట్టారట.  మాట తప్పినందున  ఇక్కడ ఉండనని  తనను చూడాలంటే సముద్రతీరాన ఉన్న అనంత కాడు రావలసి ఉంటుంది అని చెప్పి కోనేరు కుడి పక్కన ఉన్న గుహ మార్గం లోనికి ప్రవేశించి అంతర్ధానం అయిపోయాడట బాలుడు. అప్పటికి అతను మరెవరో కాదు తాను  నిత్యం పూజించే బాలకృష్ణుడే అన్న గుర్తింపు కలిగి తానూ అదే గుహ మార్గంలో వెదుకుతూ సముద్ర తీరంలో ఇప్ప చెట్లతో ఉన్న వనాన్ని చేరారట.
అక్కడ ఒక పెద్ద చెట్టు క్రింద కనపడిన బాలకుడు చూస్తుండగానే ఆ వృక్షం లోకి ప్రవేశించి పెద్ద అనంతశయం రూపంలో సాక్షాత్కరించారట.
ఆనందంతో పులకించిపోయిన విల్వ మంగళ స్వామి, అక్కడే ఉన్న మామిడి చెట్టు నుండి పచ్చి కాయలను కోసి, ఎండు కొబ్బరి చిప్పలో  ఉంచి నివేదన చేశారట. నేటికీ ఇదే నైవేద్యాన్ని ఆలయంలో సమర్పిస్తారు.
ఇదే కథను దివాకర మహాముని పేరున కూడా చెబుతారు. మరి కొందరు ఇద్దరు ఒక్కరే అంటారు.
అనంతర కాలంలో ఈ ప్రాంతమంతా వ్యవసాయ క్షేత్రంగా రూపుదిద్దుకొన్నదట. అక్కడ పనిచేస్తున్న మహిళకు పసిబాలకుని రోదన వినిపించిందట. చూడగా ఒక బాలకుడు కనిపించాడట. స్త్రీ సహజ సిద్దమైన మాతృప్రేమతో అతనిని అక్కువ చేర్చుకొని లాలించి చెట్టు నీడన నిద్రపుచ్చినదట. పని మధ్యలో తిరిగి చూడగా అనంత నాగు ఒకటి  బాలుని మీద ఎండ పడకుండా తన అయిదు పడగలను గొడుగులా చేసి పట్టిందట. ప్రతి నిత్యం  ఇదే పునరావృతం అయిందట. అలా ఈ విషయం రాజుగారిని చేరిందట. ఆయన వచ్చి త్రవ్వి చూడగా పురాతన ఆలయం బయల్పడినది.  సంతోషంతో ఆయన ఆలయాన్ని పునః నిర్మించారు.






శ్రీ అనంత పద్మనాభ ఆలయ ఉత్తర ద్వారం 

శ్రీ లక్ష్మి వరాహ స్వామి ఆలయం, శ్రీ వరాహం, 



శ్రీ అనంతపద్మనాభ ఆలయ పడమర ద్వారం 





ఇంతటి పురాణ, చారిత్రక నిర్మాణ విశేషాల సమాహారమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రతి రోజు పర్వదినమే ! దేశం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.
మలయాళ ఉగాది అయిన విషు, గణేష చతుర్థి, ఓనం, కృష్ణాష్టమి, నవరాత్రులు, శబరిమల మండల పూజలు, వైకుంఠ ఏకాదశి ఘనంగా నిర్వహిస్తారు. ఇవి కాకుండా అలపాశ ఉత్సవాలు ముఖ్యమైనవి.
ఆలయ ప్రవేశానికి పురుషులు, స్త్రీలు, పిల్లలు సంప్రదాయ దుస్తులు ధరించాలి. కెమెరా, మొబైల్ ఫోన్ లాంటి వాటిని ఆలయం లోనికి అనుమతించరు.
ఆలయం ఉదయం 3 గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు, తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది. మధ్యమధ్యలో అలంకరణ, నివేదనల కొరకు దర్శనాన్ని అవుతుంటారు.
సరైన సమయం ఉదయం ఆరు గంటలకు. రద్దీ ఉండదు. చక్కగా దర్శించుకోవచ్చును.
తిరువనంతపురం లో మిత్రానందాపురం త్రిమూర్తి ఆలయం( పడమర ద్వారానికి ఎదురుగా), శ్రీ లక్ష్మీ వరాహ స్వామి ఆలయం(ఆలయ నైరుతి లో), పలవంగాడు శ్రీ మహా గణపతి ఆలయం(తూర్పున), తిరువళ్ళం శ్రీ పరశురామ ఆలయం,  శ్రీ అట్టుక్కాల్ భగవతి ఆలయం తప్పక సందర్శించవలసినవి.
రవివర్మ చిత్రశాల, సముద్ర తీరం ఇలా ఎన్నో పర్యాటక ఆకర్షణలు నెలకొని ఉన్నాయి తిరువనంతపురంలో !
రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న సందులలో లెక్క లేనన్ని వసతి గృహాలు అందుబాటు ధరలలో
లభిస్తాయి.
తిరువనంతపురం లోని ఆలయాల వివరాలు ఈ బ్లాగ్ లో ఉన్నాయి.









జై శ్రీమన్నారాయణ !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...