ముగురమ్మల మూలపుటమ్మ - బుడియా మాత
ఆలయాలలో అమ్మవారు సర్వాంగసుందరంగా అంటే పుష్ప, సువర్ణ హారాలను ధరించి, పట్టుపీతాంబరధారిగా, నయనమనోహరంగా కొలువై ఉంటారు. నవరాత్రిలాంటి పర్వదినాలలో చేసే అలంకారాలకు లెక్కే లేదు.
కానీ దీనికి పూర్తి వ్యతిరేకంగా సాదా సీదాగా, నూలు వస్త్రం ధరించి, చేతి కర్రతో ముదుసలి రూపంలో అమ్మవారిని ఊహించుకోగలమా ? లేదు.
కానీ అచ్చం అలానే ఉండే దేవీ మాత ఆలయం ఒకటి మన దేశంలో ఉన్నది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని గోరఖ్ పూరు శివారులలోని అటవీ ప్రాంతంలో ఉంటుందొక ప్రత్యేక మందిరం. "బుదియా మాత" (ముసలమ్మ)మందిరం. పేరే చెబుతోంది కదా మందిర ప్రత్యేకత ఏమిటో !!
ప్రకృతికి నిలయమైన అటవీ ప్రాంతంలో ఈ మందిరాన్ని "జోకు సోకా" అనే ఆదివాసీల నాయకుడు ఒక యాభై సంవత్సరాల క్రిందట నిర్మించినట్లుగా స్థానికంగా వినిపించే కధనాలు తెలుపుతున్నాయి.
ఒకనాడు అతను అడవిలో వెళుతుండగా పెద్దపులి వెంబడించినదట. ప్రాణ భయంతో పరుగిడతము మొదలుపెట్టాడట. కానీ క్రూర జీవి బలం ముందు అతని బలం చాల లేదుట. దాడి చేయబోయిందట.బెదిరిపోతూ ఆఖరి ఆశగా తాను నిత్యం కొలిచే దేవదేవిని ప్రార్దించాడట.
హఠాత్తుగా ఒక ముసలమ్మ పులికి అతనికి మధ్యలోకి వచ్చిందట. ఆశ్యర్యంగా ఆమె తన చేతి లోని కర్రను పైకెత్తగానే అంత క్రూర జంతువూ పిల్లిలా మారి పారిపోయిందట.
తేరుకున్న సోకా తన ప్రాణాలను కాపాడిన ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకొని తన ఇంటికి ఆహ్వానించాడట.
కుటుంబ సభ్యులందరూ ఆమె చేసిన సాయానికి పాదాలంటుకొని నమస్కరించారట. ఘనంగా అతిధి సత్కారాలు చేసి, ఒక నేత చీరను కానుకగా సమర్పించుకొన్నారట. వారందరినీ ఆశీర్వదించి, ఇంటి వెలుపలికి వచ్చిన ఆమె అందరూ చూస్తుండగానే తెల్లని ఏనుగు మీద కూర్చొని అదృశ్యమై పోయిందట.
అప్పడు సోకా కి అర్థమైనది ఆమె ఎవరో కాదు తానూ నిత్యం కొలిచే భవానీ మాత అని.
నాటి నుండి ఆమె ప్రసాదించిన జీవితం ఆమెకే అంకితం అన్న ఆలోచనతో మరింత భక్తితో త్రిలోకేశ్వరిని పూజించసాగాడు.
జోకు సోకా
కోనేరు వడ్డున శ్రీ సూర్య దేవాలయం
ఆలయ ప్రాంగణం
కొంతకాలానికి సోకా మరణించాడట. వారి ఆచారం ప్రకారం మృతదేహాన్ని ప్రవహించే నీటి లోనికి వదిలారట. జలప్రవాహంలో తేలుతూ వస్తున్న దేహాన్ని చూసిన ఎవరో కొట్టుకు పోతున్నారు అన్న ఆలోచనతో దిగువన నివసించే తోరా జాతి వారు వడ్డుకు తెచ్చారట. దేవీ మహత్యమో మరొకటో సోకా జీవించే ఉన్నాడట. తోరా జాతి వారి సేవలకు తేరుకొని, వారికి కృతఙ్ఞతలు తెలుపుని తన గ్రామం చేరుకొని, ఆలయ నిర్మాణానికి పూనుకొన్నాడట.
అసలు ఈ ముసలమ్మ ఆరు వందల సంవత్సరాల క్రిందట ఒక తోరా జాతి వారి వివాహ వేడుకలలో కనిపించిందట. నృత్యం చేస్తున్న యువతీ యువకులను ఆమె తన కోసం గానం చేయమని కోరిందట. మద్యం మత్తులో ఉన్న వారు ఎగతాళి చేశారట. ఒక యువకుడు మాత్రం ఆమె దగ్గర కూర్చొని చక్కగా గీతాలను పాడాడట. వివాహంలో పాల్గొనడానికి వారంతా పడవలో నది దాటుతుండగా ప్రవాహ ఉదృతి పెరిగి పడవ తిరగపడటంతో ఒక్క గానం చేసిన యువకుడు తప్ప మిగిలిన వారంతా మరణించారట.
అప్పుడు తోరా జాతి వారు ఆమె తాము కొలిచే వనదుర్గాదేవిగా గుర్తించి, తప్పుకు క్షమాపణ కోరుకొని భక్తిశ్రద్దలతో పూజించసాగారు.
తనను రెండుసార్లు మృత్యువు కోరల నుండి రక్షించిన అమ్మవారిని ప్రేమగా "బుడియా మాత", గా పిలుచుకొంటూ మందిరాన్ని నిర్మించాడు జోకు సోకా. నేటికీ ఆయన వంశం వారే ఆలయ పూజారులుగా వ్యవహరిస్తున్నారు.
ఆకాశాన్ని అంటేలా పెరిగిన టేకు, మద్ది వృక్షాల మధ్య సువిశాల ప్రదేశంలో నిర్మించబడినది బుడియా మాత మందిరం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు శ్రీ సూర్య నారాయణుని ఉపాలయాలుంటాయి. ఆలయానికి ఎదురుగా ఆలయ నిర్మాత జోకు సోకా విగ్రహం చిన్న మందిరంలో చూడవచ్చును.
బుడియా మాత
ముఖమండపం పక్కన, హోమగుండం, పక్కనే మొక్కుబడులను తీర్చుకొనే ప్రదేశం ఉంటాయి. మొక్కుబడులు అంటే బలులు లాంటివి కావు. ఎక్కువగా బట్టలే ! చాలా మంది భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో బంగారు రంగు అంచు ఉన్నఎర్రటి బట్టలను, గాజులను తమకు శుభాలు కలగచేయమని ప్రార్ధిస్తూ కడతారు. పూల మాలలు, పసుపు కుంకుమల కన్నాఎక్కువగా వీటిని, నేత చీరలు అమ్మే దుకాణాలు ఎన్నో ఉంటాయా ప్రదేశంలో !!!
గర్భాలయంలో ఎదురుగా సర్వాలంకృతగా శ్రీ దుర్గాదేవి ఉపస్థితులై ఉంటారు. ఆమెకు ఎడమ పక్కనగజారూఢగా బుడియా మాత, కుడి పక్కన ఏనుగు విగ్రహం ఉంటాయి.
బుడియా మాత ఎడమ చేతిలో దండం ధరించి, కుడి అభయ ముద్రతో భక్తులను ఆశీర్వదిస్తుంటారు. ఆమెని దగ్గర నుండి చూస్తే ముడతలు పడిన మోము, లోపలి పోయిన బుగ్గలు, గుంతలు పడిన కళ్ళతో వార్ధక్యం ప్రస్ఫుటంగా కనిపించే రూపంతో దర్శనమిస్తారు.
తమ కోరికలు నెరవేరిన భక్తులు నేత చీరెలను బుడియా మాత అర్పించుకొంటారు.
వివాహం కానీ వారు, సంతానం లేని వారు, గ్రహ దోషాలతో ఇబ్బందులు పడుతున్న వారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. బుడియా మాత ను ప్రార్ధిస్తుంటారు.
ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిరాటంకంగా తెరిచి ఉండే బుడియా మాత మందిరం ప్రతి నిత్యం వందలాది మంది భక్తులతో కళకళ లాడుతుంటుంది.
పర్వదినాలలో సందర్శకుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. స్థానికంగా నివసించే వారే కాక, పాన ఉన్న బీహార్, జార్ఖండ్ మరియు నేపాల్ నుండి కూడా వస్తుంటారు.
ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న నేపాల్ లో నివసించే ఆదిమవాసుల ఆరాధ్య దేవత బుడియా మాత.
చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించేవారు శెలవు దినాలలో ఉదయాన్నే వచ్చి, వంటలు వండుకొని, అమ్మకు నివేదన చేసి, ప్రసాదంగా స్వీకరించి ఇక్కడి ఆహ్లాదకర వాతావరణంలో గడిపి వెళుతుంటారు.
కొండ మరియు అడవి బిడ్డలకే కాదు బుడియా మాత అందరినీ కాపాడే కారుణ్య మూర్తి. ఈమెను తరచుగా దర్శించుకొని వారిలో రాజకీయ నేతలు, సినీ తారలు, అధికారులు ఉన్నారు.
నవరాత్రులలో ఘనంగా ఉత్సావాలను నిర్వహిస్తారు.
ఉత్తర ప్రదేశ్ లో ప్రత్యేకమైన స్థానం కలిగిన బుదియా మాత మందిరానికి గోరఖ్ పూర్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రైల్వే స్టేషన్ వద్ద నుండి ఆటోలు లభిస్తాయి. వెళ్లి రావడానికి రెండు వందల దాకా తీసుకొంటారు.
రాప్తి నదీ తీరం లోని గోరఖ్ పూర్ గోరఖ్ నాధ్ మఠం కూడా దర్శనీయ స్థలమే !!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఆదిత్యనాథ్ యోగి ఈ మఠానికి చెందినవారే !!
నమో మాత్రే నమః !!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి