12, డిసెంబర్ 2017, మంగళవారం

Ahobhilam

                     నవ నారసింహ క్షేత్రం, అహోబిలం 




మన తెలుగు రాష్ట్రాలలో పెక్కు నరసింహ ఆలయాలున్నాయి. 
మంగళగిరి, వేదాద్రి, మట్టపల్లి, యాదాద్రి ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ భారత దేశం లోని నాలుగు నారసింహ క్షేత్రాలలో ఒకటి అయిన అహోబిలం చాలా పవిత్రమైనది మరియు ప్రత్యేకమైనది. 
స్వయంవ్యక్త క్షేత్రం గాను, శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి గాను, ఒకే ప్రదేశంలో తొమ్మిది నారసింహాలు కొలువు తీరిన చోటుగాను ఇలా ఎన్నో విధాలుగా  ప్రసిద్ధి చెందినది అహోబిలం.
శ్రీ హరి నర సింహ రూపంలో ఇక్కడ కొలువైన విషయాన్ని తెలిపే గాధ సత్య యుగం నాటిది.




దిగువ సన్నిధి 

జ్వాలా నారసింహ 


వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు, శ్రీ వారి దర్శనానికి విచ్చేసిన బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాదులను అడ్డగించి శాపగ్రస్తులైనారు. వారు శ్రీమన్నారాయణునికి తాము సన్నిధిని విడిచి ఉండలేమని మార్గోపాయం తెలుపమని ప్రాధేయపడ్డారు.
ముని శాపాన్ని తాను తొలగించలేనని, కాకపోతే మార్పు చేయగలనని తెలిపి, ఏడు జన్మలు హరి భక్తులుగానో లేదా మూడు జన్మలు హరి కి వైరులుగానో భూలోకంలో గడపడానికి ఒక దానిని కోరుకోమన్నారు వైకుంఠ వాసుడు. ఎంత తొందరగా తిరిగి వైకుంఠం చేరుకోవాలా అన్న తపనతో వారు రెండో దానినే ఎంచుకొన్నారు.
అలా వారు ఎత్తిన తొలి జన్మ దితి, కశ్యప మహర్షి దంపతులకు కుమారులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. వరబలంతో లోకకంటకులుగా మారారు. పరంధాముడు వరాహావతారం ధరించి
హిరణ్యాక్షవధ జరిపారు. సోదరుని మరణంతో ఆగ్రహించిన హిరణ్యకశిపుడు తపస్సుతో విధాతను మెప్పించి ఎవరి చేత మరణం సంభవించకుండా వరం పొందాడు.
వరగర్వంతో ఇంద్రాది దేవతలను ఓడించి, మరింత అహంకారంతో మునులను, సాధు జనులను ఇక్కట్ల పాలు చేయసాగాడు.
అతని కుమారుడైన ప్రహ్లాదుడు జన్మతః హరి భక్తుడు. కుమారుని మార్చడానికి సామదాన భేద దండోపాయాలను ప్రయోగించి విఫలుడైనాడు హిరణ్యకశిపుడు.  హరి సర్వాంతర్యామి అన్న కుమారుని సమాధానంతో రెట్టించిన అసహనం మరియు కోపంతో  ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి అని ప్రశ్నించి బలంగా మోదగా దాని నుండి ఉద్భవించారు, సింహ మొహం, మానవ శరీరం తో భీకర గర్జనలు చేస్తూ నరసింహ స్వామి.
సృష్టికర్త అసురునికి అనుగ్రహించిన వరం లోని లోపాలను అనుసరించి, మనిషి, మృగం కాని రూపం, ఇంటా బయటా కాకుండా గడప మీద, ఉదయం రాత్రి కాకుండా సంధ్యాసమయంలో, గోళ్లనే ఆయుధంగా చేసుకొని అత్యంత ఉగ్రంగా హిరణ్య కశ్యపుని వధించారు.
ఎంతకీ నృసింహుడు  ఉగ్రత్వం వీడక పోవడంతో పరమశివుడు ప్రహ్లాదుని ప్రార్ధించమని కోరారు. బాల భక్తుని స్తోత్ర పాఠాలకు శాంతించి గుహలో కొలువు తీరారు. ఆ దృశ్యాన్ని వీక్షించిన సమస్త దేవతలు, మునులు, "అహో బల ! మహా బల ! అహోబల !" అంటూ కైవారాలు చేశారు.
ఆ విధముగా అహోబలం అన్న పేరు వచ్చినది. కాలక్రమంలో దైవం బిలంలో కొలువైన క్షేత్రంగా అహోబిలం గా మార్పు చెందినది.
బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, నృసింహ పురాణం, భాగవత పురాణం, హరివంశం ఆదిగా గల గ్రంధాలలో శ్రీ నృసింహ మరియు అహోబిల ప్రస్థాపన కలదు.
శ్రీరామచంద్ర మూర్తి, జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు, శ్రీ వైష్ణవ గురువులు శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని సందర్శించి శ్రీ నారసింహుని సేవించుకొన్నట్లుగా వివిధ పురాణాల ద్వారా అవగతమవుతోంది.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు పద్మావతీ దేవితో తన వివాహానంతరం ఈ క్షేత్రానికి విచ్చేసి దిగువ సన్నిధిగా పిలవబడుతున్న శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రతిష్టించి పూజించుకొన్నారని తెలియవస్తోంది.





కారంజ నారసింహ 

ఖ్రోడా నారసింహ 

మాలోల నరసింహుడు 




అహోబిల క్షేత్రం నల్లమల అరణ్య మధ్య భాగంలో శేషాద్రి మీద గరుడాద్రి మరియు వేదాద్రి పర్వతాల నడుమ ఉంటుంది ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడైన ఆదిశేషుడు విశ్రమించాడట. ఆకారణంగా శేషాద్రి అన్న పేరు వచ్చినదట. తల భాగంలో శ్రీ శ్రీనివాసుడు, నడుము మీద అహోబిల నారసింహుడు, తోక భాగంలో శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లిఖార్జున స్వామి కొలువుదీరి ఉంటారు. శ్రీ శైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో, అష్టాదశ పీఠాలలో భాగం కాగా, శ్రీ వెంకటాచలం కలియుగ వైకుంఠంగా, శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ఒకటిగా పేరొందినది.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రెండు దివ్య తిరుపతులలో రెండవది అహోబిలం.
పన్నిద్దరు ఆళ్వారులలో తొమ్మిది మంది అహోబిల క్షేత్రం గురించి పాశుర గానం చేసారు.
శ్రీనాధ కవి సార్వభౌముడు, పోతనామాత్యుడు, అన్నమాచార్యులు మొదలైన కవి భక్తులు అహోబిల మహత్యాన్ని ఘనంగా కీర్తించారు.
"ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం !! నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం !!!" అన్న నృసింహ మంత్రరాజము ప్రకారం మరే దివ్య స్థలంలో లేని విధంగా ఇక్కడ నవ నరసింహులు కొలువై ఉంటారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్మించిన దానితో మొత్తం పది ఆలయాలుంటాయి అహోబిలంలో!
దిగువ సన్నిధితో కలిపి భార్గవ, యోగానంద, చత్రవట, పావన నరసింహ ఆలయాలుండగా, పర్వత పైభాగానికి వెళ్లే దారిలో "కారంజ నరసింహ," ఎగువన శ్రీ అహోబిల నరసింహ, ఖ్రోడా, మాలోల, జ్వాలా నరసింహ ఆలయాలుంటాయి.






శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్ర దేశికులు  

శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహుడు (దిగువ సన్నిధి)

కాకతీయ ప్రతాప రుద్ర దంపతులు 




ఎగువ ఆలయంలో తొడలమీద హిరణ్య కశపుని పట్టుకొన్న భంగిమలో స్వామి దర్శనమిస్తారు. పాదాల వద్ద ప్రహ్లాదుడు నమస్కార భంగిమలో ఉంటాడు. పక్కనే స్వామిని అర్చిస్తున్న మహాదేవుడు, శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి కొలువై ఉంటారు. మరో ఉపాలయంలో స్థానిక చెంచులు తమ సహోదరిగా ఆరాధించే శ్రీ చెంచులక్ష్మి సన్నిధి కూడా ఉంటుంది. కాకతీయ ప్రతాప రుద్రుడు ఆలయ నిర్మాత. తదనంతర కాలంలో రెడ్డి రాజులూ, విజయనగర రాజులు అభివృద్ధి చేశారు.
ఎగువన శ్రీ అహోబిల నరసింహ సన్నిధి దర్శించుకొని అడవి లోనికి నడుచుకొంటే వెళితే ఒక  కిలోమీటరు  తరువాత వస్తుంది శ్రీ ఖ్రోడా నరసింహ ఆలయం.
భూదేవితో సహా వేదాలను అపహరించుకొని పోయిన సోమకాసురుని సంహరించిన వరాహ రూపం, హిరణ్యకశపుని చేతిలో చిత్ర హింసలకు గురౌతున్న ప్రహ్లాదుని కాపాడిన నారసింహ రూపం రెండు కలగలసినదే ఖ్రోడా నరసింహ స్వామిది. శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటారు. నాసికాగ్ర భాగాన రాక్షసుని శరీరం కనపడుతుంది. పక్కనే శ్రీ లక్ష్మీ నరసింహ మూర్తి కూడా  ప్రతిష్టించారు.  సింహాచలంలో ఉన్నది కూడా ఈ రూపమే!
పక్కన పారే భవనాశని ప్రవాహాన్ని, సూర్య కిరణాలు కూడా ప్రవేశించలేనంత దట్టంగా పెరిగిన చెట్ల మధ్య నుండి నడుస్తూ సాగితే పైన ఉంటుంది శ్రీ జ్వాలా నరసింహ ఆలయం.
భవనాశని పుట్టుక ఇక్కడి నుండే !పక్కనే మరింత పైకి ఎక్కితే నృసింహుడు వెలుపలికి వచ్చిన ఉగ్రస్థంభంగా పేర్కొనే నిటారైన గోడ మాదిరి ఉండే పర్వతం ఉంటుంది. ఎగువ సన్నిధి నుండి ఇక్కడికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వామి అష్టభుజుడు. రెండు చేతులతో అసురుని తల, పాదాలను పట్టుకొనగా, రెండింటి నఖాలతో అతని ఉదరకోశాన్ని చీలుస్తూ, మరో రెండు చేతులతో అసురుని ప్రేగులను మేడలో వేసుకొంటూ, మిగిలిన హస్తాలతో శంఖు చక్రాలను ధరించి ఉంటారు. ఎడమ పక్కన ముకుళిత హస్తాలతో నిలుచొని ఉంటాడు ప్రహ్లాదుడు.
అసుర సంహారానంతరం స్వామి తన హస్తాలను శుభ్ర పరుచుకున్న "రక్త కుండం " ఇక్కడే ఉంటుంది. చూస్తే అందులోని నీరు ఎర్రగా కనిపిస్తుంది. చేతిలోకి తీసుకొంటే మామూలుగానే కనిపిస్తాయి.
జ్వాలా, ఉగ్రస్థంభం దర్శించుకొని చక్కగా నిర్మించిన మెట్ల మార్గంలో క్రిందికి వస్తుంటే కనపడే కొండ గుహ ను "ప్రహ్లాద బడి " అని పిలుస్తారు. రాక్షస గురువు చెండామార్కుల వారి వద్ద ప్రహ్లాదుడు ఇక్కడే విద్య నేర్చుకొన్నట్లుగా చెబుతారు. గుహాంతర్భాగం పైన కొన్ని చిత్రమైన అక్షరాలు లిఖించబడి ఉంటాయి.
మరింత క్రిందకి వస్తే ఎదురవుతుంది శ్రీ మాలోల నారసింహ సన్నిధి. మాలోల అనగా లక్షీ ప్రాణనాధుడు అని అర్ధం. ఉపస్థిత భంగిమలో ఉన్న స్వామి వారి ఎడమ తొడపైన కూర్చొని ఉంటారు శ్రీ లక్ష్మీ దేవి. చతుర్భుజ స్వామి శంఖుచక్రాలను ధరించి, ఎడమ చేతితో అమ్మవారిని కౌగలించుకొని, కుడి అభయ హస్తముతో భక్తులను అనుగ్రహిస్తుంటారు. సౌమ్య మూర్తి. అహోబిల మఠ పీఠాధిపతులు యాత్రల సందర్బంగా నిత్యపూజలు చేసుకోడానికి వెంట తీసుకొని వెళ్లే ఉత్సవమూర్తి ఈ స్వామిదే !!!





ఉగ్ర స్థంభం 

రంగరాయల విజయ స్థంభం 


రక్త కుండం 






ఎగువ సన్నిధి నుండి క్రిందకి వస్తుంటే మధ్యలో ఉంటుంది కారంజ నరసింహ మందిరం. కారంజ వృక్షం క్రింద పద్మాసనంలో దర్శనమిస్తారు. చిత్రంగా చేతిలో ధనుర్భాణాలు ఉంటాయి. శ్రీ ఆంజనేయుడు ఇక్కడ తపస్సు చేశారట. సాక్షాత్కరించిన నృసింహుని నీవెవరు నాకు తెలీదు. తెలిసిన దైవం శ్రీ రాముడే ! అనగా స్వామి విల్లును పట్టుకొని కనపడ్డారట. 
మూలవిరాట్టు నుదిటిన మూడో నేత్రం ఉండటం మరో విశేషం. 
దిగువ అహోబిలానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంటుంది శ్రీ భార్గవ నారసింహ ఆలయం. పరశురాముడు ఈ ప్రదేశంలో తపస్సు చేయగా శంఖుచక్రాలతో, అసురుని ఉదరం చీలుస్తున్న రూపంలో స్వామి దర్శనమిచ్చారు. 
కొద్దిగా ఎత్తులో ఉండే ఈ ఆలయం చుట్టూ పచ్చని అడవి విస్తరించి ఉంటుంది. 
దిగువ సన్నిధికి దక్షిణంగా అన్నదాన పితామహుడు, అవధూత శ్రీ కాశీనాయన ఆశ్రమానికి చేరువలో ఉంటాయి శ్రీ యోగానంద మరియు శ్రీ చత్రవట నరసింహ సన్నిధులు. 
ప్రహ్లాదునికి స్వామి ఇక్కడ యోగ విద్యను నేర్పించారట. మూలవిరాట్టు యోగబంధనంతో చతుర్బాహువుగా దర్శనమిస్తారు. 
శంఖుచక్రాలను వెనక హస్తాలతో ధరించి, ముందు ఎడమచేతితో తొడమీద తాళం వేస్తూ, కుడి చేతి అభయ ముద్రతో భక్తులను కాచేవాడు శ్రీ ఛత్రవట నరసింహుడు.  ఇక్కడ ఇద్దరు గంధర్వులు స్వామివారిని తమ సంగీతంతో అలరించారట. ప్రసన్న స్వరూపి ఛత్రవటుడు. 
ముఖ మండపంలో చప్పట్లు కొడితే జవాబుగా వీణ మీటిన ధ్వని స్ఫష్టంగా వినిపించడం ఒక విశేషం. 
దిగువ ఆలయం నుండి పదిహేను కిలోమీటర్లు వాహనంలో, ఎగువ నుండి ఏడు కిలోమీటర్లు కాలినడకన వెళితే చుట్టూ ఎత్తైన కొండల నడుమ కొలువై ఉంటారు పాములేటి స్వామిగా భక్తులు ప్రేమగా పిలుచుకునే శ్రీ పావన నరసింహుడు. 
భరద్వాజ మహర్షికి శ్రీ మహాలక్ష్మీ సమేతంగా దర్శనము ప్రసాదించారు శ్రీ పావన నరసింహుడు. 
ప్రతి నిత్యం విశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శనివారాలలో మరింత అధిక సంఖ్యలో విచ్చేస్తారు. 
వర్షాకాలంలో ఈ క్షేత్రాన్ని చేరుకోవడం ఇబ్బందులతో కూడుకున్నది. 











శ్రీ భార్గవ నరసింహ 

భవనాశని ప్రవాహం 

శ్రీ ఛత్రవట నరసింహ ఆలయం 






దిగువ శ్రీ ప్రహ్లాదవరద శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని ప్రతిష్ఠ. ఆలయాన్ని కాకతీయులు, రెడ్డి రాజులూ, విజయనగర పాలకులు, స్థానిక జమీందార్లు, పీఠాధిపతులు, ఇలా ఎందరో వివిధ కాలాలలో తమ వంతు కైంకర్యంగా ఆలయాన్ని అభివృద్ధి పరిచారు.
ఈ ఆలయంలో విజయనగర శైలిలో నిర్మించబడిన రాజగోపురం, కల్యాణ మండపము, వసంత మండపము, రంగ మండపము కనిపిస్తాయి. నవ నరసింహులు దర్శించుకోలేని వారి కొరకు రంగ మండప స్తంభాల పైన ఆ రూపాలను సుందరంగా మలచారు.
అద్భుత శిల్పాలు కనిపిస్తాయి రంగ మండపంలో.
అహోబిల మఠ స్థాపకులైన శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్రుల విగ్రహం కూడా ఉంటుందీ మండపంలో.
కాకతీయ ప్రతాపరుద్రుడు అపర శివ భక్తుడు. ప్రతి నిత్యం ఒక బంగారు లింగాన్ని పోత పోయించి, అర్చించి, బ్రాహ్మణులకు దానం ఇచ్చేవాడట. ఒకసారి ఈ ప్రాంతంలో బస చేసి పూజకు సిద్దపడగా ఎన్ని మార్లు పోత పోసినా శివ లింగానికి బదులు శ్రీ నరసింహ ప్రతిమ   రాసాగిందట.
నాటి రాత్రి కలలో శ్రీ నృసింహుడు కనపడి ఇది తన క్షేత్రం అని తెలిపి, మరునాడు కర్ణాటక ప్రాంతం నుండి ఇక్కడి వస్తున్న బ్రాహ్మణునికి ఆ విగ్రహాన్ని కానుకగా ఇవ్వమని సెలవిచ్చారట.
అలా మరునాడు వచ్చిన శ్రీ కిదాంబి శ్రీనివాసులుకు విగ్రహాన్ని, ఆలయ నిర్వహణా భాద్యతను అప్పగించారటశ్రీ ప్రతాప రుద్రుడు. ఆ శ్రీనివాసులే అహోబిల మఠ స్థాపకులైన శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్రులు.
ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి కూడా ఉంటుంది.  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, ఆండాళ్ కొలువుతీరి భక్తులను ఆదరిస్తుంటారు.






శ్రీ యోగ నారసింహ 

శ్రీ యోగ నారసింహ ఆలయం 


అహోబిల నారసింహ ఆలయం (ఎగువ సన్నిధి) 




ఎంతో ప్రశాంతతకు, ప్రకృతి రమణీయతకు, మనసులకు శాంతిని అందించే ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు అహోబిలం.
నంద్యాల, శ్రీశైలం, కర్నూలు, కడప, అనంతపురం మరియు తిరుపతి నుండి ఆళ్ళ గడ్డ మీదగా రహదారి మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చును.
వసతి శ్రీ మాలోల గెస్ట్ హౌస్, శ్రీ హరిత రిసార్ట్స్ లో లభిస్తుంది. దేవాలయం వారి అన్న సత్రాలలో చక్కని భోజనం పెడతారు. కాకపోతే ముందుగా తెలియచెప్పాలి.
శని మరియు ఆది వారాలు రద్దీ ఎక్కువగా ఉంటుంది.

నమో నారాయణః !!!!  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...