10, ఏప్రిల్ 2014, గురువారం

Vijayawada Temples

             శ్రీ విజయేశ్వర స్వామి ఆలయం, విజయవాడ 


                 

                   పార్ధుడు పాశుపతాస్త్రం పొందిన క్షేత్రం            


విజయవాడ అనగానే ప్రతి ఒక్కరి మదిలో మెదిలేది ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ కనక దుర్గ కొలువైన ఇంద్రకీలాద్రి. పౌరాణికంగానే కాకుండా చరిత్రలోను మరెన్నో ఎన్నో విషయాలలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న విజయవాడను  పురాణం కాలంలో "విజయ వాటిక " అని పిలిచేవారు. 
అనేక పురాతన గ్రంధాలలో, రాజ శాసనాలలో అదే పేరు ఉండటం గమనించవచ్చును. 
ఈ పట్టణానికి ఆ పేరు రావడానికి సంబంధించిన పురాణ గాధతో ముడిపడి ఉన్న ఒక ప్రసిద్ద ఆలయం ఇక్కడ ఉన్నది. 
కిరాతకార్జునీయం  :
మాయ జూదంలో దాయాదుల చేతిలో ఓడిపోయిన పాండవులు వనవాసానికి వెళ్ళారు. 
రాబోయే కురు పాండవ సంగ్రామంలో పాండవులకు విజయం సిద్దించాలంటే దైవానుగ్రహం తప్పక ఉండాలని, ఆ దిశగా ప్రయత్నం చేయమని చేసిన ఇంద్రుని సలహా మేరకు అర్జనుడు పరమేశ్వర అనుగ్రహం కొరకు తపస్సు చేసాడు. 
పాండవ మధ్యముని దీక్ష గంగాధరుని మెప్పించినది. 
అయినా అతనిని పరీక్షించదలచారు. 
కుంతీ నందనుడు తపమాచారిస్తున్న ప్రాంతంలోనే "ముఖాసురుడు" అనే కౌరవ పక్షపాతి అయిన అసురుడు ఉండేవాడు. 
అతనికి అర్జనుని తపస్సు గురించి తెలిసింది. 
తన మిత్రులైన గాంధారి పుత్రులకు హాని కలిగించే దానిని ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకొన్నాడు దానవుడు. 
అడవి పంది రూపంలో వెళ్లి అర్జనుడు ఉన్న ప్రాంతాలలో కల్లోలం సృష్టించ సాగాడు. 
సహనంతో అతని ఆగడాలను చాలా కాలం సహించాడు సవ్యసాచి. 
అంతకంతకు అసురుని అరాచకం పెచ్చు పెరగడంతో కోపోద్రేకుడైన కిరీటి విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలాడు. 
అదే సమయంలో కిరాతకుని రూపంలో వచ్చిన కైలాసనాధుడు కూడా బాణం వరాహం పైకి వేసాడు. మరణించిన వరాహం దేహం లో రెండు శరాలు ఉండటంతో దానిని చంపినది నేను అంటే నేను అన్న వాదం మొదలై చివరకు సమర రూపం దాల్చినది. ఎన్నో అస్త్రాలను ప్రయోగించినా అవి కిరాతకుని ఏమీ చేయలేకపోయాయి. శక్తులన్నీ నిష్ఫలమవ్వడంతో క్రుద్దుడైన అర్జనుడు గాండీవాన్ని ఎత్తి కిరాతకుని మోదబోయాడు. అప్పుడు నిజ రూపంతో దర్శనమిచ్చిన నందివాహనుడు  విజయం దక్కించుకొన్న కారణాన  "విజయా!"  అని సంభోదించి ఆశీర్వదించి "పాశుపతాస్త్రం " ప్రసాదించారు. ఈ సంఘటన జరిగినది కృష్ణా నదీ తీరంలో ఉన్న ఇంద్రకీలాద్రి వద్దనే అని మహా కవులు రచించిన కావ్యాల ఆధారంగా అవగతము అవుతోంది. 
 ఈ ఉదంతం ఆధారంగా సంస్కృతంలో "భారవి " అనే కవి "కిరాతకార్జునీయం" అనే ప్రసిద్ధ కావ్యం రాయగా అదే కథను అదే పేరుతో తెలుగులో శ్రీనాథ కవి రచించారు.అలా పార్వతీ వల్లభుడు పెట్టిన పరీక్షలో విజయుడైన క్షేత్రం గా పాండవ మధ్యముని పేరుమీద "విజయ వాటిక " గా పిలవబడి కాలక్రమంలో "విజయవాడ" గా మారింది. కరుణించినందుకు కృతజ్ఞతగా అర్జనుడు తమ పోరు జరిగిన స్థలంలో ఒక లింగాన్ని ప్రతిష్టించాడు. 
విజయుడు ప్రతిష్టించిన లింగం కనుక   శ్రీ విజయేశ్వర స్వామిగా  పిలవబడుతోంది. 
ఇంద్ర కీలాద్రి పర్వత పాదాల వద్ద ఉండే ఈ ఆలయం తనవైన ప్రత్యేకతలతో కొలిచిన వారికి  కొంగు బంగారంగా ప్రసిద్ది కెక్కినది. 












రహ దారి నుండి కొద్దిగా ఎత్తులో ఉండే ఆలయాన్ని చేరుకోడానికి సోపాన మార్గం ఉన్నది. 












పై భాగాన పురాతన ముఖ, గర్భాలయాలకు అనుబంధంగా నిర్మించిన మండపంలో ఒక పక్క నవగ్రహ సన్నిది, రెండో పక్క శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం ఉంటాయి.  ప్రతి నిత్యం ఎందరో భక్తులు ప్రదక్షిణాలకు, వ్రతాలు చేయించుకోడానికి వస్తుంటారు.
అన్నిరకాల నక్షత్ర, గ్రహ శాంతి హోమాలు కూడా ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి.









ప్రదక్షిణా పధంలో ఉన్న ఉప ఆలయాలలో విఘ్నేశ్వరుడు, గర్భాలయ వెలుపలి దక్షిణ గోడకు శ్రీ మేధో దక్షిణా మూర్తి, వెనుక చిన్న మండపంలో గణపతి, లింగరాజు, ఆంజనేయుడు కొలువై ఉంటారు. 
గురువుకు తొలి రూపం శివుడు. ఆయనే దక్షిణా మూర్తి. దక్షిణ భారత దేశంలోని అన్ని శివాలయాలలో ఈయన కొలువుతీరి ఉంటారు. మేధో దక్షిణా మూర్తి స్వామికి ఉన్న పద్దెనిమిది రూపాలలో ఒకటి. విద్యా జ్ఞాన ప్రదాత. గురువారాలు ఇక్కడ ప్రత్యేకముగా  మేధో దక్షిణా మూర్తికి  అభిషేకం మరియు పూజలు నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.  















ఉత్తరం పక్కన ప్రత్యేకంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఉప ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో నాగ ప్రతిష్టలు కూడా ఉన్నాయి. 






శ్రీ విజయేశ్వర స్వామి వారికి ఎన్నో వాహనాలు ఉన్నాయి. వాటిల్లో  ప్రత్యేకమైనది రావణ వాహనం. 








ప్రదక్షిణల ఫలితం:


శ్రీ విజయేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. 
పరిపూర్ణ విశ్వాసంతో ఎవరైతే  స్వామిని సేవిస్తారో వారి జీవితాలు ఎలాంటి అడ్డంకులూ లేకుండా విజయవంతంగా సాగిపోతాయి. కంచి స్వామీ శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర  సరస్వతి స్వామి ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడి స్వామి మహత్యాన్ని గుర్తించి అది భక్తులకు శుభాలను కలగచేయాలన్న ఉద్దేశ్యంతో ఒక నియమాన్ని రూపొందించారు. ఎలాంటి కష్టాలలో ఉన్న వారైనా ఈ ఆలయాన్ని సందర్శించి ఇరవై ఏడు ప్రదక్షినాలను చేస్తే వారితో పాటు కుటుంబ సభ్యుల  జన్మ నక్షత్ర, గ్రహ సంబంధిత దోషాలు తొలగిపోయి అన్నింటా విజయం సిద్దిస్తుంది అన్నదే ఆ నియమం. ఇరవై ఏడు అన్నది జన్మ నక్షత్రాలకు సంబంధించినది. 
 మనం చేసే ప్రదక్షిణాలు మొత్తం కుటుంబం లోని అందరి నక్షత్ర దోషాలను తొలిగిస్తుంది అన్నదే ఈ ప్రదక్షణాలలోని అంతరార్ధం. 

శ్రీ బ్రహ్మాస్త్రా దేవి : 

అర్జనుడు పరమేశ్వరుని నుండి పాశుపతాస్త్రం పొందినది ఇక్కడే అన్నదానికి ఋజువుగా ఉప ఆలయాలలో శ్రీ బ్రహ్మాస్త్రా దేవి వుంటారు. పక్కనే  మరో సన్నిధిలో శ్రీ పార్వతి దేవి కూడా దర్శనమిస్తారు. అన్ని రోజులూ ఆలయం భక్తులతో కళ కళలాడుతుంటుంది. 
కార్తీక మాసంలో, నవరాత్రులలో, మాస శివరత్రులలో విశేష పూజలలో పాల్గొనడానికి భక్తులు తండోప తండాలుగా తరలి వస్తారు. 









శ్రీ విజయేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే దారిలో కాలవ ఒడ్డున పురాతన శ్రీ వినాయక ఆలయం ఉన్నది. విజయవాడ నగరంలో అంత పెద్ద గణేశ విగ్రహం మరెక్కడా లేదు. తప్పక దర్శించవలసిన ఆలయమిది. 





నమః శివాయ !!!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...