18, ఏప్రిల్ 2014, శుక్రవారం

Tiruvallur Temples

         శ్రీ వీర రాఘవ స్వామి ఆలయం  - తిరువళ్ళూరు

తొండై మండలంగా చరిత్రలో పేరొందిన నేటి చెన్నైప్రాంతంలో ఉన్న అనేక ప్రసిద్ద ఆలయాలలో తిరువళ్లూర్ శ్రీ వీర రాఘవ స్వామి ఆలయం ఒకటి.
ఆదిశేషుని మీద స్వామి శయన భంగిమలో కొలువుతీరిన ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ, మార్కండేయ పురాణాలతో పాటు అనేక పురాతన తమిళ గ్రంధాలలో పేర్కొనబడినది.
కృత యుగంలో సంతానం లేని ముని దంపతులు నియయమ నిష్టలతో సంవత్సరం పాటు "శాలి యజ్ఞం" చేసి పరమాత్మ అనుగ్రహంతో ఒక కుమారుని పొందారట.
యజ్ఞ ఫలంగా జన్మించిన ఆ బాలునికి "శాలి హోత్రుడు"అని నామకరణం చేసి చిన్నతనం నుండి ఆచార వ్యహారాలలో, భగవత్ భక్తిలో కావలసిన విషయ జ్ఞానం కలిగించారట.
పెద్దవాడైన శాలి హోత్రుడు తపమాచారించడానికి తగిన స్థలాన్వేషణలో దీక్షారణ్యం చేరుకొని అక్కడి ప్రకృతి రమణీయతకు, ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై అక్కడి పుష్కరణి ఒడ్డున తపస్సు చేయ నిర్ణయించుకొన్నారు.
ఈ సరస్సును "హృదయతాప నాశనీ తీర్థం" అంటారు.
దీనిలో స్నానం చేసినవారి జన్మజన్మల పాపాలను హరిస్తుందని అంటారు.






వశిష్ట, వామదేవ, వ్యాస మహర్షులు ఇక్కడ తపమాచరించినట్లుగా చెబుతారు.
మధు కైటభులనే రాక్షసులను శ్రీ మహావిష్ణువు సంహరించినదిక్కడే అని అంటారు.
శివుని ఆహ్వానించకుండా యాగాన్ని తలపెట్టి, పిలవకుండా వచ్చినదని కుమార్తె సతీ దేవిని అవమానించి ఆమె అగ్నిలో దూకి ఆత్మ త్యాగం చేయడానికి కారణమైనవాడు దక్ష ప్రజాపతి.
అతనిని సంహరించిన వీర భద్రునికి సంక్రమించిన బ్రహ్మ హత్యా దోషం ఈ తీర్థం లో స్నానమాచరించిన తరువాతే తొలగి పోయినట్లుగా, దానికి నిదర్శనంగా ఇక్కడి వీరభద్ర ఆలయాన్ని, ఆయన ప్రతిష్టించిన శ్రీ తీర్దేశ్వర స్వామి ఆలయాన్ని చూపుతారు.
ఇంతటి ప్రశస్తి కలిగిన క్షేత్రంలో తపస్సును కూడా ప్రత్యేకంగా చేయదలచినాడు శాలి హోత్రుడు.
సంవత్సరమంతా తీవ్ర తపస్సు చేసి ఒక్క రోజునే భోజనం చేసి తిరిగి తపస్సును కొనసాగించాలని నిర్ణయించుకొన్నారు.
అనుకున్న ప్రకారం మొదటి సంవత్సరం గడిచి పోయినది.
ధాన్యం సేకరించి వండి దానిని నాలుగు భాగాలుగా విభజించారట. ఒకటి అతిధికి, రెండవది జలచరాలకు, మూడోది పశుపక్ష్యాదులకు నాలుగోది తనకు అని అనుకోని, అతిధి కోసం నిరీక్షించగా ఒక వృద్ద బ్రాహ్మణుడు వచ్చాడట. పెట్టుకొన్న భాగాన్ని ఆయనకిచ్చాడట.
బ్రాహ్మణుడు దానిని ఆరగించి ఆకలి తీరలేదు అనగా మిగిలిన మూడు భాగాలను కూడా సమర్పించగా స్వీకరించి, ఆశీర్వదించి ఎలా వచ్చిన వాడు అలానే వెళ్ళిపోయాడట.
అతిధి భగవంతునితో సమానం అతన్ని సంతృప్తి పరచ గలిగానని సంతృప్తి చెంది తిరిగి తన తపస్సును కొనసాగించాడట శాలి హోత్రుడు.
రెండో సంవత్సరం, మూడో సంవత్సరం కూడా మొదటి సారి జరిగినట్లే జరిగిందిట.
మూడో సారి ఆహారాన్ని తీసుకొన్న తరువాత "అలసిపోయానని విశ్రాంతి తీసుకోడానికి స్థలం ఏది ?" ( నాన్ వశిప్పాతారిక్కు ఉరియ ఉళ్ ఎవుల్ ?) అని అడిగారట.
దానికి సమాధానంగా మహర్షి తన కుటీరాన్ని చూపారట. చాలా సమయం గడిచిపోయిందట. వృద్ధుడు వెలుపలికి రాలేదట. ఆశ్చర్యానికి లోనైన శాలిహోత్రుడు ద్వారం దగ్గరికి వెళ్లి కొద్దిగా తెరిచి లోపలి చూశారట. 
లోపల ఆదిశేషుని మీద శయనించిన సర్వలోక రక్షకుడైన శ్రీ మన్నారాయణుడు  దర్శనమిచ్చారట. మహర్షి ఆనందానికి అంతు లేకుండా పోయిందట. స్వామిని ఎన్నో విధాలుగా ప్రస్తుతించి ఇక్కడే కొలువు తీరమని ప్రార్దించగా అంగీకరించారట.
వృద్ధుని రూపంలో అడిగిన ప్రశ్న లోని "ఎవుల్" అన్న దానికి గౌరవ సూచికమైన "తిరు" కలిపి "తిరువళ్ళూరు" (తిరు+ఎవుల్+ఊరు) పిలవబడసాగిందని అంటారు. 
ఎన్నో గాధలు ఈ క్షేత్ర మహత్యాన్ని, గొప్పదనాన్ని తెలిపేవి స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి.
ప్రస్తుత ఆలయాన్ని పల్లవ రాజులు నిర్మించారు.
తరువాత చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు తమ వంతు సహకారం ఆలయాభివృద్దికి అందించారు అని లభించిన శాసనాల ద్వారా వెల్లడి అయ్యింది. 
తమిళనాడులో విశేష భక్తాదరణ ఉన్న ఆలయాలలో తొలి వరుసలో నిలిచే వాటిల్లో తిరువళ్లూరు శ్రీ వీర రాఘవ స్వామి ఆలయం ఒకటి.  
నగర మధ్యలో సువిశాల ప్రాంగణంలో ఎన్నో ఉప ఆలయాలతో, ప్రతి నిత్యం విచ్చేసే వేలాది  భక్తులతో నిత్యం కళకళ లాడుతూ ఉంటుందీ ఆలయం.
పూజా సామాగ్రి అమ్మే దుకాణాల మధ్యనుండి వెళితే వస్తుంది మూడు అంతస్తుల రాజ గోపురం.



ప్రవేశ ద్వారం గుండా ప్రాంగణం లోనికి వెళితే ఎన్నో మండపాలు, గోపురానికున్న ఉప ఆలయాలు ఉంటాయి. 
ప్రదక్షిణా పధంలో మొట్ట మొదట వచ్చేది అమ్మవారు శ్రీ కమల వల్లి తాయారు సన్నిధి. తరువాత వరుసగా సూక్ష్మ చెక్కడాలతో సుందరంగా ఉండే ఊంజల్ మండపం, శ్రీ రామ, రుక్మిణీ సత్య భామ సమేత శ్రీ కృష్ణ, శ్రీ వేదాంత దేశిక, శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యుల సన్నిదులుంటాయి. 













విష్ణు సహస్ర నామంలో "భీషజం భిషక్ " అన్న నామానికి శరిరాన్నిశుద్దిచేసి అన్ని అనారోగ్యాలను నివారించి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించేవాడు అని అర్ధం. ఈ నామం కారణంగానో మరో కారణం చేతనో శ్రీ వీర రాఘవ స్వామిని శతాబ్దాలుగా వైద్య వీర రాఘవునిగా భావిస్తారు భక్తులు. నమ్మి శరణు కోరిన వారిని కాపాడే వాడు వీర రాఘవుడు అన్న నమ్మకంతో ప్రతి నిత్యం ఎందరో వస్తుంటారు.  
తమ ఆరోగ్యం కొరకు ఉప్పు మిరియాలను  స్వామి పాదాలున్న మండపంలో భక్తిప్రపత్తులతో సంపూర్ణ విశ్వాసంతో వదిలి పుష్కరణిలో స్నానం చేసి స్వామిని దర్శించుకొంటారు. 








ప్రదక్షిణ పూర్తి చేసుకొని ముఖ మండపం గుండా అర్ధ మండపం చేరితే గర్భాలయంలో ఆది శేషువు పడగల ఛాయలో దక్షిణం వైపుకు తల, ఉత్తరం వైపు పాదాలు ఉంచి శిరస్సు వద్ద ఉన్న శాలి హోత్ర మహర్షిని ఆశీర్వదిస్తున్నట్లుగా, ఎడమ చేతితో నాభి నుండి ఉద్భవించిన కమలంలో ఆశీనులైన బ్రహ్మకు ఉపదేశం చేస్తున్నట్లుగా దివ్య మంగళంగా రమ్యమైన అలంకరణతో దర్శనమిస్తారు శ్రీ వీర రాఘవ స్వామి. 
గర్భాలయం వెనుక శ్రీ నారసింహ మరియు శ్రీ చక్రత్తి ఆళ్వార్ సన్నిధులు ఉండటం విశేషం. 
తిరుమలై చై ఆళ్వార్ మరియు తిరు మంగై ఆళ్వార్ కలిసి శ్రీ వీర రాఘవ స్వామిని కీర్తిస్తూ పన్నెండు పాశురాలను గానం చేసారు. 
అన్ని పర్వదినాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది ఇక్కడ.  ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజులలో దూర ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు శ్రీ వీర రాఘవ స్వామిని దర్శించుకోడానికి వస్తుంటారు. విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతి మాసంలో మూడురోజుల పాటు ప్రత్యేక పూజలు జరుపుతారు. 
ప్రతి నిత్యం నాలుగు పూజలు శ్రీ వీర రాఘవ స్వామికి జరిపిస్తారు. చైత్ర మాసంలో పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఉత్సవమూర్తులను వివిధ వాహనాల మీద ఉపస్థితులను చేసి రమణీయంగా అలంకరించి నగర వీధులలో ఊరేగిస్తారు. తమిళనాడు నుండే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ మరియు ఆంధ్ర నుండి కూడా లక్షలాదిగా భక్తులు తిరువళ్లూరు తరలి వస్తారు. 
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి తొమ్మిదు గంటల వరకు భక్తుల కొరకు తెరిచి ఉండే ఈ ఆలయం శ్రీ అహోబిల మఠం ఆధ్వర్యంలో ఉన్నది. 
ఈ దివ్య దేశం చెన్నై అరక్కోణం రైలు మార్గంలో ఉన్నది. అన్ని లోకల్ రైళ్ళు, కొన్ని దూర ప్రాంత రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. స్టేషన్ నుండి ఆలయం మూడు కిలో మీటర్ల దూరం. 
ప్రస్తుతం జిల్లా కేంద్రం అయిన ఇక్కడ అన్ని వసతులు లభిస్తాయి. 
జై శ్రీ మన్నారాయణ !!!









1 కామెంట్‌:

  1. మా కులదైవం వీరరాఘవ స్వామి. ఈ మధ్య వెళ్ళినపుడు కోనేరు అంత శుభ్రంగా లేదు. ఈ ఫోటోలు ఎప్పుడు తీసినవి?

    రిప్లయితొలగించండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...