శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం,
గుంటూరు అనగానే అందరికి గుర్తుకొచ్చేవి మిరపకాయలు మరియు పొగాకు. ఈ జిల్లలో ఎన్నో పంటలు పండుతున్నాకూడా ఈ రెండే ప్రసిద్ది. అదే విధంగా ఆలయాలు అనగానే అందరి మదిలో మెదలేవి అమరావతి మరియు కోటప్ప కొండ.
కానీ ఒకప్పుడు విద్యకు పేరొందిన గుంటూరు పట్టణంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి.
అలాంటి వాటిల్లో పాత గుంటూరులో ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం ఒకటి. కృతయుగంలో సప్త మహర్షులలో ఒకరైన శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్టించారని స్థల పురాణం తెలుపుతోంది.
దక్షిణ భారత దేశంలోని ఎన్నో పరమేశ్వరుని ఆలయాలలోని ప్రధాన లింగాలు ఈ మహాముని ప్రతిష్టే !కైలాస వాసుని కల్యాణం కళ్ళార చూద్దామని ప్రజలందరూ ఉత్తర భాగానికి తరలి వెళ్ళడంతో భూ భారం పెరిగి క్రుంగిపోసాగిందట. అదే సమయంలో తాను మేరు పర్వతం కన్నా గొప్పవాడిని అనిపించుకోవాలని విపరీతంగా వింధ్య పర్వతం పెరిగి పోవడంతో ఉత్తర దక్షిణ ప్రాంతాలకు రాక పోకలలో, సూర్య చంద్ర గమనానికి అంతరాయం కలగసాగిందట. అప్పుడు మహేశ్వరుడు అగస్త్యుని పిలిచి శిష్య ప్రశిష్యులతో కలిసి దక్షిణ భాగానికి వెళ్ళమని ఆదేశించారట. తనకు శివ కళ్యాణ వీక్షణా భాగ్యం లేదా అని భాద పడిన ఋషికి అతనెక్కడ ఉన్నా అక్కడి నుండే తన వివాహ ఘట్టాన్ని కళ్ళారా చూడగలడు అనే వరాన్ని ప్రసాదించారట పన్నగ భూషణుడు.
అలా బయలుదేరిన అగస్త్యుడు వింధ్యను చేరగా పర్వతరాజు మహామునికి గౌరవ సూచనగా వంగి నమస్కరించారట. సంతసించిన ఆయన తాను తిరిగి వచ్చే వరకు అలానే ఉండమని ఆదేశించారట. అప్పటిదాకా "కుంభ సంభవుడు" అని పిలవబడే మహర్షి పర్వతాన్ని నేలకు తెచ్చిన వాడని అర్దం వచ్చే విధంగా "అగస్త్యుడు" అని పిలవ బడసాగాడు. తన పర్యటనలో వివిధ ప్రాంతాలలో నిత్య దైవతార్చన కొరకు అక్కడ లింగాన్ని స్థాపించుకొనే వారట. అవన్నీ నేడు ప్రముఖ శైవ క్షేత్రాలుగా పేరొందాయి. ఈ ఆలయము ఆ కోవలోనిదే!
గుంటూరు బస్సు స్టాండ్ వెనుక జండా చెట్టుకు దగ్గరలో ఉంటుంది ఈ ఆలయం. ఎలాంటి విరాట్ నిర్మాణాలు కనపడవు. నూతనంగా నిర్మించబడిన ప్రవేశ ద్వారం పైన శ్రీ పార్వతి సమేత పరమేశ్వరుని విగ్రహాలను చిన్న మండపంలో నిలిపారు.
విశాల ప్రాంగణం లోనికి ప్రవేశించగానే కుడివైపున శ్రీ కామాక్షి దేవి, శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఉపాలయం ఉంటుంది.
ఇక్కడి మండప స్తంభానికి "నాగ" లిపిలో లిఖించబడిన శాసనం కనపడుతుంది.
దీనిని పదో శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన "వేంగి చాళుక్య వంశానికి చెందిన అమ్మిరాజు" వేయించినట్లుగా చరిత్ర కారులు నిర్ధారించారు. తదనంతర కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వివిధ రాజ వంశాలు ఆలయాభివ్రద్దికి తమ వంతు కృషి చేసినట్లుగా తెలుస్తోంది.
ఎడమ వైపున శ్రీ అష్ట భుజ వీరబద్ర స్వామి ఉపాలయం ఇటీవల కాలంలో నిర్మించబడినది.
పక్కనే ఉన్న మరో పురాతన మండపంలో జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరుల మందిరం, నవగ్రహ మండపం ఉన్నాయి.
విశాల ప్రదక్షిణా ప్రాంగణంలో కళ్యాణ మండపం, జమ్మి చెట్టు, నాగ ప్రతిష్టలు, హరిహర సుత శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని చూడవచ్చును.
ప్రధాన అర్చా మూర్తులు కొలువు తీరిన గర్భాలయాల మీద సుందర చెక్కడాలు ఉంటాయి.
తూర్పు దిశగా ధ్వజస్తంభం, పురాతన నంది మండపం కలవు.మండపంలో చాలా చిన్న నందీశ్వరుడు ఉంటాడు.
పురాతన నిర్మాణాలైన నమస్కార మండపం, అర్ధ మండపం దాటిన తరువాత వుండే గర్భాలయంలో లింగ రాజు చందన కుంకుమ మరియు విభూతి లేపనాలతో అలంకరించబడి భక్తుల అర్చనలు, పూజలు, అభిషేకాలు స్వీకరిస్తుంటారు. దక్షిణ దిశగా ఉన్న మరో సన్నిధిలో అమ్మవారు శ్రీ పార్వతి దేవి చక్కని అలంకరణతో ప్రసన్న వదనంతో కొలువై వుంటారు.
ప్రతి నిత్యం ఎన్నో రకాల అభిషేకాలు, పూజలు స్వామి వార్లకు జరుపుతారు. సోమవారాలు, మాస శివరాత్రి, అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో భక్తులు ప్రత్యేక అభిషేకాలలో, పూజలలో పాల్గొంటారు. కార్తిక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువ. శివరాత్రి, నవ రాత్రులు, గణేశ చతుర్ధి విశేషంగా నిర్వహిస్తారు. కార్తీక, ధనుర్మాసాలలోశబరీ కొండకు వెళ్ళే దీక్షా స్వాములు అయ్యప్ప భజనలు ప్రతి రోజు జరుపుకొంటారు.
ఎంతో పౌరాణిక మరెంతో చారిత్రాత్మక విశేషాలకు నేటికి నిలిచివున్న సాక్ష్యంగా పాత గుంటూరు శివాలయాన్ని పేర్కొనవచ్చును.గుంటూరు పట్టణంలో మరెన్నో పురాతన విశేష ఆలయాలు ఉన్నాయి. శ్రీ గౌతమ మహర్షి ప్రతిష్టించిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం సమీపంలోనే ఉంటుంది.
నమః శివాయ !!!
గుంటూరియన్ నైన నేను ప్రస్తుతం ఆ నగరానికి దూరంగా ఎక్కడో ఉంటున్నాను. ఈ టపా వ్రాసినందుకు కృతజ్ఞతలు. నా స్వస్థలం గురించి భవిష్యత్తులో మరికొన్నివిశేషాల్ని పరిచయం చేస్తారని భావిస్తాను.
రిప్లయితొలగించండి