17, ఏప్రిల్ 2014, గురువారం

Tiruvallur Temples

                   శ్రీ తీర్దేశ్వేర స్వామి ఆలయం - తిరువళ్ళూరు 

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై ( మద్రాస్ )కి సమీపంలో నెలకొన్న అనేక పుణ్య క్షేత్రాలలో ఒకటి తిరువళ్లూర్. 
ఈ పేరు వినగానే అందరి మదిలో మెదలేది శ్రీ వీర రాఘవ స్వామి దివ్య మంగళ రూపం. 
కాని ఇక్కడ అంతే ప్రాధాన్యత కలిగిన శివాలయం కూడా ఉన్నది. 
పురాణ కాలం నుండి ఇక్కడ సదాశివుడు పూజలందుకొంటున్నారని, ఈ లింగం వీరభద్రుని ప్రతిష్ట అని అంటారు. 
ప్రజా పతులలో ఒకరైన దక్షుడు, మహేశ్వరుని పిలవకుండా యాగం చేయడం, దానికి పిలవకుండానే సతీ దేవి రావడం, తండ్రి చేసిన అవమానానికి తట్టుకోలేక ఆమె యజ్ఞ గుండంలో పడటం అందరికి తెలిసినవే !
సతీ దేవి మరణంతో ఆగ్రహించిన త్రినేత్రుడు తన జటాజూటం నుండి వీరభద్రుని సృష్టించారు. 
అతను గణాలతో వెళ్లి దక్షుని యాగాన్ని భగ్నం చేసి అడ్డువచ్చిన అతనిని సంహరించారు. 
తరువాత సర్వేశ్వరుని అనుగ్రహంతో అతును బ్రతకడం వేరే సంగతి. 
కానీ బ్రాహ్మణుడైన దక్షుని చంపడం వలన వీరభద్రునికి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకొన్నది. 
గంగాధరుని సలహా మేరకు భూలోకం లోని తిరువళ్లూర్ లో ఉన్న "హృదయ తాప నాశని" పుష్కరణి లో నియమంగా స్నానం చేస్తూ, నిత్య పూజ నిమిత్తం ఒక శివ లింగాన్ని ప్రతిష్టించి ప్రతి నిత్యం స్వామిని, పక్కనే కొలువు తీరిన శ్రీ వీర రాఘవ స్వామిని సేవించుతూ కొద్ది కాలం లోనే బ్రహ్మ హత్యా పాతకం నుండి విముక్తుడైనాడు.   
నాడు అలా వీరభద్రుడు ప్రతిష్టించిన లింగాన్ని పవిత్ర పుష్కరణి తీరాన ఉన్నందున "శ్రీ తీర్తేశ్వర స్వామి"గా పిలవబడుతున్నారు. 
తదనంతర కాలంలో ఎన్నో రాజ వంశాలు తమ వంతు సహాయ సహకారాలు అందించడం వలన ఆలయం నేటి రూపుని సంతరించుకొని మనకు కనపడుతోంది.
శ్రీ వీర రాఘవ స్వామి ఆలయానికి దక్షిణాన పుష్కరణి ఒడ్డున కొద్దిగా లోపలికి ఉంటుందీ ఆలయం.
ప్రాంగణం లోనికి తూర్పున ఉన్న చిన్న గోపురానికి ఉన్న ద్వారం గుండా ప్రవేశిస్తే లోపల చాలా ఆలయాలు ఉన్నాయి.








ఎదురుగా అమ్మవారి ఆలయం పక్కనే శ్రీ వల్లీ దేవసేన సామెత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటాయి. 
ఉత్తర భాగాన నూతనంగా నిర్మించిన హరిహర సుత శ్రీ ధర్మశాస్త ఆలయం కలదు. 
దానికి ఎదురుగా నవగ్రహ మండపం, వాహన గృహం ఉంటాయి. 







ప్రాంగణ దక్షిణ భాగాన ప్రధాన అర్చనా మూర్తి శ్రీ తీర్దేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. 
గర్భాలయ వెలుపల శ్రీ దక్షిణా మూర్తి, శ్రీ బ్రహ్మ దేవుడు, శ్రీ మహా విష్ణువు, శ్రీ దుర్గ మరియు శ్రీ చండికేశ్వర విగ్రహాలను ఉంచారు. 
పురాతన ఆలయ విమానానికి మరమత్తులు జరుగుతున్నాయి. 
ఆలయ వెనక భాగాన ఉన్న పెద్ద పొగడ చెట్టు క్రింద ఎన్నో నాగ ప్రతిష్టలు కనపడతాయి. 








మహా శివరాత్రి, కార్తీక మాస పూజలు, పక్షానికి ఒకసారి వచ్చే త్రయోదశి నాడు ప్రదోష పూజలు విశేషంగా నిర్వహిస్తారు. 
శ్రీ తీర్దేశ్వర స్వామిని నియమంగా కొలిస్తే అన్ని గ్రహ సంబంధిత చెడు ప్రభావాలు తొలగి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకొంటాయి అని, ప్రస్తుత గత జన్మ పాపాలు నశించుతాయి అన్నది భక్తుల తరతరాల విశ్వాసం. 
తిరువళ్లూర్ లో దర్శించ వలసిన ఆలయాలలో ఇది ఒకటి.    
నమః శివాయ !!!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...