ఒక అందమైన సాయంత్రం కోలికోడ్ సముద్ర తీరాన
హిందూ మహా సముద్రం లేదా బంగాళా ఖాతం సముద్ర తీరాల కన్నా అరేబియా సముద్ర తీరాలు బాగుంటాయన్నది గోవా, గుజరాత్, కర్నాటక (ఉత్తర ప్రాంతం ), కేరళలోని తిరువనంతపురం, చేరాయి చూసిన తరువాత నాకు ఏర్పడిన అబిప్రాయం.
ఉద్యోగరీత్యా పని పడి కోలి కోడ్ (కాలికట్) వెళ్ళవలసి వచ్చినది.సాయంత్రం మూడు గంటల కల్లా పని పూర్తి అయ్యింది.
హోటల్ కి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బీచ్ కి ఆటోలో చేరుకొన్నాము.
నగరంలోనే ఉన్న సాగర తీరాన ఎన్నో హోటల్లు, కార్యాలయాలు, గృహాలు ఉన్నాయి.
వాహనాల రాక పోకలతో ఎంతో రద్దీగా ఉన్నది ఇక్కడి రహదారి.
అయినా ఎక్కడా ఇతరులకు అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ పద్దతిగా ఉన్న తీరు మెచ్చుకోదగినది.
అన్నీ క్రమ పద్దతిలో సాగుతున్నాయి.
అల్లరి మూకలు, తాగుబోతులు లేకపోవడం మరో మంచి విషయం.
విద్యాలయాలకు శెలవలు కావడంతో తీరం అంతా పిల్లలతో వచ్చిన పెద్దలతో, స్నేహితులతో కలిసి వచ్చిన యువతీ యువకులతో సందడి వాతావరణం నెలకొనివున్నది.
అలలతో ఆటలాడుకొంటున్న చిన్నలు ఒడ్డున కూర్చొని ప్రశాంత వాతావరణాన్ని చల్లగాలిని అనుభవిస్తూ పెద్దలు అంతా విశ్రాంతిగా ఎలాంటి హడావుడి లేకుండా కనపడుతున్నారు.
పిల్లలకు కావలసిన అనేక ఆట వస్తువులను అమ్మే వారు ఇసక లో తిరుగుతూ ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.
ఎత్తుగా పెరిగిన చెట్లు పరిసరాలకు కావాల్సిన అదనపు అందాన్ని అద్దుతున్నాయి.
పరిసరాలు శుభ్రంగా ఉండటం మెచ్చుకోతగ్గ అంశం.
మరో విశేషమేమిటంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త వెయ్యడం గాని, సిగిరెట్లు కాలుస్తూ వాతావరణాన్ని కలుషితం చేసేవారు మచ్చుకైన కనపడక పోవడం.
సిగిరెట్లు, గుట్కా పొట్లాలను దొంగచాటుగా అమ్మేవారు దాపులలో కనపడలేదు.
సరదాగా రెండు చోట్ల సిగిరెట్ కావాలని అడిగితే "కాలిస్తే పోలీసులు స్టేషన్ కు తీసుకుపోతారు అమ్మము సార్ అన్నారు.
ఆటల మధ్యలో సేదతీరడానికి అందుబాటులో ఉన్న తినుబండారాల బండ్ల వైపుకు చేరుకొంటున్నారు.
ఆల్చిప్పలతో చేసిన ఒక బజ్జీ లాంటి ఒక పదార్దం. మోజుగా తింటున్నారు.
మరునాడు మార్కెట్లో బతికి ఉన్న ఆల్చిప్పలను అమ్మడం కనిపించినది.
కోలి కోడ్ ప్రత్యేకం అనిపించినది.
నన్ను బాగా ఆకట్టుకోన్నవి రకరకాల గాలిపటాలు.
ప్రతి బీచ్ లో కనిపించే ఈ దృశ్యం ఇక్కడా తప్పలేదు.
నగరం లోని మురుగు నీటిని సముద్రం లోనికి తరలించడం నన్ను ఎప్పుడూ కలవరపెట్టే విషయం.
కోలి కోడ్ బీచ్ లో తెలియకుండానే ఒక అరుదైన అవకాశం నాకు లభించినది.
దూరంగా మెట్ల మీద కూర్చున్న నా దృష్టిని ఆకర్షించాడో సాధారణం గా కనిపించే వ్యక్తి ఒకరు. ఎందుకో దగ్గరకి వెళ్లి ఏం చేస్తున్నాడో చూడలనిపించినది.
చేతిలో ఉన్న పెన్సిల్ తో తెల్ల కాగితం మీద అతను సృష్టించిన అద్భుతం ఇదే.
ఎన్నో అడగాలని ఉన్నా మలయాళం తప్ప మరో భాష రాని ఆ కళాకారుని ఒక కరచాలనంతో "వెరీ గుడ్ !" ఆంగ్ల పదంతో అభినందించాను.
అదే కొంత సంతృప్తిని కలిగించినది.
సముద్రం పక్కనే ఆసుపత్రి.
చేపల వేటలో జీవనం సాగించే వారి సంఖ్య అధికంగా ఉండే కేరళలో ఇది అభినందించదగిన విషయంగా చెప్పుకోవాలి.
ఉదయ భానుడు తన రోజు వారీ కార్యక్రమం పూర్తి చేసుకొని పడమర గృహానికి చేరుకోడానికి సిద్దపడుతున్న దృశ్యాలను కెమెరాలో బంధించు కొని హోటల్ కు ఇరుగు ముఖం పట్టాము.
ఒక అందమైన సాయంత్రం గడప గలిగానన్న తృప్తి కలిగింది ఆటో ఎక్కుతుండగా !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి