9, ఏప్రిల్ 2014, బుధవారం

Akkanna and Madanna Caves, Vijayawada

                                      అక్కన్న మాదన్న గుహలు 


అమ్మల గన్న అమ్మ శ్రీ కనక దుర్గమ్మ కొలువైన విజయ వాటిక విజయవాడ. 
 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నడి  బొడ్డు. 
భారత దేశ ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలను కలిపే వారధి. 
పవిత్ర జీవ నది కృష్ణా తీరంలో ఉన్న ప్రముఖ వ్యాపార కేంద్రం. 
విద్యలకు ప్రసిద్ది. 
ఎన్నో ప్రత్యేకతల సమాహారం విజయవాడ. 
నగరంతో పాటు చుట్టుపక్కల ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయి. 
అమ్మవారు వెలసిన ఇంద్ర కీలాద్రి, మహాత్మా గాంధీ కొండ, విక్టోరియా మ్యూజియం, గుణదల మేరిమాత ఇలా ఎన్నో ఆకర్షణల కూడలి  విజయవాడ. 
అంతగా వెలుగులోనికి రాని కొన్ని విశేష స్థలాలలో ఇక్కడి గుహాలయాలు. 
ఇంద్ర కీలాద్రి పాదాల వద్ద ఉంటాయి అక్కన్న మాదన్న గుహలు. 
 




ప్రస్తుతం పురావస్తు శాఖ వారి అధ్వర్యంలో ఉన్న ఈ గుహల గురించిన పూర్తి వివరాలు చాలా వరకు అందుబాటులో లేవని చెప్పవచ్చును. 

వాస్తవానికి యివి అయిదు ఆరు శతాబ్దాల కాలంలో అంటే విష్ణు కుండినుల పరిపాలనలో మలచినట్లుగా చరిత్రకారులు నిర్ణయించారు. 
నగరంలో ఉన్న మొఘల్ రాజ పురం గుహలు, కృష్ణా నదికి ఆ పక్క ఉన్న ఉండవల్లి గుహలు కూడా వారి కాలం లోనే నిర్మించినట్లుగా తెలుస్తోంది. 
విష్ణు కుండినులు స్వతహాగా శివారాధకులు. 
కొంత కాలం బౌద్ధం ఆచరించారని చరిత్ర కారుల అభిప్రాయము. 
ఆ కారణంగా ఈ గుహలు తొలుత బౌద్ద బిక్షువుల ఆరామ కేంద్రాలుగా ఉండి తరువాత హిందూ గుహాలయాలుగా మారి ఉండవచ్చును అని అంటారు. 
అయిదో శతాబ్దంలో చెక్కిన గుహలకు పదిహేడో శతాబ్దానికి చెందిన గోల్కొండ నవాబు తానీషా దగ్గర పనిచేసిన అన్నదమ్ములైన అక్కన్న మాదన్న పేర్లు రావడానికి కారణం వారు ఈ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ విడిది చేయడం వలన వారి పేరుతొ పిలవడం ప్రారంభమై ఉండవచ్చును అని కూడా అంటుంటారు. 



 దగ్గరలో ఇసుక రాతిలో చెక్కిన మరో పురాతన గుహలను త్రిమూర్తి గుహలంటారు.
ఇక్కడ ఉన్న రెండు రాతి గదులలోని  ఒక దానిలోనే సదా శివుడు లింగ రూపంలో కనపడతాడు.
మరొకటి ఖాళీగా ఉంటుంది.
ద్వారపాలక విగ్రహాలు, విఘ్న నాయకుని రూపం గోడల పైన చెక్కబడ్డాయి.


పక్కనే ఉన్న నల్లరాతి మండపం సుందర సూక్ష్మ చెక్కడాలతో బాటు తెలుగు శాసనం తో ఆకర్షిస్తుంది.  







మధ్యలో ఉన్న శాసన స్తంభము మహేశ్వరుని వివిధ రూపాలలో చూపుతుంది. 
హనుమంతుని ఆశీర్వదిస్తున్న సీతా రాములను కూడా ఈ స్థంభం పైన చూడవచ్చును. 






చాలా సంవత్సరాల క్రిందట కొంతకాలం ఇక్కడ లైట్ అండ్ మ్యూజిక్ షో ఏర్పాటు చెయ్యడం జరిగింది. 
గుహల గురించిన పూర్తి సమాచారం కూడా అందుబాటలో లేక పోవడం భాధాకరం.  
ప్రస్తుతం ఎలాంటి యాత్రికులను ఆకర్షించే ప్రయత్నాలు జరగడం లేదు. 
చరిత్రలో ఎంతో విశిష్ట స్థానం సంపాదించుకొన్న అక్కన్న మాదన్న గుహలను శ్రీ కనక దుర్గ ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు సందర్శించేలా అభివృద్ధి జరగాలి.  











1 కామెంట్‌:

  1. మంచి ఆర్టికల్. నిజానికి నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఈ గుహల ఎదురుగానే వుంటుంది. చాలా బాగుంటాయి. కాని గుహల గురుంచి ఎక్కువ వివరాలు తెలియవు.

    రిప్లయితొలగించండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...