2, ఏప్రిల్ 2014, బుధవారం

NALAYIRA DIVYA PRABANDHAM

                                    నలయిర దివ్య ప్రబంధం 

ఈ సువిశాల ప్రపంచంలో తొలిగా నాగరికత వెల్లివిరిసిన ప్రదేశంగా భారత దేశం గుర్తింపబడినది. 
భారత దేశం అంటే ఆధ్యాత్మికకు తొలి చిరునామాగా, దైవం నడయాడిన దివ్య భూమిగా, కర్మ భూమిగా కీర్తించబడినది. 
ఈ కారణంగా భారతీయులకు దైవ భక్తి మెండు. 
వారసత్వంగా లభించిన పురాణాలలోని దైవ రూపాలలో తమ హృదయాంతరాలలో తెలియని ఒక ఆరాధనానుభూతిని రేకెత్తించిన రూపాన్ని తమ ఆరాధ్య దైవంగా భావించి కొలవసాగారు. 
ఆ రూపాలకు ఆలయాలు నిర్మించారు. 
తమవైన పూజా విధానాలను నిర్ణయించుకొన్నారు. 
ఇలా మొదలైన ఆరాధనా విధానాలలో ముఖ్యమైనవి మూడు. 
శైవం, శ్రీ వైష్ణవం మరియు శాక్తేయం. 
త్రిమూర్తులలో లయకారకుడైన కైలాస వాసుని పూజించేవారు శైవులు. 
స్థితి కారకుడైన వైకుంఠ వాసుని సేవించేవారు శ్రీ వైష్ణవులు. 
స్త్రీ మూర్తి సకలసృష్టికి మూలం అయిన శక్తి ని ఆరాధించే వారు శాక్తేయులు. 
తాము కొలిచే మూర్తి దగ్గరనుండి అన్ని విషయాలలో ఎన్నో అంశాలలో సామ్యం లేకపోయినా, ఆ విషయాల గురించి ఎన్నో విబేధాలు తలెత్తినా అవి తర తరాలుగా కొనసాగుతున్నాయి. 
ఈ విబేధాలు మరింత ఎక్కువగా ఉన్నది శైవులకు మరియు వైష్ణవులకు. 
చరిత్రలో ఎన్నో ఉదంతాలు దీనికి సాక్ష్యంగా ఉన్నాయి. 
చిత్రమైన విషయం ఏమిటంటే ఈ రెండు సాంప్రదాయాలు తమ అగ్రత్వాన్ని నిలబెట్టుకోడానికి పాలకులను విపరీతంగా ప్రభావితం చేసేవి. 
కాల క్రమంలో వివిధ ఆరాధనా సాంప్రదాయాలు భారత దేశం లో తలెత్తాయి. 
అవే జైన మరియు బౌద్ద మతాలు. 
నాటి రాజులు వాటిని సంపూర్ణంగా ఆదరించారని చరిత్ర చెబుతున్న సత్యం. 
రాజాదరణ కొరవడటంతో శైవ వైష్ణవ సాంప్రదాయాల స్థితి సామాన్య ప్రజల అనుసరణ మీద ఆధారపడి నివురుగప్పిన నిప్పులా ఉండిపొయినది. 
ప్రజలు తాము నమ్మిన సాంప్రదాయాన్ని పాటిస్తూ విభేదాలకు దూరంగా సామరస్యంగా జీవనం సాగించేవారు. 
కానీ తమవైన సాంప్రదాయాలను తిరిగి ప్రాభవం లోనికి తేవడానికి  ఎందరో తమ వంతు కృషి చేసారు. 
ఇది ఒక ప్రణాళికతో లేదా ఇతర మతాల మీద వైషమ్యం తో కాకుండా తాము నమ్మిన దైవం మీద పరిపూర్ణ విశ్వాసం, అచంచల భక్తితో చేసినది కావడం ప్రత్యేకంగా చెప్పాలి. 
దీనినే "భక్తి సాహిత్యోద్యమం" అన్నారు. 
ఈ ప్రక్రియకు కేంద్ర స్థానం నేటి తమిళ నాడు. 
తమ ఆరాధ్య దైవం గురించి ప్రస్తుతించడానికి వారెన్నుకొన్న మార్గం కీర్తనలు. 
క్రీస్తు శకం అయిదు నుండి ఎనిమిది శతాబ్దాలలో అపరిమిత ఆదరణ పొందిన ఈ భక్తి సాహిత్యోద్యమంలో శైవులు మరియు వైష్ణవులు ఉన్నారు. 
పైన చెప్పినట్లుగా ఇది ముందుగా ప్రణాళిక రచించుకొని చేసినది కాదు. 
ఎక్కడైతే హృదయంతరాలలో భక్తి పొంగి నోటినుండి ఆశువుగా అక్కడి దైవాన్ని కీర్తించుతూ గానం చేసారో వాటినే ప్రమాణంగా స్వీకరించారు. 
కాక పొతే దీనిలో కూడా శైవుల వైష్ణవుల మధ్య కొంత వ్యతాసం ఉన్నది. 
ఎక్కడ శివాలయంలో అక్కడి సదాశివుని కీర్తిస్తూ గానం చేసారో వారిని "నయన్మారులు" అని ఎక్కడ వైష్ణవ ఆలయంలో శ్రీ హరిని ప్రస్తుతిస్తూ కీర్తనలు గానం చేసిన వారిని "ఆళ్వార్" అన్నారు.   
రెండు పాదాలకు అర్ధం ఒకటే "నిరంతరం భగవద్సేవలో ఉండేవారు"
మొత్తం అరవై మూడు మంది నయన్మారులు కలిసి ఆరువేల కీర్తనలను గానం చేసారు. 
ఒక కీర్తనను "తేవరం" అని, పది తేవరాలను "పాటికం" అని, ఒక పాటికం లో ఉన్న క్షేత్రాన్ని "పడాల్ పెట్ర స్థలం" అని 
ఒకటి రెండు తేవరాలలో ఉన్న క్షేత్రాన్ని "తేవర్ వైప్పు స్తలం " గా నిర్ణయించారు. 
దీని ప్రకారం మొత్తం రెండువందల డెభై అయిదు పడాల్ పెట్ర స్థలాలు ఉన్నాయి. 
వీటిల్లో చాలా భాగం తమిళ నాడులో, మిగిలినవి కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ( శ్రీ శైలం, శ్రీ కాళహస్తి), ఉత్తర భారతంతో పాటు పక్క దేశాలైన నేపాల్ మరియు శ్రీ లంక లలో ఉన్నాయి. 
పడాల్  పెట్ర స్థలాలలో మొదటి స్థానం పెరియ కోవెల గా పిలిచే " చిదంబరం"ది కాగా చివరది సదాశివుని నివాసమైన "కైలాస పర్వతం". 
తమిళ నాడులోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలూ ఈ జాబితాలో ఉన్నాయి
రెండువందల నలభై తొమ్మిది ఆలయాలను "తేవర్ వైప్పు స్థల"లుగా నిర్ణయించారు. 
ఇవన్ని తమిళ నాడు లోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. 
నయన్మారులలొ "సంభందార్, అప్పార్ మరియు సుందరార్" ముఖ్యులు. 
ఇక వైష్ణవం విషయానికొచ్చేసరికి మొత్తం పన్నెండు మంది ఆళ్వార్ లు కలిసి నాలుగు వేల కీర్తనలను గానం చేసారు. 
వీరు గానం చేసిన కీర్తనను "పాశురం" అంటారు. ఈ పాశురాలలో పేర్కొనబడ్డ క్షేత్రాలను "దివ్య దేశాలు" అన్నారు.
ఒక పాశురం లో పేర్కొనబడ్డా ఆ క్షేత్రాన్ని దివ్య దేశం అన్నారు.

మొత్తం నూట ఎనిమిది దివ్య దేశాలలో ప్రధమ స్థానం భూలోక వైకుంఠము గా పిలవబడే " శ్రీ రంగం"ది కాగా, చివరి రెండు శ్రీ మన్నారాయణుడు నివసించే పాల కడలి మరియు శ్రీ వైకుంఠము.



   
వీటిల్లో కూడా అధిక భాగం తమిళ నాడు లో ఉండగా, పద కొండు కేరళలో, గుజరాత్ (ద్వారక), ఆంధ్ర ప్రదేశ్ (తిరుమల, అహోబిలం ) ఉత్తర భారతం లోని నైమిశారణ్యం, కేదారనాథ్, ప్రయాగ, జోషిమట్  మొదలైన హిమాలయ ప్రాంతాలు వస్తాయి.
 అహోబిలం 

 కలియుగ వైకుంఠము తిరుమల 


నేపాల్ లో ఉన్న తిరు సాలగ్రామం కూడా ఈ జాబితాలలో స్థానం సంపాదించుకొన్నది. 
ఆళ్వార్ లలో ప్రముఖులు నమ్మాళ్వార్, పెరియాళ్వార్ మరియు ఆండాళ్. 
మరో ప్రస్తావించవలసిన విషయం ఏమిటంటే నయన్మారులలొ మరియు ఆళ్వార్ లలో నాటి సమాజంలోని అన్ని వర్ణాల వారు ఉండటం. 
నయన్మార్లు మరియు ఆళ్వార్ లు దరిదాపుగా ఒకే కాలానికి చెందిన వారిగా గుర్తింపబడినా సరియిన కాలనిర్ణయంలో మత గ్రంధాలకు చారిత్రిక పరిశోధనలకు ఎంతో వత్యాసం కనపడుతున్నది. 
మత గ్రంధాలు వీరంతా క్రీస్తు పూర్వం రెండు లేదా మూడు శతాబ్దాలకు చెందిన వారని అంటుంటే, లభించిన కొద్ది ఆధారాల ద్వారా చరిత్రకారులు వీరు క్రీస్తు శకం ఆరు నుండి తొమ్మిది శతాబ్దాలకు చెందిన వారని తేల్చారు. 
కాకపొతే వీరు తమ కీర్తనలలో ప్రస్తుతించిన క్షేత్రాలు మాత్రం ఎన్నో యుగాల పౌరాణిక గాధలను సొంతం చేసుకొన్నాయి. 
ఆయా ఆలయాల నిర్మాణం మాత్రం క్రీస్తు శకం ఏడు నుండి జరిగినట్లు శాసన ఆధారాలు నిర్ధారిస్తున్నాయి. 
దాదాపుగా అన్ని శైవ క్షేత్రాలలో నయన్మారులు, దివ్య దేశాలలో ఆళ్వార్ల సన్నిధులు ఉన్నాయి. 
ఆళ్వార్ లలో, నయన్మారులలొ ఉన్న ఒకే ఒక్క స్త్రీ "ఆండాళ్ " ( గోదా దేవి ). 
సాక్షాత్ భూదేవి అంశగా పేర్కొనే ఈమె ఉద్భవించి, నడయాడి, శ్రీ రంగనాధుని పరిణయ మాడిన దివ్య దేశం "శ్రీ విళ్లి పుత్తూరు" ఒక విశేష ఆలయం ఉన్నది. 
వీరి  కీర్తనల ద్వారా ఎన్నో మరుగున పడిన పురాతన ఆలయాలను రాజుల సహకారంతో తిరిగి భక్తులకు అందుబాటులోనికి తెచ్చినా తదనంతర కాలంలో మరుగున పడిపోయినాయి. 
విద్య అంతగా అందుబాటులోని ఆ కాలంలో ఒక తరం నుండి మరో తరానికి ఈ కీర్తనలు వారసత్వంగా కొనసాగినాయి. 
వాటిని కొందరు మహానుభావులు సేకరించి పన్నెండో శతాబ్దము లో గ్రంథస్థం చేసారు. 
పన్నెండు భాగాలుగా ఉండే "తిరుమూరై" లో అన్ని పాటికాలను పొందుపరిచారు. 
అదే విధంగా నాలుగు వేల పాశురాలను "నాద ముని " అనే మహనీయుడు స్వయంగా నమ్మాళ్వార్ ను ప్రసన్నం చేసుకొని "నలయర దివ్య ప్రభంధం"గా మనకందించారు.
ఒకో దేవి దేవతా రూపానికి ఒక్కో విధమైన ప్రత్యేక పూజా విధానం మన హిందూ గ్రంధాలలో ఏనాడో లిఖించబడినది. 
లింగ రాజు అభిషేకప్రియుడు. 
పన్నగ శయనుదు అలంకార ప్రియుడు.
దేవికి కుంకుమార్చన. 
ఇది అందరికీ తెలిసిన విషయమే !
భగవంతుని రూపం ఏదైనాసరే ఆ మూర్తి మీద  పరిపూర్ణ భక్తి విశ్వాసాలు కలిగి ఉండటం ఒక ఉత్తమ భక్తుని లక్షణం అని పెద్దలు శెలవిచ్చారు. 
కానీ శ్రీ మద్భాగవతం శ్రీ హరిని సేవించుకోడానికి మానవులకు నవవిధ భక్తి మార్గాలను తెలిపింది. 

" శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం - పాద సేవనం అర్చనం వందనం 
   దాస్యం సఖ్యమాత్మ నివేదనం  - ఇతి పుంసార్పితా విష్ణా భక్తిశ్చేన్నవలక్షణా !"
శ్రవణం, కీర్తనం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం ఈ తొమ్మిది మార్గాలలో పెరుమాళ్ కి అత్యంత ప్రీతికరమైనది "కీర్తనం ". 

ఈ విషయం తెలుసుకోన్నారేమో నారద, తుంబుర, తులసీ దాసు, మీరా బాయి, త్యాగయ్య, రామదాసు, అన్నమయ్య ఇలా ఎందరో తమ గానంతో స్వామిని కీర్తించి ఆయన కృపాకటాక్షాలను పొందారు. 
వీరందరికన్నా ముందు ఆళ్వార్ లు శ్రీ హరి దివ్య రూప మహిమలను కీర్తించే  మార్గం ఎంచుకొన్నారు.
వీరు గానం చేసిన పాశురాలను తమిళ వేదాలుగా అభివర్ణిస్తారు.
వంశ పారంపర్య సంపదగా ఒక తరం నుండి మరో తరానికి లభించుతూ వస్తున్న పాశురాలు కొన్ని తరాల తరువాత కొన్ని కుటుంబాలకు అదీ కొన్ని ప్రాంతాలకు పరిమితమైపోయాయి.
తొమ్మిదో శతాబ్దములో అప్పటికి ఆళ్వార్ లలో ఆఖరివారుగా పేర్కొనే "తిరుమంగై ఆళ్వార్" గతించి చాలా కాలమైనది.
వంశానుగతంగా వస్తున్న పాశురాలను ప్రతి నిత్యం ఆలయాలలో గానంచేయడం మినహా మిగిలిన విషయాలు గురించి ఏమి తెలియని స్థితి.
అలాంటి సంధి కాలంలో "నాద ముని" అనే విష్ణు భక్తుడు కుంభకోణం లోని శ్రీ చక్రపాణి ఆలయంలో కొందరు గానం చేస్తున్న నమ్మాళ్వార్ పాశురాలను విన్నారు.
అవి ఆయనకు అనిర్విచనమైన ఆధ్యాత్మికానందాన్ని కలిగించాయి.
వాటిల్లో ఆ పాడినవి వెయ్యి పాశురాలలో పది అని ఉండటంతో ఆయనలో ఆసక్తిని రేకెత్తించినది.
విచారించగా ఏ వివరాలు తెలియరాలేదు. నిరాశ కలిగించినా పట్టువదలక తీవ్రంగా తన అన్వేషణ కొనసాగించారు నాద ముని. లభించిన మరికొన్ని పాశురాలలో రాసినవారి పేరు "శటగోపన్" ( నమ్మాళ్వార్ పూర్వ నామం) అని, ఆళ్వార్ తిరునగరికి చెందినవారని ఉదహరించబడినది.
దాని ప్రకారం ఆయన ఆళ్వార్ తిరునగరి చేరుకొని తన విచారణ కొనసాగించారు.
ఆ క్రమంలో నమ్మాళ్వార్ శిష్యుడైన "మధుర కవి ఆళ్వార్ " రచించిన "కన్నిన్ సిరుతంబు" అన్న పేరుతొ ఉన్న పదకొండు పాశురాలు లభించాయి.
వాటిల్లో మధుర కవి ఏ పెరుమాళ్ ని కీర్తించలేదు. తన గురువు ప్రతిభను ప్రశంసించాడు.
నాదముని ఆ పాశురాలను తీసుకొని నమ్మాళ్వార్ ధ్యానంలో ఉన్న చింత చెట్టు క్రింద కూర్చొని తదేక దీక్షతో పన్నెండు వేల సార్లు జపించారు.
              నమ్మాళ్వార్ తపమాచరించిన చింతచెట్టు. దీని వయస్సు మూడు వేల సంవత్సరాలని అంటారు. 
 
ఆయన దీక్షకు సంతసించిన నమ్మాళ్వార్ దర్శనమిచ్చి తన పాశురాలే కాక మిగిలిన ఆళ్వార్లు గానంచేసిన వాటితో కలిపి మొత్తం నాలుగు వేల మంగళ శాసనాలను ప్రసాదించారు.
తనకు లబించిన అదృష్టానికి ఆనందపడిన నాదముని వాటిని పుస్తక రూపంలో భావి తరాలకు అందించారు.
అదే "నలయిర దివ్య ప్రభంధం".
ఇందులో నమ్మాళ్వార్ గానం చేసిన "తిరువాయ్ మొళి, పెరియ తిరువందాది" తమిళ వేదాలుగా పేరొందాయి.
ఆయన తరువాత ఆళ్వార్ లలో ఒకే ఒక్క స్త్రీ అయిన "ఆండాళ్" రచించిన "తిరుప్పావై " ఎంతో ప్రసిద్ది చెందినది.
వీటి గానం పురుషోత్తమునికి ప్రీతికరం. ఎంతగా అంటే ధనుర్మాసంలో తిరుమలలో శ్రీ వేంకటేశుని సుప్రభాతంతో కాకుండా తిరుప్పావై తో మేలుకొలుపు పలికేంతగా !!!
ఆండాళ్ కొలువుతీరిన ప్రధాన క్షేత్రం "శ్రీ విల్లి పుత్తూరు".





ఈ ఆలయ గోపురం తమిళ నాడు రాష్ట్ర అధికార చిహ్నం.
జై శ్రీమన్నారాయణ !!!!

     
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...