29, ఏప్రిల్ 2014, మంగళవారం

sholingnur Temples


             శ్రీ యోగనారసింహ ఆలయం, షోళింగనూర్ 


ఘటికా చలం, చోళ రాజ పురం, శోలింగనూర్, ఇలా ఎన్నో పేర్లున్న ఈ క్షేత్రం శ్రీ నారసింహుడు స్థిర నివాసమేర్పరచుకొన్న పర్వతం. 
అనేక క్షేత్రాలలో శ్రీ లక్ష్మి నారసింహ స్వామిగా కొలువైన సింహరూపుడు ఇక్కడ శ్రీ యోగ నారసింహునిగా దర్శనమిస్తారు. 
సృష్టాది నుండి భక్తులకు అందుబాటులో ఉన్న ఈ క్షేత్రం గురించిన పౌరాణిక గాధ వెలుగు లోనికి రాలేదు. 
స్వామి ఇక్కడ ప్రహ్లాదునికి, సప్త మహర్షులకు దర్శనమిచ్చి వారికి కైవల్యం ప్రసాదించారని అంటారు. 
ఈ దివ్య దామంలో ఒక ఘడియ కాలం గడిపితే మోక్షం సిద్దిస్తుందని, ఎందరో మహామునులు ఇక్కడ తపమాచారించినట్లుగా వ్యాప్తిలో ఉన్న గాధలు చెబుతున్నాయి.  
ఆ ఘడియ కాలం తోనే "ఘటికా చలం" అని పిలవడం ఆరంభమైనది. 
చోళ రాజు ఒక శివాలయాన్ని నిర్మించడం వలన చోళ రాజ పురం గా పిలవడం మొదలై కాల క్రమంలో శోలింగనూర్ గా మార్పు చెందినట్లుగా కూడా చెబుతారు. 
ఏది ఏమైనా శోలింగనూర్ నేడొక ప్రసిద్ద నారసింహ ఆంజనేయ క్షేత్రం. 
ఈ ప్రాంతంలో ఎన్నో పర్వతాలున్నాయి. 
యెంత దూరానికైన దృష్టిని ఆకర్షించేవి రెండే!
ఒకటి పెరియ మలై. రెండు చిన్న మలై. 
పెద్ద పర్వతం శ్రీ యోగ నారసింహ స్వామి నివాసం. 
చిన్నకొండ శ్రీ హనుమంతునిది. 



పెద్ద కొండ 

చిన్న కొండ 

రెండూ ఎదురెదురుగా ఉంటాయి
పెద్ద కొండ మీద శ్రీ నారసింహస్వామి తూర్పు ముఖంగా ఉండగా నమ్మిన బంటు పడమర ముఖంగా స్వామి వారి సేవలకు సర్వ వేళలా సిద్దం అన్నట్లుగా ఉంటారు. 





క్షేత్ర విశిష్టత పర్వత పాదాలకు దారి తీసే మార్గం నుండే ప్రారంభం అవుతుంది. 
ప్రధాన రహదారి దగ్గర బస్సు దిగగానే ఎదురుగా పర్వత పాదాల వద్దకు చేర్చే దారికి మొదట్లో నిర్మించిన స్వాగత ద్వారం భక్తులకు ఆహ్లాదం కలిగిస్తుంది. 



                                                                        





పక్కనే ఉన్న పుష్కరణి ఒడ్డున నిలువెత్తు భక్తాంజనేయ రూపం యాత్రికుల హృదయాలలో స్థైర్యాన్ని నింపుతుంది. 






పుష్కరణి కి ఆపక్క శ్రీ వరద రాజ పెరుమాళ్ ఆలయం ఉంటుంది. 
కొండ మీది స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఇక్కడే ఉంటాయి. 
ఈ ఆలయానికి సంబంధించి ఒక మహా భక్తుని గాధ స్థానికంగా వినపడుతుంది. 







ఒకప్పుడు ఇక్కడ దొడ్డాచార్యులు అనే శ్రీ వైష్ణవుడు నివసించేవారట. ఆయన కంచి శ్రీ వరద రాజ స్వామి వారి భక్తుడు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కంచిలో జరిగే స్వామి వారి గరుడ సేవా ఉత్సవానికి వెళ్ళే వారట.
వయస్సు పెరగటంతో ఒక సంవత్సరం వెళ్ళలేక పోయారట.
మనిషి ఇక్కడున్నా మనసు అక్కడే ఉన్నది.
గరుడ సేవ సమయం దగ్గర పడుతున్న కొద్దీ చూడలేక పోతున్నందుకు ఎంతో భాధ పడసాగారట.





ఆవేదనతో దొడ్డాచార్యుల వారు తక్కన్ కులం ఒడ్డున నిలబడి అయిదు శ్లోకాలతో శ్రీ వరద రాజ స్వామిని కీర్తించారట.
వీటినే "దేవరాజ పంచకం" అని అంటారు.
భక్త వత్సలుడైన శ్రీహరి తన నిజ భక్తుని ఆర్తిని గ్రహించి అతనికి కంచిలో జరుగుతున్న సేవ యొక్క సందర్శనం ప్రసాదించారట.
ఆ సంఘటనకు గుర్తుగా నాటి నుండి నేటికీ కంచిలో గురుడ సేవ నాడు స్వామిని గోపురం వద్ద ఒక నిముషం ఆపి హారతి ఇచ్చిన తరువాత లోపలికి తీసుకొని వెళతారు.
దాని ప్రకారం ఇక్కడ నిర్మించిన శ్రీ వరద రాజ స్వామి గరుడ సేవ వేళలో మార్పులు జరుగుతాయి.
ఆ పుష్కరణి ఒడ్డున శ్రీ దొడ్డాచార్యుల విగ్రహాన్ని ఉంచారు. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎడమ చేతి వైపున పెద్ద వట వృక్షం క్రింద ఉంటుందీ సన్నిధి.








స్వామిని సందర్శించుకొని పర్వతం వైపుకి బయలు దేరితే దారంతా ఎన్నో వసతి గృహాలు కనపడతాయి.



మొదటగా పెరుమాళ్ళ దర్శనం కొరకు పెరియ మలై అధిరోహించాలి.
సోపాన మార్గం పక్కనే అన్న ప్రసాద కార్యాలయం ఉంటుంది. విరాళాలు లేదా ఉచిత భోజన చీటీలు తీసుకొని పైకి ఎక్కడం మొదలుపెట్టవచ్చును.





ఆరంభంలోనే కుడి పక్కన చిన్న సన్నిధిలో శ్రీ విష్ణు గణపతి కొలువై ఉంటారు. 
ఆయనకు మొక్కి ముందుకు కదిలితే కుడి వైపున శ్రీ కేసరీ నందనుని సన్నిధి కనపడుతుంది.

 






ఈ ఆలయంలో ఎదురెదురుగా రెండు ఆజనేయ రూపాలు ఉండటం చెప్పుకోవలసిన విషయం.





ఈ సోపాన మార్గాన్ని తొలుత "రాయోజి" అనే భక్తుడు నిర్మించారని తెలుస్తోంది. 
తిరిగి 1953 వ సంవత్సరంలో మెట్ల మార్గానికి జరిగిన మర్మత్తులలొ అనేక మంది తెలుగు భక్తులు పాలు పంచుకోన్నారని మెట్ల మీద, ఇరుపక్కలా నిర్మించిన గోడల పైన ఉన్న ఫలకాలలు చూస్తే తెలిసి పోతుంది. 






హనుమత్ సమేత శ్రీ యోగ నార సింహ క్షేత్రం కావడాన దారంతా వానర సేన అల్లరి చెప్పలేనిది.
చేతిలో సంచి, సీసా, ఇంకేదన్నా ఉన్నదంటే అంతే హస్త గతం చేసుకొంటాయి. తగిన జాగ్రత్తలు అవసరం.













నిట్ట నిలువుగా వుండే మెట్లు స్వామి నామం చెప్పుకొంటూ సాగిపోతే అలసట తెలియదు.


సగం దారి నుండి కొండ పైన కోవెల ఇలా కనిపిస్తుంది.
సగం నిర్మించిన శిధిల మండపం దగ్గర నుండి ఇలా కనిపిస్తుంది.



పైనుంచి ఇలా కనపడుతుంది. 



నమ్మకాలు రకరకాలు.
భగనంతుడు కొలువైన పవిత్ర క్షేత్రంలో రాళ్ళను ఎత్తుగా పేరిస్తే సొంత ఇల్లు కట్టుకొంటామని, చెట్ల కు గుడ్డ ఊయలలు కడితే సంతానం కలుగుతుందని ఇలా ఎన్నో !
విశ్వాసంతో భక్తులు కట్టినవి, పెర్చినవి ఎన్నో కనపడతాయి.











పైకి చేరే కొద్దీ పర్వతము, ఆలయము ఇలా కనపడతాయి. 







మొత్తం పదమూడు వందల అయిదు మెట్లు. 
రాజ గోపురానికి సుందర శిల్పాలు చెక్కబడి ఉంటాయి. 













రాజ గోపురం దాటి కుడి పక్కకు తిరిగితే బలి పీఠం, ధ్వజస్తంభం కనపడతాయి. 



దాటి ముందుకు వెళితే స్వామి వారి కనకపు రధం ఉంటుంది. 
2009 నుండి ఆలయ విమాన స్వర్ణ పూత కార్యక్రమం జరుగుతోంది. 
విమాన భాగం పూర్తైనా లోపలి భాగాలు ఇంకా పూర్తికావాలి. 
అదే విధంగా కొండ పైకి రోప్ వే ప్రయత్నాలు గత ఐదేళ్లుగా సాగుతున్నాయి. 






ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారం.
తొలుత అమ్మవారు శ్రీ అమృత వల్లీ తాయారు సన్నిధి చేరుకొని, సేవించుకొని అలానే ముందుకు వెళితే స్వామి వారి సన్నిధి చేరుకొంటాము.






కొద్దిగా ఎత్తులో ఉన్న గర్భాలయం చేరుకోడానికి మెట్లుంటాయి.
గోడలకు ఒక వైపున దశావతారాలు, మరో వైపున అష్ట లక్ష్మి రూపాలను సుందరంగా చెక్కారు.
స్వామి వారికి ఎదురుగా కొద్ది ఎత్తులో చిన్న కిటికీ ఉంటుంది.
దీనిగుండానే చిన్న మల మీద వేంచేసిన శ్రీ ఆంజనేయస్వామి శ్రీ వారిని సందర్శించు కొంటారని భక్తుల నమ్మిక.
గర్భాలయంలో శ్రీ యోగ నారసింహ స్వామి యోగ బంధనంలో చక్కని పుష్పాలంకరణలో దర్శనమిస్తారు.
గమనించవలసిన అంశాలు రెండున్నాయి ఇక్కడ.
స్వామి వారికి ఎదురుగా ఆలయం లోపలే శ్రీ గరుడాల్వార్ ఉంటారు.
రెండవది శివాలయంలో మాదిరిగా స్వామి గర్భాలయ మధ్యలో ఉపస్థిత భంగిమలో ఉండటం.
సింహాచలంలో కూడా ఇలానే ఉంటారు.





నరసింహ జయంతి, అన్ని హిందూ పర్వదినాలను, ధనుర్మాస పూజలను విశేషంగా జరుపుతారు. 
ప్రతి నిత్యం ఉదయం ఆరు నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో ఎన్నో పూజలు, సేవలు, అలంకరణలు స్వామి వారికీ జరుగుతాయి. 
మానసిక వ్యధతో భాధ పడేవారికి సరైన మార్గం చూపే వానిగా శ్రీ శొలింగనుర్ యోగ నారసింహ స్వామి ప్రసిద్ది. 
శ్రీ వైష్ణవ ఆళ్వార్ లైన పై ఆళ్వార్ మరియు తిరుమంగై ఆళ్వార్ గానం చేసిన మంగళ శాసనాల కారణంగా ఈ క్షేత్రం నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా గుర్తించ బడినది.

ఈ క్రింది చిత్రం నేను 2009లో వెళ్లి నప్పుడు తీసినది.
సరిగ్గా గమనిస్తే దీనిలో బంగారు విమానం కనపడదు.
ఈ క్షేత్రానికి చెన్నై నుండి అరక్కోణం రైలులో, అక్కడ నుండి బస్సులో సులభంగా చేరుకోవచ్చును. అన్ని కులాల వారి సత్రాలు, దేవస్థానం వారి ఉచిత అన్న సత్రం ఉన్నాయి.
అన్ని వసతులు లభిస్తాయి.
 చక్కని ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణం  శొలింగనుర్ సొంతంగా చెప్పుకోవాలి.
చిన్న కొండకు నాలుగు వందల నలభై మెట్లు ఉంటాయి. గర్భాలయంలో శ్రీ అంజనాతనయుడు శంఖుచక్రదారిగా ఉపస్థిత భంగిమలో దర్శనమిస్తారు. అరుదైన భంగిమ. 

   జై శ్రీ మన్నారాయణ !!!                           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...