30, ఏప్రిల్ 2014, బుధవారం

kappad Beach

                  పరాయి దేశస్తులు ప్రధమంగా పాదం మోపిన ప్రదేశం 


కోలికోడ్ లో నేను సందర్శించిన మరో సాగర తీరం "కపాడ్" (KAPPAD).
సహజంగా ఉన్న కుతూహలంతో నేను పాల్గొన్న సమావేశానికి వచ్చిన స్థానిక మిత్రులొకరిని చూడతగ్గ ప్రదేశాల గురించి అడిగితె చెప్పినదే "కపాడ్". 
సమావేశం ముగిసిన తరువాత బస్సు లో బయలుదేరాం.
ఈ బీచ్ కోలి కోడ్ కి ఇరవై కిలో మీటర్ల దూరంలో ఉన్నది.
నేరుగా వెళ్ళే బస్సులు చాలా తక్కువ. 
కన్నూర్ వెళ్ళే దారిలో "పూక్కాడ్"లో దిగి ఆటోలో (రెండు కిలోమీటర్లు ) చేరుకోవచ్చును.
ఈ దారిలో ప్రతి పది నిముషాలకు ఒక బస్సు కలదు. 
అలానే చేరాం. 




కాకపొతే భాషా సమస్య వలన ఆటో అతను బీచ్ వైపున కాకుండా రిసార్ట్ వైపున దించాడు.
అక్కడ దిగిన తరువాత కపాడ్ స్వరూపం కొంత వరకు అర్ధం అయ్యింది.
చాలా పొడవైన లోతైన కపాడ్ బీచ్  రిసార్ట్ కి,  పూర్తి స్థాయి బీచ్ కి  మధ్యన చిన్న కొండ ఉన్నది.
ఇటు వైపు నుండి అటు వైపుకు వెళ్ళాలంటే ఒకటిన్నర కిలోమీటర్ల దూరం చుట్టూతిరిగి వెళ్ళాలి
నడిచి గాని, వాహనాల మీద గాని వెళ్ళవచ్చును.
ఉత్సాహవంతులైతే గుట్ట మీదగా కొద్దిగా జాగ్రత్త  తీసుకొంటే దిగవచ్చును.
గుట్ట మీద శ్రీ దుర్గా దేవి, శ్రీ భద్ర కాళి అమ్మవార్ల ఆలయాలు ఉన్నాయి.
ఆగ్నేయంలో చిన్న మండపంలో శివుని మరో అవతారంగా భావించే "కుట్టి చేతన్ " చిన్న విగ్రహం పెట్టారు.



                                    సముద్ర  తీరంలో కొండ మీద మహా వృక్షాలు, ఆలయాలు.




పైనుంచి చూస్తే బీచ్ వైపున ఇలా కనపడుతుంది.


                                              రిసార్ట్ వైపున ఇలా ఉంటుంది. 



ఆటో అతనికి సరిగ్గా చెప్పలేక పోవడం వలన రిసార్ట్ వైపున దిగిన మాకు అక్కడి రక్షణ నిమిత్తం నియమించబడిన  పోలీస్ చెప్పిన ప్రకారం రోడ్ మీద నడిచి వెళ్ళే ఓపిక లేక గుట్ట ఎక్కి అమ్మవారిని దర్శించుకొని  నెమ్మదిగా ఆపక్కకు దిగాం.
ఎండ కొద్దిగా ఎక్కువ గానే ఉన్నది. చెమటలు బాగా పట్టాయి.
దిగి తుడుచుకొంటూ ఆకస్మాత్తుగా చల్ల బడింది ఏమిటా అని చూస్తే తూర్పు నుండి నల్లని మబ్బులు ఏనుగుల మందలా మందగమనంతో రావడం కనపడినది.
కేరళా వాతావరణం గురించి కొంత అనుభవం ఉండటంతో వర్షానికి భయపడలేదు కానీ తడవ కుండా ఉండటానికి సరైన స్థలం లేదన్న భయం ఎక్కువగా కలిగింది.







                 ముంచుకొస్తున్న మబ్బులను కెమేరాతో పట్టుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక సందర్శకుడు.

                                 
                                    మేఘాలను చూసి పరవళ్ళు తొక్కుతున్న సముద్రుడు






                                 నిముషాల మీద మబ్బులు సముద్రాన్ని కూడా కమ్మేశాయి.


ఇంత హడావుడి చేసిన మేఘాలు నేల కూడా సాంతం తడపకుండా ముందుకి వెళ్లి పోయాయి.



                                              నింగి, నీరు, నేల కలవడానికి ప్రయత్నం

బీచ్ వైపున చక్కగా సేదతీరడానికి చెట్ల నీడన చక్కని ఏర్పాట్లు చేసారు.
లోతు ఎక్కువగా ఉన్న నీటిలో సందర్శకులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా రాళ్ళతో సముద్రం లోపలి నాలుగు గట్లు నిర్మించారు.
యాత్రికుల సౌకర్యం కొరకు అన్ని రకాల ఆహార పదార్ధాలు, శీతల పానీయాలు, కాఫీ టీ లాంటి సదుపాయాలు లభిస్తాయి.


                                                             ప్రవేశ ద్వారం

పలహారశాల  






కపాడ్ బీచ్ కి రావడానికి ముఖ్య కారణం ఒక చారిత్రాత్మిక సంఘటనతో  ఈ ప్రదేశం ముడిపడి ఉండటం !
పోర్చుగీసు నావికుడైన "వాస్కో డ గామా" ఐరోపా నుండి భారత దేశానికి సముద్ర మార్గం కనిపెట్టడానికి చేసిన ప్రయత్నం ఫలించి పదునాలుగు వందల తొంభైఎనిమిది మే ఇరవై వ తారీకున భారత దేశ గడ్డ మీద తన తొలి అడుగు పెట్టిన ప్రదేశం ఇదే !
నాలుగు నౌకలలో నూట డెబ్బై మంది సహచరులతో అప్పట్లో "కప్పాడ్కావు"గా పిలవబడిన ఈ సముద్ర తీరానికి చేరుకొన్నాడు.
అప్పటి స్థానిక పాలకుడైన "జోమారిన్ రాజు" రాచ మర్యాదలతో అతనిని ఆహ్వానించారట.
నాటి సంఘటనకు గుర్తుగా ఇక్కడ ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేసారు.
అది ఎలా ఉంటుందో చూడాలన్న ఆశతో వచ్చిన నాకు బీచ్ అంతా తిరిగినా అది కనపడ లేదు.
భాష ఒక పెద్ద సమస్యగా మారింది.
హిందీ, ఇంగ్లీష్ అంతగా రాకపోవడం, మేము అడిగేది వారికి తెలియక (అర్ధం)కాక పోవడం ఏదో జరిగింది.
స్థానికునిగా కనపడిన ఒక పెద్దాయన కనపడితే అడిగా !
పాపం ఆయనకు కూడా భాషా సమస్యే !
కానీ ఆయన వెళ్లి మలయాళం లో మాట్లాడి ఇంగ్లీష్ తెలిసిన ఒకతన్ని పిలుచుకొని వచ్చారు.
ఆ యువకుడు స్థానికుడు కాదు.
పెద్దాయనకు స్మాకర చిహ్నం ఎక్కడ ఉన్నదో తెలీదు.
మాకు ఏం కావాలో తెలిసిన తరువాత ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న దుకాణాలలో విచారించి కనుక్కొని విజయవంతంగా మా వద్దకు వచ్చారు.
అప్పటికే నాకు అర్ధం అయ్యింది, నేను చూడదలుచుకొన్నస్థూపం ఏ స్థితిలో ఉంటుందో !
వారు చెప్పిన దాని ప్రకారం బీచ్ చివర కోలి కోడ్ నేరుగా చేరే మార్గంలో ఉన్నది.
వారికి కృతఙ్ఞతలు తెలుపుకొని ఆ దిశగా కదిలాము.
బీచ్ నుంచి నాలుగు అడుగుల లోపల ఉన్నది ఇదే !



ఒక విధమైన విచారం కలిగింది.
వాస్కో డ గామా ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఒక లక్ష్యం దిశగా చేసిన ప్రయత్నాల ఫలితమే అతను సాధించిన అద్భుత విజయం.
తదనంతర పరిణామాలను పక్కన పెడితే ఆ నావికుడు ఆ నాడు అందుకొన్నది సామాన్య లక్ష్యం కాదు.
అలాంటి చారిత్రాత్మక విషయాన్ని తెలిపే స్థూపాన్నిఅలా వదిలేయడం సరిగా అనిపించలేదు.





                                                              లుంగీ ఫుట్ బాల్






                                                  సాగర తీరాన సుందర గృహాలు 


స్థూపం ఉన్న స్తితి  కలిగించిన ఆవేదన, నిరాశ  నన్ను ఇక అక్కడ ఉండనీయ లేదు.
నచ్చిన వాటిని ఫోటోలు తీసుకొంటూ బస్సు స్టాప్ చేరుకొన్నాము.
ఈ సారి కోలి కోడ్ కి నేరుగా వెళ్ళే బస్సు దొరికింది.
సముద్ర తీరం నుండి తిరిగే మలుపులో ఉన్న ఆ స్థూపాన్నికనపడినంత వరకూ చూస్తూనే ఉన్నా !  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...