24, ఫిబ్రవరి 2014, సోమవారం

Tiruvanvandoor - Sri Maha Vishnu Temple

  తిరువాన్ వండూరు - శ్రీ మహా విష్ణు ఆలయం 




పంచ పాండవ విర్మిత ఆలయాలుగా ప్రసిద్ది చెందిన శ్రీ మహా విష్ణు ఆలయాలలో చివరది తిరువాన్ వండూరులో ఉన్న శ్రీ కమల నాధన్ లేక పంబానియప్పన్ ఆలయం. పంబా నది ఒడ్డున చెంగనూర్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని పాండవులలో కడపటి వాడైన నకులుడు నిర్మించాడు. 
వాన ప్రస్థ ఆశ్రమ సమయంలో ఈ పరిసరాలలో సంచరిస్తున్న నకులునికి శిధిలావస్థలో ఉన్న ఆలయం కనిపించినది. అక్కడి వారిని "ఇది ఏ ఊరు ?" అని అడగగా వారు మలయాళంలో "తిరువాన్ ఉండు " ( భగవంతుడు ఉంటాడు ) అని బదులిచ్చారట. కాలక్రమంలో అదే తిరువాన్ వండూరు" గా మారింది. 
సృష్టి ని ఆరంభించిన బ్రహ్మ తన మానస పుత్రులుగా సనక సనందాదులను సృష్టించారు. 
లోకంలో మానవ ఆవిర్భావానికి కృషి చేయవలసిన వారు నారద మహర్షి భొదనలతొ  ఆధ్యాత్మిక మార్గం వైపుకు మళ్ళి నిరంతరం భగవత్ ధ్యానంలో మినిగి పోయారు. 
ఆగ్రహించిన విధాత కారణమైన నారదుని ఒక చోట నిలకడ లేకుండా నిరంతరం సంచరిస్తూ ఉండమని శపించారట. సృష్టికర్తే ఆగ్రహించడంతో ఖిన్నుడైన నారదుడు భూలోకానికి వచ్చి పవిత్ర పంబా తీరంలో లోక రక్షకుడైన శ్రీ హరి గురించి త్రీవ్రమైన తపస్సు చేసాడు. 
సంతుష్టుడైన వైకుంఠ వాసుడు మహర్షికి సాక్షాత్కారం ప్రసాదించి, ఆయన కోరిక మేరకు ఇక్కడే కొలువైనారు.స్వామివారి ఆశీర్వాదంతో ముని చాలాకాలం స్థిరంగా క్షేత్రంలో ఉండి ఇష్ట దైవాన్ని సేవించుకొంటూ "నారదీయ పురాణం" ఇక్కడే రచించారట. 
కురుక్షేత్ర సంగ్రామంలో విజయం కొరకు తెలిసి చేసిన తప్పులకు చింతపడుతున్న నకులుడు మనః శాంతి కొరకు "శ్రీ కమల నాధు"ని సేవించుకొందామని నిర్ణయించుకొని ఇక్కడకు వచ్చి   శిధిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునః నిర్మించాడు.తదనంతర కాలంలో చేర, చోళ, పాండ్య, విజయనగర మరియు స్థానిక రాజ వంశాలు ఆలయాభివ్రుద్దికి యధాశక్తి కృషి చేసారు. 
వీరి కృషినీ మరియు కైంకర్యాలను ధ్రువీకరిస్తూ ఆలయ ప్రాంగణంలో క్రీస్తు శకం తొమ్మిదో శతాబ్దం నుండి పన్నెండో శతాబ్ద కాలానికి చెందిన అనేక తమిళ శాసనాలు ఉన్నాయి.








విశాల ప్రాంగణానికి పడమర దిశలో ఉన్న ప్రధాన స్వాగత ద్వారం గుండా ప్రవేశిస్తే విశాల ముఖ మండపం, బలి పీఠం, ధ్వజస్తంభం, గర్భాలయం లోనికి వెళ్ళడానికి ప్రవేశ ద్వారం ఉంటాయి. 
ఉప ఆలయాలలో గణేశ, నాగ దేవతలు, శ్రీ ధర్మ శాస్త మరియు శ్రీ గోసాల కృష్ణ కొలువై ఉంటారు. 
శ్రీ గోసాల కృష్ణ విగ్రహం వెనుక ఒక ఆసక్తి కరమైన కధనం ఉన్నది. సుందర రూప శ్రీ గోసాల కృష్ణ విగ్రహాన్ని నకులుడు సేవించేవాడని అంటారు. విగ్రహ సుందరతకు ఆకర్షితుడైన చెంగనస్సెర్రి రాజు  తనతో తీసుకొనివెళ్లి రాజధాని లోని మరో ఆలయంలో ప్రతిష్ట చేయాలన్న నిర్ణయం తీసుకున్నారట. 
అది ఇష్టంలేని స్థానికులు, అడ్డుకోలేని అసహాయతతో విగ్రహాన్ని పుష్కరణిలో పడవేసారట. 
సుమారు ఆరు వందల సంవత్సరాల తరువాత పుష్కరణికి పూడిక తీస్తుండగా ఈ విగ్రహం, అనేక పూజ పాత్రలు లభించాయిట. అలా తిరిగి లభించిన శ్రీ గోసాల కృష్ణ విగ్రహాన్ని పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో పునః ప్రతిష్టించారు. ఆలయం పూర్తిగా కేరళ సాంప్రదాయ నిర్మాణంలో ఉంటుంది. ప్రవేశద్వారం కోట గుమ్మాన్ని పోలి ఉండి, పైన గజేంద్రుని రక్షిస్తున్న గరుడవాహన శ్రీ మహా విష్ణు రూపాన్ని చెక్కి ఉంటుంది. ఆలయం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ నిర్మించబడినది. ప్రధాన ఆలయం లోనికి ప్రవేశించే ముందు విశాలమైన సభా లేదా నాట్య మండపం ఉంటుంది. ధ్వజస్థంభం, బలిపీఠం దాటిన తరువాత నమస్కార మండపం కనపడుతుంది. గర్భాలయం పైన రెండు అంతస్థుల వర్తులాకార పైకప్పు ఉంటుంది. ద్వారానికి ఇరుపక్కలా ఉన్న ద్వారపాలకులు విగ్రహాలు  సుందరంగా మలచబడినాయి. 
వర్తులాకార శ్రీ కోవెలలో శ్రీ పంబానియప్పన్ స్థానక భంగిమలో చతుర్భుజాలతో, చందన పుష్ప అలంకరణతో నేత్ర పర్వంగా దర్శనమిస్తారు. పన్నెండు మంది ఆళ్వార్ లలో ప్రముఖుడైన శ్రీ నమ్మాళ్వార్ స్వామిని కీర్తిస్తూ పాశుర గానం చేశారు. అలా తిరువాంవండూరు కేరళలోని పదమూడు శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ఒకటిగా శాశ్వత కీర్తిని స్థానాన్ని పొందినది. 













ఉదయం నాలుగు నుండి పదకొండు వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది వరకూ తెరిచి ఉండే ఆలయంలో నిత్యం నియమంగా తొమ్మిది రకాల పూజలు జరుగుతాయి. అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి తిధులలో, రోహిణి నక్షత్ర రోజున విశేష పూజలు జరుపుతారు.
నవంబర్ నెలలో పది రోజుల పాటు ఆలయ ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.
అన్ని హిందూ పర్వ దినాలలో,స్థానిక ముఖ్య పర్వ దినాలైన విషు, ఓనం రోజులలో విశేష పూజలు, ఉత్సవాలు జరుపుతారు.శబరిమల మండల, మకర జ్యోతి సమయాలలో కూడా ప్రత్యేక పూజలు శ్రీ పంబానియప్పన్ కు చేస్తారు.చెంగనూరు కు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం చేరుకొనడానికి ఆటోలు లభిస్తాయి.
అందుబాటు ధరలలో వసతి మరియు భోజన సౌకర్యాలు చెంగనూర్ లో లభిస్తాయి.
జై శ్రీ మన్నారాయణ !!!! 

1 కామెంట్‌:

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...