11, ఫిబ్రవరి 2014, మంగళవారం

kumbhakonam


                        సారంగపాణి ఆలయం - కుంభకోణం 



ఆలయాల రాష్ట్రంలో ఆలయాల నగరంగా పేరొందినది కుంభకోణం. 
ఎన్నో ప్రాచీన, ప్రసిద్ద, పవిత్ర, అద్భుత ఆలయాలు ఉన్నాయి కుంభకోణం లోను చుట్టుపక్కల. 







 వామన పురాణం, భవిష్యోత్తర పురాణం, కుంభకోణ మహత్యంలలో కుంభకోణం గురించి సవివరంగా తెలుపబడినది.
కావేరి మరియు అరసలార్ నదుల మధ్య ఉన్న కుంభకోణాన్ని పెరుమాళ్ యొక్క మధ్య విశ్రాంతి స్థలం గా పేర్కొంటారు. పైన ఉన్న శ్రీరంగం ప్రధాన విశ్రాంతి క్షేత్రంగాను, క్రింద ఉన్న తిరుకన్నాపురం మరో విశ్రాంతి క్షేత్రంగాను పిలవబడుతున్నాయి.
కుంభకోణాన్ని పంచ క్రోష యాత్రా స్థలం అని కూడా అంటారు. అదే విధంగా కావేరీ నదీ తీరంలోని పంచ రంగ క్షేత్రాలలో ఈ ఆలయాన్ని ఒకటిగా పేర్కొంటారు. 
ఎందుకనే దానికి  సంభందించిన పురాణ గాధ భవిష్యోత్తర పురాణం ఇలా వివరిస్తోంది.
జలప్రళయం సంభవిస్తోందని తెలుసుకొన్న విధాత పునః సృష్టికి ఏర్పాట్లు మొదలుపెట్టారు.
అన్ని పవిత్ర ప్రదేశాలనుండి మట్టిని సేకరించి దానికి అమృతం కలిపి ఒక కుంభాన్ని తయారుచేసి అందులో అమృతాన్ని పోసి మేరు పర్వతం పైన ఉంచారు.
జల ప్రవాహ వేగానికి ఆ కుండ నీటిలో తేలుతూ ఈ ప్రాంతానికి వచ్చేసరికి కొద్దిగా కదిలినది.
ఆ కదలిక వలన కొంత అమృతం తొణికి చుట్టుపక్కల పడినది.
కుంభం మూతి నుండి అమృతం వొలొకిన ప్రదేశంగా కుంభకోణం అన్న పెరోచ్చినది.
అలా పడిన ప్రతి ప్రదేశం ఒక దివ్య ధామంగా రూపుదిద్దుకొన్నది.
వాటిల్లో శైవ వైష్ణవ ఆలయాలు రెండూ ఉండటం వలన  పంచ క్రోష యాత్రా స్థలం ప్రఖ్యాతి పొందినది.
ప్రత్యక్ష నారాయణుడు శ్రీ మహా విష్ణు దర్శనం కొరకు తపమాచరించినందున కుంభకోణం భాస్కర క్షేత్రం.
అదే విధంగా హేమ మహర్షి తపో దీక్షకు సంతసించిన నారాయణుడు  సాక్షాత్కరించి ఆయనకు ఇక్కడ తన సేవా భాగ్యం ప్రసాదించడమే కాకుండా ఆయన కుమార్తె మహాలక్ష్మి అవతారమైన కోమలవల్లి ని వివాహమాడారు. శ్రీ హేమ ఋషి ప్రాంగణంలోని ఉపాలయంలో కొలువై దర్శనమిస్తారు. 
ఆ కారణంగా కుంభకోణం కళ్యాణపురం కూడా !
ఊరి మధ్యలో సువిశాల ప్రాంగణంలో ఉన్నఆలయం అద్భుత శిల్పాలకు నిలయం.
నూట నలభై ఏడు అడుగుల ఎత్తు గల పదకొండు అంతస్థుల  రాజ గోపురం రామాయణ, భాగవత గాధలకు సంభందించిన సుందర శిల్పాలతో నిండివుంటుంది.







 




గర్భాలయం ఏనుగుల చేత లాగబడుతున్న రధం ఆకారంలో ఉంటుంది.మరో ప్రత్యేకత ఏమిటంటే ఆలయం లోనికి ప్రవేశించడానికి రెండు ద్వారాలుంటాయి. ఒకటి ఉత్తరాయాణానికి రెండవది దక్షిణాయనానికి తెరుస్తారు.
గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీ అరవముదన్ పెరుమాళ్ సగం శయనించిన భంగిమలో కొలువైవుంటారు. మూలవిరాట్ నుదుటన త్రినేత్రునికి ఉన్నట్లు మూడో నేత్రం ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. 
పన్నెండు అడుగుల దివ్యాలంకరణ అర్చామూర్తి కన్నుల పండుగగా ఐదు తలల ఆదిశేషువు పడగల క్రింద దర్శనమిస్తారు.












గర్భాలయంలో స్వామి వారికి మొక్కుతున్న ఎందరో దేవి దేవతల, మహర్షుల మూర్తులు కూడా కనపడతాయి.
అమ్మవారు శ్రీ కోమలవల్లి తాయారు  విడిగా సన్నిధిలో కొలువుతీరి వుంటారు.
ప్రతి నిత్యం ఎన్నో సేవలు నియమంగా జరుగుతాయి. నియమంగా ఆరు పూజలు రోజులో నిర్వహిస్తారు. సంవత్సరంలో పన్నెండు ఉత్సవాలు అనగా నెలకి ఒకటి చొప్పున జరుపుతారు. చైత్ర మాసంలో ఇక్కడ జరిగే రధోత్సవం చాలా ప్రసిద్ది.
ముఖ్యంగా కేతు గ్రహ దోషం కలిగి ఉన్నవారు విద్యాభివృద్ధి, సంతానాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి కొరకు శ్రీ సారంగపాణి పెరుమాళ్ ని ఆరాధిస్తారు. 
చోళ, పాండ్య, విజయనగర, నాయక రాజ వంశాల వారు ఆలయ అభ్యున్నతికి తమ వంతు సేవ చేసారని తెలుస్తోంది.
శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా పేరొందిన ఈ ఆలయంలోని మూల విరాట్టు  శ్రీ అరవముదన్ పెరుమాళ్ మీద అలానే ఉత్సవ మూర్తి శ్రీ సారంగ పాణి మీద శ్రీ పెరియాళ్వార్, శ్రీ భోతత్తి ఆళ్వార్, శ్రీ తిరుమలై సాయి ఆళ్వార్, శ్రీ  పై ఆళ్వార్, శ్రీ నమ్మాళ్వార్ , శ్రీ తిరుమంగై ఆళ్వార్ మరియు శ్రీ ఆండాళ్  కలిసి యాభై ఒక్క పాశురాలు గానం చేసారు.
ఇక్కడి కోనేరు, రధం, ఆలయం, శ్రీ వారు ప్రతి ఒక్కటి ఒక విశేషమే!!!
కుంభకోణానికి చెన్నై నుండి నేరుగా రైలు మరియు బస్సులు లభిస్తాయి. తంజావూరు, తిరుచ్చి, మదురై పట్టణాల నుండి కూడా సులభంగా చేరుకోవచ్చును. స్థానికంగా ఎన్నో ప్రసిద్ధ ఆలయాలున్నాయి. అన్నీ దర్శనీయాలే ! నగరంలోని మహామాగం పుష్కరిణికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జీవ నదులకు నిర్వహించే మాదిరి పుష్కరాలను నిర్వహిస్తారు. కాకపోతే అవి ఒక రోజు మాత్రమే ! 
స్థానికంగా అన్ని సౌకర్యాలు యాత్రీకులకు అందుబాటు ధరలలో లభ్యం అవుతాయి. 

జై శ్రీ మన్నారాయణ !!!!


  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...