16, ఫిబ్రవరి 2014, ఆదివారం

Tirunelveli Sri Nelliappar Temple


                     శ్రీ నెల్లిఅప్పార్ కాంతిమతి ఆలయం - తిరునెల్వేలి 

భారత దేశం లోని అతి పెద్ద ఆలయాలలోనే కాదు తమిళనాడు లోని పంచ సభల సాంప్రదాయంలో కూడా భాగం అయిన శ్రీ నెల్లిఅప్పార్ కాంతిమతి ఆలయం ఎన్నో విశేషాల సమాహారం. 
భూలోక సంచార సమయంలో ప్రకృతి రమణీయతకు ఆకర్షితులైన ఆది దంపతులు తమిర పారాణి నదీ తీరంలో కోలువైనారని అంటారు. 
దక్షిణ భారతంలో అనేక శివాలయాల నిర్మాణం వెనుక అజ్ఞాత శక్తిగా ఉన్న అగస్థ్య మహర్షిని  శ్రీ హరి అవతారమైన శ్రీ రామ చంద్ర మూర్తి కొలిచిన క్షేత్రంగా ప్రసిద్ది. 
పాండ్య రాజులు ఏడో శతాబ్దంలో ఆరంభించిన ఆలయ నిర్మాణం పదిహేడో శతాబ్దంలోని నాయక రాజుల కాలంలో పూర్తయిన ఈ శిల్ప కళా నిలయం మరెన్నో విశేషాలు కలిగి ఉన్నది. 

పౌరాణిక గాధ :

స్వయంభూగా వెలసిన దంపతులను వెదురు పొదలలో కనుగొన్న అగస్థ్య మహర్షి పూజించేవారు.
రావణుని లంకకు వెళ్ళే సమయంలో శ్రీ రామచంద్రులు అగస్థ్య మహర్షి ఆశ్రమంలో ఉండి శ్రీ నెల్లిఅప్పర్ ను ఆరాధించారు.
దనంతర కాలంలో రామశర్మ అనే బ్రాహ్మణుడు నిత్యం భిక్షమెత్తుకొని సేకరించిన ధాన్యాన్ని వండి నెల్లిఅప్పార్ కు నివేదన చేసి తాను ప్రసాదంగా స్వీకరించేవాడు. ఒక రోజు సేకరించిన  ధాన్యాన్నిఆరబెడుతుండగా అకస్మాతుగా తమిర పారాణి నదికి వరద రాగా, భక్తుని ధాన్యము కొట్టుకొని పోకుండా చుట్టూ కంచె నిలిపారట కైలాసపతి. విషయం తెలుసుకొని చూడ వచ్చిన రాజు శర్మ శివ భక్తికి ప్రశంసించి ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని తిరునెల్ వేళి ( తిరు- శ్రీ, నెల్- ధాన్యం, వేళి - కంచె )గా, స్వామిని నెల్లి అప్పార్ గా పిలవాలని నిర్ణయించారు. కాలక్రమంలో అదే తిరునెల్వేలి గా మారింది. 




స్వయంభూ శ్రీ నెల్లిఅప్పార్, శ్రీ కాంతిమతి అమ్మాళ్ విడివిడిగా రెండు ఆలయాలలో కొలువై ఉంటారు. రెండు ఆలయాలను "సంగిలి మండపం" కలుపుతుంది.
ముందుగా అమ్మవారిని సెవించుకొన్న తరువాతే స్వామిని సేవించుకోవడం ఇక్కడి ఆచారం.
అందుకే రెండు ఆలయాలకు రెండు ప్రవేశ ద్వారాలుంటాయి.
అమ్మవారు కొలిచినవారి జీవితాలలో ఉన్నత స్తాయిని, అప్పార్ మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం.
సుమారు యాభై ఎకరాల స్థలంలో అయిదు గోపురాలు, బంగారు కోనేరు, ఎన్నో ఉప ఆలయాలు, మండపాలు నిర్మించబడినాయి.
మహా మండపం,కళ్యాణ మండపం, ముఖ మండపం, అర్ధ మండపం, సంగిలి మండపం అన్నింటా అద్భుత శిల్పాలు కనపడతాయి.
పెద్ద నందీశ్వరుడు మండపంలో గంభీరంగా గర్భాలయానికి ఎదురుగా ఉంటాడు. ఆయనకు ఎదురుగా అరుదైన అర్జున, కర్ణ విగ్రహా సౌందర్యం అద్వితీయం. ఎంతో సునిశితంగా చెక్కబడినాయి.
అమ్మవారి ఆలయంలో ఉన్న వెయ్యి కాళ్ళ మండపంలో అక్టోబర్ నెలలో స్వామి వారి తిరు కల్యాణం జరుగుతుంది.
వసంత మండపంలో ఏప్రిల్ లో వసంతోత్సవం నిర్వహిస్తారు.
తమిళనాడులో పంచ నాట్య సభలున్నాయి. అవి తిరువలంగాడు లోని రత్న సభ, చిదంబరం లోని కనకసభ, మధురై లోని వెళ్లి ( వెండి) సభ, కుర్తాళం లోని చిత్ర సభ. తిరునెల్వేలిలో ఉన్నది తామ్ర సభ.
ఇక్కడ లోహాలతో లేదా రాతి శిల్పాలు ఉండవు.
చెక్క మీద శివ పురాణ దృశ్యాల నుండి శృంగార బొమ్మలను సుందరంగా మలచారు. ఈ తామ్ర సభలో మార్గశిర
మాసంలో ఆరుద్రోత్సవం జరుగుతుంది.
ప్రధాన ఆలయానికి పడమర శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మయూర వాహనం మీద కొలువైన విగ్రహం ఎంతో సుందరంగా ఉంటుంది.




ఎన్నో గణేష్ రూపాలు, మరెన్నో లింగాలు కనపడతాయి ప్రాంగణంలో.
అలంటి వాటిల్లో "అనవతర ఖాన్" లింగం ఒకటి.
ఆలయ ఆగ్నేయ మూల ఉన్న ఈ లింగం వెనుక ఉన్న గాధ మతాల మాటను తుడిచిపెడుతూ విశ్వాసంతో కొలిచిన వారికి కొంగు బంగారంగా కైలాస నాధుడు ఉంటాడని చెబుతుంది.
పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించే నవాబుకు సంతానంలేదు.
భార్య కూడా అనారోగ్యంతో భాదపడేది.
ఎన్నో విద్యాలు చేయించినా గుణం కనిపించ లేదు.
అప్పుడు కొందరు వేద పండితులు నియమంగా అప్పార్ ను సేవిస్తే పలితం ఉంటుంది అని తెలిపారు.
ఆ ప్రకారం చేయడంతో కొంత కాలానికి ఆమె ఆరోగ్యం బాగుపడి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినది. నవాబు దంపతులు ఆ బాబుకి " అనవతర ఖాన్ " అని నామకరణం చేసి అతని పేరు మీద ఒక లింగాన్ని ప్రతిష్టించారు. 



శ్రీ నేల్లిఅప్పార్ ఆలయంలో మరో ఆకర్షణ సప్త స్వరాలూ పలికే సంగీత స్తంభాలు. 
గర్భాలయానికి చేరుకొనే మార్గంలో ఉన్న రత్న మండపం నిండా సంగీత స్తంభాలే !
వీటిలో గొప్పతనమేమిటంటే ఒక్కో దానిని తడితే స్వరాలు పలకడమే కాదు. 
ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడటం విశేషం. 
ఏకరాతి మీద మొత్తం ఇరవై నాలుగు స్తంభాలు వివిధ ధ్వనులను పలుకుతాయి. మద్దెల, మృదంగం, సరిగమలు ఇలా ఎన్నో వాయిద్య ధ్వని కర్ణపేయంగా ! !
గర్భాలయంలో శ్రీ నెల్లి అప్పార్ తెల్లని పంచె ధరించి చందన కుంకుమ విభూతి లేపనాలతో దర్శనమిస్తారు. 
సంకిలి మండపం గుండా శ్రీ కాంతిమతి అమ్మన్ కోవెల చేరితే అక్కడ కూడా కొన్ని సంగీత స్తంభాలు అర్ధ మండపంలో ఉంటాయి. 
కొద్దిగా ఎత్తుగా ఉన్న గర్భాలయంలో పట్టు చీర ధరించి స్వర్ణా భరణ భూషితగా అమ్మవారు ప్రసన్నవదనంతో కనపడతారు. 
అదిదమ్పతులను సేవించుకొన్న తరువాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రసిద్ద తిరునెల్వేలి వేడి వేడి హల్వా తినాలి. 
తిరునెల్వేలి చుట్టూ పక్కల ఎన్నో దివ్య ధామాలున్నాయి. 
నవ తిరుపతులూ మరియు నవ కైలాసాలు ఇక్కడికి దగ్గరే !





తిరునెల్వేలి కి చెన్నై ఎగ్మూరు స్టేషన్ నుండి ప్రతి రోజు రైళ్ళు ఉన్నాయి. 
తిరునెల్వేలి జంక్షన్ స్టేషన్ వద్ద అందుబాటు ధరలలో వసతి సౌకర్యాలు లభిస్తాయి. 
నమః శివాయ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...