15, ఫిబ్రవరి 2014, శనివారం

Tiruthangal Sri Nindra Narayana Perumal Temple


             తిరుతాంగల్ - శ్రీ నిన్ర నారాయణ ఆలయం 





శ్రీ మహా విష్ణువు లోక సంరక్షణార్ధం లేక భక్త మనోభీష్ట్తాలను నెరవేర్చడానికి భూలోకంలోని అనేక దివ్య క్షేత్రాలలో వెలశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాంటి ఒక పుణ్య ధామం తిరుత్తాంగల్. 
నూట ఎనిమిది శ్రీ వైష్ణవ తిరుపతులలో ఒకటిగా పేరొందిన తిరుత్తాంగల్ ఎంతో పౌరాణిక నేపద్యాన్ని కలిగి ఉన్నది. 

పురాణ గాధ :

గతంలో ఒకసారి వైకుంఠములో సవతుల మధ్య సహజంగా ఉండే ఆధిపత్య ధోరణితో దేవేరులైన శ్రీదేవి, భూదేవి మరియు నీళా దేవిల నడుమ త్రీవ్ర వాగ్వాదం నెలకొన్నది. 
కలత చెందిన శ్రీ దేవి భూలోకంలోని సుందరమైన ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు ఆరంభించారు. 
అప్పటికే అక్కడ శ్రీ మన్నారాయణ సాక్షాత్కారం కొరకు యజ్ఞ యాగాదులు చేస్తున్న మునులు అమ్మవారిని చూసి తమ అదృష్ట్టానికి సంతసించి, తమ స్తోత్ర పాఠాలతో ఆమెను ప్రసన్నురాలిని చేసుకొన్నారు. 
వారి భక్తి ప్రపత్తులకు సంతుస్ట్టు రాలైన శ్రీ మహాలక్ష్మి వరం కోరుకోమన్నది. 
దానికి ఋషులందరూ తల్లీ నీతో పాటు జగన్నాథుని సేవించుకోవడమే మా ఏకైక కోరిక అని అన్నారు. 
మీ మనో వాంఛ త్వరలో నెరవేరుతుంది అని పలికి ధ్యానంలో నిమగ్నమైపోయినది. 
కొంత కాలానికి ఆమె దీక్షకు ముగ్ధుడైన శ్రీ హరి, మిగిలిన ఇద్దరు దేవేరులతో తరలివచ్చి దర్శనమిచ్చారు. 
భూదేవి, నీళాదేవి మహాలక్ష్మికి ప్రణమిల్లి తమ తొందరపాటుకు క్షమాపణలు కోరుకొన్నారు.    





అదే సమయంలో అక్కడ ఉన్న మునులు, వానప్రస్థఆశ్రమం స్వీకరించిన పురూరవ చక్రవర్తి లోకకల్యాణ దంపతులను సేవించుకొని, భావి తరాలను అనుగ్రహించడానికి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోమని ప్రార్ధించారు.








వారి అభీష్టాన్ని స్వీకరించారు శ్రీవారు.








తదనంతరం ద్వాపర యుగంలో బాణాసురుని కుమార్తె అయిన ఉషతో  శ్రీ కృష్ణ భగవానుని  మనుమడైన అనురుద్దిని వివాహం ఇక్కడే జరిగినది అని అంటారు.








పాండవులు అరణ్యవాసంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నీటి కోసం అర్జనుడు తన శరంతో పాతాళ గంగను రప్పించాడట. అదే ఇక్కడ ప్రవహించే "అర్జున నది" అన్నది స్థానిక విశ్వాసం.






ఆలయ విశేషాలు :

చిన్న కొండ మీద ఉన్న ఆలయానికి సోపాన మార్గం ఉన్నది. 
కొండను తొలచి ఆలయాన్ని నిర్మించారు. 
ముఖ మడపంలో దర్శనమిచ్చేగరుడుడు ప్రత్యేక భంగిమలో కనపడతాడు. 
సహజంగా ముకుళిత హస్తాలతో ఉండే వినతా సుతుడు చతుర్భుజునిగా వెనక కుడి చేతిలో అమృత భాండం, ఎడమ చేతిలో శంఖం దరించి, ముందరి హస్తాలతో స్వామికి నమస్కారాలు సమర్పించుకొంటూఉంటాడు. 
అదే విధంగా స్వామికన్నా ముందే ఇక్కడికి వచ్చిన అమ్మవారు కూడా ప్రత్యేకంగా కనపడతారు. 
మిగిలిన ఆలయాలలో ఉపస్థిత భంగిమలో ఉండే తాయారు ఇక్కడ స్థానక భంగిమలో ఎడమ చేతిని క్రిందకు వదలి, కుడి చేతిని అభయ ముద్రలో ఉన్నందున, భక్తులకు సమస్త నిత్య జీవిత భాధల నుండి ఉపశమనం కలిగించే దేవతగా ప్రసిద్ది.  ఈమెను సెంగమలై నాంచారి లేదా అన్న నాయకి అని పిలుస్తారు. 
గర్భాలయంలో శ్రీ నిన్ర నారాయణ పెరుమాళ్ స్థానక భంగిమలో వరద, కటి హస్తాలతో, సుందర స్వర్ణాభరణ భూషితులై చక్కని పుష్పాలంకరణతో నయనమనోహరంగా దర్శనమిస్తారు. 
మరో గుర్తించవలసిన ప్రత్యేకత ఏమిటంటే గర్భాలయంలో మూలవిరాట్టుతో పాటు పదకొండు విగ్రహాలు మార్కండేయ ముని, గరుడ, విశ్వకర్మ, శ్రీ దేవి, భూదేవి, అరుణుడు ( సూర్యుని రధ సారధి ), జాంబవతి,ఉష, అనిరుద్ధ, భ్రుగు మహర్షి ఉంటారు. 
మరే ఆలయంలోను ఇది కనిపించదు. 
అందుకే తమిళంలో ఒక నానుడి ఉన్నది. 
తిరుతాంగల్ ఆలయాన్ని సందర్శించిన వారికి మరు జన్మ లేదు అని.





    



తిరుత్తాంగ మలై మీదే సదా శివునుకి, సుబ్రహ్మణ్య స్వామికి ఆలయాలుండటం మరో విశేషంగా పేర్కొనవచ్చును. శ్రీ కరుణెల్లినాథర్ గా కైలాసనాధుడు లింగ రూపంలో కొలువై ఉంటారు. ఈ మూడు ఆలయాలు ఒకే వరుసలో ఉండటం మరింత విశేషం.
ఇక ఉపాలయాలలో శ్రీ రంగనాథర్, శ్రీ నర్తన కృష్ణ, శ్రీ ఆండాళ్, శ్రీ దుర్గ , శ్రీ వినాయకుడు, పన్నిద్దరు ఆళ్వార్లు కొలువై దర్శనమిస్తారు. 
కొద్దిగా పైన మరో మందిరంలో శ్రీ పళ్ళికొండ పెరుమాళ్ శయన భంగిమలో పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి లతో పాటుగా ఇరుపక్కలా శ్రీ భృగు మరియు మార్కండేయ మహర్షులతో కలిసి కొలువై ఉంటారు. 
కొండను తొలచి నిర్మించిన నిర్మాణం కావడాన కాబోలు మండపాల పైన, వాటి స్తంభాల పైన ఎలాంటి శిల్పాలు కనిపించవు. గర్భాలయం మీద ఉన్న విమానం మాత్రం శ్రీ రంగం ఆలయ విమానాన్ని పోలి ఉంటుంది. పర్వతం మీద నిర్మించిన అన్ని నిర్మాణాలను కలుపుతూ ఎత్తైన ప్రహారీగోడ ఉంటుంది. కానీ ఎలాటి రాజ గోపురం ఉండదు.  ప్రాంగణంలో భాస్కర, పద్మ మరియు సంగ పుష్కరుణులు ఉంటాయి. 
ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్జున నది కూడా ఆలయ తీర్థం క్రింద పరిగణించబడుతోంది. 

 









ప్రతినిత్యం ఎందరో భక్తులు సందర్శించే తిరుతాంగల్ పెరుమాళ్ శ్రీ తిరుతాంగల్ అప్పన్ లేదా శ్రీ నిన్ర నారాయణ స్వామి వైభవం గురించి భూత్తత్తి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కలిసి అయిదు పాశురాలు గానం చేసారు. వాటివలన ఈ క్షేత్రం నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ఒకటిగా శాశ్విత హోదా పొందినది.






ప్రతి నిత్యం నియమంగా నాలుగు పూజలు జరిగే ఈ ఆలయంలో ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి రోజులలో, అష్టమి, ఏకాదశి తిథులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సంవత్సరానికి మూడు సార్లు వైశాఖి వసంతోత్సవం, పిళ్ళై లోకాచార్యర్ మరియు కురత్తి ఆళ్వార్ పేర్ల మీదగా పది రోజుల చొప్పున ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. 
వైకుంఠ ఏకాదశి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ రామ నవమిలతో పాటు అనేక పండుగల సందర్భంగా ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తారు. ధనుర్మాసంలో ప్రతి రోజు పాశుర గానం ఉంటుంది. 
ప్రతి నిత్యం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల కొరకు తెరిచి ఉంటుందీ ఆలయం. 
కైలాసనాధుడు, ఆయన కుమారుడు శ్రీ కుమార స్వామి కూడా కొలువైనందున శివరాత్రి, స్కందషష్ఠి , కార్తీక మాస పూజలు, ఆడి  కృతిక పూజలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ రకంగా తిరుత్తంగల్ శివ కేశవ స్థలంగా పేరొందినది. 
మధురై నుండి శివకాశి మార్గంలో శివకాశి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో రహదారి పక్కనే ఉండే ఈ దివ్య క్షేత్రాన్ని మధురై, విరుద్నగర్, శివకాశి, శ్రీ విల్లిపుత్తూర్ ల నుండి బస్సులో సులభంగా చేరుకొనవచ్చును.


జై శ్రీమన్నారాయణ !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...