మధురై శ్రీ మీనాక్షి అమ్మన్ ఆలయము
శ్రీ మీనాక్షి సోమసుందరేశ్వర స్వామి కొలువు తీరిన క్షేత్రం మదురై.
క్రీస్తు శక ఆరంభం నుండి అన్ని తమిళ కావ్యాలలో, గ్రంధాలలో మధురై ప్రస్తావన ఉన్నది.
మదురైని పాలించిన మలయ ధ్వజ పాండ్య రాజు చేసిన పుత్ర కామేష్టి యాగంలో పసి బాలిక రూపంలో అమ్మవారు ఉద్భవించినది.
ఆమె అసలు పేరు "తదాతగై".
అన్ని విద్యలలో అసహాయ ప్రతిభ కలిగిన రాజ కుమార్తె ముల్లోకాలను జయించాలన్న ఆకాంక్షతో సత్య, విష్ణు లోకాలను, అమరావతిని జయించి, కైలాసానికి చేరుకొని అక్కడ సదా శివుని చూసి తన అసలు స్వరూప జ్ఞానం పొందినది.
కైలాస పతి ఆమెను వివాహమాడటానికి సమ్మతించడంతో రంగ రంగ వైభవంగా ఆది దంపతుల కల్యాణం సమస్త దేవతల సమక్షంలో మధురై లో జరిగినది.
తొట్ట తొలి ఆలయాన్ని దేవేంద్రుడు నిర్మించాడని అంటారు.
తరువాత ఎందరో రాజులు తమ వంతు సహకారం ఆలయాభివ్రుద్దికి అందించారని పురాతన తమిళ గ్రంధాల ఆధారంగా, నయమ్మార్ల తేవరాల మూలంగా తెలుస్తోంది.
కానీ పదునాల్గవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాపతి అయిన మాలిక్ ఖాఫర్ జరిపిన దక్షిణ దేశ దండ యాత్రలో పురాతన ఆలయం పూర్తిగా నేలమట్టమయ్యింది.
తిరిగి పదహారవ శతాబ్దంలో నాయక రాజులైన విశ్వనాధ, తిరుమల నాయక ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారు.
భారత దేశంలో ఉన్న అనేక హిందూ దేవాలయాలలో అతి పెద్ద పది ఆలయాలలో మధుర మీనాక్షి అమ్మన్ ఆలయం ఒకటి.
శ్రీరంగం లోని శ్రీ రంగనాధ స్వామి ఆలయంది మొదటి స్థానం.
నలభై అయిదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయానికి నాలుగు దిక్కులా రాజ గోపురాలుంటాయి.
అన్నింటి లోనికి దక్షిణ గోపురం నూట డెబ్భై అడుగుల ఎత్తుతో ఉంటుంది.
ప్రాంగణంలో మొత్తం పద్నాలుగు గోపురాలతో పాటు ప్రధాన అర్ఛనా మూర్తులు కొలువైన గర్భాలయాల పైన స్వర్ణ విమానాలుంటాయి.
ప్రతిఒక్క గోపురం పైన శివ పురాణ, శివ లీలల శిల్పాలు, వివిధ పురాణ ఘట్టాల బొమ్మలు, రకరకాల జంతు బొమ్మలు, అనేకం నేత్ర పర్వంగా మలచబడినాయి.
రాతి నిర్మాణాలైన అనేక మండపాలలో షుమారుగా ముప్ఫై వేల పైచిలుకు అద్భుత శిల్పాలు అత్యంత నిపుణతతో చెక్కబడ్డాయి.
అనేక సహజ సిద్ద వర్ణ చిత్రాలు కనువిందు చేస్తాయి.
అనేక ఉప ఆలయాలతో నిరంతరం భక్త జన సందోహంతో కళకళలాడే ఈ ఆలయ సందర్శన మన దైనందిన జీవితాల నుండి ఒక రోజు ఉపశమనాన్ని ప్రసాదిస్తుంది అనటంలో ఎలాంటి సందేహము లేదని చెప్పవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి