12, ఫిబ్రవరి 2014, బుధవారం

Tiruchendur sri Subramanya Swamy Temple







                 తిరుచెందూర్ శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామి ఆలయం 

లోక కంటకులైన దానవులను సంహరించి సమస్త లోకాలకు సంతోషాన్ని ప్రసాదించిన ఆది దంపతుల ప్రియ పుత్రుడు శ్రీ కుమార స్వామి. 
అసురలతొ సమరం సల్పిన సమయంలో విడిది చేసిన ఆరు సమర క్షేత్రాలు నేడు "ఆరు పాడై వీడు" గా పవిత్ర దేవాలయాలుగా రూపుదిద్దుకొని ప్రసిద్ది చెందాయి. 
తమిళ నాదులొని వివిధ జిల్లాలలో ఉన్న అవి తిరుప్పరై కుండ్రం, తిరు పళ మధురై చోళై ( మధురై ), స్వామిమళై (కుంభ కోణం ), తిరుత్తణి (తిరువళ్లూర్ ), పళని ( దిండిగల్ ) మరియు తిరుచెందూర్ ( టూటికోరన్ ). 
వీటిల్లో అయిదు పర్వత శిఖరాల మీద ఉండగా తిరుచెందూర్ మాత్రం సముద్ర తీరాన ఉంటుంది. 
ఆరు పాడై వీడులలో ఒక్కో చోట ఒక్కో నామంతో కుమారుడు పిలవబడతాడు. 
తిరుచెందూర్ శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెనక ఉన్న పౌరాణిక గాధ యుగాల నాటిది. 

పురాణ విశేషాలు :

బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన కశ్యప మహర్షి కుమారులు శూరుడు, పద్ముడు. 
ఘోర తపస్సుతో సదా శివుని ప్రసన్నం చేసుకొని అసహజ,లోక నష్ట కరమైన వరాలను పొందారు. 
వర బలంతో అన్నదమ్ములు ఒకే రూపం ధరించి శూరపద్ముడు అన్న పేరు పొంది ముల్లోకాలను స్వాధీనం చేసుకొన్నారు. 
ఎవరి చేతిలోనూ తమకు మరణం లేదు అన్న శివ వర గర్వంతో సర్వ లోక వాసులను ఇక్కట్లకు గురిచేయసాగారు. 
త్రిమూర్తులు ఇతర దేవతలు సమిష్టి గా సమాలోచన చేసి శివ పార్వతుల పుత్రుడే శూరపద్ముని భాధ నుండి లోకాలను కాపాడగలవాడని తెలుసుకొన్నారు. 
వారి ప్రార్ధనల మేరకు త్రినేత్రుడు తన దివ్య తేజస్సును విడవగా దానిని అగ్ని వాయు దేవులు గంగా నదిలో భద్ర పరిచారు. 
కొద్ది కాలానికి ఆ తేజస్సు ఆరుగురు ముద్దులొలికే బాలకులుగా రూపాంతరం చెందినది. 
వారిని కృతికా నక్షత్ర యువతులు పెంచసాగారు. 
ఒక నాడు ఓ బాలకులను చూసిన పార్వతీ దేవి విషయం తెలుసుకొని ఆప్యాయంగా కౌగలించుకొనగా వారు ఆరు తలలు, పన్నెండు చేతుల షణ్ముఖు నిగా అవతరించారు. 
దేవ సేనలతో బయలుదేరి శూరపద్ముని పైకి సమరానికి తరలివెళ్ళారు. 
జరిగిన భీకర పోరులో అసురుని బలమణఛి తిరిగి రెండుగా చేసి, వానికి మరణం లేనందున ఒకరిని తన మయూర వాహనంగాను, రెండోవానిని తన పతాకంలో కోడిగాను ఏర్పరచుకొన్నారు. 
తమను కాపాడిన కార్తికేయునకు కైవారాలు చేసి దేవతలు కోరిన కోర్కె మేరకు ఇక్కడి గంధమాధన పర్వతం పైన శ్రీ బాల సుబ్రహ్మణ్యం గా కొలువుతీరారు.  

ఆలయ విశేషాలు :

కాలక్రమంలో సముద్రుని అలల తాకిడికి పర్వతం తరిగిపోయినది. 
చాలాకాలం గుప్తంగా ఉన్న తరువాత అరవై మూడు మంది శివ గాయక భక్తులైన నయమ్మార్ లలో ఒకరైన "శ్రీ అప్పార్" గానం చేసిన "తేవరాల" ద్వారా తిరుచెందూర్ జన బాహుళ్యంలో ప్రాముఖ్యం సంతరించుకొన్నది. 
శిల్పాధికారం లాంటి పురాతన తమిళ గ్రంధాలలో ఈ క్షేత్ర ప్రస్తావన కనపడుతుంది. 
జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్యుల వారు తిరుచెందూర్ ని సందర్శించి స్వామి వారి మీద "తిరుచెందూర్ సుబ్రహ్మణ్య భుజంగం" గానం చేసారు. 
క్రీస్తు శకం తొమ్మిదో శతాబ్దం నుండి ఈ ప్రాంతాన్ని పాలించిన పాండ్య, చోళ, చేర,విజయనగర, నాయక రాజ వంశాలు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేసాయి. 
ఆలయ ప్రస్తుత రూపంలో దర్శనమివ్వడానికి అవధూతలైన మౌన స్వామి, కాశీ నాధ స్వామి, అర్ముగ స్వామి చేసిన కృషి ఎంతైనా చెప్పుకోతగ్గది. 
ఈ మహానుభావుల సమాధులను ఆలయ వెలుపల వళ్ళీ గుహాలయం సమీపంలో సందర్శిన్చుకొవచ్చును.    
నిర్మాణ రీత్యా మిగిలిన తమిళ నాడు ఆలయాలకు కొద్దిగా భిన్నంగా ప్రత్యేకతను విశిష్టతను కలిగి ఉంటుంది. 
తూర్పున సాగరం ఉండటంతో ఆలయం, ఊరు రెండూ పడమర దిశగా విస్తరించాయి. 
మేళ గోపురంగా పిలవబడే రాజ గోపురం తొమ్మిది అంతస్తులతో పైనుండి క్రింద దాకా వేలాయుధ అలంకరణతో ఎంతో దూరానికి కనపడుతుంది.   



వాహనాలు నిలిపే చోటునుండి, సముద్ర తీరం నుండి ఆలయ అంతర్భాగానికి దారి తీసే "షణ్ముఖ విలాస మండపం"
చేరుకోడానికి "నట పాద కొట్టగై" ( పై కప్పుతో ఉన్న నడక దారి) నిర్మించారు.


షణ్ముఖ విలస మండపం నుండే ప్రధమ ప్రాకారంలోని మహా మండపంలో కొలువు తీరిన "ఆరుళ్ ముగు అర్ముఖ పెరుమాన్ " ని దర్శించుకొనవచ్చును. 
నల్ల రాతితో ఎత్తుగా విశాలంగా సుందర శిల్పాలతో నిండిన  స్తంభాలతో నిర్మించిన ప్రాకారంలో తూర్పున ద్వారముండక పోయినా అక్కడే ధ్వజస్థంభము, బలి పీఠం ఉంటాయి. 
ధ్వజస్థంభ వెనుక ఒక నిర్మాణ విశిష్టతను వీక్షించ వచ్చును. 
అక్కడ రాతి గోడకు అడుగు పరిమానంలో చేసిన రంధ్రం గుండా చూస్తే హోరు మంటూ అలలతో సముద్రుడు కనిపిస్తాడు. 
అదే చెవిని పెడితే ఆ హోరు గాలే మృదు మధుర "ఓంకార" నాదంగా వినిపిస్తుంది. 
వరసగా అరవై మూడు మంది నయమ్మారల మూర్తులు, దక్షిణా మూర్తి, ముగ్గురు అవధూతలు, శ్రీ వల్లీ అమ్మన్, శ్రీ శంకర నారాయణ స్వామి, శ్రీ విశాలాక్షి, శ్రీ వేద పురీశ్వర, శ్రీ చంద్రశేఖర, శ్రీ నటరాజ, శ్రీ శివగామి అమ్మన్, భైరవ, శనీశ్వర, ఆదిగా గల వారు వేంచేసి ఉంటారు. 
ద్వితీయ ప్రాకారంలో మరో దక్షిణా మూర్తి, నూటేట్టేశ్వర లింగం, సోమస్కంద మూర్తి, వల్లభ, మేళ్ వాసళ్ వినాయకుడు, చండికేశ్వర, శ్రీ తిరుమల వేంకటేశ, శ్రీ రంగం రంగనాధ స్వామి, శ్రీదేవి, భూదేవి, నీళా దేవి, గజ లక్ష్మి, పన్నిద్దరు ఆళ్వారులు కొలువై ఉంటారు. ఇక్కడే గంధ మాధన పర్వత భాగంగా పేర్కొనే సంతాన శిల ఉంటుంది.


తూర్పు దిశగా ఉన్న గర్భాలయంలో స్థానక భంగిమలో శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామి నేత్ర పర్వతంగా దర్శనమిస్తారు. 
గర్భాలయం వెనక స్వామి ప్రతిష్టించిన పంచలింగాలను, ఇరు ప్రక్కల దేవేరులైన వల్లీ దేవసేన లుంటారు. 
షణ్ముఖ విలస మండపం పక్కనే ఉన్న మరో మండపం లోనికి కొంత రుసుము చెల్లించి వెళితే స్వచమైన తీయటి నీటి ఊట అయిన " నళి కినారు" 
సైనికుల దాహార్తిని తీర్చడానికి శరవణుడు శరాన్ని వదిలి రప్పించినపాతాళ గంగ  ఈ నళి కినారు. 







ఆలయ ఉత్సవాలు :

ఉదయం అయిదు నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి తొమ్మిది వరకు తెరిచి ఉండే ఆలయంలో నియమంగా పదిహేను రకాల సేవలు సుబ్రహ్మణ్య స్వామికి జరుగుతాయి. 
ఇక్కడి ఊంజల్ సేవ విశేషమైనది. 




ఇంతటి విశేష తిరుచెందూర్ దర్శించుకోవాలంటే మధురై, తిరునెల్వేలి లనుండి బస్సు మార్గంలో, చెన్నై ఎగ్మూరు నుండి రైలులో చేరవచ్చును. 
అందుబాటు ధరలలో వసతి సౌకర్యాలు లభిస్తాయి. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...