18, ఫిబ్రవరి 2014, మంగళవారం

ThiruChenganoor

                       తిరు చెంగనూర్ - శ్రీ మహా విష్ణు ఆలయం 

కేరళ రాష్ట్రంలో ఉన్న అనేక దివ్య క్షేత్రాలలో చెంగనూరు ఒకటి. 
ఇక్కడి శ్రీ మహాదేవ, పార్వతి దేవి ఆలయం చాలా ప్రసిద్ది చెందినది. 





చెంగనూర్ శ్రీ మహాదేవ మందిరం 


చెంగనూర్ చుట్టుపక్కల ఎన్నో పురాతన ఆలయాలు కలవు. 
హరిహర సుతుడు శ్రీ ధర్మ శాస్త మానవ రూపంలో నడయాడిన పందళం ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది. 





పందళం రాజ భవనం 





అలాంటి దర్శనీయ క్షేత్రాలలో పంచ పాండవ నిర్మితాలుగా పేరుపొందిన అయిదు శ్రీ కృష్ణుని (శ్రీ మహా విష్ణువు ) ఆలయాలు చెంగనూరుకు పదిహేను కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. 
తిరు చెంగనూరు ( ధర్మజ), తిరు ప్పుళియూర్ (భీమ ), ఆరన్మూల ( అర్జున), తిరువాన్ వండూరు ( నకుల), తిరుక్కోడి త్తానం ( సహదేవ). 
పాండునందనులు దర్శించి, కొలిచి, పునః నిర్మాణాలు చేసిన క్షేత్రాలుగానే కాక శ్రీ వైష్ణవ గాయక భక్తులు అయిన పన్నిద్దరు ఆళ్వార్లు కీర్తించిన పాశురాల వలన నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఈ అయిదు దివ్య ధామాలు కూడా శాశ్విత స్థానం పొందాయి. 
 చెంగనూరు రైల్వే స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ప్రధాన రహదారికి కొద్దిగా లోపలికి ఉంటుందీ దివ్య దేశం.
పంపా నదికి ఉప నది అయిన "చిత్తరార్" ఒడ్డున ఏర్పడిన ఊరు కావడం చేత "చిత్తరూరు" గా పిలవబడి కాలక్రమంలో "చెంగనూర్"గా స్థిరపడినది అని చెబుతారు.
ఈ ఆలయం గురించి రెండు వేరు వేరు యుగాలకు చెంది ఒక దానితో మరొకటి ముడిపడి ఉన్న గాధ స్థానికంగా ప్రచారంలో ఉన్నది.









పురాణ గాధ :

సుధీర్గ రాజ్య పాలన తరువాత పాలనా భాద్యతలు వారసులకు అప్పగించి పాండవులు ద్రౌపది దేవితో కలిసి వానప్రస్థం స్వీకరించి, పుణ్య క్షేత్రాలను సందర్శిస్తూ ఈ ప్రాంతాలకు చేరుకొన్నారు.
అక్కడి ముని వాకిట ఆతిధ్యం స్వీకరించిన తరువాత ఈ క్షేత్ర విశేషాలను గురించి అడిగారు.
సత్య యుగంలో బ్రహ్మ మానస పుత్రుడైన కశ్యప మహర్షికి సూర్యుడు మరియు పద్ముడు అనే కుమారులుండేవారు.
తండ్రి అనుమతితో చేసిన తీవ్ర తపస్సుతో పరమశివుని ప్రసన్నం చేసుకొని, చిత్రమైన వరాలను కోరి, పొందారు.
వర ప్రభావంతో అన్నదమ్ములు ఇద్దరూ ఒకరిగా మారి సూర పద్ముడు అని పిలవబడసాగారు.
మరణ భయం లేక పోవడంతో పెచ్చురిల్లిన గర్వంతో సమస్త లోక వాసులను పీడించసాగారు.
వారి అఘాయిత్యాలకు తట్టుకోలేక దేవతలు, మునులు అంతా కలిసి వైకుంఠము వెళ్లి శ్రీమన్నారాయణుని శరణు కోరారు.
పెరుమాళ్ళు వారికి సదా శివుడు అసురునికి ప్రసాదించిన వరాల గురించి తెలిపి, వాని భాదను లోక వాసులకు తప్పించగల సమర్ధుడు ఆదిదంపతుల కుమారుడైన షణ్ముఖుడు అని తెలిపారు.
లోకాలను ప్రశాంతంగా ఉంచాలని చెప్పిన పెద్దల మాటతో శరవణుడు దేవ సేనలతో సూరపద్ముని పైకి దండయాత్రకు వెళ్ళారు.
వారిరువురి మధ్య భీకర సమరం జరిగినది ఈ ప్రదేశంలోనే!
కుమార స్వామి కమల నాభుని సలహా మేరకు రాక్షసుని తన వేలాయుధంతో రెండుగా చీల్చి ఒకడిని తన మయూర వాహనంగాను, రెండో వానిని పతాకం మీది కోడి గుర్తుగా ఏర్పరచుకొన్నారు.
అలా సమయానికి ఉపాయం చెప్పి ముప్పు నుండి కాపాడిన శ్రీ హరిని తమ స్తోత్ర పాఠాలతో కీర్తించిన దేవతలు, మునులూ ఎల్ల కాలాలో భూలోక వాసులను రక్షించదానికి ఇక్కడ కొలువు తీరి ఉండమని కోరిన మీదట స్వామి శ్రీ ఇమయ వరప్పన్ అన్న పేరుతొ స్వయంభూ మూర్తిగా వెలిశారు.
పరిపూర్ణ విశ్వాసంతో కొలిస్తే స్వామి గ్రహ పీడలను, మానసిక అశాంతిని తొలగించే వానిగా ప్రసిద్ది.     
ఆడి తప్పని వానిగా, సత్య సంధునిగా పేరొంది కూడా విజయం కొరకు గురువు ద్రోణుని మరణానికి కారణమైన అసత్య పద ప్రయోగ భాధ యుధిస్థరుని నిరంతరం వేధించేది.
ఎన్నో క్షేత్రాలలో పరమాత్ముని సేవించిన ఆ మనోవేదన దూరం కాకపోవడంతో వ్యధకు లోనవుతున్న పాండవాగ్రజుడు ఇక్కడైనా చేసిన తప్పిదనం నుండి కోరుకొంటున్న విముక్తి, శాంతి లభించాలన్న తలంపుతో శిధిలమైన దేవాలయాన్ని పునః నిర్మించాడు.








ఆలయ విశేషాలు :

సువిశాల ప్రాంగణానికి వివిధ దేవీ దేవత మూర్తులతో కూడిన స్వాగత ద్వారం ఉంటుంది.


















ఎదురుగా ధ్వజస్తంభం ప్రధాన ప్రవేశ ద్వారం, ఈశాన్యంలో పుష్కరణి కనపడతాయి. 
పూర్తిగా కేరళ నిర్మాణ శైలిలో ఉండే ఆలయంలో నమస్కార మండపం, శ్రీ కోవెల రాతి నిర్మాణాలు. 
ప్రదక్షిణ పధంలో భగవతి అమ్మన్, వినాయక, నాగ దేవతలు, శాస్త మరియు శ్రీ గోసాల కృష్ణ ఉప ఆలయాలుంటాయి. 










శ్రీ గోసాల కృష్ణ మందిరంలో ఉండే విగ్రహాన్ని ధర్మరాజు తన పూజా మందిరంలో కొలిచినదిగా చెబుతారు. 











వర్తులాకార శ్రీ కోవెలలో శ్రీ ఇమయ వరప్పన్ చతుర్భుజాలతో స్థానక భంగిమలో చందన, పుష్పాలంకరణతో దివ్యంగా కనపడతారు.
మూల విరాట్టులో గమనించ వలసిన అంశం ఏమిటంటే కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం ఉంటాయి.
అరుదైన భంగిమ.

దివ్య దేశం : 

పన్నిద్దరు ఆళ్వారులలో ప్రముఖుడైన నమ్మాళ్వార్ యన మనో నేత్రంతో   శ్రీ ఇమయ వరప్పన్, ఆయన వెలసిన చెంగనూర్ ను వీక్షించి పాశురాలు గానం చేసారు. 
ఆ కారణంగా కేరళలోని పదకొండు దివ్య దేశాలలో ఒకటిగా తిరు చెంగనూర్ ప్రసిద్ది చెందినది. 

పూజలు - ఉత్సవాలు :

ఉదయం నాలుగు గంటల నుండి పదకొండు వరకు, తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి వుండే ఈ ఆలయంలో నియమంగా రోజుకు ఆరు పూజలు జరుగుతాయి. 
ప్రధాన తిధులైన అష్టమి, నవమి, ఏకా దశి, ద్వాదశి లలో, హిందూ పర్వదినాలలో, అదే విధంగా స్థానిక ముఖ్య పర్వదినాలైన విషు, ఓనం ల సందర్భంలో  ప్రత్యేక పూజలు జరుగుతాయి. 
మార్చి నెలలో పది రోజుల పాటు ఆలయ ప్రతిష్టా దినోత్సవాలను రంగ రంగ వైభోగంగా నిర్వహిస్తారు. 
ప్రశాంతంగా పచ్చగా ఉండే ఆలయ పరిసరాలు, మనోహర రూపంతో దర్శనమిచ్చే  శ్రీ ఇమయ వరప్పన్ భక్తుల హృదయాలను యెనలేని శాంతిని నింపుతాయి. 

చెంగనూర్  చేరుకోడానికి దేశం నలుమూలల నుండి రైల్ సౌకర్యం ఉన్నది. 
జై శ్రీమన్నారాయణ !!!!





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...