14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Palani


                             పళని - శ్రీ దండాయుధ పాణి ఆలయం 

ప్రసిద్ద ఆరు పాడై వీడులలో మూడవది గా పేరొందిన పళని తమిళ నాడులోని దిండుగల్ జిల్లాలో ఉన్నది. 
ఈ క్షేత్రం గురించి అనేక పురాతన తమిళ గ్రంధాలలో పేర్కొనబడినది. 
ఎంతో ఆసక్తికర, ఆరోగ్యకర, ఆద్యాత్మిక విశేషాల సమ్మిళితం ఈ క్షేత్ర గాధ. 

క్షేత్ర గాధ :

 ఒకనాడు కైలాసంలో పార్వతి పరమేశ్వరులు తమ కుమారులైన గణపతి, కుమారస్వామి లతో సమయం గడుపుతున్న వేళ నిరంతర సంచారి నారద మహర్షి అక్కడికి వచ్చారు. 
ఆది దంపతులకు అభివాదం చేసి ఒక అరుదయిన ఫలం వారికి కానుకగా సమర్పించుకొన్నారు. 


పిల్లలిద్దరూ అది తనకు కావాలంటే తనకు కావాలి అని వాదులాడుకోవడంతో, సదా శివుడు వారికి ఒక పరీక్ష పెట్టారు. 
ఇరువురలో ఎవరైతే అన్ని పుణ్య నదులలో స్నానమాచరించి వస్తారో వారు  ఆ ఫలాన్ని పొంద అర్హులు అని చెప్పారు. 
సరేనన్నారు  అన్నదమ్ములు. 
తన మయూర వాహనం మీద రివ్వున సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళగా తాను ఏమి చెయ్యాలో తెలియక ఉండి పోయారు గణపతి. 
అప్పుడు నారద మహర్షి శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు. 
దానిని భక్తిగా పఠిస్తూ తల్లితండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసారు గజ ముఖుడు. 
తానెంత వేగంగా వెళ్ళినా అన్న ముందుగా అక్కడకి చేరుకొని తిరిగి రావడం చూసిన షణ్ముఖుడు తన ఓటమిని అంగీకరించినా, పరాజయ బాధతో భూలోకానికి వచ్చి శివగిరి పర్వతం పాదాల వద్ద ధ్యానంలో ఉండి పోయారు. 
తనయుని మనస్సును గ్రహించిన శివ పార్వతులు అతనిని చేరి "నీవే ఒక జ్ఞాన ఫలం. వేరే ఫలాలు నీకెందుకు ?"
అని బుజ్జగించారు. 
ఆ కారణంగా ఈ స్థలానికి "పళని" అన్న పేరోచ్చినట్లుగా తెలుస్తోంది. 
    



అదే సమయంలో అగస్థ్య మహర్షి దక్షిణ భారతంలో శివ ఆజ్ఞతో పర్యటిస్తున్నారు.
ఆయన ఔషధ సుగుణాలు కలిగిన రెండు పర్వతాలైన శివగిరి మరియు శక్తిగిరి తమతో ఉత్తరాన్నుండి దక్షిణానికి తీసుకొని వెళుతున్నారు.
వాటిని తెచ్చే భాద్యత శిష్యుడైన "ఇదుమ్బన్" కు అప్పగించారు.
అతను వాటిని కావడిలో పెట్టుకొని మోస్తూ తిరుగుతూ ఉండేవాడు.
ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అలసి పోయిన ఇదుమ్బన్ కావడిని క్రింద ఉంచి విశ్రాంతి తీసుకొంటున్న సమయంలో కుమార స్వామి కైలాసం నుండి అగ్రజుని చేతిలో పరాజయం పొందిన భాదతో శివగిరి పాదాల వద్దకు రావడం, అతనిని సముదాయించడానికి ఆది దంపతులు తరలిరావడం జరిగింది.
తల్లి తండ్రుల ఓదార్పుతో తేరుకొన్న స్కందుడు ఈ ప్రాంత ప్రకృతి శోభకు ఆకర్షితుడై శివగిరి పైన ఉండిపోయాడు.
సేదతీరిన ఇదుమ్బన్ కావడిని కదలించబొగా కదలలేదు.
విషయం ఏమిటా అని చూసిన అతనికి శిఖరాగ్రాన శివ కుమారుడు కనపడినాడు.
ఇరువురి మధ్య పర్వతం గురించి వాగ్వాదం మొదలై చివరకు యుద్దానికి దారితీసినది.
ఓటమి పాలైన ఇదుమ్బన్ సత్యాన్ని గ్రహించి మురుగ స్వామికి మొక్కి ఎవరైతే కావడి కట్టుకొని ఈ క్షేత్రానికి వస్తారో వారి మనోభీస్థాలు నెరవేర్చ్చమని కోరాడు.
నాటి నుండి పాలని మురుగనునికి కావడి తెచ్చే ఆనవాయితీ ఆరంభమైనది.
కావడిలో పాలు, పంచామృతం,గంధం,పూలు ఇలా ఎన్నో తెస్తారు భక్తులు.
భుజాల మీద మోసుకురావడమే కాకుండా వీపుకు కొక్కేలతో గుచ్చుకొని కూడా తెస్తుంటారు.


విగ్రహ విశిష్టత :

కొంతకాలం శివ గిరి పైన ఉండిన సుబ్రహ్మణ్య స్వామి కైలాసానికి వెళ్ళిపోయారు. 
తదనంతర కాలంలో "భోగార్" అనే సిద్దుడు ( లబించిన శిలా శాసనాల, ఆయన రచించిన భోగార్ సప్త కాండ అనే గ్రంధం ఆధారంగా క్రీస్తు పూర్వం 3000 సం. చెందినవాడని ధ్రువీకరించబడినది). సుబ్రహ్మణ్య ఆరాధకుడైన భోగార్ గొప్ప సిద్ద పురుషుడు.భారత చైనా దేశాలలో విస్తృతంగా పర్యటించి  అనేక మూలికల ఔషద గుణాలను విశ్లేషించి, గ్రంధస్తం చేసారు. 
మానవులకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించే నవ పాషాణాలను కనుగొని వాటిని సమ్మిళితం చేసి ఒక దివ్య ఔషదంగా రూపొందించారు భోగార్. 
అది సమస్త మానవాళికి ఉపయుక్తంగా వారికి అందుబాటలో ఉండాలని తన ఆరాధ్య దైవమైన కుమారుడు నడయాడిన, దివ్య మూలికకు నెలవైన శివగిరి ( పళని గిరి ) చేరుకొని నవ పాషాణ మిశ్రమంతో శ్రీ దండాయుధ పాణి విగ్రహాన్ని తయారుచేసి ప్రతిష్టించారు. 

పళని పర్వతం మీద నైరుతి మూలలో శ్రీ భోగార్ విగ్రహాన్నిఆయన సమాధి మీద ప్రతిష్టించారు. ఇక్కడ ఆయన పూజించిన నవ దుర్గా, మరకత లింగాలు కూడా ఉంటాయి. ఇక్కడ కనిపించే గుహ మార్గం నేరుగా గర్భాలయం లోనికి దారి తీస్తుందని అంటారు. 
అందుకే ఇక్కడి అభిషేక ద్రవ్యాలైన పంచామృతానికి సర్వ రోగ నివారణిగా పేరు. 

ఆలయ విశేషాలు :

పర్వత శిఖరం చేరుకోడానికి సోపాన మార్గం, రోప్ కార్ ఉన్నాయి. 
వెళ్ళేటప్పుడు రోప్ కార్ లోను, దేగేటప్పుడు మెట్ల మార్గంలో దిగటం వలన రెండు రకాల అనుభవాలను సొంతం చేసుకొనవచ్చును. 
మెట్ల మార్గంలో ఇదుమ్బన్ తో సహా క్షేత్ర గాధను తెలిపే విగ్రహాలను ఉంచారు. 
కొండ మీద విశాల ప్రాంగణంలో అనేక పరివార దేవతలతో శ్రీ దండాయుధ పాణి కొలువు తీరి వుంటారు. 
గర్భాలయంలో స్థానక భంగిమలో కుడి చేతిలో దండం, ఎడమ చేతిని నడుము మీద పెట్టుకొని కౌపీనం ధరించి బాలకుని రూపంలో దర్శనమిస్తారు  శ్రీ దండాయుధ పాణి. 
నిత్యం అనేక అబిషేకాలు, పూజలు, వివిధ అలంకారాలు శ్రీ స్వామి వారికి చేస్తారు. 
ఉదయం అయిదున్నర గంటల నుండి మధ్యాహాన్నం పన్నెండు వరకు, తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల కొరకు ఆలయం తెరిచి ఉంటుంది. 
ఇరవై ఆరు రకాల ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. 
అన్నింటిలోనికి బంగారు రధోత్సవం మరియు తులాభారం ముఖ్యమైనవి. 
నెలకొక ఉత్సవం పది రోజుల పాటు జరుగుతుంది. 
తమిళ "తాయి" ( జనవరి -ఫిబ్రవరి ) లో పది రోజుల "తాయి పూసం" ఉత్సవాలలో రాష్ట్ర నలుమూల నుండే కాక పక్క రాష్ట్ర భక్తులు కావడులు ఎత్తుకొని కాలి నడక పళని చేరుకొంటారు. 
ఆరు, ఏడు రోజులలో జరిగే వెండి, చెక్క మరియు స్వర్ణ రధ ఉత్సవాలలో పళని భక్త సముద్రంగా మారిపోతుంది.   








                                    
పళని పట్టణంలో పెరియ నాయకి అమ్మన్ ఆలయం చాలా ముఖ్యమైనది. 
అన్ని ఉత్సవాలు ఇక్కడి నుండే ప్రారంభం అవుతాయి. 
కోలందై వేలాయుధ స్వామి ఆలయం ఇక్కడే అలిగిన కుమారుని ఆది దంపతులు బుజ్జగించినట్లుగా చెబుతారు. 
నయమ్మార్లు తెవరాలు గానం చేసారు. 
మరో పురాతన ఆలయం "పెరియ అవుదియర్ కోవెల" (శివాలయం ). 
మరియమ్మన్ కోవెల కూడా తప్పక దర్శించవలసినదే! 

పళనికి కోయంబత్తూర్, తిరుచ్చి, మధురై  లేదా సేలం నుండి నేరుగా చేరుకోవచ్చును. 
రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ నుండి పర్వత పాదాల వద్దకు చేరడానికి జట్కాలు లబిస్తాయి. 
తప్పక దర్శించవలసిన పుణ్య క్షేత్రం శ్రీ దండాయుధ పాణి కొలువైన పళని. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...