19, ఫిబ్రవరి 2014, బుధవారం

Thiruppuliyoor

            తిరుప్పులియూర్ - శ్రీ మయాప్పిరన్ ఆలయం  





చెంగనూర్ పరిసరాలలో నెలకొన్న పంచ పాండవ ఆలయాలలో రెండవది తిరు ప్పులియూర్ ( ప్పులియూర్ ). పాండవులలో రెండవ వాడు, వాయు దేవుని వర ప్రసాది, అమిత బలశాలి,ఆవేశ పరుడు, మృష్టాన్న భోజన ప్రియుడు అయిన భీమసేనునితో ముడిపడి ఉన్న ఈ క్షేత్రం, యుగాలనాటి పౌరాణిక గాదనే కాకుండా మరెన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకొన్నది. 







పౌరాణిక విశేషాలు :

బలి చక్రవర్తిని వామనావతారం ధరించన శ్రీ మన్నారాయణుడు పాతాళానికి పంపిన తరువాత అతని కుమారుడు " వృష ధర్భి" పరిపాలనా భాద్యతలను స్వీకరించాడు. 
ఆ సమయంలో ఈ ప్రాంతమంతా తీవ్ర కరువు సంభవించినది. 
వానలు లేక, పంటలు పండక ప్రజలు ఆకలి దప్పులతో అల్లాడుతున్నారు. 
చక్రవర్తి వారి విషయం ఏ మాత్రం పట్టించుకొనక తన విలాసాలలో తానున్నాడు. 
 నిరంతర పుణ్య తీర్ధ దర్శనాభిలాషులైన సప్త ఋషులు ఈ ప్రాంతానికి చేరుకొన్నారు. 
వారి రాకను తెలుసుకొన్న చక్రవర్తి ఘన స్వాగతానికి, షడ్ర షోపెతమైన భోజన ఏర్పాట్లు చేసారు. 
కాని వారు ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి, కరువు కాటకాలతో  దుర్భిక్ష వాతావరణం నెలకొన్న ప్రాంతంలో అతిధి మర్యాదలు స్వీకరించడం శాస్త్ర సమ్మతం కాదని తెలిపి, ప్రస్తుతం ఆలయమున్న ప్రదేశానికి చేరుకొన్నారు. 
అక్కడ సరోవరంలో ఉన్న కొద్దిపాటి నీటిలో మొలచిన తామర కాడలను తిని క్షుద్భాదను తీర్చుకొందామని నిర్ణయించుకొన్నారు. 
ఆహరానికి ముందు చేసే భగవత్ ప్రార్ధనలో  వారు పరమాత్మను ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు వీలైనంత తొందరలో నెలకొల్పామని కోరుకొన్నారు. 
సామాన్య ప్రజానీకం పట్ల వారికున్న అభిమానానికి సంతుస్తుడైన వైకుంఠ వాసుడు వారి ముందు
ప్రత్యక్షమైనారు.
సప్త ఋషులు స్వామి వారిని స్తోత్ర పాఠాలతో స్తుతించి భూలోక వాసులను కాపాడటానికి ఇక్కడ కొలువు తీరమని కోరగా పెరుమాళ్ళు అంగీకరించారు.
ఈ వివరాలు మునుల నుండి విన్న కుంతీనందనుడు కురుక్షేత్ర సంగ్రామంలో గురువు ద్రోణుని నేలకూల్చడంలో తానూ పోషించిన పాత్ర మూలంగా వేధిస్తున్న మానసిక వేదన నుండి విముక్తిని శ్రీ మాయ పిరప్పన్ దూరం చెయ్యగలరని భావించి ఆలయాన్ని పునః నిర్మించి చాలా కాలం సెవించుకొన్నాదు.
అలా భీమసేనుని ద్వారా వెలుగు లోనికి వచ్చిన ఆలయం కలియుగంలో గ్రామంలో చెలరేగిన కుల ఘర్షణల కారణంగా రెండు వందల సంవత్సరాలు మూతపడిపోయింది.
కొందరు గ్రామ పెద్దలు పూనుకోవడం వలన భక్తులకు అందుబాటలోనికి వచ్చినట్లుగా స్థానిక గాధలు తెలుపుతున్నాయి.

ఆలయ విశేషాలు :











చిన్న కొండ మీద విశాల ప్రాంగణంలో ఉంటుందీ కోవెల. సాదా సీదాగా స్థానిక శైలిలో నిర్మించబడిన ఆలయానికి ఉన్న స్వాగత ద్వారం పైన శ్రీ అనంత పద్మనాభుని విగ్రహాన్ని సుందరంగా నిలిపారు. 
ఉన్న కొద్ది మెట్లు ఎక్కిన తరువాత బాలి పీఠం, ధ్వజస్తంభం కనిపిస్తాయి. 
గదా ధరుడైన భీముడు నిర్మించిన ఆలయం'కావటాన ఒక పెద్ద రాతి గదను ప్రాంగణంలో ఉంచారు. 
ఉప ఆలయాలలో లింగ రూపంలో కైలాస పతి, శ్రీ ధర్మ శాస్త, శ్రీ భగవతి దేవి వేంచేసి ఉంటారు. 
వర్తులాకార శ్రీ కోవెలలో శంఖ, చక్ర, గద, పుష్పాలను ధరించిన శ్రీ మయా పిరప్పన్ స్థానక భంగిమలో చందన లేపనంతో నేత్ర పర్వంగ దర్శనం ప్రసాదిస్తారు. 
ఎన్నో చిత్రమైన నమ్మకాలు ప్పులియూర్ ఆలయంతో శతాబ్దాలుగా ముడిపడి ఉండటం చెప్పుకోవాల్సిన విషయం. 

శత్రు భయంకరుడు :










కొల్లం ( క్విళన్ ) దగ్గర ఉన్న "మలనాడ"లో దక్షిణ భారత దేశంలోని ఒకే ఒక్క దుర్యోధనుని ఆలయం ఉన్నది. ఆలయ నిర్వహణ, పూజాదికాలు " కురువ " వంశం వారు చూస్తుంటారు. 
వీరికొక చిత్రమైన నమ్మకం ఉన్నది. ప్పులియూరుతో ఎలాంటి సంభంద భాంధవ్యాలు పెట్టుకోరు. ఒక వేళ వెళ్ళినా అక్కడ నిద్రించరు. నిద్రిస్తే భీమసేనుని ఆత్మ వారిని అంతం చేస్తుంది అన్న భయం వారిలో నెలకొని వున్నది. 

 ధన్వంతరీ స్వరూపం :

చెంగనూర్ ప్రాంత ప్రజలు శ్రీ మాయా పిరప్పాన్ ను అపర ధన్వంతరీ స్వరూపంగా విశ్వసించి కొలుస్తారు. ఈ నమ్మకం వెనుక ఒక కధనం వినిపిస్తుంది. 
చాలా కాలం క్రిందట ఇక్కడ నివసించే ధనవంతుడు ఒకతను భరించలేని కడుపు నొప్పితో భాధ పడుతుండేవాడు. ఎన్నో వైద్యాలు చేయించుకొన్నా తగ్గలేదు. చివరికి జ్యోతిష్కుల సలహా మేరకు అతను తన వ్యాధి నయమైతే భారీ నైవేద్యాలు సమర్పించుకొంటానని శ్రీ మాయా పిరప్పన్ కు మొక్కుకొన్నాడు. ఆనతి కాలంలోనే ఎలా వచ్చినదో అలానే తగ్గి పోయినది అతని కడుపు నొప్పి. అంతులేని ఆనందంతో ఇనుమడించిన భక్తి ప్రపత్తులతో ఆ ధనవంతుడు స్వామిని దర్శించుకొని భారీ నైవేద్యాలను సమర్పింఛుకొన్నాడు. నేటికీ అనారోగ్యంతో భాదపడే వారు వైద్యం చేయించుకొంటూనే వ్యాధిని తొలగించమని మొక్కుకొని స్వస్తులైన తరువాత ప్పుళియూర్ వచ్చి తమ మొక్కులను చెల్లించుకోవడం కనిపిస్తుంది. 

భారీ నైవేద్యాలు :

ప్పుళియూర్ ఆలయం భీమసేన నిర్మాణమైనందుకో లేక మరో కారణమో తెలియదు. 
కానీ మొక్కుబడులలో, ప్రత్యేక పర్వదినాలలో సమర్పించుకొనే నైవేద్యాలు భారీగా ఉండటం ఒక విశేషం.నిత్య నైవెద్యాలలొ కూడా భారీతనం కనపడుతుంది. విశేష పర్వదినాలలో భీమ సేనుని భోజన ప్రియత్వాన్ని సూచించే ప్రత్యేక వంటకం అయిన " చాతు శ్యాతుం" అనే పాయసాన్ని నలుగు వందల కిలోల బియ్యం తో చేస్తారు.దీనిని సమర్పించుకోడానికి భక్తులు పోటీ పడుతుంటారు. ఐతే అది అంత తేలికగా లభించే అవకాశం కాదు.సంవత్సరాల ముందే పేరు నమోదు చేసుకోవాలి.

దివ్య దేశం :

ఆళ్వారులలో ప్రముఖుడైన నమ్మాళ్వార్ శ్రీ మయా పిరప్పాన్ ను కీర్తిస్తూ పదకొండు పాశురాలు గానం చేసారు. ఆ కారణాన ప్పుళియూర్ కేరళలోని శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ఒకటిగా శాశ్వితంగా నిలిచి పోయినది. 

పూజలు - ఉత్సవాలు :

నిత్యం ఉదయం నాలుగు గంటల నుండి పన్నెండు వరకు, తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల దర్శనం కోసం తెరిచి ఉండే ప్పుళియూర్ ఆలయంలో నియమంగా ఆరు పూజలు జరుగుతాయి. 
అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి తిధులలో హోమాలు, పూజలు ఏర్పాటు చేస్తారు. 
ముక్కోటి, కృష్ణాష్టమి, శ్రీ రామనవమి, విషు, ఓనం మరియు శబరిమల మండల, మకర విళక్కు రోజులలో విశేష పూజలు జరుగుతాయి. 
మార్చి నెలలో ఆలయ ప్రతిష్టా మహోత్సవాలు పది రోజుల పాటు భనంగ నిర్వహిస్తారు. 
తప్పక దర్శించవలసిన ఆలయాలలో ఒకటైన శ్రీ మాయా పిరప్పన్ కొలువైన తిరు ప్పుళియూర్, చెంగనూరుకి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 
జై శ్రీ మన్నారాయణ !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...