24, ఫిబ్రవరి 2014, సోమవారం

Attukkal Bhagavathi Amman Koil - Tiruvananthapuram

                              అతివల శబరిమల- అత్తుక్కాల్ 





కేరళలో అత్యధికులు ఆరాధించే భగవతి దేవి సాక్షాత్తుగా పార్వతి దేవి అవతారం. 
పరశు రాముడు సముద్రుని నుండి తీసుకొన్న భూ భాగంలో ( నేటి గోవా, ఉత్తర కర్నాటక, కేరళ) నూట ఎనిమిది శివాలయాలు, నూట ఎనిమిది శ్రీ ధర్మ శాస్త, నూట ఎనిమిది భగవతి అమ్మవారి విగ్రహాలు ప్రతిష్టించి, ఆలయాలు నిర్మించి కర్ణాటక నుంచి వేద విదులైన బ్రాహ్మణులను రప్పించి వారికి ఆలయ నిర్వహణా భాద్యతలు అప్పగించారు 
కాల క్రమంలో ప్రజలలో భక్తి భావాలు అభివృద్ధి చెంది గ్రామ గ్రామాన అమ్మవారి ఆలయాలు వెలశాయి. 
వాటిల్లో ప్రత్యేకమైనది కేరళ రాజధాని తిరువనంతపురం నడి బొడ్డున ఉన్న " అత్తుక్కాల్ భగవతి ఆలయం". 
చిత్రమైన విషయం ఏమిటంటే ఈ దేవి పరశురామ ప్రతిష్ట కాదు. 
అమ్మవారు కోరి కొలువైన క్షేత్రం. 
నేడు సువిశాల తిరువనంతపురం లో భాగమైన అత్తుక్కాల్ ఒకప్పుడు చిన్న పల్లె.
చాలా కాలం క్రిందట ఈ ప్రాంతం " మల్ల వీట్టిల్" వంశస్తుల అధీనంలో ఉండేది.
ఒకనాడు వంశ పెద్ద సమీపం లోని "కిళ్ళి నది"లో స్నానమాచరించరిస్తుండగా ముద్దులొలికే పాప ఆయన వద్దకు వచ్చి నది దాటించమని అడిగినదట.
ఆ చిన్నారిని చూడగానే హృదయాంతరాలలో చెప్పలేని ఆప్యాయత కలగడంతో పెద్దాయన నది దాటించి తన ఇంటికి తీసుకొని వెళ్లారట.
కుటుంబ సభ్యులంతా ఆ బాలికను ప్రేమాదరణలతో ఆహ్వానించి విందును ఏర్పాటు చేసారు.
విందు ఆరగించిన తరువాత ఆమె ఎవరికి కనిపించలేదుట.
చుట్టు పక్కల ఎక్కడా చూడలేదు ? ఎవరు ఆ పాప?అన్న రకరకాల ప్రశ్నలతో సతమతమౌతూ కలత నిద్రలో కెళ్ళిన పెద్దాయనకు స్వప్న దర్శనమిచ్చిన దేవి పసి పాప రూపంలో విచ్చేసినది తానేనని మరుసటి రోజున దాపుల ఉన్న తోట లో ఎక్కడ మూడు గీతలు కనిపిస్తాయో\అక్కడ గుడి కట్టమని తెలిపారట.
తెల్ల వారిన తరువాత తోటలో ఒక చోట గీతలు కనిపించడంతో తమ అదృష్టానికి మురిసిపోయిన  మల్ల వీట్టిల్ వంశస్తులు ఆలయం నిర్మించారట.
ఆ బాలిక మరెవరో కాదు అన్యాయం చేసిన పాండ్య రాజుని అతను పాలిస్తున్న మదురై నాశనాన్ని శాశించిన తమిళ ఆడబడుచు "కన్నగి" అని నమ్ముతారు. ఈమె ప్రస్తావన పురాతన తమిళ గ్రంధమైన "శిల్పాదికారం"లో ఉన్నది.
కన్నగి మధురై  నుండి కన్యాకుమారి మీదుగా కోడంగల్లూరు వెళ్ళే క్రమంలో ఇక్కడ "భగవతి అమ్మన్"గా ప్రకటితమయ్యిందని స్థానిక నమ్మకం.
కన్యాకుమారి మరియు కోడంగల్లూరు రెండూ శక్తి క్షేత్రాలే !
అత్తుక్కాల్ భగవతి తమిళ ఆడపడచు కావడం వలన ఆమె ఆలయం సాంప్రదాయ కేరళ ఆలయాలకు భిన్నంగా వివిధ శిల్పాలతో, ఎత్తైన గోపురాలతో ఉంటుంది.
ఆలయంలో గానం చేసే "తొట్టెం పట్టు" ( ప్రార్ధన గీతం) లో వినిపించేది కన్నగి జీవిత గాధే !






నగర రణగోణ ధ్వనుల మధ్య అత్యంత ప్రశాంత వాతావరణంలో ఉండే ఆలయ ప్రాంగణం లోనికి ప్రవేశించగానే మనస్సుకు ఏదో తెలియని అనుభూతితో కూడిన శాంతి సందర్శకులకు కలుగుతుంది.
గోపురం పైన , ద్వారాలకు అష్టా దశ అమ్మవార్ల రూపాలను సుందరంగా ఛెక్కారు.
ప్రదక్షిణా ప్రాంగణంలోని స్థంభాలకు దశావతార శిల్పాలను రమణీయంగా మలచారు.
శ్రీ వినాయక, శ్రీ సదాశివ,శ్రీ నాగ రాజు ఉప ఆలయాలలో కొలువుతీరి కనపడతారు.
గర్భాలయంలో రెండు భగవతి అమ్మన్ విగ్రహాలు దర్శనమిస్తాయి.
దృష్టిని ఆకర్షించే అలంకరణతో కనపడే పెద్ద విగ్రహం  మల్ల వీట్టిల్ వశస్థులు ఏనాడో పనస చెట్టు కాండంతో చెక్కిచ్చినది కాగా రెండవది పంచలోహ విగ్రహం. అభిషేకాలు అన్నీ చిన్న విగ్రహానికే జరుగుతాయి.

ఉఅదయమ్ నాలుగున్నరకి సుప్రభాతంతో ఆలయాన్ని తెరచిన తరువాత నిర్మాల్య దర్శనం, అభిషేకాలు, గణపతి హోమం, దీపారాధన,చందనాభిషేకం, పతిరాడి పూజ, ఉషః పూజ, ఉచ్చః పూజ, అతళ పూజ అన్ని నియమంగా జరుగుతాయి. 
భక్తుల సౌలభ్యం కోసం ఎన్నో ఆర్జిత సేవలలో ముఖ్యమైనవి ములక్కప్పు, చందనాభిషేకం మరియు పొంగలి నైవేద్యం. 
మొదటి రెండు సేవలు అత్తుక్కాల్ భగవతి దేవికి జరిపించాలంటే నేటికి నుంచి పాతిక సంవత్సరాలు వేచివుండాల్సినదే!!!!
మూడో దానికి ప్రతి మహిళకు స్వాగతమే !
కొళ్ళ వర్షం (మలయాళ పంచాంగం) లోని మకరం (ఫిబ్రవరి-మార్చి) లో జరిగే పది రోజుల ఉత్సవాలు ఈ ఆలయంలో ముఖ్యమైనవి. 
అందులో లక్షలాది మహిళలు భక్తి'శ్రద్దలతో సమర్పించుకొనే పొంగలి నైవేద్యం అమ్మవారే స్వయంగా కోరుకొన్నారు అని తెలిపే ఒక గాధ స్థానికంగా ప్రచారంలో ఉన్నది. 
మల్ల వీట్టిల్ వశస్థులు అమ్మవారిని ప్రతిష్టించి ఆలయం నిర్మించిన తొలి రోజులలో ఒక నాడు కొందరు మహిళలు పొలం పనులు చేసుకొంటుండగా నదిలో పాదాలను ఉంచి ఆడుకొంటున్న ఆడ మనిషి ఒకరు కనిపించారట. 
ఆమె ఎవరు ఈ ప్రాంతాలలో ఎప్పుడూ చూడలేదు అని వారు మల్ల గుల్లాలు పడుతూ ఉండగా ఆమె వారిని పిలిచి ఆకలిగా ఉన్నది ఏదన్నా ఉంటే పెట్టండి అని అడిగినదట. 
ఆమె తేజోమయ రూపం చూసిన మహిళలు తాము తెచ్చుకొన్న ఆహారం కాకుండా తమ వద్ద పాలు, బెల్లంతో మట్టి కుండల్లో పాయసం వండి చూడగా ఆ మహిళ కనపడలేదట. 
అప్పుడు వారికి అర్ధమయ్యింది వచ్చినది ఎవరో కాదు భగవతి అమ్మే అని, నాటి నుండి ఆ రోజున పాయసం వండి సమర్పించుకోవడం ఒక ఆనవాయతీగా రూపుదిద్దుకొన్నది. 
అంతే కాదు అమ్మవారు కాళ్ళు కడుకొన్న ప్రదేశం అవటం వలన అత్తుక్కాల్ అన్నపేరొచ్చినది అని అంటారు. 
ఉత్సవాలలోని తొలి తొమ్మిది రోజులు పూజలు, అభిషేకాలు, ఊరేగింపులు రంగరంగ వైభవంగా జరుగుతాయి. పదో రోజున తెల్ల వారక ముందే రహదారులు, భవనాలు, గృహాలు అన్నది లేకుండా తిరువనంతపురం అంతా రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి విచ్చేసిన మహిళలతో నిండిపోతుంది. 
ఎక్కడ స్థలం దొరికితే అక్కడ నాలుగు రాళ్ళను ఉంచి పొయ్యి వెలిగించి అమ్మవారికి ప్రీతికరమైన పొంగలి వండటంలో మహిళలు నిమగ్నమవుతారు. 
అందుకే అత్తుక్కల్ భగవతి ఆలయాన్ని ఆడవారి శబరిమలగా పేర్కొంటారు. సాయంత్రం అమ్మవారు స్వయంగా విచ్చేసి అందరి వంటకాన్ని ఆరగిస్తారు అంటారు. 
పంతొమ్మిది వందల తొంభై ఏడులో అత్యధికంగా పదిహేను లక్షల మంది మహిళలు పాల్గొనడం వలన ఈ ఉత్సవం గిన్నిస్ రికార్డ్స్ లో చోటుచేసుకొంది. 



పదో రోజు రాత్రి అమ్మవారు పుర వీధులలో విహరిస్తారు. 

ఇలాంటి ఎన్నో విశేషాలతో ముడిపడి ఉన్న "అత్తుక్కాల్ భగవతి ఆలయం" ప్రతి ఒక్కరూ దర్శించవలసిన దివ్య క్షేత్రం.
ప్రసిద్ద శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఆలయం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...