26, ఫిబ్రవరి 2014, బుధవారం

Sri Maha Ganapathi Temple, Tiruvananthapuram

                     శ్రీ మహా గణపతి ఆలయం - తిరువనంతపురం 

కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం పౌరాణికంగా మరియు చారిత్రకంగా విశేష చరిత్ర కలిగిన పట్టణం. 
తిరువనంతపురం పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. 
స్వామి కొలువైనందునే ఈ పేరు వచ్చినది. 
కాని ఈ ఊరిలో కొన్ని అరుదయిన ఆలయాలు ఉన్నాయి. 
తిరువళ్ళం శ్రీ పరశురామ, మిత్రానంతపురం త్రిమూర్తి కోవెల, అత్తుక్కాల్ భగవతి, కళ్ళం పల్లి మార్కండేయ ధర్మ శాస్త, శ్రీ లక్ష్మి వరాహ స్వామి ఆలయం, కౌరవుల తల్లి శ్రీ గాంధారి మాత ఆలయం ఇలా చాల ఆలయాలు ఉన్నాయి. 
ఒక్క తిరువళ్ళం శ్రీ పరశురామ ఆలయం తప్ప మిగిలిన ఆలయాలు అనంత పద్మనాభ స్వామి ఆలయ చుట్టుపక్కలే ఉంటాయి. 
ఇదే కోవకు చెందినది పళవంగాడు శ్రీ మహా గణపతి ఆలయం. 
నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్వామి సకల విఘ్నాలను తొలగించి విజయం కలిగించేవానిగా ప్రసిద్ది. 
పదిహేడో శతాబ్దపు తొలి సంవత్సరాలలో ట్రావెంకూర్ రాజుల ముఖ్య పట్టణం నాగర్ కొయిల్ పట్టణానికి దగ్గరలోని "పద్మనాభ పురం". 
నేడు పురావస్తు శాఖ వారి అధ్వర్యంలో ఉన్న నాటి కోటను సందర్శించుకోవచ్చును. 
ఆ రోజులలో రాజైన "ఇరవి వర్మ కులశేఖర పెరుమాళ్" ఒక గణేష మూర్తిని కోటలో ప్రతిష్టించారు. 
వేటకు, యుద్దానికి, ఏదైనా రాచ కార్యం మీద వెళ్ళే తప్పుడు ఈ విఘ్న నాయకునికి మొక్కి వెళితే కార్యంలో విజయం కలుగుతుంది అన్న నమ్మకం అందరిలో కలిగింది. 
కాలగమనంలో " రాజా మార్తాండ వర్మ" ట్రావెంకూర్ వంశాన్ని పద్మనాభ దాసులుగా ప్రకటించి రాజధానిని తిరువనంత పురానికి మార్చారు.     
అదే సమయంలో శ్రీ మహా గణపతి విగ్రహాన్ని తీసుకొని వచ్చి కోట తూర్పు భాగంలో "పళవంగాడు" గా పిలవబడే ప్రదేశంలో ప్రతిష్టించారు. 
నాటి నుండి విఘ్ననాయకుడు "పళవంగాడు శ్రీ మహా గణపతి" భక్తుల కొంగు బంగారంగా మారి కొలవబడుతున్నాడు. 
తిరువనంతపురం రైల్వే స్టేషన్ నుండి శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్ళే రహదారి పక్కనే దూరానికి కూడా ప్రస్పుటంగా కనపడే నల్ల రంగు వేసిన గోపురాలు, మండపాలతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. 



తమిళనాడు ఆలయ నిర్మాణ శైలిలో చిన్న ఆవరణంలో ఉండే ఈ ఆలయం లోనికి ప్రధాన ద్వారం దాటి ప్రవేశిస్తే మహా మండపం చేరుకొంటాము.
మండప స్థంభాలకు లక్ష్మి, సరస్వతి మరియు ఇతర దేవతా మూర్తులను, మండప గోడలపై చిత్రించిన ముప్పై రెండు తీరుల గణేష రూపాలు ఆకట్టుకొనే విధంగా వుంటాయి.


అన్ని ఆలయాలలో ఎడమ కాలును మడచి కుడి కాలును క్రింద గద్దె మీద ఉంచినట్లుగా కనపడే గణ నాధుడు ఇక్కడ కుడి కాలు మడిచి ఎడమ కాలు క్రిందకు వదిలి ఉపస్థిత భంగిమలో దర్శనమిస్తారు.


స్వామిని దర్శించి మనోగతాలను తెలిపి అవి నెరవేరిన తరువాత కొబ్బరి కాయలు కొట్టటం ఇక్కడి అలిఖిత శాసనం.
నిత్యం అలా తమ మొక్కులు తీర్చుకొనే భక్తులు ఎందరో ఇక్కడ కాన వస్తారు.
ఉదయం నాలుగున్నర నుండి పదిగంటల నలబై అయిదు గంటల వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో నిర్మాల్య దర్శనం, అభిషేకం, ఉషః పూజ లాంటి ఇరవై రెండు రకాల సేవలు పార్వతీ నందనునకు జరుపుతారు.
నెల కొకసారి జరిగే "మాస విశేషం", అలానే సంవత్సరానికి ఒకసారి జరిగే "ఆట్ట విశేషం" సందర్బంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు.
గణేష చతుర్ధి, ఆలయ ప్రతిష్టా దినోత్సవాలలో "కొడియాట్టు, శుద్ధి కలశ ఉత్సవ బలి" లాంటి పదకొండు రకాల పూజలు ఘనంగా ఏర్పాటు చేస్తారు.
అన్ని హిందూ పర్వదినాలు ఇక్కడ భక్త జన జయజయధ్యానాల మద్య సాంప్రదాయ బద్దం గా జరుగుతాయి. ఈ ఆలయంలో ప్రతి నెలా పౌర్ణమి తరువాత వచ్చే "సంకష్ట హర చతుర్ది " మాఘ మాసంలో అమావాస్య తరువాత వచ్చే "శుక్ల పక్ష చతుర్ధి" నాడు గణపతి హోమం నిర్వహిస్తారు.
జై గణేష !!!!!   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...