భైరవకోన
మన రాష్ట్రంలో ఉన్న నల్లమల అడవులు అపురూప వనమూలికలకే కాదు, అరుదైన మరియు అంతరించిపోయే వన్యప్రాణులకు నివాసాలు. అంతే కాదు కొన్ని శతాబ్దాల నుండి ఎందరో ముముక్షువులకు నివాసాలుగా పేరొందాయి.
యోగులు, సిద్దులు, కాపాలికులు, మునులు ఇక్కడ తపస్సు చేసుకున్నారన్న దానికి తగిన నిదర్శనాలు కనపడతాయి.
ఇవన్నీ ఒక ఎత్తైతే అత్యంత పురాతనమైన ఎన్నో ఆలయాలు ఈ అడవులలో ఉన్నాయి.
గుండ్ల బ్రహ్మశ్వరం, నెమలి గుండ్ల రంగనాయక స్వామి, అహోబిలం, మద్దిలేటి స్వామి, ఓంకారం ఇలా ఎన్నో ఉన్నాయి.
వాటికీ భిన్నమైనది భైరవకోన. చిక్కని అరణ్యం మధ్యలో నెలకొని ఉన్న ఎనిమిది గుహాలయాలే భైరవకోన.
ప్రకాశం జిల్లా ముఖ్యపట్టణం ఒంగోలు కు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబవరం కొత్తపల్లి కి సమీపంలోని చంద్రశేఖర పురం (సి యస్ పురం) దగ్గరలో ఉంటుందీ భైరవ కోన. సి యస్ పురం దాకా బస్సులు ఉంటాయి. అక్కడ నుండి సొంత ఆటోలలో చేరుకోవచ్చును. సొంత వాహనం అయితే గుహల దాకా నేరుగా వెళ్లేందుకు వీలుంది. అయిదు కిలోమీటర్లు.
ఈ క్షేత్రానికి పాలకుడు భైరవుడు. అనేక స్థానిక గాధలు వ్యాప్తిలో ఉన్నాయి ఈ గుహల గురించి. కానీ నిర్మాణ శైలి ప్రకారం చూస్తే ఇవన్నీ పల్లవుల కాలం (ఆరు నుండి ఎనిమిదో శతాబ్దాల మధ్య)
ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. మహాబలిపురం లాంటి నిర్మాణాలను పల్లవులే నిర్మించారు.
శశినాగ, రుద్రేశ్వర, విశ్వేశ్వర, నగిరికేశ్వర, భార్గేశ్వర, మల్లిఖార్జున, రామలింగేశ్వర, పక్ష మాలిక లింగ మొత్తం ఎనిమిది గుహాలయాలు. వీటిల్లో ఒకటి ఉత్తర ముఖంగా ఉండగా మిగిలినవి తూర్పు ముఖంగా ఉంటాయి. పైన శ్రీ అన్నపూర్ణేశ్వరీ దేవి ఆలయం నూతనంగా నిర్మించారు.
గుహే గర్భాలయం. మొదటి గుహకి ఉన్న ద్వారపాలకుల శిల్పాలు ఆకట్టుకొంటాయి.
ఎనిమిదో గుహాలయానికి వెలుపల ఒక పక్క శ్రీ బ్రహ్మ దేవుడు మరో పక్క శ్రీ మహావిష్ణువు రూపాలు చెక్కారు.
పౌర్ణమి రోజున చంద్ర కిరణాలు వెలుపల ఉన్న చిన్న నీటి గుండంలో పడి, పరావర్తనం చెంది అమ్మవారిని తాకుతాయి. అద్భుతమైన ఈ దృశ్యాన్ని వీక్షించడానికి ఎందరో భక్తులు తరలి వస్తారు.
క్రింది భాగంలో త్రిముఖ దుర్గాదేవి కొలువై ఉంటారు. మూడు ముఖాలలో ఒక ముఖం చిత్రంగా ఉంటుంది.
గుహాలయాలకు చేరుకొనే ముందు పైనించిపడే జలపాతం ఆకట్టుకొంటుంది. కాకపోతే వానా కాలంలోనే జల ప్రవాహం కనపడుతుంది. క్రింద నిలువచేసిన నీటిలో భక్తులు స్నానం చేస్తారు. పక్కనే నిత్యాన్నదాన మండపం ఉంటుంది. శ్రీ కాశీ నాయన ద్వారా వెలుగు లోనికి వచ్చిన భైరవ కోన లో అన్నదానం కూడా ఆయన భక్తుల చలవే !
చుట్టూ పచ్చని ప్రకృతి, స్వచ్ఛమైన గాలి పరిసరాలు హృదయాలను పరవశింపచేస్తాయి.
ఏమిదవ గుహ
వాహనాలను నిలిపే చోట పెద్ద హనుమంతుడు ఆశీర్వదిస్తూ ఆహ్వానం పలుకుతుంటారు.
ప్రకృతిని పరమేశ్వరుని ప్రేమించేవారు తప్పక దర్శించవలన క్షేత్రం భైరవకోన.
నమః శివాయ !!!!