Sholingnur Temples

శ్రీ యోగాంజనేయ స్వామి ఆలయం శోలింగనూర్ లో శ్రీ యోగ నారసింహ స్వామి వెలసిన పెరియ మలకు ఎదురుగా చిన్న మల మీద పడమర ముఖంగా ఉన్న ఆలయంలో కొలువై ఉంటారు శ్రీ యోగాంజనేయ స్వామి. రెండిటి మధ్య దూరం ఒక కిలోమీటరు ఉంటుంది. నడిచి వెళ్ళ వచ్చును. వాహనాల మీద కూడా పర్వత పాదాల వద్దకు చేరవచ్చును. ఈ క్షేత్రంలో అంజనా సుతుడు స్థిర నివాసం ఏర్పరచుకోడానికి సంబంధించిన పురాణ గాధ ఇలా ఉన్నది. లోకాలను తన పాలనలో ఉంచుకొని, సమస్త లోక జనులను హింసిస్తున్న "కుంభోదరుడు" అనే రాక్షసుని సంహరించడానికి దేవతల కోరిక మేరకు సిద్దమయ్యాడట "ఇంద్రదుమ్యుడు" అనే రాజు. అతనికి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇతర దేవతలు కూడా తమ ఆయుధాలను, శక్తులను అందించారట. శ్రీ నారసింహుని ఆజ్ఞ మేరకు హనుమంతుడు, స్వామి వారి శంఖు చక్రాలను ధరించి రాక్షస వధలో రాజుకి తమ వంతు సహాయం అందించారట. అసురుని అంతం చేసిన తరువాత కేసరీ నందనుడు తన స్వామికి ఎదురుగా యోగ ముద్రలో ఉండి పోయారని చెబుతారు. ...