22, జులై 2024, సోమవారం

Veerula Gudi, Karampudi

                         

                             చరిత్రకు సాక్షి వీరుల గుడి 


మన దేశంలో ఎన్నో విభిన్న శైలులలో నిర్మించిన ఆలయాలు కనపడతాయి. ఎన్నో రూపాలలో ఉన్న దేవదేవుడు కొలువై పూజలందుకొంటున్నారు. శ్రీ వినాయకుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ మన్నారాయణుడు తన దశావతార రూపాలైన శ్రీ నారసింహ, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, శ్రీ రంగ నాయకుడుగా , శ్రీ పరమేశ్వరుడు పంచ భూత లింగాలుగా, పంచ ఆరామ క్షేత్ర పాలకునిగా మరెన్నో క్షేత్ర నాధునిగా, అమ్మలగన్న అమ్మ శ్రీ ఆది శక్తి గా దర్శనమిస్తారు. మన దేశంలో  వైష్ణవం, శైవం మరియు శాక్తేయం లాంటి అనేక ఉపాసనా పద్దతులను అనుసరించడం కూడా కనపడుతుంది. 
నిరాకారుడైన పరమాత్మకు రకరకాల రూపాలలో ప్రతిష్టించిన  తరువాత భక్తులు తమకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం వహించిన గురువులు, అవధూతల మందిరాలను కూడా నిర్మించి ఆరాధిస్తున్నారు. 
మరో విశేషం ఏమిటంటే మన పురాణాల ప్రకారం ప్రతినాయకులాగా చిత్రీకరించబడిన రావణాసురుడు, సుయోధనుడు, కర్ణుడు మరియు శకుని లాంటివాళ్లకు కూడా ఆలయాలు ఉండటం భారతదేశంలోనే సాధ్యం. 
మన దేశంలో మరో గొప్ప సంస్కృతి నెలకొని ఉన్నది. దేశం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధుల గౌరవసూచనగా వారికి సైనికవందనంతో రాజలాంఛనాలతో అంతిమసంస్కరణ చేస్తారు. బిరుదులు ఇస్తారు. శిలా విగ్రహాలను పెడతారు. వారి జయంతి లేదా వర్ధంతి రోజున వారిని స్మరించుకొంటారు. 
బహుశా ఈ సంప్రదాయం ఎప్పటి నుండో ఉండి ఉండాలి. దీనికి భిన్నంగా మన రాష్ట్రంలో ఉన్న ఒక ఆలయం(గుడి) ఉన్నది. ఇక్కడ ఒక గొప్ప యుద్ధంలో అమరులైన వారిని గత ఎనిమిది వందల సంవత్సరాలుగా స్మరించుకొంటున్నారు. ప్రతి సంవత్సరం గొప్ప ఉత్సవాన్ని వారి గుర్తుగా ఘనంగా నిర్వహిస్తున్నారు.  
ఆ గుడి ఏమిటో ఎక్కడ ఉన్నదో  ఆ వివరాలు ఏమిటో చూద్దాము. 












ఆంధ్ర మహా భారతం 

పంచమ వేదంగా కీర్తించబడే మహాభారత పురాణానికి మన రాష్ట్రంలో పన్నెండవ శతాబ్దంలో జరిగిన పల్నాటి యుద్దానికి ఎన్నో పోలికలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 
ద్వాపర యుగంలో రాజ్యాధికారం కోసమే కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేసిన కౌరవులకు వారి దుష్టపన్నాగాలను సహనంతో భరించిన పాండవులకు మధ్య జరిగింది కురుక్షేత్ర యుద్ధం. 
కలియుగంలో ఒకే తండ్రి బిడ్డలు అయిన నలగామ రాజు, మలిదేవ రాజుల మధ్య జరిగింది పలనాటి యుద్ధం. ఇది కూడా దరిదాపుగా పై కారణాల వలననే సంభవించినది. 
 అక్కడ అన్నదమ్ముల బిడ్డలు. ఇక్కడ ఒకే తండ్రికి జన్మించినవారు. 
అక్కడ మామ శకుని. ఇక్కడ నాయకురాలు నాగమ్మ. 
అక్కడ పాచికలు. ఇక్కడ కోడి పందెం. 
అక్కడ కురుక్షేత్రం. ఇక్కడ కారంపూడి. 
అక్కడ శ్రీ కృష్ణుడు. ఇక్కడ బ్రహ్మనాయుడు. 
రెండు కాలాలలో జరిగిన యుద్ధంలో లక్షల సంఖ్యలో జరిగిన జన, జీవ నష్టం అంతిమంగా లభించిన ఫలితం. 

పూర్వ గాథ 

నేటి మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ ప్రాంతాన్నినాడు పాలించిన కార్తవీర్యార్జనుని వారసులైన  హైహేయ వంశానికి చెందిన అనుగు రాజు పన్నెండవ శతాబ్దకాలంలో ఆంధ్రప్రాంతానికివచ్చారట గుంటూరు జిల్లాలోని చెందోలును రాజధానిగా చేసుకొని పాలిస్తున్న వెలనాటి చోడులను ఓడించాడు. వారి కుమార్తెను వివాహం చేసుకోవడమే కాకుండా పలనాటి సీమను వరకట్నంగా తీసుకొన్నాడు. గురజాలను రాజధానిగా చేసుకొని పాలన సాగించాడు. 
ఆయనకు విద్యావంతుడు, గొప్ప వీరుడు, న్యాయకోవిదుడు, పరిపాలనాదక్షుడు,  అసామాన్య యుద్ధతంత్ర నిపుణుడు, సంఘసంస్కర్త అన్నింటికీ మించి దైవాంశసంభూతుడు అని ప్రజలు విశ్వసించే బ్రహ్మనాయుడు మంత్రి. 
అనుగురాజు తదనంతరం ఆయన పెద్ద కుమారుడు నలగామ రాజు రాజ్యాధికారం చేపట్టాడు. తమ్ములు మరియు బ్రహ్మనాయుని సహకారంతో రాజ్యాన్ని విస్తరించాడు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారు. 
కానీ కులాల పట్ల సదభిప్రాయం లేని బ్రహ్మనాయుడు నాటి సమాజంలోని అట్టడుగు వర్గాలవారిని చేరదీసి కీలక పదవులను ఇవ్వడం, అన్ని కులాలవారు పక్కపక్కనే కూర్చొని సహపంక్తి భోజనం చేసే "చాపకూడు" ను అమలులోకి తేవడం కొంతమందికినచ్చలేదు . 
దీనికి మరొకటి తోడయ్యింది. బ్రహ్మనాయుడు వైష్ణవుడు. శ్రీ చెన్నకేశవస్వామి భక్తుడు. భూరి విరాళాలు స్వామివారి ఆలయాలకు ఇచ్చాడు. 
వర్ణసంక్రమణం చేయడం, క్రింది వర్గాలవారిని అగ్రవర్ణాలవారితో సమానంగా గౌరవించడం సహించలేని వారి సహకారంతో నాయకురాలు నాగమ్మ నలగామ రాజు యొక్క ప్రాపకం సంపాదించినది. 
నెమ్మదిగా సవతి సోదరుల  గురించి,బ్రహ్మనాయకుని గురించి లేనిపోనివి చెప్పి మహారాజు కు వారిపట్ల ద్వేషభావం నెలకొనేలా చేసింది. దీనితో రకరకాల సమస్యలు ఎదుర్కొన్న బ్రహ్మనాయుడు , మలిదేవరాజు సోదరులను తీసుకొని మాచర్ల చేరుకొని అక్కడ రాజ్యస్థాపన చేసాడు. కొద్దీ రోజులలలోనే మాచర్ల రాజ్య వైభవం గురజాల చేరింది. తట్టుకోలేకపోయిన నాగమ్మ నలగామరాజు తో మలిదేవాదులను కోడి పందాలకు ఆహ్వానం పంపినది. 
మయా పాచికలతో ఎలా పాండవరాజ్యం కౌరవుల వశం అయ్యిందో అదేవిధంగా మోసపూరిత కోడి పందాలలో మలిదేవాదులు రాజ్యం కోల్పోయారు. 
వారు కృష్ణానది దాటి అక్కడ ఉండసాగారు. పందెం తాలూకు షరతు ఏడు సంవత్సరాలు. కాలం ముగిసినా గురజాల వారు రాజ్యం ఇవ్వకపోగా బ్రహ్మనాయుడు పంపిన దూతను చంపడంతో యుద్ధం తప్పలేదు. 
నాగులేటి వాగు ఒడ్డున ఉన్న  "కార్యమాపూడి లేక కార్యంపూడి"(కారంపూడి) వద్ద రెండు సైన్యాలు భీకర యుద్ధం చేశాయి. యోధానుయోధులందరూ మరణించారు. చివరకు మిగిలిన ముఖ్యులు నలగామరాజు, బ్రహ్మనాయుడు, నాగమ్మ. 
తన మూలంగా జరిగిన వినాశనానికి పశ్చాతాపం తో నాగమ్మ వెళ్లి పోయింది. 
బ్రహ్మనాయుడు నలగామ రాజుకు రాజ్యం అప్పగించి తాను గుత్తికొండ బిలం లోనికి వెళ్ళిపోయాడు. 







వీరుల గుడి 

బ్రహ్మనాయుని సైన్యంలో అన్ని కులాల వారు ఉన్నారు. పలనాటి యుద్ధంలో ముఖ్యపాత్ర పోషించిన మలిదేవ రాజు,అతని  సోదరులు, కన్నమ దాసు, బాలచంద్రుడు, కొమ్మరాజు అతని తమ్ములు ఇలా అరవైఆరు మంది వీరుల పేరిట నాగులేటి ఒడ్డున  ప్రతిష్టించి, వారి ఆయుధాలను అక్కడ ఉంచి సద్గతులు  ప్రార్ధనలు చేసి గుత్తికొండ బిలం కి వెళ్లిపోయారు. 
అనంతరం  కాకతీయులు, శాతవాహనులు, రెడ్డి రాజులు,  చోళులు, విజయనగర రాజులు పలనాటి సీమను పరిపాలించారు. 
ఎందరు పాలకులు వచ్చినా కార్తీక మాసంలో అరవై ఆరు యుద్ధ వీరుల వంశాలవారు తరలివచ్చి ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరిపి తమవారికి ఘన నివాళులు సమర్పించేవారట. 
ఢిల్లీ సుల్తాను, ఆర్కాట్ నవాబు చాలాకాలం ఈ ప్రాంతాన్ని పాలించారు అని చరిత్ర తెలుపుతోంది. ఈ నవాబుల కాలంలో వీరుల గుడి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకొన్నది అంటారు. 
నవాబు సైనికులు జాఫర్ మరియు ఫరీద్ అనే ఇద్దరు సేనాపతుల నాయకత్వంలో ఈ ప్రాంతాలకు వచ్చారట. 
అప్పటికి వీరుల గుడిలోని లింగాలు మట్టిలో కలిసిపోయాయి. సైనికులు వాటిని సాధారణ రాళ్లుగా భావించి వాటి మీద గిన్నెలను ఉంచి వంట చేసుకున్నారట. ఆహరం తిన్న వెంటనే సైన్యం మొత్తంగా అస్వస్థతకు గురైనదట. కారణం తెలీక సేనాధిపతులు ఏమిచేయాలో పాలుపోని పరిస్థితులలో ఉండిపోయారట. నాటి రాత్రి జాఫర్ కు శ్రీ చెన్నకేశవ స్వామి స్వప్న దర్శనమిచ్చి  " మీరు వంట చేసుకొన్న రాళ్లు వీరుల జ్ఞాపకార్ధం వేసినవి. వారంతా నా భక్తులు. మీరు చేసిన పొరబాటుకు మీరంతా అనారోగ్యానికి గురయ్యారు. వారికి క్షమాపణ కోరుకొని ఒక గురి నిర్మించండి" అని ఆదేశించారట. 
మరునాటి ఉదయం సేనాపతులు ఊరి  పిలిచి విచారించగా కలలో శ్రీ చెన్నకేశవుడు చెప్పింది నిజమని తేలడంతో వారు ప్రస్తుతం నాగులేటి ఒడ్డున ఒక గుడిని నిర్మించారట. 
అలా ప్రస్తుత ఆలయం నెలకొన్నది. 







ఆలయ విశేషాలు 

నాగులేటి వాగు ఒడ్డున ప్రధాన రహదారి మీదనే ఉంటుంది ఆలయం. 
విశాల ప్రాంగణం లో అనేక నిర్మాణాలు కనిపిస్తాయి. 
విశాల మైదానంలో  కనిపించే మండపంలో  యుద్దభూమికి వెళ్లే వీరసైనికులకు బ్రహ్మనాయుడు స్వయంగా శంకు తీర్ధం ఇచ్చేవారట. అందుకని శంకు తీర్ధ మండపం అని పిలుస్తారు. 
పక్కనే బ్రహ్మనాయుడు ప్రతిష్టించిన శ్రీ కాలభైరవ మరియు శ్రీ ఎరుకల శక్తి చిన్న రాతి మండపాలలో కనపడతారు. 
దక్షిణ ద్వారం గుండా ప్రాంగణం లోనికి వెళితే ఎదురుగా వీరుల గుడి కనపడుతుంది. ఆస్థాన మండపం, గర్భాలయం అంతే ! 
ఆస్థాన మండపంలో పడిగం, కట్టే, పోతురాజు శిల కన్పిస్తాయి. గర్భాలయంలో అరవైఆరు యోధుల పేరిట వేసిన లింగాలు వారి ఆయుధాలు అయిన కుంతలం(త్రిశూలం), సామంతుల (చిన్న త్రిశూలం, ఖడ్గం కనిపిస్తాయి. వాటికే భక్తులు పూజలు చేస్తారు. 
ప్రాంగణంలో ఇంకా బలి ఇవ్వడానికి ఏర్పాటు చేసిన స్థానాలు, ఒక రాతి తోరణం, కన్నమదాసు గుడి తో పాటు రెండు సమాధులు కనిపిస్తాయి. 
అవి మరెవెరివో కాదు వీరుల గుడిని పునరుద్ధరించిన నవాబు సేనాపతులైన జాఫర్ మరియు ఫరీద్ లవి. ఎందరో వీరులను కన్న ఈ ప్రదేశంలో మరణించడం కూడా గొప్ప విషయం అన్న భావనతో వారు ఇక్కడే ఉండి పోయారట








ఆలయ ఉత్సవాలు 

ప్రతిరోజూ భక్తులు వచ్చి తమ మొక్కుబడులు తీర్చుకొని, వంటలు చేసుకొని నివేదన పెట్టి తాము తిని పెట్టి వెళ్ళిపోతారు. 
కానీ ప్రధాన ఉత్సవాలు కార్తీక మాసంలో చివరలో జరుగుతాయి. 
వీరులగుడి పలనాటి వీరాచార పీఠం యొక్క పీఠాధిపతి ఆధ్వర్యంలో ఉంటుంది. బ్రహ్మనాయుడు స్వయంగా "పిడుగు"వంశం వారిని నియమించారు.నేటికీ వారి వారసులే గుడిని నిర్వహిస్తుంటారు. 
కార్తీక పౌర్ణమి రోజున పీఠాధిపతుల సమక్షంలో కార్తీక అమావాస్య నుండి అయిదు రోజుల పాటు పలనాటి వీరుల గుడి ఉత్సవాలు జరుగుతాయని ప్రకటిస్తారు. అదే రోజున బ్రహ్మనాయుని నృసింహ కుంతలం. బాల చంద్రుని సామంతరాగోల, కన్నమదాసు భైరవ ఖడ్గం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం నుండి సగౌరవంగా తెచ్చి నాగులేటిలో వీరుల గుడి వెనుక ఉన్న "గంగాధరీ మడుగు" అన్న ప్రదేశంలో పవిత్ర స్నానం చేయిస్తారు. చుట్టుపక్కల గ్రామాలలో  గురించి టముకు వేయిస్తారు. 
గుడిలో ఉత్సవాల ఆరంభానికి గుర్తుగా జెండా ఎగురవేస్తారు.
ఈ అయిదు రోజుల ఉత్సవాలను "రాచ గావు, రాయబారము, మందపోటు, కోడిపోరు, కల్లిపాడు" అనే పలనాటి యుద్ధం గురించి తెలిపే అయిదు అంశాలుగా విభజించి రోజుకొక అంశాన్ని ప్రదర్శిస్తారు. 
 పిన్న పెద్దలు,  పోతురాజుల,కన్నమనీడులు, ఆచారవంతులు అందరూ దూరప్రాంతాల నుండి కూడా తరలివస్తారు. తమ వీరుల కుంతలాలను తీసుకొనివస్తారు. పూజలు నిర్వహిస్తారు.  
ఆ పదిహేను రోజులు ముఖ్యంగా ఉత్సవం జరిగే అయిదు రోజులు కారంపూడి లో పండుగ వాతావరణం వెళ్లి విరుస్తుంది. 
ఊరిలోని పురాతన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం మరియు శ్రీ అంకాళమ్మ ఆలయాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. కారంపూడి ఊరి చివర శ్రీ మంత్రాలమ్మ తల్లి ఆలయం ఉంటుంది. 
యుద్దానికి తరలివస్తున్న బ్రహ్మనాయునికి నాగమ్మ అడ్డంకులు సృష్టించిందట. కోపోద్రేకుడైన బ్రహ్మనాయుడు అక్కడ ఉన్న కొండ శిలను తన కుంతలంతో రెండుగా చీల్చాడట. నేటికీ ఆ సంఘటనకు సాక్షిగా నిలిచిన ప్రదేశాన్ని సందర్శించవచ్చును. 












ఒకసారైనా తప్పక చూడవలసినవి కారంపూడి వీరుల గుడి ఉత్సవాలు. 
కారంపూడి, గురజాల, మాచర్ల చుట్టుపక్కల గ్రామాలలో నేటికీ పలనాటి పాలకులు నిర్మించిన కట్టడాల శిధిలాలు కనపడతాయి. 
కారంపూడి సమీపంలోనే గుత్తి కొండ  బిలం ఉన్నది. గురజాలలో శ్రీ ఇష్ట కామేశ్వరీ దేవి ఆలయం, శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, కోట అవశేషాలు కనిపిస్తాయి. 
మాచర్లలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, శ్రీ వీరభద్ర స్వామి ఆలయం , చుట్టుపక్కల అవతార పురుషుడు శ్రీ పరశురాముడు ప్రతిష్టించిన అయిదు శివాలయాలు ఉన్నాయి. 
ఒకసారైనా పలనాడు ప్రాంతాన్ని సందర్శించాలి అనిపించేంత గొప్ప ఆలయాలు మరియు చరిత్రను  తెలిపే నిర్మాణాలు కనిపిస్తాయి. 

జై శ్రీ చెన్నకేశవా !!!! 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...