14, జులై 2024, ఆదివారం

Arunachala Temple information

 అరుణాచల ఆలయ విశేషాలు 

ప్రపంచ వ్యాప్తంగా పరమేశ్వరుడు ఎన్నో విశేష స్థలాలలో కొలువై ఉన్నారన్న సంగతి  తెలిసినదే ! వివిధ నామాలతో స్వామిని భక్తులు కీర్తించడం కూడా మనకు తెలుసు. 
కానీ "ఆరోం అర" (హరోం హర)అన్న పిలుపు ఒక్క తిరువణ్ణామలై కి మాత్రమే సొంతం. భారతదేశంలో మీరు మిక్కిలి తమిళనాడులో వేలాది ఈశ్వర కోవెలలు ఉన్నాయి. వాటి వేటికీ లేని ప్రత్యేకత "గౌరీ నగర్, దాస హాగరు, యాన నగర్, తలచారం, దక్షిణ కైలాసం, సోనగిరి ఆదిగా పేర్లు కలిగిన  అరుణాచలానికి ఈ ప్రత్యేకత రావడానికి కారణం పర్వత రూపంలో పరమేశ్వరుడు కొలువైన ఏకైక స్థలం కావడం ! జ్యోతిర్లింగ ఆవిర్భావ స్థలం తిరువణ్ణామలై. 
జ్యోతి స్వరూపమైన ఈ పర్వతం నుండి చుట్టూ ఉన్న పర్వతాలు శక్తిని స్వీకరించి శోభిల్లుతున్నాయి. 
ఎందరో మహర్షులు, మునులు, సిద్దులు, యోగులు, సర్వసంగ పరిత్యాగులు శివ స్వరూపమైన ఈ పర్వతాన్ని ఆరాధించి ముక్తిని పొందారు. 

నామ ప్రాధాన్యత 

"అణ్ణామలై" అధిరోహించలేని పర్వతం, కొండలకు పెద్దన్న అని అర్ధం. గౌరవ పదం "తిరు" చేరికతో తిరువణ్ణామలై గా కీర్తించబడుతున్నది. 
ఆధిపత్య కోరికతో వాదనకు దిగారు శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ బ్రహ్మ దేవుడు. వాదన తీవ్ర రూపం దాల్చడంతో ఆది అంతాలు లేని జ్యోతి రూపంలో సాక్షాత్కరించారు మహేశ్వరుడు. షరతు మేరకు  విధాత హంస వాహనం మీద ఊర్ధ్వ దిశగా, శ్రీహరి భూవరాహ రూపంలో పాతాళం వైపుకు జ్యోతిర్లింగ ఆది అంతాలను కనుగొనడానికి బయలుదేరారు. కానీ విఫలులై తిరిగి వచ్చారు. వారి అహంకారం తొలగిపోయినది. తమ తప్పిదానానికి క్షమించమని ప్రార్ధించారు. అప్పుడు స్వామి "అన్నాళ్" (జ్యోతి)గా శిఖరాగ్రాన దర్శనమిచ్చారు. సహస్ర నామాలలో "అన్నాళ్" ఒకటి. నయనారులలో ఒకరైన శ్రీ తిరు జ్ఞానసంబందార్ ఈ విషయాన్ని అద్భుతంగా వర్ణించారు. 
అలా కొండ మీద జ్యోతి రూపంలో దర్శనమివ్వడం వలన అణ్ణామలై గా పిలవబడుతున్నారు. 
అణ్ణామలై ని భక్తులు అరుణాచలం మరియు అరుణ గిరి అని పిలుస్తుంటారు. "అరుణ" అంటే పగడపు వర్ణం. చలం లేదా గిరి అనగా (కదలిక లేనిది) పర్వతం. అగ్ని రంగు ఎరుపు వర్ణం కదా ! 
కైలాస నాధుడు జ్యోతి రూపంలో కనపడటం వలన పంచ భూత స్థలాలలో తిరువణ్ణామలై అగ్ని క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. 

ఆలయ చరిత్ర మరియు విశేషాలు 

అరుణగిరి పాదాల వద్ద తూర్పు ముఖంగా పాతిక ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఆలయానికి నాలుగు దిక్కులలో ఎత్తైన గోపురాలు , వాటిని కలుపుతూ దృఢమైన ఎత్తైన ప్రహరీ గోడ నిర్మించబడినది. గిరి మార్గంతో కలిపి మొత్తం ఏడు ప్రాకారాలుగా కనిపిస్తుంది. అపర కైలాసం. 
తూర్పున పదకొండు అంతస్థులతో రెండువందల పదిహేడు అడుగుల ఎత్తైన రాజగోపురం అంబరాన్ని తాకేలా కనపడుతుంది. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో 1516వ సంవత్సరంలో విజయనగర శైలిని ప్రదర్శించే ఈ గోపుర నిర్మాణం జరిగింది. 
స్వామివారి తిరుమంజనం (అభిషేకం) కొరకు నీటిని ఈ మార్గం గుండా తెస్తారు కనుక దక్షిణం వైపున ఉన్న 157 అడుగుల గోపురాన్ని "తిరుమంజన గోపురం" అని పిలుస్తారు. చక్కని పురాణ ఘట్టాల శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి. 
పడమర దిక్కున గిరికి అభిముఖంగా 144 అడుగుల "పై గోపురం" ఉంటుంది. ఉత్తర దిశలో అమ్మణి అమ్మన్ అనే శ్రీ అరుణాచలేశ్వరుని భక్తురాలు నిర్మించడం చేత ఆమె పేరుతో  "అమ్మణి అమ్మన్ గోపురం" అని పిలుస్తారు. 
దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తమిళనాడులో పెద్ద ఆలయాలలో ఒకటైన శ్రీ ఉణ్ణామలై సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం"లో అనేక విశేషాలు కనిపిస్తాయి. 
ముఖ్యమైనది వేదాలలో వర్ణించినట్లుగా ఆది అంతాలు లేని నిరాకారుడైన నటరాజు ఇక్కడ గర్భాలయంలో స్వయంభూ లింగరూపంలో, ఆలయం వెనుక అధిరోహించలేని పర్వత రూపంలో దర్శనమిస్తారు. అంతే కాదు జన్మ జన్మల పరంపర నుండి విముక్తి కోరుకొనేవారికి ముక్తిని ప్రసాదించే ముక్తి ప్రదాత. 
రాజ గోపురానికి వెలుపల ఉన్న మాడ వీధులను, గిరి మార్గాన్ని కాకుండా లెక్క వేస్తే ఆలయం లోపల అయిదు ప్రాకారాలు ఉంటాయి. తూర్పు రాజగోపురానికి చేరుకొనే వర్ణమయ పదహారు స్తంభాల మండపం, నాలుగు స్తంభాల మండపం కనిపిస్తాయి. 
రాజ గోపురంలో దర్శనమిస్తారు "గోపుర గణపతి".  విఘ్ననాయకునికి మొక్కి ప్రాంగణం లోనికి  వెళితే ఎదురుగా "కంబత్తు ఇళయనార్ సన్నిధి" కనిపిస్తుంది. భక్తుడైన శ్రీ అరుణగిరినాథర్ కీర్తనలకు సంతసించి ప్రౌఢ దేవరాయలు శ్రీ కుమార స్వామి స్తంభంలో దర్శనమిచ్చినది ఇక్కడే ! ఈ సన్నిధి వెనుక "జ్ఞానపాల్ లేక వళై కప్పు మండపం" పక్కన "శివ గంగ తీర్థం"పుష్కరణి. కోనేరుకు మెట్ల దారిలో పాటు నాలుగు దిక్కులా "తిరుమలపతి మండపం నిర్మించారు. కొలను నైరుతిలో శ్రీ సిద్ది వినాయక సన్నిధి. 
తమిళనాడులో వెయ్యికాళ్ల మండపం సుమారు తొమ్మిది ఆలయాలలో మాత్రమే కనిపిస్తుంది. వాటిలో శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం ఒకటి. విజయనగర రాజులు నిర్మించిన ఈ మండప చివర పాతాళ లింగం ఉంటుంది. భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇక్కడ చాలా కాలం ధ్యానంలో గడిపారు. 
శ్రీ సిద్ది వినాయక సన్నిధి మరియు పాతాళ లింగం మధ్యన రుద్రాక్ష మండపం మరియు పెరియ (పెద్ద) నంది మండపం ఉంటాయి. పెరియ నందికి ఎదురుగా వీర శైవుడైన వళ్ళాల రాజు 1340 వ సంవత్సరంలో కట్టించిన "వళ్ళాల గోపురం" కనిపిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన కవి శ్రీ అరుణగిరినాథర్ ఆత్మహత్య చేసుకోడానికి ఈ గోపురం పై నుండి దూకారు. అప్పుడు పార్వతీ నందనుడు ఆయనను కాపాడారు. అందువలన గోపురానికి ఎడమ పక్కన " శ్రీ గోపుర ఇల్లియనార్ సన్నిధి" ఉంటుంది. ఇందులో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. గోపుర కుడి పక్కన శ్రీ కళ్యాణ సుందర స్వామి సన్నిధి. 
 వళ్ళాల గోపురం దాటి నాలుగవ ప్రకారం లోనికి ప్రవేశిస్తే అక్కడ ఎడమ పక్కన శ్రీ కాల భైరవ సన్నిధి బ్రహ్మ తీర్థం ఒడ్డున ఉంటుంది.  ఈ ప్రాకారం లోనే తీర్థవారి మండపం మరియు పురవి మండపం ఉంటాయి. ప్రస్తుతం పురవి మండపాన్ని ఆలయ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. 
ఆధ్యాత్మిక మరియు కావ్య సంబంధిత గోష్టి జరిగే శక్తి విలాస మండపం కూడా కనిపిస్తుంది. 
ఈ ప్రాకారంలో దక్షిణం వైపున విఘ్నేశ్వర, నళేశ్వర, విద్వత్బరేశ్వర మరియు బ్రహ్మలింగేశ్వర సన్నిధులు ఆ పక్కన ఆలయ గోశాల ఉంటాయి. తిరుమంజన మరియు అమ్మణి అమ్మన్ గోపురాలు, చిన్న నంది మండపానికి ఎదురుగా కిళి గోపురం. 
ఈ ప్రాకార పడమటి వైపున అంటే పై గోపురం వైపున అమావాస్య మండపం, వినాయక సన్నిధి, స్థూల సూక్ష్మాందార్, తిరుపాద సన్నిధి మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి కలవు. 
నాలుగవ ప్రాకారం నుండి మూడవ ప్రాకారానికి దారి తీసే కిళి గోపురానికి ఆ పేరు రావడానికి వెనుక ఒక గొప్ప శివ పరివార భక్తుని కధ ఉన్నది. 
ప్రౌఢ దేవరాయలు స్తంభత్తు ఇలియనార్ సన్నిధిలో శ్రీ సుబ్రహ్మణ్య సాక్షాత్కారంతో దృష్టిని కోల్పోయాడు. తిరిగి చూపు రావడానికి స్వర్గ లోకంలోని పారిజాత పుష్పం కావాలని వైద్యుల చేత చెప్పిస్తాడు శ్రీ అరుణగిరినాథర్ పట్ల ద్వేష భావం కలిగిన సంబందన్. ఆ మాటలు నమ్మి పరకాయ ప్రవేశం చేసి చిలక శరీరంతో దేవలోకానికి వెళ్లారు అరుణగిరినాథర్. కొద్ది రోజులు గడిచిన తరువాత ఆయన పూర్తిగా చనిపోయాడు అన్న పుకారు పుట్టించి భద్రపరచిన అరుణగిరినాథర్ శరీరాన్ని దహనం చేయిస్తాడు సంబంధన్. మరికొన్ని రోజులకు పారిజాత పుష్పంతో అరుణగిరినాథర్ తిరిగి వచ్చారు. 
తన మానవ దేహం దహనం అయినది అని తెలుసుకొన్న అరుణగిరినాథర్ చిలక శరీరంతో ఈ గోపురంలో నివసించారు. తమిళంలో "కిళి" అనగా చిలక. ఈ ఉదంతానికి నిదర్శనంగా గోపురం మీద చిలక బొమ్మ ఉంచడం జరిగింది. 
ఇక్కడ ఒక విషయాన్ని ఉదాహరించాలి. అణ్ణామలయ్య ఆలయం గోపురాలకు నిలయం. ప్రధాన ప్రాకారానికి నాలుగు గోపురాలు ఉన్నాయి అని చెప్పుకొన్నాము కదా. వాటితో కలిపి మొత్తం తొమ్మిది గోపురాలు ప్రాకారానికి ఒకటి చొప్పున కన్పిస్తాయి. అదే\విధంగా గర్భాలయంలో పాటు అమ్మవారి సన్నిధి, ఉపాలయాలు మీద ఉన్న విమానాలను లెక్కిస్తే అవి కూడా తొమ్మిది ఉండటం విశేషం. 
పైన చెప్పుకోవడం జరిగింది మండపాల గురించి. మరెన్నో సుందర శిల్పాలతో కూడిన మండపాలు చాలా ఉంటాయి ఆలయంలో!
కిళి గోపురం గుండా మూడవ ప్రకారం లోనికి ప్రవేశిస్తే ఎదురుగా కట్చి మండపం. ఈ పదహారు స్తంభాల మండపాన్ని "మంగైయార్కరాశి" అనే భక్తుడు నిర్మించారు. కార్తీక దీపోత్సవ ఉత్సవాల సందర్బంగా పంచ మూర్తులను(ఉత్సవ మూర్తులు)ఈ మండపం లోనే ఉంచుతారు. 
ఈ ప్రకారం ఉత్తర దిక్కున శ్రీ పిదారి అమ్మన్ సన్నిధి వద్ద పవిత్ర వృక్షంతో పాటు చుట్టూ పంచ భూత స్థలాల ఆలయాలు కలవు. 
ఇవి కాకుండా కళ్యాణ మండపం, విఘ్నేశ్వర, భీమేశ్వరస్వామి సన్నిధులు కూడా ఉంటాయి. పడమర వైపున అరుణగిరి యోగేశ్వర సన్నిధి కలదు. ఇక్కడ పరిపూర్ణ ఏకాగ్రతతో ధ్యానం చేస్తే గొప్ప అనుభూతులు లభిస్తాయి. 
కట్చి మండపం దాటగానే ఎదురుగా స్వర్ణమయ కాంతులు చిమ్ముతూ బంగారు ధ్వజస్థంభం, శ్రీ అరుణగిరీశ్వర స్వామి సన్నిధి కనిపిస్తాయి. వెలుపలి మండపానికి ఇరుపక్కలా శ్రీ సంబంధ వినాయకర్ మరియు శ్రీ పళని ఆండర్ కొలువై ఉంటారు. మండపంలో అధికార నందికి నమస్కరించి రెండవ ప్రకారం లోనికి వెళితే నలవర్, మూలవర్, 63 మంది నయనారులు, చక్కిలార్, వ్యోమ మరియు కాశి లింగాలు కనపడతాయి. 
ప్రదక్షిణ పధంలో క్షేత్ర వినాయక, వినాయక, బ్రహ్మ లింగం, సోమస్కందార్, అమ్మ వారు, అర్ధనారీశ్వర, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కృష్ణ, హనుమాన్, గరుడ, విక్రపండీశ్వర, వరుణ లింగం, గజలక్ష్మి, శ్రీ వల్లీ దేవసేన సమేత అర్ముగనాథర్,సహస్రలింగం, శాంత లింగం, శ్యామలాంబ, జ్యేష్ఠాదేవి, వాయు లింగం, అన్నపూర్ణాదేవి, శ్రీ సుబ్రహ్మణ్య ఉత్సవ మూర్తులు, నటరాజ, బిక్షందార్, చంద్రశేఖర, కుబేర లింగం, 63 మంది నయనారుల ఉత్సవ విగ్రహాలు, భక్తానుగ్రహ సోమస్కందార్, విశ్వామిత్రేశ్వర, పతంజలీశ్వర్, వ్యాఘ్రపాదేశ్వర, అగస్తీశ్వరా, జూలేశ్వర, కాలసంహార, 108 లింగం, సోమ భైరవ, తిరుపల్లివారై, శ్రీ నటరాజ, శ్రీ శివకామ సుందరి, ఆది శేష తీర్థం(బావి), స్వామివారి తిరువాభరణాలు ఉండే ఖజానా కనిపిస్తాయి. 
రథ విళక్కు, ప్రదోష నంది దాటిన తరువాత మొదటి ప్రాకారం లేదా గర్భాలయానికి చేరువ అవుతుంది. గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ దక్షిణామూర్తి, లింగోద్భవ, శ్రీ దుర్గాకొలువై ఉంటారు. ఉత్తర ద్వారం వద్ద శ్రీ చెండికేశ్వర స్వామి సన్నిధి. 
గర్భాలయంలో స్వయంభూ లింగ రూపంలో శ్రీ అరుణాచలేశ్వర స్వామి రమణీయ అలంకరణలో దర్శనమిస్తారు. ఒక్క క్షణం స్వామిని కనులారా చూసిన చాలు అనిర్వచనీయమైన ఆనందానుభూతి పొందగలరు భక్తులు. 
ఉత్తరం వైపున ఉన్న శ్రీ ఉణ్ణామలై అమ్మన్ లేదా అపితకుచాంబ దేవి సన్నిధికి చేరుకొంటే తొలుత శ్రీ విజయ రాఘవ వినాయక దర్శనం లభిస్తుంది. గర్భాలయంలో రమణీయ అలంకరణలో అమ్మలగన్న అమ్మ శ్రీ ఉణ్ణామలై అమ్మ తన చల్లని చూపులతో భక్తావళిని అనుగ్రహిస్తారు. 
తిరువణ్ణామలై ఒక అద్భుతం. పర్వతం,స్థలం, మూర్తి, అమ్మవారు, ఆలయ వృక్షం, తీర్థం అన్నీ విశేషమైనవే !
విఘ్ననాయకుడు సంబంధ వినాయకర్ గా అనేక రూపాలలో, పేర్లతో కొలువైన ఏకైక ఆలయం 
స్థలం త్రిమూర్తులు, దేవతలు నడయాడిన స్వయం సర్వేశ్వరుడు గిరి రూపంలో వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం. 
శ్రీ అరుణాచలేశ్వర స్వామి ప్రధాన మూర్తి. స్వామికి అనేక నామాలు ఉన్నట్లుగా ఆలయంలోని శాసనాలు తెలుపుతాయి. స్మరణ మాత్రాన ముక్తిని ప్రసాదించే దయాళువు. 
అమ్మవారు శ్రీ ఉణ్ణామలై అమ్మన్ లేదా శ్రీ అపిత కుచాంబ. శ్రీ పార్వతీ దేవి తిరువణ్ణామలై లోనే పరమేశ్వరునిలో అర్ధభాగం పొందారు. భక్తాభయ ప్రదాయని. 
ఇక తీర్థం విషయానికి వస్తే ఒకప్పుడు తిరువణ్ణామలై లో 366 పుష్కరుణులు ఉండేవట ! కాలక్రమంలో చాలా మటుకు అంతరించిపోయాయి. ప్రస్తుతం వాటిని పునరుద్దరించే కార్యక్రమానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆలయంలో ఉన్న శివ గంగ మరియు బ్రహ్మ తీర్ధాలు పవిత్రమైనవి. 
 ఆలయ వృక్షం "పొగడ చెట్టు (మార్గళి మారం). ఆలయ మూడో ప్రాకారంలో క్యూ లైన్ల వద్ద కనిపిస్తుంది. 

అసత్యానికి అనుమతి లేదు 

పదవీ కాంక్ష ఎంతటివారినైనా దిగజారుస్తుంది అన్న దానికి శాశ్విత ఉదాహరణ జ్యోతిర్లింగ ఆద్యంతాలు కనుగొనే క్రమంలో బ్రహ్మ చేసిన అతి పెద్ద తప్పు అసత్యం చెప్పడం. 
భూవరాహ రూపంలో పాతాళానికి వెళ్లిన శ్రీ మన్నారాయణుడు లింగ ఆవిర్భావ స్థలాన్ని కనుగొనడంలో విఫలమయ్యారు. పైకి వచ్చి తన అసహాయతను అంగీకరించారు. ఊర్ధ్వ ముఖంగా వెళ్లిన విధాత కూడా లింగ పైభాగాన్ని కనుగొనలేక పోయారు.కానీ ఓటమిని ఒప్పుకోవడం ఇష్టంలేక జ్యోతిర్లింగ పైభాగం నుండి క్రిందకు రాలిన మొగలి పువ్వును సాక్ష్యంగా తీసుకొని వచ్చారు. సర్వాంతర్యామి ఆగ్రహించి వాణీపతికి ఇలలో పూజార్హత లేకుండా శపించారు. 
తిరువణ్ణామలైలో అసత్యం, మోసం. పర లేక దైవ లేక సాదు నింద చేయడం వలన శివానుగ్రహం పొందలేరు. 
నిర్మల మనస్సుతో, ఏకాగ్రతతో అరుణాచల శివ నామస్మరణ చేసేవారు ఆదిదంపతుల అనుగ్రహం కోరకనే పొందుతారు. 

పార్వతీ దేవి పరమేశ్వరుని అర్ధభాగం పొందిన వృతాంతం 

ఈశ్వరాదేశంతో కాంచీపురం నుండి తిరువణ్ణామలై చేరుకొన్న పార్వతీదేవి శ్రీ గౌతమ మహర్షి వద్ద అరుణగిరి యొక్క ఆవిర్భావ వృత్తాంతాన్ని,గొప్పదనాన్ని, ఆరాధించే విధానాన్ని తెలుసుకొన్నారు. 
కొంత కాలం గౌతమ ఆశ్రమంలో, మరికొంత కాలం పావళ కున్రు నుండి స్వామిని అత్యంత భక్తిశ్రద్దలతో స్మరిస్తూ తీవ్ర తపస్సు చేశారు. ప్రతి నిత్యం శివ నామస్మరణ చేస్తూ మహర్షి బోధించిన పద్దతిలో గిరి ప్రదక్షిణ చేసేవారు. ఈ సమయంలో మహిషాసురుడు ఆమె ను చూసి మోహించాడు. ఆగ్రహించిన దేవి అసురుని, అతని సమస్త పరివారాన్నిసంహరించారు. 
లోకకంటకుని రక్తంతో మలినమైన తన హస్తాలను శుభ్రపరుచుకోడానికి కత్తితో కొండ నుండి నీటి జలను రప్పించారు. అదే శ్రీ దుర్గ దేవి కోవెలలో కనిపించే "ఖడ్గ తీర్థం". మహిషాసురుని ఖంఠం నుండి తీసిన ఈశ్వర లింగాన్ని నీటితో శుభ్రపరిచి అక్కడ ప్రతిష్టించారు. 
ఆమె దీక్షకు సంతసించిన మహేశ్వరుడు సాక్షాత్కారించి "నీవు నా కనులు మూసి లోకాల ప్రళయానికి దారి తీయడం వలన పొందిన పాపం తొలగిపోయింది. త్వరలో నిన్ను నా వద్దకు రప్పించుకొంటాను " అని శలవిచ్చారు. 
సంతసించిన పార్వతీదేవి ఉత్తరాషాఢ నక్షత్రం రోజు "దేవ యాగం" ప్రారంభించి కృత్తికా నక్షత్రం రోజున పూర్తి చేసారు. తరువాత మహాలక్ష్మి, సరస్వతి, సమస్త దేవతలు, మహర్షులు వెంటరాగా గిరి ప్రదక్షిణ చేసి ఆలయం వద్దకు చేరుకొన్నారు. 
నందివాహనం మీద అక్కడ ఉన్న ఉమాపతి ఆమెను ఎక్కువ చేర్చుకొని తన శరీరంలో అర్ధభాగాన్ని ప్రసాదించి అర్ధనారీశ్వరునిగా దర్శనం ఇచ్చారు. ఈ సంఘటన జరిగింది కార్తీక పొర్ణమి రోజున!
ఈ మహత్తర పౌరాణిక సంఘటన గుర్తుగా కార్తీక దీపోత్సవాన్ని జరుపుతారు. ఆ సమయంలో ఆలయం నుండి శ్రీ అర్ధనారీశ్వర స్వామి వెలుపలికి వచ్చి కార్తీక దీపాన్ని వీక్షించి, భక్త జనులను ఆశీర్వదిస్తారు. 

పురాణ గ్రంథ విశ్లేషణ  

పైన ఉదహరించిన సంఘటనలు మాత్రమే కాకుండా క్షేత్రంతో ముడిపడి ఉన్న అనేక  ఇతర విషయాల గురించి ఎన్నో పురాతన గ్రంధాలలో పేర్కొనబడినది. 
మూడువేల సంవత్సరాల క్రిందటిదిగా పండిత పామర విశ్వాసాన్ని చూరగొన్న తమిళ గ్రంధం "శిలప్పాధికారం". కార్తీక పౌర్ణమి నాడు అరుణగిరి మీద మహారాజు లేదా ఆయన వారసులు కార్తీక దీపాన్ని వెలిగిస్తారు అని స్పష్టంగా పేర్కొన్నది అని తెలుస్తోంది. 
అదే విధంగా పురాతన జైన గ్రంధం " జీవక చింతామణి"తో పాటు పురాతన తమిళ గ్రంధాలైన "కర్ నార్పట్టు మరియు కలవళి నార్పట్టు" అనే వాటిలో కూడా కార్తీక దీపోత్సవ ప్రస్థాపన ఉన్నట్లుగా చెబుతారు. సుమారు ఏడవ శతాబ్దానికి చెందిన 63 మంది నయనారులలో ప్రసిద్ధులైన "అప్పార్ మరియు సంబందార్" తమ పాటికాలలో కార్తీక దీపోత్సవాన్ని వర్ణించారు. 
వీటన్నింటిలో "మానవాళిలో నెలకొని ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని దహించివేసి జ్ఞానమనే దీపాన్ని వారిలో వెలిగించేదే కార్తీక దీప ముఖ్య సందేశం అనే అర్ధంలో తెలుపబడింది. 

కార్తీక దీపోత్సవాలు 

తిరువణ్ణామలై లో ప్రతి ఒక్క ముఖ్య ఘట్టం కార్తీక దీపంతో ముడిపడి ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. బ్రహ్మ విష్ణువులు జ్యోతిర్లింగ ఆద్యంతాలు కనుగొనడంలో విఫలమై ప్రార్ధించినప్పుడు ప్రతి కార్తీక పౌర్ణమి నాడు శిఖరాన జ్యోతి రూపంలో దర్శనమిస్తాను అన్నారు సర్వేశ్వరుడు. పార్వతీదేవికి అర్ధభాగం కూడా ఇచ్చినది కార్తీక పౌర్ణమి నాడే !
కార్తీక మాసంలో పది హేడు రోజుల పాటు సాగే కార్తీక దీపోత్సవాలు ఉత్తరాషాఢ నక్షత్రం నాడు ఆరంభమై కార్తీక పౌర్ణమి నాడు దీప ప్రజ్వలం చేసిన తరువాత మిగిలిన ఉత్సవాలతో ముగుస్తుంది. 
మొదటి రోజున శ్రీ దుర్గా దేవి కోవెలలో వినాయక పూజ తదితర పూజలు జరుగుతాయి. రెండో రోజు   ప్రధాన ఆలయంలో పిదారి అమ్మన్ కు, శ్రీ గణపతికి ప్రత్యేక పూజలు చేస్తారు. మొదటి రోజున ధ్వజారోహణ తో ప్రారంభం అవుతుంది. నాటి నుండి ప్రతి రోజు ఆదిదంపతులు తమ పరివార సమేతంగా వివిధ వాహనాల మీద మాడ వీధులలో ఊరేగుతారు. 
కార్తీక పౌర్ణమి రోజున ఉదయం నాలుగు గంటల నుండి వివిధ రకాల పూజలు జరుపుతారు. భరణి దీపం వెలిగిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు పంచ మూర్తులను కట్చి మండపానికి తోడ్కొని వస్తారు. సరిగ్గా ఆరు గంటలకు శ్రీ అర్ధనారీశ్వర స్వామి మేళతాళాల, భక్తుల కైవారాల మధ్య వెలుపలికి వాహనం మీద తీసుకొని వస్తారు. ఆయన బాలి పీఠం వద్ద ఉపస్థితులైన అనంతరం అరుణగిరి శిఖరాగ్రాన కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. 
ఆనందోత్సవాలతో భక్తి పులకింతలతో భక్తులు చేసే "అణ్ణామలయ్యకు ఆరోం అర" అన్న నామ ధ్వనితో తిరువణ్ణామలై ప్రతిధ్వనించిపోతుంది. నగరంలోని ప్రతి అణువు అపూర్వ ఘట్టాన్ని  వీక్షించి  పులకరించి పరవశించి పోతుంది. 
పశు పక్షి కీటక మానవులు ఎవరైతే ఈ అపురూప కార్తీక దీపాన్ని చూసారో వారి పాపాలు సమస్తం దహించి వేయబడతాయి.
కార్తీక దీపోత్సవంలో పదిహేడు రోజుల పాటు జరిగే విశేషాలను వరసగా తెలుసుకొందాము. 

1. శ్రీ దుర్గాదేవి పూజ : పూజలు జరిపిన తరువాత నాటి రాత్రి అమ్మవారిని కామధేను వాహనం మీద ఊరేగిస్తారు. 

2. పిడారి అమ్మన్ పూజ : పూజల అనంతరం పిడారి అమ్మన్ సింహ వాహనం మీద ఆలయానికి వెలుపల ఊరేగింపుగా వస్తారు. 

3. అనుజ్ఞ వినాయక పూజ : అనుమతి కొరకు పూజలు చేసి శ్రీ శాంతీశ్వర స్వామి సమేతంగా శ్రీ వినాయకుడు మూషిక వాహనం మీద ఊరేగుతారు. 

4. ఉత్సవ ప్రారంభం : ఉత్సవాల ఆరంభ సూచనగా ధ్వజారోహణం చేసిన తరువాత పంచ మూర్తులైన శ్రీ వినాయక, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ ఉణ్ణామలై సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామి మరియు శ్రీ శాంతీశ్వర స్వామి మాడ వీధులలో ఇంద్ర వాహనం మీద ఊరేగుతారు. సాయంత్రం మూషిక, మయోర, అధికార నంది, హంస మరియు చిన్న నంది మీద ఉపస్థితులను చేసి ఊరేగిస్తారు. 

4.  రెండవ రోజు ఉత్సవం :  ఈ రోజు సూర్యప్రభా వాహనం మీద శ్రీ గణపతి మరియు శ్రీ చంద్రశేఖర స్వామి మాడవీధుల్లో విహరిస్తారు. రాత్రి పంచ మూర్తులు వెండి ఇంద్ర వాహనం మీద మాడ వీధులలో ఊరేగుతారు. 

5. మూడవ రోజు ఉత్సవాలు : పూజల అనంతరం భూతనాథ వాహనం మీద శ్రీ వినాయక, శ్రీ చంద్రశేఖరులు ఇద్దరూ ఊరేగిస్తారు. రాత్రికి పంచ మూర్తులను వెండి హంస వాహనం మీద మాడ వీధులలో ఊరేగిస్తారు. 

6. నాలుగవ రోజు ఉత్సవాలు : నిత్య పూజల చేసిన తరువాత శ్రీ గణపతి మరియు శ్రీ చంద్రశేఖర స్వామి నాగ వాహనం మీద ఊరేగేవారు. పంచ మూర్తులను వెండి కామధేనువు మరియు కల్పవృక్ష వాహనాల ఊరేగిస్తారు. 

7. అయిదవ రోజు ఉత్సవాలు : రిషభ వాహనం మీద శ్రీ వినాయక మరియు శ్రీ చంద్రశేఖర స్వామి విహరిస్తారు. సాయంత్రం పంచ మూర్తులను వెండి మూషిక, మయూర, పెద్ద రిషభ వాహనం మీద ఊరేగిస్తారు. 

8. ఆరవ రోజు ఉత్సవాలు : ఈ రోజున శ్రీ వినాయక మరియు శ్రీ చంద్రశేఖర స్వామి వెండి మూహిక, వెండి గజ వాహనం మీద చెక్కిలార్ మరియు 63 మంది నయనారుల విమానం క్రింద ఉపస్థితులై ఊరేగుతారు. రాత్రి పంచ మూర్తులు వెండి రథంలో ఇంద్ర విమానం క్రింద కూర్చొని మాడ వీధులలో భక్తులకు దర్శనం ప్రసాదిస్తారు. 

9. ఏడవ రోజు ఉత్సవాలు : నిత్య పూజల అనంతరం వృశ్చిక లగ్నంలో పంచ మూర్తులు రధాలలో ఉపస్థితులవుతారు. వేలాది మంది భక్తులు రథాలను లాగడానికి పోటీపడతారు. సాయంత్రం ఆలయానికి చేరిన మూర్తులు ఆస్థాన మండపంలో కొలువు తీరుతారు. 

10. ఎనిమిదవ రోజు ఉత్సవాలు : శ్రీ వినాయక మరియు శ్రీ చంద్రశేఖర స్వామి అశ్వ వాహనం మీద ఊరేగుతారు. సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ బిక్షందార్ ప్రత్యేక పూజ ఉంటుంది. రాత్రికి పంచ మూర్తులను అశ్వ వాహనం మీద మాడ వీధులలో ఊరేగిస్తారు. 

11. తొమ్మిదవ రోజు ఉత్సవాలు : యధాప్రకారం పూజల అనంతరం శ్రీ గణపతి, శ్రీ చంద్రశేఖర స్వామి వారి వాహనాల మీద ఊరేగుతారు. సాయంత్రం పంచ మూర్తులను  కైలాస మరియు కామధేను వాహనాల మీద ఉపస్థితులను చేసి మాడ వీధులలో ఊరేగిస్తారు. 

12. పదవ రోజు ఉత్సవాలు : సంవత్సర కాలంగా భక్త లోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కార్తీక దీపం వెలిగించేది ఈ రోజునే ! కార్తీక పౌర్ణమి నాడు దీపాలను వెలిగించడం తమిళనాడు లో మాత్రమే కాదు దక్షిణ భారత దేశంలో అన్ని చోట్లాకనపడుతుంది . ప్రజలు తమ గృహాలను కూడా దీపాలతో అలంకరిస్తారు. దీనిలో ముఖ్య ఉద్దేశ్యం జీవితాలలో నెలకొని ఉన్న అనేక రకాల అంధకారం తొలిగిపోవడం ! కానీ కార్తీక పౌర్ణమి నాడు తిరువణ్ణామలై లో వెలిగించే  దీపానికి చాలా ప్రత్యేకత ఉన్నది. అదే మిటి అంటే ఇక్కడ పర్వతమే పరమేశ్వరుడు. ఆయన ప్రతి రూపమే దీపం. నేతి తో నింపిన పెద్ద డ్రమ్మును , కిలోల కొద్దీ కర్పూరాన్ని మరియు దీపం తాలూకు వత్తిగా ఉపయోగించడానికి ప్రత్యేకంగా నేసిన పెద్ద వస్త్రాన్ని కొండ మీదకి తీసుకొని పోతారు. నిర్ణయించిన సమయానికి వెలిగించే అరుణగిరి కార్తీక దీపం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా కనిపిస్తుంది కొద్ది రోజుల పాటు.   

13. పదకొండవ రోజు ఉత్సవాలు : రాత్రి ఏడు గంటలకు శ్రీ చంద్రశేఖర స్వామి తెప్పోత్సవంజరుగుతుంది . 

14. పన్నెండవ రోజు ఉత్సవాలు :  రాత్రి ఏడు గంటలకు శ్రీ పరా శక్తి అమ్మకి తెప్పోత్సవం నిర్వహిస్తారు. 

15. పదమూడవ రోజు ఉత్సవాలు : రాత్రి ఏడు గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తెప్పోత్సవం. 

16. పద్నాల్గవ రోజు ఉత్సవం : కార్తీక దీపోత్సవాలలో ఆఖరి రోజు. వెండి వృషభ వాహనం మీద శ్రీ చంద్రశేఖర స్వామిని ఊరేగిస్తారు. దీనితో ఆ సంవత్సర కార్తీక దీపోత్సవాలు ముగుస్తాయి. 

పవిత్ర అరుణగిరి 

2668 అడుగుల ఎత్తైన అరుణాచలం ఎన్నో విధాలుగా పవిత్రమైనది. అరుణాచల మహత్యం ప్రకారం విధాత మరియు విష్ణువు మధ్య తలెత్తిన వివాదాన్ని తొలగించడానికి కృత యుగంలో సాక్షాత్కరించినది  జ్యోతిర్లింగం. త్రేతాయుగంలో రత్న గిరిగా ప్రసిద్ధి చెందినది. ద్వాపర యుగంలో లోహ గిరిగా ఉన్న గిరి కలియుగంలో ఎఱ్ఱని పగడపు కొండగా "అరుణాచలం" పిలవబడుతోంది. 
పరమేశ్వరుడే మహా పర్వతంగా కొలువైన గిరికి చుట్టూ అనేక నందులు కనపడతాయి. అదే విధంగా శివ పరివారంగా అష్ట దిక్పాల లింగాలు, వాటి సమీపంలో పుష్కరణిలు కనపడతాయి. 
గిరి ప్రదక్షిణ మార్గంలో ఇంద్ర లింగం, అగ్ని లింగం, యమ లింగం, నైరుతి లింగం, సూర్య లింగం, వరుణ లింగం, ఆది అణ్ణామలై ఆలయం, వాయు లింగం, చంద్ర లింగం, కుబేర లింగం మరియు ఈశాన్య లింగం తో పాటు ఎనిమిది నందులు, అనేక ఆలయాలు, మఠాలు, మండపాలు మరియు 360 కోనేరులు ఉంటాయి. 
సదాశివ మూర్తి, గుహా నమః శివాయ, గురు నమః శివాయ, శ్రీ అరుణగిరి నాథర్, శ్రీ మాణిక్యవాచకార్, శ్రీ ఈశాన్య దేశికర్, శ్రీ శేషాద్రి స్వామి, భగవాన్ శ్రీ రమణ మహర్షి, శ్రీ యోగి రాం సూరత్ కుమార్  లాంటి అనేక మంది యోగి పుంగవులు ఇక్కడ నడయాడారు. భక్తులకు మార్గదర్శకత్వం చేశారు. 
కపర్ది కొండగా కొలువు కావడం వలన భక్తులు గిరి ప్రదక్షిణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అరుణాచల పురాణం, అరుణాచల మహత్యం మరియు అనేక ఇతర పురాతన తమిళ గ్రంధాల ప్రకారం గిరిప్రదక్షిణ చేసినా సమాన ఫలితం దక్కుతుంది. కానీ భక్తులు ఎక్కువగా పౌర్ణమి నాడు ప్రదక్షణ చేయడానికి సిద్దపడుతుంటారు. 
పైన పేర్కొన్న గ్రంధాల ఆధారంగా పౌర్ణమి రోజులలో ఎలాంటి ఫలితం లభిస్తుందో అలాంటి ఫలితాన్ని అశ్విజమాసం, కార్తీక మాసం మరియు మార్గశిర మాసాలలో ఏ రోజు చేసినా, చైత్ర మాసం మొదటి రోజున, శివ రాత్రి రోజున అరుణ గిరి ప్రదక్షిణ చేయడం వలన పొందగలరు. అదే విధంగా మంగళ వారాలు, కనుమ పండుగ రోజున చేసే ప్రదక్షిణ ఫలితం అనంతంగా గ్రంధాలు పేర్కొంటున్నాయి. 
ఆదివారం చేసే ప్రదక్షిణ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. సోమవారం నాడు చేస్తే ఇంద్ర పదవి పొందటానికి  అర్హులు అవుతారు. మంగళవారం నాడు చేసే ప్రదక్షిణ అన్ని రంగాలలో  ప్రావీణ్యం మరియు మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. బుధవారం నాటి ప్రదక్షిణ అన్ని విద్యలలో నిష్ణాతులవుతారు. ఇక గురువారం చేసే అరుణగిరి ప్రదక్షిణ లోకపూజ్యులు అవుతారు. శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని ప్రసాదించేది శుక్రవారం చేసే గిరి ప్రదక్షిణ. నవగ్రహ ప్రభావాన్ని తొలిగిస్తుంది శనివారం చేసే ప్రదక్షిణ. 
ప్రతి నిత్యం దేవతలు, మహర్షులు, యోగులు అదృశ్యరూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. అందువలన గిరి ప్రదక్షిణ చేసే భక్తులు మౌనంగా శివనామస్మరణ చేస్తూ, తరచూ గిరి వంక చూస్తూ  ఆది దంపతులను నింపుకొవాలి. అనవసర మాటలు, మామూలు జీవితంలో ఉన్న అలవాట్లను ఆ సమయంలో విడిచిపెట్టడం అత్యంత ఆవశ్యకం. 
వృద్దులు, నడవలేనివారు, దివ్యాంగులు కూడా శివానుగ్రహంతో గిరి ప్రదక్షిణ చేయగలరు అన్నది ఎందరి అనుభవాలు తెలుపుతున్న వాస్తవాలు. 

అష్టలింగాలు 

భూమితో సహా ప్రతి ఒక్క నిర్మాణానికి అష్ట దిక్కులు ఉంటాయి. వాటి ఆధారంగా వాస్తు శాస్త్రం ఏర్పడింది. ప్రతి దిక్కుకు ఒక దేవత అధిపతిగా ఉంటారు. శివుడే శిఖరంగా ఏర్పడటం వలన ఆ దిశల అధిపతులు స్వయంగా తమతమ స్థానాలలో లింగాలను ప్రతిష్టించారు అని తెలుపుతున్నాయి క్షేత్రగాధలు. 

ఇంద్ర లింగం 

దేవతల అధిపతి. ఆయన సతి శచీ దేవి. వాహనం ఐరావతం. దేవదానవులు చేసిన క్షీరసాగర మధనం సందర్బంగా వెలికి వచ్చిన వాటిలో ఒకటి ఐరావతం. దేవేంద్రుని ఆయుధం వజ్రాయుధం. అధర్మం మీద ధర్మం సాధించే విజయంలో వజ్రాయుధ పాత్ర గొప్పది. ఇంద్రుడు తూర్పు దిశకు అధిపతి. లయకారుని సేవించి దేవేంద్రుడు ప్రతిష్టించిన ఇంద్ర లింగం ప్రధాన ఆలయానికి అతి చేరువలో, గిరి ప్రదక్షిణలో వచ్చే మొదటి దిక్పాలక లింగం.  
 గిరి మార్గంలో వచ్చే మిగిలిన దిక్పాలక మరియు గ్రహ లింగాలలో ఇక్కడ ఒక్క చోట మాత్రమే కైలాసనాధుడు కుటుంబ సమేతంగా దర్శనమిస్తారు. 

అగ్ని లింగం 

ఆగ్నేయ దిశకు అధిపతి. స్వాహా దేవి సతీమణి. దేవతలకు మనుష్యులకు మధ్య వారధి లాంటివారు అగ్నిదేవుడు. తన ఏడు  హస్తాలతో,ఏడు నాలుకలతో యజ్ఞంలో సమర్పించే పూర్ణాహుతిని దేవతలకు అందిస్తారు. తద్వారా మానవులు యజ్ఞఫలితాన్ని, దేవతల అనుగ్రహాన్ని అందుకొంటారు. 
పంచ భూతాలలో ఒకరైన అగ్ని భూమిలోని సమస్త జీవరాశికి ఆధారభూతుడు. యజ్ఞయాగాదులు, హోమాలకు, అంధకారంలో మార్గాన్ని చూపే దీపప్రజ్వలన ఆఖరికి ఆహారాన్ని తయారు చేసుకోడానికి అగ్ని దేవుని అవసరం తప్పనిసరి. 
అంతే కాదు అగ్ని సర్వభక్షకుడు. నశించిన ప్రతిదానిని స్వీకరించి లోకాన్ని శుభ్రపరుస్తారు. పునరుజ్జీవనానికి దోహదపడతారు. 
అగ్ని దేవుడు ప్రతిష్టించిన లింగం గిరి మార్గంలో శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమానికి కొద్దిగా ముందు పర్వత పాదాల వద్ద అనగా పర్వతానికి ఆగ్నేయ దిశలో కనపడుతుంది. అష్ట దిక్పాలక లింగాలలో ఈ ఒక్క  పక్కన వస్తుంది. 
అగ్నిలింగానికి చేసే పూజలు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి కావలసిన వెలుగును ప్రసాదిస్తాయి. 

యమ లింగం 

దక్షిణ దిశకు అధిపతి. మహిష వాహనం మీద ఉగ్రరూపంలో కనిపించే శునకాలతో కనిపించే శ్రీ యమధర్మ రాజు మృత్యు దేవత. జీవుల మరణానంతరం వారి పాపపుణ్యాల ఆధారంగా శిక్షలు విధించే ధర్మమూర్తి. 
యమా లింగాన్ని ఆరాధించడం వలన ఇహంలో అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ధర్మమార్గంలో నడవడం తెలుస్తుంది. పుణ్య ఫలం కారణంగా జనన మరణ బంధాల నుండి విముక్తి లభిస్తుంది. 
గిరి మార్గంలో వచ్చే మూడో దిక్పాలక లింగం చిత్రంగా శ్మశానాల ఎదురుగా ఉంటుంది. 

నైరుతి లింగం 

రాక్షస రాజు. నైరుతి దిశకు అధిపతి. ఇహలోకంలో జీవుల కర్మ ఫల ఆధారంగా ఫలితాన్ని ప్రసాదించేవాడు నివృత్తి. 
నైరుతి లింగానికి చేసే పూజల ఫలితంగా మనం ఇహలోకంలో దుష్కర్మల నుండి దూరంగా ఉండి అంతిమంగా పరమేశ్వర అనుగ్రహానికి పాత్రులమౌతాము. 

వరుణ లింగం 

పడమర  దిక్కుకు అధిపతి. మకరం (మొసలి) వాహనం. పంచ  భూతాలలో జీవకోటికి అత్యంత ప్రధానమైన నీటికి రాజు. సకాలంలో వర్షాలు కురవడం ఈయన అనుగ్రహంతోనే జరుగుతుంది. 
వర్షించే మేఘాలు, నదులు, సముద్రాలు ఈయన ఆధీనంలోనే ఉంటాయి. 
ఆరోగ్య ప్రదాత. వరుణ లింగాన్ని ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. 

వాయు లింగం 

పంచ భూతాలలో మరొక ముఖ్యుడు వాయు దేవుడు. జీవకోటికి ప్రాణ వాయువును అందించేవారు. 
జింక వాహనం. అత్యంత వేగంగా సంచరించడం ఈయన లక్షణం. 
వాయుదేవుడు కూడా ఆరోగ్యప్రదాత. 

కుబేర లింగం 

ధనానికి ఉత్తర దిశకు అధిపతి. కిన్నెరుల రాజు. ఆర్ధిక నిపుణుడు. ఒంటి కన్ను గలవాడు కనుక " ఏకపింగ" అని కూడా పిలుస్తారు.మూడు కాళ్ళు, ఎనిమిది దంతాలు కలిగి ఉండే కుబేరుడు అలకాపురిలో తన భార్య యక్షితో కలిసి ఉంటారు. పురాణాలలో ఈయన  ఆకారం గురించి, ఈయన నిర్వర్తించే కార్యాల గురించి వివరించబడినది. 
సమస్త సంపదలు కుబేరుని ఆధీనంలోనే ఉంటాయి. 
కుబేర లింగానికి చేసే పూజల వలన ఇహపర సుఖాలు లభిస్తాయి. 

ఈశాన్య లింగం 

అష్ట దిక్పాలక లింగాలలో ఆఖరిది. సప్త రుద్రులలో ఒకరైన ఈశానుడు ఈశాన్య దిశకు అధిపతి. పులిచర్మం మీద జటాజూటాలతో, దేహమంతా విభూతి పూసుకొని నిరంతర ధ్యానంలో ఉంటారు. చుట్టూ గణాలతో పరివేష్టించబడి కనపడతారు. మహేశ్వరుని మాదిరి శిఖలో చంద్రుడు, మేడలో నాగులు, చేతిలో ఢమరుకం, పక్కన త్రిశూలం ఉంటాయి. 
ఇవన్నీ కూడా జీవుల భావనకు తగిన విధంగా ఉంటాయి. కానీ ధరించిన ఆయన అధీనంలో ఉండటం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఈశానుని ఆరాధన మనలను ఈ ఇహలోక బంధాల నుండి రక్షించి ముక్తిని ప్రసాదిస్తుంది. 

అరుణాచల యోగులు 

తమిళనాడులోని అనేకానేక పుణ్య క్షేత్రాలలో ముఖ్యంగా శైవక్షేత్రాలలో ముఖ్యమైనవి ఇరవై రెండు అని చెబుతారు. తిరువణ్ణామలై వాటిలో ఒకటి. 
శ్రీ అరుణాచలేశ్వరుని ఆరాధించిన వారిలో అష్ట దిక్పాలకులు, లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్య, చంద్రులు, అష్టా వసువులు, గౌతమ మహర్షి, పాండు ముని, వారణాసి మహారాజు బృహదత్తుడు. పులకాధిప అనే రాక్షస రాజు ఉన్నారు. 
కలియుగంలో గుహాయి నమః శివాయ, గురునమః శివాయ, ఈశాన్య దేశికర్, దైవశిఖామణి దేశికర్, విరూపాక్ష దేవర, అరుణగిరినాథర్  శ్రీ అరుణాచలేశ్వరుని కృపతో సద్గతులు పొందారు. 
మనకు తెలిసి శ్రీ శేషాద్రి స్వామి, భగవాన్ శ్రీ రమణ మహర్షి, శ్రీ యోగి రాం సూరత్ కుమార్ తిరువణ్ణామలైలో జీవితాంతం ఉండి ఎందరికో ఆధ్యాత్మిక గురువులుగా మార్గదర్శకత్వం చేస్తున్నారు నేటికీ !
మరి కొందరి గురించి తేలుకొందాము. 

తిరుజ్ఞానసంబందార్ 

అరవై మూడు మంది శైవ గాయక భక్తులలో అగ్రస్థానంలో ఉన్న అప్పర్, సుందరార్ తో సమ స్థానంలో ఉన్న నాయనారు శ్రీ తిరు జ్ఞాన సంబందార్. ఈయన స్వస్థలం నుండి శైవ క్షేత్రాలు సందర్శించాలన్న కోరికతో చిదంబరం మీదగా వరుసగా క్షేత్ర సందర్శన చేస్తూ తిరువణ్ణామలైకి సమీపంలోని అరకన్దనల్లూరు చేరుకొన్నారు. 
శ్రీ అతుల్య నాదేశ్వర స్వామిని సేవించుకొన్నారు. అక్కడ ఉండగా తిరువణ్ణామలై గురించి తెలుసుకొని స్వామిని కీర్తిస్తూ పది తేవరాలతో కూడిన పాతికాన్ని గానం చేశారు. సంతసించిన ఆది దంపతులు మారు వేషాలలో ఆయనను తిరువణ్ణామలై తీసుకొని వెళ్లారు. క్షేత్రంలో మరికొన్ని పాతికాలను గానం చేశారు. 
తన పాతికాలలో బ్రహ్మ విష్ణువులు జ్యోతిర్లింగ ఆద్యంతాలను కనుగొనడంలో విఫలమవడం తప్పనిసరిగా ప్రస్తావించడం జరిగింది. సంబందార్ తన పాతికాలలో అరుణగిరి మహత్యాన్ని, శ్రీ అపితకుచాంబ అమ్మన్ గురించి, శివ శక్తి వివాహం గురించి ప్రముఖంగా ప్రస్తావించడం చూడవచ్చును. 

తిరునావుక్కరసు 

జీవిత పరమార్ధం పరమాత్ముని స్మరణమే అని పరిపూర్ణంగా విశ్వసించి ఎన్నో కీర్తన మాలలను శ్రీ అరుణాచలేశ్వరునికి సమర్పించుకున్నారు తిరునావుక్కరసు. వాటిల్లో ప్రముఖమైనవి తిరుక్కురుంతొకై కాగా  రెండవది తిరు నెరసై. తన పాటికాలలో ఒక దానిలో "ఆని అణ్ణామలై" అని పేర్కొంటారు. పెద్దలు అది "ఆది అణ్ణామలై" గురించి పలికినట్లుగా వివరించారు. 
ఆయన పాటికాలలో అత్యంత రమణీయంగా శివభక్తి కనపడుతుంది. 
దేహమే మహాదేవుని ఆలయంగా తలచి, మదిలో ఆయన లింగాన్ని ప్రతిష్ఠించుకొని,  శిరస్సును పాదాల వద్ద ఉంచి నోటి ద్వారా స్వామిని కీర్తిస్తూ. మనకు కనిపించే ప్రతి జీవి ఆయన స్వరూపంగా భావిస్తూ, మన సర్వస్వాన్ని అంటే పంచేద్రియాలను, శరీరాన్ని పంచామృత అభిషేకంగా సమర్పించుకోవాలి. 

సుందరమూర్తి స్వామిగళ్

నయనారులలో అగ్ర స్థానంలో నిలిచిన ముగ్గురిలో మరొకరు సుందరార్. నయనారులలో లేక పోయినా మాణిక్యవాసగర్ ని  కూడా చేర్చి సుందరార్, అప్పర్ మరియు సంబందార్ లను కలిపి " "నలువర్" అని అగ్రస్థానం ఇచ్చి గౌరవించారు. 
సుందరార్ 3700 కి పైగా పాతికాలు గానం చేసారని తెలుస్తోంది. కానీ నేడు అందుబాటులో ఉన్నవి ఒక వంద్ మాత్రమే ! ఈయన శ్రీ అరుణాచలేశ్వరుని దర్శించి కీర్తించారని "తిరుప్పరంకుండ్రం"
లో గానం చేసిన పాటికాల ద్వారా తెలుస్తుంది. 

మాణిక్యవాసగర్

గొప్ప శివభక్తుడు. మదురై పాలకునికి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతర కాలంలో అన్నింటినీ విడిచి శైవ క్షేత్రాలను సందర్శిస్తూ తిరువణ్ణామలై చేరుకొన్నారు. కొంతకాలం అక్కడ నివసించిన మాణిక్యవాసగర్ ప్రఖ్యాతి గాంచిన "తిరువెంబావై" అనే ముప్పై కీర్తనల సంకలాన్ని రచించారు. దీనికి సర్వేశ్వరుని ప్రశంస లభించినది. నేటికీ తమిళనాడులోని శివాలయాలలో మార్గశిర మాసంలో తిరువెంబావై గానం నియమంగా జరుగుతుంది. 

మఱైజ్ఞాన సంబందార్ 

శైవ అర్చక కుటుంబంలో జన్మించిన మఱైజ్ఞాన సంబందార్ చిదంబరం నుండి తిరువణ్ణామలై చేరుకొన్నారు. అనేక సంవత్సరాలు ఇక్కడే నివసించిన ఈయన అరుణగిరి పురాణం. అందుబాటులో ఉన్న రెండు పుస్తకాలలో ఈయన రచించినది పురాతనమైనది. ఆరువందల శ్లోకాలతో ఎనిమిది సర్గలతో ఉండే ఈ గ్రంథం అత్యంత విశ్వసనీయమైనదిగా పేర్కొంటారు. 

ఈశాన్య దేశికర్ 

 తిరువణ్ణామలై ఆది నుండి ఎందరో యోగులకు, సర్వసంగ పరిత్యాగులకు అంతిమ గమ్యంగా ప్రసిద్ధికెక్కింది. తొలినాటి వారిలో అత్యంత ప్రముఖులు శ్రీ ఈశాన్య జ్ఞాన  దేశికర్. తిరువణ్ణామలైలో అనేక ప్రాంతాలలో నివసించినా చివరికి ఈశాన్య లింగం వద్ద స్థిరపడ్డారు. ఈ కారణంగా ప్రజలు ఈ పేరుతొ పిలవసాగారు. 
తిరువణ్ణామలై రావడానికి ముందు చాలాకాలం వేటవాలం సమీపంలోని పక్కం అనే చోట కొండా గుహలో చాలా కలం నిర్వికల్ప సమాధి స్థితిలో గడిపారని తెలుస్తోంది. ఆ రోజులలో ముత్తుస్వామి ఉదయార్ అనే వ్యక్తి నియమంగా పాలు అందించేవారట. శ్రీ దేశికర్ సలహా మేరకు అతను పొలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా లంకె బిందెలు లభించాయి. దానితో గ్రామస్థులు శ్రీ దేశికర్ వద్దకు వెళ్ళసాగారు. దానిలో ఆయన అక్కడ నుండి ఎవరికీ చెప్పకుండా తిరువణ్ణామలై చేరుకొన్నారు. 
ముత్తు స్వామి అనేక ప్రాంతాలు వేడికి చివరకి దేశికర్ ను తిరువణ్ణామలైలో కనుగొని ఆయన ఉన్న ప్రాంతాన్ని కొని ఆశ్రమం నిర్మించారు. శ్రీ ఈశాన్య దేశికర్ శ్రీ అరుణాచలేశ్వరుని కీర్తిస్తూ "థోతిర పమలి"అనే మకుటం క్రింద స్తోత్రాలను రచించారు. 
ఆ రోజులలో మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించేవారు. వెల్లూరు కలెక్టర్ శ్రీ దేశికర్ కి నిజమైన భక్తుడు. ఆయన పెద్ద స్థలం ఇవ్వదలిచారట. దానికి శ్రీ దేశికర్ నవ్వి "అక్కడ ఆలయంలో ఒక పెద్ద మనిషి భార్య, ఇద్దరు  పిలలు  మరియు అనేక మంది పరివారంతో ఉన్నాడు. ఆయనకు ఇవ్వండి" అన్నారట. 
శ్రీ ఈశాన్య దేశికర్ 1829 వ సంవత్సరంలో శ్రీ అరుణాచలేశ్వరునిలో ఐక్యం అయ్యారు. 

విరూపాక్ష దేవర 

వీరశైవుడైన శ్రీ విరూపాక్ష దేవర స్వస్థలం కర్ణాటక. శ్రీశైల మల్లిఖార్జున స్వామికి అచంచల భక్తుడు. స్వామి వారి ఆదేశం మేరకు తిరువణ్ణామలై చేరుకొని కొండ మీద గుహలో చాలా కాలం తపస్సు చేసి శ్రీ అరుణాచలేశ్వరుని దర్శనం పొందారు. వీరితో పాటు గుహలో తపస్సు చేసిన వారు గుహాయి నమః శివాయ మరియు గురు నమః శివాయ. 
విరూపాక్ష దేవర నివసించిన గుహను ఆయన పేరుతోనే విరూపాక్ష గుహ అని పిలుస్తారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి తిరువణ్ణామలై వచ్చిన తోలి రోజులలో చాలా సంవత్సరాలు విరూపాక్ష గుహలో నివసించారు. 

వడలూర్ వల్లలార్ 

కరుణ్గుళి నివాసి అయిన రామలింగ అడిగళ్ చిదంబరం తో పాటు అనేక శైవ స్థలాలను దర్శించుకొని కీర్తనలను గానం చేసేవారు. ఆయన తన ఒక కీర్తనలో తిరువణ్ణామలై మహత్యాన్ని గొప్పగా వర్ణించారు. 

గుహాయి నమః శివాయ మరియు గురు నమః శివాయ 

కన్నడ ప్రాంతానికి చెందిన నమః శివాయ శ్రీశైలంలో గురువు వద్ద ఉండేవారు. గురువాజ్ఞ మేరకు శ్రీ విరూపాక్ష దేవరతో కలిసి తిరువణ్ణామలై చేరుకొన్నారు. ఎల్లప్పుడూ గుహలో ఉంది తపస్సు చేయడం వలన ప్రజలు ఆయనను గుహాయి నమః శివాయ అని పిలిచేవారు. 
ఈయన శిష్యుడు శ్రీ నమః శివాయ. భక్తి శ్రద్దలతో గురువును, శ్రీ అరుణాచలేశ్వరుని సేవించి అనేక శక్తులను పొందారు. గమనించిన గురువు అతనికి గురు అన్న బిరుదు ప్రసాదించి చిదంబరం వెళ్ళమని ఆదేశించారు. అలా గురు నమః శివాయ చిదంబరం చేరుకొని శ్రీ నటరాజ కోవెల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకొన్నారు. 
వీరు ఇరువురూ అనేక కీర్తనలను శ్రీ అరుణాచలేశ్వరుని కీర్తిస్తూ గానం చేశారు. వాటిలో కొన్నింటిని భగవాన్ శ్రీ రమణ మహర్షి గుహాయి నమః శివాయ గుహలో ఉన్నప్పుడు వెలికితీశారు. 

దైవశిఖామణి దేశికర్ 

ఆది శైవుడైన దైవ శిఖామణి దేశికర్ స్వస్థలం తిరువణ్ణామలై. నిరంతరం శివనామస్మరణ చేస్తుండేవాడు. చోళ రాజు కు ప్రీతిపాత్రమైన అశ్వం ఒకటి దారితప్పి ఈయన ఆశ్రమం వద్దకు వచ్చి చనిపోయింది. రాజా సైనికుల అభ్యర్ధన మీద దేశికర్ అశ్వాన్ని తన మంత్రం మహిమతో బ్రతికించారు. దానితో ఆయన పేరు అందరికీ తెలిసింది. ఈ సంఘటన తెలిపే శిల్పం ప్రధాన ఆలయ మూడో ప్రాకారంలో ఆలయ వృక్షం ఎదురుగా ఉంటుంది. 
రామేశ్వరం పాలకుడు శ్రీ రాజా సేతుపతి కోరిక మేరకు అయిదు ఆలయాల నిర్వహణ స్వీకరించి తిరువణ్ణామలై అధీనం కున్నక్కుడి లో ఏర్పాటు చేశారు. 

శ్రీ అరుణగిరినాథర్ 

కవి గొప్ప శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన శ్రీ అరుణగిరినాథర్ తన ఆరాధ్య దైవం వలననే జీవితాన్ని సార్ధకత చేసుకొన్నారు. వళ్ళాల గోపురం వద్ద ఉన్న శ్రీ గోపుర ఇలియనార్ ఇతనికి ప్రాణ బిక్ష పెట్టారు. 
అనేక సుబ్రహ్మణ్య మరియు శివాలయాలను సందర్శించి అనేక కీర్తనలను గానం చేశారు. వాటిని "తిరుప్పుగళ్" అన్న పేరుతొ గ్రంథస్థం చేశారు. 
ఈయన మహారాజుకు పోయిన దృష్టి రప్పించడానికి దేవలోకంలో పారిజాత పుష్పాన్ని తీసుకొని రావడానికి చిలక రూపంలో వెళ్లారు. తిరిగి వచ్చిన తరువాత చిలక రూపంలో గోపురం మీద స్థిరపడ్డారు. అలా కిళి గోపురం అన్నపేరు వచ్చింది. ఈ గోపురం నుండి ఆయన కతర్ అనుభూతి అన్న గొప్ప గీతాన్ని గానం చేశారు. 

శైవ ఎల్లప్ప నవలార్ 

649 శ్లోకాలతో, 14 సర్గలతో కూడిన "అరుణాచల పురాణం" అనే పద్య కావ్యాన్ని రచించారు. ఈ కావ్యం ఆధ్యాత్మిక మరియు చక్కని సాహిత్యంతో కూడిన రచనగా గొప్పపేరును సంపాదించుకున్నది. ఈయన మరో రెండు అద్భుత కావ్యాలను తిరువణ్ణామలై గురించి రాశారు. అవి "తిరు అరునై కళంబాకం" మరియు " తిరువరునై అంథాతి".. 
తమిళ సాహిత్యంలో ఎన్న దగిన ఆధ్యాత్మిక రచనలలో ఒకటిగా  తిరువరునై కళంబాకం గుర్తించబడింది. 
అరుణాచల పురాణం తో సమానమైనదిగా గుర్తించబడిన రెండవ గ్రంధం మరై జ్ఞాన దేశికర్ రచించిన "అరుణగిరి పురాణం". 
ఇలా ఎందరో యోగులు, తపస్యులు, సిద్దులు అరుణాచలేశ్వరుని గురించి ఎన్నో రచనలను చేశారు. 

ఆలయ పూజలు మరియు ఉత్సవాలు 

తిరువణ్ణామలైలో జరిగే ప్రతి ఉత్సవానికి ఎంతో చరిత్ర ఉన్నది.. వీటిని శతాబ్దాలుగా నిర్వహిస్తున్నట్లుగా శాసన ఆధారాలు కలవు. 
మార్గశిర మాస ఉత్సవం, పుష్య మాస ఉత్సవం, ఫాల్గుణ మాస ఉత్సవం మరియు కార్తీక దీపోత్సవం ముఖ్యమైనవి. 
రాజేంద్ర చోళుని ముందు కాలం నుండి కార్తీక దీపోత్సవం, ఫాల్గుణ మాస ఉత్సవం గొప్పగా జరిగేవి. కుళోత్తుంగ చోళుని కాలంలో పుష్య మాస ఉత్సవం ఆరంభించబడినట్లుగా తెలుస్తోంది. 
కానీ అన్నింటి లోనికి కార్తీక దీపోత్సవం తలమానికం వంటిది. 
రాజ మహారాజ, చక్రవర్తులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు అందరూ ఆలయ ఉత్సవాలకు తమ వంతు కైకార్యాలను సమర్పించుకొన్నట్లుగా శాసనాలు తెలియజేస్తున్నాయి. 

పంచ పర్వ విళ 

పంచ పర్వ విళ అనగా అమావాస్య, కార్తీక, ప్రదోష, శుక్రవారం మరియు సోమవారం, అదే విధంగా శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి, పౌర్ణమి రోజులలో నిర్వహించే ప్రత్యేక ఉత్సవాలు. 

మాసోత్సవాలు 

చైత్ర మాసోత్సవం : చైత్ర (ఏప్రిల్-మే )మాసంలో పౌర్ణమికి పది రోజుల ముందు ప్రారంభించి పౌర్ణమితో ముగిసే ఉత్సవాలు. మన్మధ దహన కార్యక్రమం ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణ. 
వైశాఖ మాసోత్సవాలు : వైశాఖ (మే - జూన్)మాసం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి ప్రీతికరమైన మాసంగా చెబుతారు. శ్రీ మురుగన్ కి విశేష పూజలు జరుగుతాయి. తిరుజ్ఞాన సంబందార్ తిరు నక్షత్రం , యానప్పాల్ తిరు విళ ఈ మాసంలో నిర్వహిస్తారు. 
జ్యేష్ట మాసం (అణి మాసం) (జూన్ - జులై) జ్యేష్ఠ మాసం ఇరవై ఒకటవ రోజున ప్రారంభం అయ్యే ఉత్సవాలు పది రోజులు ఘనంగా దక్షిణాయన ప్రారంభం వరకు జరుగుతాయి. ఉత్తరా నక్షత్రంలో జరిగే నటరాజ తిరుమంజనం రెండు రోజుల పాటు వెయ్యికాళ్ల మండపంలో నిర్వహిస్తారు. మాణిక్య స్వామిగళ్ మహా నక్షత్ర ఉత్సవం కూడా ఈ నెలలో జరుగుతుంది. 
ఆడి (ఆషాడం)(జులై - ఆగస్టు) : శ్రీ పరాశక్తికి ఆడి పూరం పేరిట పది రోజులు అట్టహాసంగా నిర్వహిస్తారు. పడవ రోజున వలికప్పు , నిప్పుల మీద నడక భక్తులు భక్తిశ్రద్దలతో చేస్తారు. 
శ్రావణ మాసం (అవని)(ఆగష్టు - సెప్టెంబర్) : మూలా నక్షత్ర ఉత్సవం ఒక రోజు, తొమ్మిది రోజుల గణేష చతుర్థి ఘనంగా జరుగుతాయి. 
భాద్రపద మాసం (పురట్ఠాసి) (సెప్టెంబర్ - అక్టోబర్) : పది రోజుల దేవి నవరాత్రులు నిర్వహిస్తారు. 
ఆశ్వీజ మాసం (ఇప్పాసి ) (అక్టోబర్ - నవంబర్) : ఈ నెలలో శ్రీ సుబ్రహ్మణ్య షష్టి ఆరు రోజల పాటు గొప్పగా చేస్తారు. ఆఖరి రోజున సూర సంహారం ప్రత్యేక ఆకర్షణ. ఒక రోజు అన్నాభిషేకం శ్రీ అరుణాచలేశ్వరునికి చేస్తారు. 
కార్తీక మాసం (నావేమ్బర్ - డిసెంబర్) : పదిహేడు రోజుల కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా కార్తీక దీపోత్సవంతో ముగుస్తాయి. 
మార్గశిర మాసం (మార్గళి) (డిసెంబర్ - జనవరి) : పది రోజుల పాటు మాణిక్యవాసగర్ ఉత్సవాన్ని ఈ నెలలో నిర్వహిస్తారు. నెల ఇరవై ఒకటవ రోజున ఉత్తరాయణ ఉత్సవం చేస్తారు. వెయ్యికాళ్ల మండపంలో తిరువతురై ఉత్సవాన్ని శ్రీ నటరాజ స్వామికి చేస్తారు. ఆలయంలో తిరువెంబావై గానం, అమ్మవారి సన్నిధిలో తిరుప్పలయెంచులి గానం ఈ నెలలో నిర్వహిస్తారు. 
పుష్య మాసం (థాయ్) (జనవరి - ఫిబ్రవరి) : ఈ నెల రెండవ రోజున తిరువూడల్ ఉత్సవం జరుగుతుంది. తీర్థవారి ఉత్సవ సందర్భంగా శ్రీ అరుణాచలేశ్వరుడు మానాలూర్పేట్ , కళసపాక్కం గ్రామాలకు వెళతారు. థాయ్ పూసం సందర్భంగా ఈశాన్య తీర్థవారి నిర్వహిస్తారు. 
మాఘ మాసం (మాసి) ఫిబ్రవరి - మార్చి) : వళ్ళాల మహారాజు ఆబ్ధీకం ఏర్పాటు చేస్తారు. పరమేశ్వరునికి అత్యంత ముఖ్యమైన పర్వదినం మహా శివరాత్రి ఉత్సవాలు ఈ నెలలో జరుగుతాయి. 
ఫాల్గుణ మాసం (పంగుని) మార్చి - ఏప్రిల్) : ఫల్గుణి ఉత్తరాయణం సందర్భంగా జరిగే ఆరు రోజుల ఉత్సవం సందర్భంగా ఆది దంపతుల కళ్యాణం ఘనంగా చేస్తారు. 
  
 అరుణాచలేశ్వరునికి ఆరోం  అర !!! 

 

  









































































































    

 

   




      
    

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...