9, జులై 2024, మంగళవారం

Chennaganur

                        మహాదేవ శ్రీ క్షేత్రం, చెంగన్నూర్  


పరుశురామ భూమి, దేవతల స్వస్థలం అయిన కేరళలో ఎన్నో విశేష, ప్రత్యేక దేవాలయాలు కనపడతాయి. 
అధిక శాతం ఆలయాలలో అర్చనామూర్తులను శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ భార్గవరాముని ప్రతిష్టలుగా పురాణాలు తెలుపుతున్నాయి. 
సముద్రుని నుండి భూమిని స్వీకరించిన పరశురాముడు క్షేత్రపాలకునిగా పరమేశ్వరుని, క్షేత్ర రక్షకునిగా శ్రీ ధర్మశాస్త ( శ్రీ అయ్యప్ప) మరియు క్షేత్ర దేవిగా శ్రీ భగవతీ దేవిని నూట ఎనిమిది ప్రదేశాలలో ప్రతిష్టించారని పురాతన మలయాళ గ్రంధాలు పేర్కొంటున్నాయి. 
ఇవే కాకుండా అనేక పావన క్షేత్రాలలో దేవీదేవతలు స్వయంభూగా వెలిశారని ఆయా క్షేత్రగాధలు తెలుపుతున్నాయి. 
దక్ష యజ్ఞం 

దక్షప్రజాపతి అల్లుడైన మహేశ్వరుని పిలవకుండా యజ్ఞాన్ని తలపెట్టారు. తండ్రి చేస్తున్న యాగానికి పిలవకపోయినా వెళ్లిన సతీ దేవి జరిగిన అవమానం తట్టుకోలేక యజ్ఞగుండంలో ఆత్మార్పణ చేసుకొంటుంది. 
ఆగ్రహించిన కైలాసవాసుడు శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రుని పంపి దక్ష యజ్ఞాన్ని భగ్నం చేయిస్తారు.అనంతరం విచారగ్రస్థులైన శంకరుడు సతీ దేవి శరీరాన్ని తీసుకొని విరాగిగా తిరగసాగారు. 
శ్రీ మహావిష్ణువు తో సహా దేవతలందరూ ఆమె శరీరం లేకపోతే గంగాధరుడు సాధారణ స్థితికి వస్తారని నిర్ణయం తీసుకొంటారు. శ్రీహరి
 సుదర్శన చక్రంతో సతీ దేవి దేహాన్ని ఖండించగా అవి భూలోకంలో వివిధ ప్రాంతాలలో పడటం వలన శక్తి పీఠాలు ఆవిర్భవించాయని మనందరికీ తెలిసిన విషయమే !
అలా ఏర్పడిన శక్తి పీఠాల సంఖ్య రకరకాలుగా ఉన్నది. చాలా మంది అవి యాభై ఒకటి అని విశ్వసిస్తారు. కానీ ప్రఖ్యాతి గాంచిన శక్తి పీఠాలు  పద్దెనిమిది. అష్టాదశ పీఠాలుగా ప్రసిద్ధి. 
మిగిలిన వాటిల్లో ఒకటి దేవతల భూమి కేరళలో ఉన్నది. 
అదే చెంగన్నూర్. 
శబరిమల వెళ్ళడానికి అతి సమీప రైల్వే స్టేషన్ చెంగన్నూర్. 
ఈ క్షేత్రం కొన్ని యుగాలుగా ప్రసిద్ధి చెందినది అని ఊరిలో చుట్టుపక్కల ఉన్న ఆలయాల క్షేత్ర  గాథల ద్వారా తెలియవస్తోంది.  క్షేత్ర గాథ 

సతీ దేవి శరీరాన్ని సుదర్శన చక్రం ఖండించడం వలన భాగాలు అనేక ప్రాంతాలలో పడినట్లుగా తెలుసుకున్నాము కదా ! ఇక్కడ అమ్మవారి నడుము లోని కొంత భాగం పడినట్లుగా తెలుస్తోంది. 
సతీ దేవి మరు జన్మలో పర్వతరాజ పుత్రి పార్వతిగా జన్మించినది. దైవ నిర్ణయమైన వారి వివాహం 
నిర్ణయమైనది. 
వారి కల్యాణాన్ని కనులారా వీక్షించాలన్న కోరికతో వస్తున్న వారితో ఉత్తర భాగం క్రుంగి పోసాగిందట. అప్పుడు మహేశ్వరుడు శ్రీ అగస్థ్య మహర్షిని పిలిచి, తన శిష్యప్రశిష్యులతో దక్షిణ భాగానికి వెళ్ళమని ఆఙ్ఞాపించారట. 
ఆనతి ఇవ్వడమే కాకుండా ఆయన కల్యాణ సమయానికి ఎక్కడ ఉన్నా అక్కడ నుండి వివాహాన్ని చూసే వరాన్నీ అనుగ్రహించారట.వివాహానంతరం దంపతులుగా తాము మహర్షి ఆతిధ్యం స్వీకరిస్తామని కూడా చెప్పారట. 
 దక్షిణ భాగం అంతా తిరుగుతూ అగస్థ్య మహర్షి చివరకు పావన పంపా నదీ తీరంలోని "శోణాద్రి" చేరుకొన్నారట. శోణాద్రి అనగా "ఎఱ్ఱటి కొండ" అని అర్ధం. స్థానిక మలయాళ భాషలో "చెన్ కున్ను". ఎఱ్ఱటి పర్వతం ఉన్న ఊరుగా కాలక్రమేణ "చెంగన్నూర్"గా పిలవబడుతోంది అని చెబుతారు. 
యథాప్రకారం మహర్షి అక్కడ కూడా నిత్య పూజ నిమిత్తం ఒక శివలింగాన్ని ప్రతిష్టించుకొన్నారట.
 కళ్యాణం తరువాత ఆది దంపతులు శోణాద్రి వచ్చి మహర్షి ని సంతోషపరిచారట. అదే సమయంలో పార్వతీ దేవికి ఋతుస్రావం (నెలసరి) రావడంతో విడిగా ఒక ఆశ్రమంలో ఉన్నారట. 
అనంతరం కైలాసానికి తిరిగి వెళ్లిపోయారని తెలుస్తోంది. 
కలియుగంలో ఈ ప్రాంతం "వంగిపుజ రాజుల" పాలనలో ఉండేదట. 
ఈ ప్రాంత రైతులు కొందరు వ్యవసాయం చేసుకోడానికి రాజుగారి అనుమతి తీసుకొని పనులు ప్రారంభించారట. 
ఒక కార్మీకుడు తన పనిముట్టుకు పదును పెట్టడానికి ఒక రాతి మీద రుద్దగా రక్తం రావడం మొదలయ్యిందట. అందరూ భయపడి పోయి రాజుగారికి విన్నవించుకొన్నారట. 
ఆయన రాజ పురోహితులను సంప్రదించగా వారు అగస్త్య మహర్షి ఉదంతాన్ని వివరించి రాతికి  నెయ్యితో అభిషేకం చెయ్యమన్నారట. అది పార్వతీదేవి కూర్చున్న శిల అని ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పారట.పెరుంథాచన్ 

 పురాతన మలయాళ గ్రంధాల ప్రకారం ఈయన ఒక గొప్ప శిల్పి. అది చెక్క, రాయి, అన్న బేధం లేకుండా తనకు కావలసిన విధంగా మలచడంలో ఆయనకు సాటిరాగలవారు అప్పటి నుండి ఇప్పటి వరకు లేరు అని అంటారు. 
ఆలయ నిర్మాణం ఎలా ఉండాలో నిర్ణయించడంలో కూడా సిద్ధహస్తుడు. ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా శాస్త్ర ప్రకారం ఆలయ ప్రణాళిక తయారుచేయడం ఆయన గొప్పదనం. 
కేరళలోని అనేక ఆలయాలను ఆయన సారథ్యంలోనే నిర్మించారు. మిగిలిన వాటిలో ఆయన శిష్యులు ఆయన విధానాన్నే అనుసరించారు. 
 ఈయన పుట్టుపూర్వోత్తరాలు, తల్లితండ్రుల వివరాలు ఏమీ తెలియవు. కానీ అనేక గాధలు మాత్రం వినపడుతుంటాయి. 
పెద్దల మాట ప్రకారం వంగిపుజ రాజు పెరుంథాచన్ ను పిలిపించారట. ఆయన ఆలయ ఎలా నిర్మించాలి అన్నది పూర్తిగా సిద్ధం చేసి రాజానుమతితో నిర్మాణం ప్రారంభించారట. 
అద్భుతంగా ఆలయం రూపుదిద్దుకొన్నది. ముఖ్యంగా "కూతంబలం"గా పిలవబడే నృత్య ప్రదర్శన శాల గురించి చాలా గొప్పగా చెప్పబడినది. 
ఎన్ని దీపాలు పెట్టినా వేదిక మీద నటుడి నీడ ఏమాత్రం పడింది కాదట. 
ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత రాజు గారు పెరుంథాచన్ ను సుందరమైన అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయమని కోరారట. అప్పుడు శిల్పి ప్రాంగణంలో ఒక చోట త్రవ్వమని చెప్పారట. ఆ విధంగా చేయడంతో అద్భుతమైన అమ్మవారి విగ్రహం మరియు అగస్త్య మహర్షి ప్రతిష్టించిన శివలింగం వెలుగు చూశాయట. వాటిని ఆలయంలో ప్రతిష్టించడం జరిగింది. 
పెరుంథాచన్ కు అపూర్వమైన శిల్పకళా ప్రావీణ్యంతో పాటు భవిష్యత్ వాని చెప్పగలిగే శక్తి కూడా ఉండేదట. 
ఆలయం నిర్మించిన కొన్ని సంవత్సరాల తరువాత పెరుంథాచన్ ఆలయ ప్రధాన అర్చకులకు ఒక సుందర పంచ లోహ అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చి కొద్ది రోజులలో ఆలయం పూర్తిగా అగ్నికి ఆహుతి అవుతుంది. అప్పుడు ఈ విగ్రహాన్ని గర్భాలయంలో ఉంచామని చెప్పారట. 
అదే జరిగి అమ్మవారి విగ్రహం పూర్తిగా శిధిలమయ్యింది. అప్పుడు పంపా నదిలో ఉంచిన పంచ లోహ విగ్రహాన్ని పునఃనిర్మించిన ఆలయంలో ప్రతిష్టించారు. కానీ పెరుంథాచన్ అద్భుతంగా నిర్మించిన కూతంబళ నిర్మాణం మాత్రం చేయలేక పోయారట. 
ఇక్కడ పెరుంథాచన్ నిర్మాణ చాతుర్యాన్నిమరియు  గొప్పదనాన్ని తెలిపే విషయం మనకు నేటికీ కనపడుతుంది. 
సహజంగా ఆలయాలలో మహేశ్వరుడు మరియు అమ్మవారు విడివిడిగా సన్నిధులలో కొలువై దర్శనమిస్తారు. 
కానీ కేరళలో అధిక శాతం ఆలయాలలో వర్తులాకార గర్భాలయంలో తూర్పు ముఖంగా స్వామి, పడమర ముఖంగా దేవేరి కొలువై  ఒకే సన్నిధిలో కనిపిస్తారు. సర్వేశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా !
ఒక్క చెంగన్నూర్ లోనే కాదు, శ్రీ వడుక్కునాథర్  ఆలయం, త్రిసూర్, వైక్యం మహాదేవ మందిరం ఇలా చాలాచోట్ల ఇదే విధంగా ఆది దంపతుల దర్శనం లభిస్తుంది. 
మరో గమనించవలసిన విషయం శ్రీ మహాదేవ లింగానికి అలంకరించే పంచలోహ కవచం అర్ధనారీశ్వర రూపంలో ఉండటం !


ఆలయ విశేషాలు 

అన్ని కేరళ ఆలయాలలో మాదిరి ఇక్కడ కూడా సువిశాల ప్రాంగణానికి నాలుగు వైపులా ప్రవేశ ద్వారాలు వాటిని కలుపుతూ ఎత్తైన ప్రహరీ గోడ. 
తూర్పు వైపున స్థానిక శైలిలో ఎత్తైన గోపుర నిర్మాణం. 
ప్రాంగణంలో ఎదురుగా అంబరాన్ని తాకేలా ఏర్పాటు చేసిన ధ్వజస్థంభం పక్కనే బలిపీఠం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన మొక్కుబడిని చూడవచ్చును. 
"మంజాడి" గా పిలవబడే ఈ మొక్కుబడిలో ఎఱ్ఱ గురివింద గింజలను ధ్వజస్థంభం వద్ద భక్తితో పెడితే సకల సంపదలు, అభివృద్ధి మరియు ఆరోగ్యం సిద్ధిస్తుంది అని చెబుతారు. వేలాది ఎఱ్ఱటి గింజలు ధ్వజస్థంభం వద్ద కనపడతాయి. 
నలుచదరపు పెంకులతో నిర్మించిన ప్రధాన ఆలయానికి వెలుపల నలువైపులా శ్రీ గణపతి, శ్రీ ధర్మశాస్త, శ్రీ నీలగ్రీవన్, శ్రీ చండికేశ్వరన్, శ్రీ గంగాదేవి మరియు నాగదేవతల సన్నిధులు ఉంటాయి. 
వర్తులాకార గర్భాలయంలో శ్రీ మహాదేవుడు, శ్రీ పార్వతీ దేవి దివ్యమంగళమైన అలంకరణలో దర్శనం ప్రసాదిస్తారు. 
ఈ ఆలయంలో అతి ముఖ్యమైన పూర్తిగా అరుదైన విశేషం ఒకటి ఉన్నది. 

త్రిపుతరట్టు 

క్షేత్ర గాథలో చెప్పుకొన్నాము కదా అగస్థ్య మహర్షి ఆశ్రమానికి వచ్చిన సమయంలో అమ్మవారికి నెలసరి వచ్చినట్లుగాను, అనంతరం రాతి నుండి రక్తం రావడం గురించి. 
ఇప్పటికీ అమ్మవారికి కొన్ని మాసాలకు ఒకసారి నెలసరి కనిపిస్తుంది. దానిని "త్రిపుతరట్టు" అని పిలుస్తారు. ఆ ఐదు రోజులు అమ్మవారి దర్శనం భక్తులకు లభించదు. పక్కనే ఉన్న ప్రత్యేక గదిలో అమ్మవారిని ఉంచుతారు. ఐదవ రోజున పంపా నదిలో పవిత్ర స్నానం చేయించిన  అమ్మవారిని గర్భాలయానికి తీసుకొని వస్తారు. ఆ తరువాతనే భక్తులకు శ్రీ పార్వతీ దేవి దర్శనం లభిస్తుంది. 
త్రిపుతరట్టు సమయంలో ఉపయోగించిన వస్త్రానికి ఋతుస్రావం అంటుకొని ఉంటుంది. ఆ వస్త్రం పరమ పవిత్రమైనదిగా ఇంటిలో ఉంటే సకల శుభాలు చేకూరుతాయన్న విశ్వాసం భక్తులలో నెలకొని ఉన్నది. 
అందువలననే ఇప్పటి నుండి మరో పదిహేను సంవత్సరాల వరకు ఆ వస్త్రం లభించే అవకాశం లేదు. దేవస్థానం నిర్ణయించిన పైకం చెల్లించి తమ పేరును నమోదు చేసుకొన్నారు అనేక మంది. 

ఆలయ పూజలు - ఉత్సవాలు 


ఉదయం నాలుగు గంటలకు తెరిచి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటా నుండి రా త్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉండే ఆలయంలో ప్రతి రోజు ఇరవై ఆరు రకాల అభిషేకాలు, హోమాలు, అలంకరణలు మరియు అర్చనలు జరుపుతారు. 
ఇవి కాకుండా తులాభారం, శబరిమల మండల మరియు మకర విళక్కు, విద్యాభ్యాసం, వివాహం కూడా నిర్వహిస్తారు. 
ప్రతి రోజు పండగ వాతావరణం వెల్లివిరిసే చెంగన్నూర్ మహాదేవ శ్రీ క్షేత్రంలో కేరళ పంచాంగం అయిన కొళ్లవర్షం ప్రకారం "ధనుర్మాసం " (డిసెంబర్ - జనవరి ) లో ఇరవై ఎనిమిది రోజుల పాటు  నిర్వహించే  వార్షిక ఉత్సవాలు ముఖ్యమైనవి. పవిత్రమైన "తిరువదిరై" నాడు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలలో లక్షలమంది భక్తులు తరలి వస్తారు. 
చైత్ర పౌర్ణమి మరో ముఖ్యమైన పర్వదినం. అమ్మవారికి ప్రీతికరమైన ఆ రోజున ప్రత్యేక పూజలు, అర్చనలు జరుపుతారు. 
కైలాసనాధునికి అత్యంత ప్రీతికరమైన రోజు మహా శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 
కార్మీకుడు పదును పెడుతున్నప్పుడు రాతి నుండి వచ్చిన రక్తాన్ని ఆపడానికి నెయ్యి అభిషేకం చేసారు కదా ! ఆ సంఘటనను గుర్తుచేస్తూ తులం మాసం మొదటి రోజున  (అక్టోబర్ - నవంబర్) లో "తుల సంక్రమణ నెయ్యాట్టు" పేరిట ముప్పైఆరు కలశాల నెయ్యితో మహాదేవునికి అభిషేకం చేస్తారు. 
ఇవే కాకుండా విషు, ఓనం మరియు ఇతర హిందూ పర్వదినాలలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆది దంపతుల దర్శనానికి వస్తారు. 
ఇంతటి ఘన పౌరాణిక చారిత్రక ప్రత్యేక విశేష క్షేత్రం అయిన మహాదేవ శ్రీ క్షేత్రం ఉన్న చెంగన్నూర్ కి దేశం లోని అన్ని ప్రదేశాల నుండి రైలు సౌకర్యం కలదు. ఆలయం రైల్వే స్టేషన్ కు సమీపంలోనే ఉంటుంది. 
చుట్టుపక్కల పంచపాండవులు నిర్మించిన శ్రీ మహావిష్ణువు ఆలయాలు కూడా దర్శించవలసినవి. 
వసతి మరియు భోజన సౌకర్యాలు లభిస్తాయి. 
శ్రీ ధర్మశాస్త (అయ్యప్ప స్వామి) కొలువైన పవిత్ర శబరిమల ఇక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

నమః శివాయ !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Chennaganur

                        మహాదేవ శ్రీ క్షేత్రం, చెంగన్నూర్   పరుశురామ భూమి, దేవతల స్వస్థలం అయిన కేరళలో ఎన్నో విశేష, ప్రత్యేక దేవాలయాలు కనపడతాయ...