19, జులై 2024, శుక్రవారం

Sri Bugga Ramalingeswara swami Temple, Tadiparthi

                                  అద్భుత కళాఖండం  

గతంలో మనం తాడిపత్రి నగరంలో ఉన్న చింతల శ్రీ వెంకట రమణ మూర్తి ఆలయం గురించి తెలుసుకొన్నాము. 
అదే ఊరిలో అంతకన్నా ముందు నిర్మించబడిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని వీక్షిద్దాము

క్షేత్ర గాథ 

బ్రహ్మ మాసన పుత్రులుగా జన్మించిన ప్రజాపతులలో ఒకరైన "పులస్త్య బ్రహ్మ" మనుమడు  రావణ బ్రహ్మ. గొప్ప విద్యావంతుడు, పరమేశ్వర సాక్షాత్కారం పొందినవాడు అయినా అసురగుణాల వలన రావణాసురునిగా పేరొందాడు. 
సీతా మాతను అపహరించుకొని పోయిన పాపానికి శ్రీ రామచంద్రమూర్తి చేతిలో హతుడయ్యాడు. 
ఎంత రాక్షస చర్యలు చేసినా జన్మతః బ్రాహ్మణుడు అవ్వడం మూలాన శ్రీరామునికి బ్రహ్మ హత్యా దోషం సంక్రమించింది. దానిని తొలగించుకోడానికి దశరధ రాముడు సాగర తీరాలలో, నాదీ పరివాహక ప్రాంతాలలో అనేక శివలింగాలను ప్రతిష్టించారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో రామేశ్వరం నుండి అనేక ప్రాంతాలలో శ్రీరామ ప్రతిష్టించిన శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాలు అధికసంఖ్యలో కనిపిస్తాయి. 
అదేవిధంగా శ్రీహరి మరో అవతారమైన శ్రీ పరశురాముడు తండ్రి ఆనతి మీద తల్లిని సంహరించడం మూలాన కలిగిన దోషాన్ని తొలగించుకోడానికి తనగురువైన పరమేశ్వరుని లింగాలను ప్రతిష్టించారని ఆయా క్షేత్రగాధలు తెలుపుతున్నాయి. ఆయన ప్రతిష్టించిన లింగ రాజును కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. 
ఇక్కడ ఈ క్షేత్రంలో కూడా శ్రీరాముడు పావన పెన్నానదీ తీరంలో లింగాన్ని ప్రతిష్టించారని క్షేత్ర పురాణం తెలుపుతోంది. 





శ్రీ ఆంజనేయ కాశీ లింగం 

పెన్నాతీరంలో లింగాన్ని ప్రతిష్టించాలి అని నిర్ణయం తీసుకొన్న తరువాత పండితులు సుముహూర్తం నిర్ణయించారు. శ్రీ రాముడు, శ్రీ ఆంజనేయుని కైలాసనాధుని మరో నివాసం, పవిత్ర గంగాతీరంలో ఉన్న ముక్తి క్షేత్రమైన వారణాసి నుండి లింగాన్ని తెమ్మని పంపారట. కానీ ఆయన తిరిగి రావడంలో కొద్దిగా ఆలస్యం అయ్యిందట. 
అక్కడి ఋషివాటికలోని మహర్షుల సలహా మేరకు జానకీరాముడు శ్రీ మహేశ్వరుని ప్రార్ధించారట. ఆయన కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయంభూ గా వెలిశారని తెలుస్తోంది. 
శ్రీ హనుమంతుడు తెచ్చిన లింగాన్ని ప్రాంగణంలో ఎత్తైన గద్దె మీద ఉత్తరాభిముఖంగా ప్రతిష్టించారు. భక్తులు స్వయంగా అభిషేకం చేసుకొనే అవకాశం లభిస్తుంది. 




ఆలయ విశేషాలు 

తాడిపత్రిలో ఉన్న రెండు ఆలయాలు కూడా విజయనగర చక్రవర్తులు  నియమించిన మండలాధీశ్వరుల చేత నిర్మించబడటం వారివురూ తండ్రీకుమారులు కావడం ప్రత్యేకం. 
శ్రీ పెమ్మసాని రామలింగేశ్వర నాయకుడు గండికోట మండలాధీశునిగా వచ్చినప్పుడు తాడిపత్రి చిన్న గ్రామం. 
శ్రీ రాముని ప్రార్ధనతో ఇక్కడ స్వయంభూ లింగరూపంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి గురించి తెలిసి దర్శించుకొన్నారట. స్వామివారికి ఆలయం నిర్మించాలన్న సత్సంకల్పం కలిగిందట. చక్రవర్తి అనుమతి తీసుకొని శిల్పకళలో నిష్ణాతుడైన రామాచారి ఆధ్వర్యంలో ఆరువందల పైచిలుకు శిల్పులను ఆలయనిర్మాణానికి నియమించారట. 
కావలసిన రాళ్లను సేకరించడానికి కావలసిన మందీమార్బలాన్ని కూడా ఏర్పాటు చేశారట. 
వీరందరి ఆధ్వర్యంలో ఇరవై ఒక్క సంవత్సరాలలో ఒక గొప్ప నిర్మాణం రూపుదిద్దుకొన్నది. 
ఒక అద్భుత కళా ఖండం. నేటికీ దేశవిదేశాల నుండి ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. 
తాడిపత్రి   లోని మరో సుందర శిల్పకళా భాండారం కలియుగవరదుడు చింతల శ్రీ వెంకట రమణునిగా కొలువుతీరిన ఆలయం శ్రీ రామలింగేశ్వర నాయకుని కుమారుడు ఆయన తరువాత మండలాధీశునిగా నియమించబడిన తిమ్మనాయకుడు నిర్మించారని తెలుస్తోంది. 

























పేరు వెనుక కధ 

తాడిపత్రిలో పడమర ముఖంగా కొలువైన కైలాసవాసునికి "బుగ్గ" శ్రీ రామలింగేశ్వరుడు అని పిలుస్తారు. కారణం ఏమిటంటే లింగరాజు స్వయంభూ గా ఉద్భవించిన ప్రదేశంలో గంగా దేవి కూడా ఆయనతో పాటు తరలి వచ్చింది. ఆయన శిరస్సే కాదా ఆమె స్థానం.  
లింగం క్రింద భాగం నుండి నిరంతరం జలం ఉబికివస్తుంటుంది. చిత్రమైన విషయం ఏమిటంటే ఆ నీరు ఆలయంలో ఉన్న భక్తుల సంఖ్యతో సమానంగా ఉండటం. అంటే పది మంది ఉంటే వారి మీద జల్లడానికి సరిపోయేంత ! అదే కార్తీక మాసంలో లేదా శివరాత్రి పర్వదినాన విచ్చేసే భక్తుల సంఖ్య వేలాదిగా ఉంటుంది ఆ సమయంలో అదే స్థాయిలో నీరు లింగం క్రింద నుండి రావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గర్భాలయానికి ఎదురుగా పది అడుగుల దిగువన పెన్నానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. నదీ ప్రవాహం పూర్తిగా తగ్గిపోయినా, నగరం చుట్టుపక్కల నీటి ఎద్దడి ఏర్పడినా సర్వకాల సర్వావస్థల అందుకూడా ఆలయంలో నీరు ఉండటం గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. 
బుగ్గ అంటే నీటి ఊట . అలా స్వామివారిని బుగ్గ శ్రీ రామలింగేశ్వరడు అని పిలుస్తారు. 
ఇదే పేరుతొ కర్నూల్ జిల్లా లోని "కాల్వబుగ్గ" క్షేత్రంలో శ్రీ పరశురాముడు ప్రతిష్టించిన గంగాధరుడు కొలువై ఉంటారు. కానీ ఇక్కడ బుగ్గ ఆలయానికి వెలుపల ఉంటుంది. 
అలానే తెలంగాణా రాష్ట్రం లోని వికారాబాద్ జిల్లాలో మరో విశేష క్షేత్రం ఉన్నది. 













అద్భుత కళా ఖండం 

ఒక రకంగా చెప్పాలి అంటే అసలైన విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఆలయాల సౌందర్యాన్ని చూడాలంటే హంపి కాదు వెళ్ళవలసినది తాడిపత్రి. 
రామాచారి బృందంలోని లబ్ధప్రతిష్టితులైన శిల్పులు రెండు దశాబ్దాల కాలం శ్రమించి తమ విద్యను అత్యద్భుతంగా శిల్పాల రూపంలో నిలిపిన అపురూప శిల్ప కళా ఖండం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. 
దక్షిణ మరియు ఉత్తర దిశలలో నల్ల రాతితో నిర్మించిన అసంపూర్ణ గోపురాలు శివలీలలను, రామాయణ భాగవత పురాణాల ముఖ్య ఘట్టాలను అతి రమణీయంగా చెక్కారు. 
మరో ముఖ్య విశేషాన్ని గమనించాలి. ఈ ఆలయ శిల్పాలలో విజయనగర శైలితో పాటు చాళుక్య, చోళ మరియు పాండ్య శిల్పశైలి కనిపించడం. మరెక్కడా ఇలాంటి ప్రత్యేకత కనిపించదు.  
కానీ అర్ధం కాని విషయం ఏమిటంటే ఈ గోపురాలు సంపూర్ణంగా ఉండటానికి కారణం ఏమిటి అన్నది ?  గోపురాలు అసలు పూర్తి గా ఏదన్నా ప్రత్యేక కారణం వలన చెక్కలేదా ? లేక పరాయి పాలకుల పైశాచిక చర్యల కారణంగా  ధ్వంసం కాబడినదా ? అన్న ప్రశ్నలకు పూర్తి సమాధానం లభించడం లేదు. కానీ ఆలయ వెనుక భాగంలో అనేక భిన్న శిల్పాలు నేల మీద పేర్చబడి కనిపిస్తాయి. 
పాక్షిక విధ్వంసానికి గుర్తులుగా మిగిలాయి. 
ఎంచుకొన్న రాతి  మీద ప్రతి అంగుళాన్నీ ఏకాగ్రతతో, నేర్పుగా రమణీయంగా మలచడం అన్నది ఇక్కడ ప్రతి శిల్పంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. 







హరిహర క్షేత్రం 

పేరుకు తగినట్లుగా శ్రీ రామ లింగేశ్వర స్వామి ఆలయం హరిహర నిలయం. 
శ్రీ రాముడు ప్రతిష్టించిన లింగం  తో పాటు దక్షణ ముఖంగా శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీ కోదండ రాముడు కొలువు తీరిన ఉపాలయం ప్రాంగణంలో కనిపిస్తుంది.  
ఆలయ గోపురాల పైన రామాయణ ముఖ్య ఘట్టాలను, దశావతార రూపాలను కూడా సుందరంగా చెక్కి అమర్చారు. 

ఉపాలయాలు 

శ్రీ రామ సన్నిధితో  పాటు ప్రాంగణంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ప్రత్యేక సన్నిధిలో కొలువై దర్శనం ఇస్తారు. 
క్షేత్రపాలకుడు శ్రీ వీరభద్ర స్వామి సన్నిధి కూడా ఉన్నది. ఇక్కడ విజయనగర రాజుల వంశ వివరాలను తెలిపే శాసనం ఉంటుంది.  నవగ్రహ మండపం ఆలయ ఈశాన్యంలో ఏర్పాటు చేయబడింది. 
వటవృక్షం క్రింద నాగప్రతిష్ఠలు కనిపిస్తాయి. 

















ఆలయ పూజలు - ఉత్సవాలు 

ప్రతి నిత్యం నియమంగా నాలుగు పూజలు జరిగే ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వారు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉంటుంది. ఉత్సవాలు మరియు ప్రత్యేక పర్వదినాలలో ఈ సమయాలు మారుతుంటాయి. 
మాసశివరాత్రి, అమావాస్య, పౌర్ణమి, సోమవారాలు, కార్తీక మాస పూజలు, మహాశివరాత్రి, శ్రీ వినాయక చవితి, దుర్గానవరాత్రులు, శ్రీ రామనవమి, హనుమజ్జయంతి పర్వదినాలను పెద్ద ఎత్తున జరుపుతారు. 
ముఖ్యంగా మాఘ మాసంలో పన్నెండు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో రాష్ట్ర నలుమూలల నుండే కాక పక్క రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తారు. 
ఆది దంపతులు ఈ పన్నెండు రోజులూ ఒకొక్క వాహనం మీద పురవీధులలో ఊరేగుతారు. చివరి రోజున రధోత్సవం ఉంటుంది. 
ఉగాది పండుగ మరియు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి కూడా విశేషంగా నిర్వహిస్తారు. 
ఆలయాన్ని ఆత్యంత చేరువలో భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం తప్పనిసరిగా సందర్శించవలసినదే !
పురాతన ఆలయాలు, ఆలయ శిల్పకళ పట్ల ఆసక్తి గలవారే కాదు సాధారణ భక్తులు కూడా తప్పనిసరిగా ఒక్కసారి అయినా తాడిపత్రి ఆలయాలను సందర్శించుకోవాలి. 
మన పూర్వీకుల నుండి అందిన ఆధ్యాత్మిక సంపద ఎంత విలువైనదో తెలుస్తుంది. 

నమః శివాయ !!!!

 









































































































































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...