26, జులై 2024, శుక్రవారం

sri Ganga Bhramarambha sameta Sri Mallikharjunaswami Temple , Morjampadu

 

                             దక్షిణ శ్రీ శైలం మోర్జంపాడు 


మనం కొద్దిగా శ్రద్ధ పెట్టి వెతికితే మన రాష్ట్రంలో ఎన్నో విశేషాలకు నిలయమైన దేవాలయాలు చాలా కనపడతాయి. ప్రతి ఆలయ నిర్మాణం వెనుక ఒక గాథ లేక ఒక విశేషం నెలకొని ఉంటుంది. 
కాకపోతే వీటిలో చాలామటుకు మారుమూల పల్లెలలో లేదా గ్రామాలలో ఉండటం వలన క్షేత్ర వివరాలు బాహ్యప్రపంచానికి తెలియడం లేదు. స్థానికంగా కూడా వాటిని ఒక ఆలయంగా  మాత్రమే పరిగణించడం విచారకరం. 
ఈ మధ్య నేను దర్శిస్తున్న ఆలయాలలో మూడు గంగతో ఉన్న గంగాధరుని క్షేత్రాలే !
మొదటిది కర్నూల్ దగ్గర ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. రెండవది తాడిపత్రిలో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. మూడవది ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి ఆలయం. మోర్జంపాడు.  
ఈ మూడు ఆలయాలలో నీటి బుగ్గలు ఉండటం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. పరమశివుడు అభిషేక ప్రియుడు కదా !
మారుమూల పల్లె మోర్జంపాడు శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం మరింత ప్రత్యేకమైనది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన క్షేత్రం. 






ఆలయ గాథ 

పావన కృష్ణానదీ తీరంలో ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు మునివాటిక అని తెలుస్తోంది. మహర్షులు తమ నిత్య పూజ కొరకు మహాదేవుని ప్రతిష్టించుకొన్నారని అంటారు. 
ప్రస్తుతం కైలాసవాసుని పూర్తి పరివారం కొలువై ఉన్నారు. 
ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలియదు. కానీ అమరావతిని పరిపాలించిన జమీందారు శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారు ఈ ప్రాంతాల పర్యవేక్షణ నిమిత్తం వచ్చినప్పుడు ఈ క్షేత్రం గురించి విని దర్శించుకొని శిధిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించారని, ఆలయ నిర్వహణకు నిధులు సమర్పించారని తెలుస్తోంది. కాలక్రమంలో భక్తుల సహకారంతో ఆలయం అభివృద్ధి చెందసాగింది. 










దక్షిణ శ్రీ శైలం 

ప్రసిద్ధ జ్యోతిర్లింగ మరియు అష్టాదశ పీఠ క్షేత్రం అయిన శ్రీశైలంతో చాలా పోలికలు ఉండటం వలన దక్షిణ శ్రీ శైలం అని కూడా పిలుస్తారు. 
కొండగుట్టలతో నిండిన అటవీ ప్రాంతంలో, కృష్ణవేణీ పరివాహక ప్రాంతంలో చిన్న గుట్ట మీద  నెలకొన్న ఈ క్షేత్రంలో శ్రీ మల్లేశ్వర స్వామి తూర్పు ముఖంగా గర్భాలయంలో దర్శనమిస్తారు. పక్కనే చిన్న నీటి బుగ్గలో నిరంతరం స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఉదయం నుండి అలంకరణ దాకా వచ్చిన భక్తులు స్వయంగా బుగ్గ లోని నీటితో స్వామికి అభిషేకం చేసుకొనే అరుదైన అవకాశం లభిస్తుంది ఇక్కడ. 
గ్రామంలో నీటి ఎద్దడి వచ్చినా, కృష్ణలో నీరు లేకపోయినా, మండే వేసవిలో కూడా బుగ్గలో నీరు ఉంటూనే ఉంటుంది. బుగ్గలో నీరు పాచి పట్టదు. వాసన రాదు. ఎక్కడ నుండి నీరు వస్తుందో తెలియదు. కానీ సర్వకాలసర్వావస్థల యందు కూడా ఒకే పరిమాణంలో నీరు ఉండటం విశేషం. ఇలాంటిది మరెక్కడా కనిపించదు. 
శ్రీశైలం కూడా కృష్ణా తీరంలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉండటం తెలిసిన విషయమే !  శ్రీశైలంలో గర్భాలయానికి దక్షిణం పక్కన ఉన్న బావి నీటితోనే స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రీశైలంలో ప్రతినిత్యం స్పర్శ దర్శనం ఉంటుంది. 
శ్రీ శైలంలో శ్రీ వృద్ధ మల్లిఖార్జున స్వామి సన్నిధి ఉంటుంది. తన సాన్నిధ్యం కోరుకొన్న ఒక యువరాణిని పరీక్షించడానికి లింగరాజు ముదుసలి రూపంలో వచ్చిన ఉదంతానికి నిదర్శనంగా లింగం కొద్దిగా ముడుతలు పడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. 
అదే విధంగా ఇక్కడ కూడా శ్రీ వృద్ధ మల్లిఖార్జున స్వామి సన్నిధి ఉంటుంది. ప్రత్యేకంగా ధ్వజస్థంభం ఉండటాన్ని బట్టి ఈ స్వామి ప్రధాన ఆలయంలో కన్నా ముందు నుండి ఉన్నారని అర్ధం చేసుకోవాలి. ఇలా స్వామి శ్రీ వృద్ధ మల్లిఖార్జునునిగా పిలవబడేది ఈ రెండు చోట్లలోనే !
శ్రీ శైల ఆలయానికి ఈశాన్య నైరుతి లో పుష్కరణి ఉంటుంది. ఈ క్షేత్రంలో కూడా అదే విధంగా ఆలయ కోనేరు ఉండటం ప్రత్యేకం. 
శ్రీ భ్రమరాంబ అమ్మవారు శ్రీ శైలంలో శ్రీ మల్లికార్జునస్వామి ఆలయానికి వెనుక ఎత్తైన ప్రదేశంలో కొలువై ఉంటారు. ఈ క్షేత్రంలో కూడా అదే విధంగా అమ్మవారు ఎత్తైన గుట్ట మీద ప్రత్యేక సన్నిధిలో కొలువై దర్శనమనుగ్రహిస్తారు. శ్రీశైలంలో ఉన్నంత పెద్ద సన్నిధి కాదు. సాదాసీదాగా ఉంటుంది. 
అమ్మవారి సన్నిధి సమీపంలో నూతనంగా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి  సన్నిధిని నెలకొల్పారు. అదే విధంగా ఈ ఆలయం లోని నవగ్రహ మండపం కూడా ప్రత్యేకంగా నిర్మించారు. మిగిలిన ఆలయాలలో మాదిరి కాకుండా ఏ గ్రహానికి ఆ గ్రహ విగ్రహాన్ని విడివిడిగా ప్రతిష్టించారు. ఇలా ఉండటం వలన ఏ గ్రహానికి సంబంధించిన అభిషేకం, పూజా విడివిడిగా చేసుకొనే అవకాశం లభిస్తుంది. 
శ్రీ శైలంలో స్వామివారి సన్నిధికి ఎడమ పక్కన నాగేంద్ర స్వామిపుట్ట ఉంటుంది. ఈ క్షేత్రంలో కూడా ఆలయ ప్రాంగణంలో వాయువ్యంతో పాటు ఆగ్నేయంలో కూడా నాగేంద్రుని నివాసం కనపడుతుంది. అరుదుగా అర్హులైన భక్తులకు నాగేంద్రుడు శ్వేతనాగు రూపంలో దర్శనమిస్తారట. 


నాగ బంధం 

ప్రధాన ఆలయ వెలుపలి గోడపైన అరుదైన నాగబంధం చెక్కబడి ఉంటుంది. మోక్షపురి వారణాసిలో ఉన్నాడని అంటారు. విడిగా రతి పలకల మీద చెక్కిన నాగబంధం  కొన్ని ఆలయాలలో కనిపిస్తుంది. 
పవిత్రమైన మహిమాన్వితమైన నాగబంధాన్ని దర్శించి పూజించుకొంటే అవివాహితులకు వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. శత్రు బాధలు తొలగిపోయి జీవితంలో అభివృద్ధి పొందుతారన్నది భక్తుల విశ్వాసం. 









క్షేత్రపాలకుడు 

మారుతీనందనుడైన శ్రీ ఆంజనేయస్వామి రుద్రంశగాచెబుతారు. ఈ క్షేత్రానికి ఆయనే క్షేత్రపాలకుడు. ప్రధాన ఆలయానికి నైరుతిలో ఉత్తరాభిముఖంగా శ్రీ రామదూత ముకుళిత హస్తాలతో స్థానక భంగిమలో సింధూవర్ణశోభితులుగా దర్శనమిస్తారు.  ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి వారి ఉపాలయం. 










పూజలు ఉత్సవాలు 

గతంలో ఒక్క సోమవారాలు మాత్రమే తెరిచే ఈ ఆలయం ప్రస్తుతం అన్ని రోజులూ  ఉదయం నుండి మధ్యాహన్నం వరకు భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉంటోంది. ఊరికి దూరంగా అటవీ ప్రాంతంలో ఉండటం వలన సాయంత్రాలు వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని అంటారు. 
స్వయంగా అభిషేకం చేసుకునే భాగ్యం లభించే ఈ క్షేత్రం పేరు "మోర్జంపాడు". 
ప్రస్తుత పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది.  
జ్యొతిర్లింగ క్షేత్రం అయిన శ్రీశైలంతో ఇన్ని సారూప్యాలు ఉన్నందున భక్తులు శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి కొలువైన మోర్జంపాడును దక్షిణ శ్రీశైలంగా భావిస్తారు. శ్రీశైలం వెళ్లలేని వారు ఈ క్షేత్రానికి వస్తుంటారు. 
కార్తీక మాసంలో, మహాశివరాత్రికి విశేష పూజలు పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీ వినాయక చవితి, శ్రీ రామనవమి,  దేవీనవరాత్రులు,శ్రీ హనుమజ్జయంతి పర్వదినాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు. 
శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి భక్తసులభుడని దూరప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. 





స్థానిక భక్తులు  సేకరించిన విరాళాలతో  వచ్చిన భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేసారు. కానీ ఉండటానికి ఎలాంటి సదుపాయాలు లేవు. పిడుగురాళ్లలో వసతి సౌకర్యాలు లభిస్తాయి. పిడుగురాళ్ల నుండి ఆలయం వరకు వెళ్ళడానికి ఆటోలు లభిస్తాయి. సొంతవాహనంలో వెళ్లడం ఉత్తమం. 
ప్రశాంత ప్రకృతిలో పరమేశ్వరుని సన్నిధిలో కొన్ని గంటలు గడపడం ప్రయాణబడలికను పూర్తిగా తొలగించి, శాశ్విత ఆధ్యాత్మిక ప్రసాదించే క్షేత్రం మోర్జంపాడు. 
గ్రామంలో పురాతన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, గ్రామదేవత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం కూడా దర్శించవలసినవి.  

నమః శివాయ !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...