9, జులై 2024, మంగళవారం

Sri Ramalingeswara swamy Temple, Mustabada(vijayawada)



      గుహలో కొలువు తీరిన గంగాధరుడు  


లింగరాజు శ్రీ పరమశివుడు ప్రపంచవ్యాప్తంగా అనేక క్షేత్రాలలో కొలువు తీరి పూజలు అందుకొంటున్నారు. 
ఆ దివ్య ప్రదేశాలలో కొన్నింట మహేశ్వరుడు స్వయంభూ గాను, మరి కొన్నింటిలో శ్రీ మహా విష్ణువు, విధాత బ్రహ్మదేవుడు, ఇతర దేవీ దేవతలు, దిక్పాలకులు, గ్రహాధిపతులు ప్రతిష్టించినవి. మిగిలినవి మహర్షులు కొలిచినవి కావడం గమనించవలసిన విషయం. 
స్వయంభూ క్షేత్రాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచ భూత లింగాలు ఇలా ఎన్నో ఉన్నాయి. అదే విధంగా బ్రహ్మ ప్రతిష్ఠిత లింగాన్ని, శ్రీ మహా విష్ణు ప్రతిష్టించిన లింగాన్ని, అష్ట దిక్పాలకులు మరియు సూర్య చంద్రులు  ప్రతిష్టించిన లింగాలను ఒకే క్షేత్రంలో సందర్శించుకోవచ్చును. స్మరణ మాత్రమున  ప్రసాదించే తిరువణ్ణామలై (అరుణాచలం). 
ఇక మహర్షులలో సప్త ఋషులు మరియు ఇతర మహర్షులు వేలాదిగా లింగాలను దేశ నలుమూలలా ప్రతిష్టించారు. ముఖ్యంగా శ్రీ గౌతమ మహర్షి దక్షిణ భారత దేశంలో వందలాది పవిత్ర ప్రదేశాలలో నిత్య పూజ నిమిత్తం మహేశ్వర లింగాలను ఏర్పాటు చేసుకొన్నారు. అందుకే దక్షిణ భారత దేశంలో అత్యధిక క్షేత్రాలలో స్వామిని శ్రీ అగస్తేశ్వరుడు అని పిలుస్తారు. 
లోక సంరక్షణార్థం అనేక అవతారాలు ధరించిన శ్రీ మహావిష్ణువు తన రామావతార సందర్బంగా అనేక శివలింగాలను వివిధ ప్రాంతాలలో ప్రతిష్టించారు. 
కారణం అసురుడైనా, లోకకంటకుడైనా, ఎన్నో అకృత్యాలు చేసినా, జన్మతః బ్రాహ్మణుడైన రావణబ్రహ్మను సంహరించడం వలన సంక్రమించిన బ్రహ్మహత్యా దోషం తొలగించుకోడానికి !
అలా శ్రీ రామచంద్ర మూర్తి ప్రతిష్టించిన లింగాలు మనదేశంలోనే కాదు పొరుగు దేశాలలో కూడా నెలకొని ఉండటం విశేషం. 
తొలి లింగాన్ని భారతదేశంలో రామేశ్వరంలో ప్రతిష్టించిన అవతార పురుషుడు తన మార్గంలో ఎదురైనా పావన ప్రదేశాలలో లింగాలను ప్రతిష్టించారు అని క్షేత్ర గాధలు తెలుపుతున్నాయి. 
అలాంటి ఒక విశేష లింగం పవిత్ర కృష్ణవేణీ నదీ తీరంలో ఇంద్రకీలాద్రి మీద  అమ్మలగన్న అమ్మ చాలా పెద్దమ్మ శ్రీ కనకదుర్గ దేవి శ్రీ మల్లేశ్వరస్వామితో కొలువైన విజయవాడ నగరానికి సమీపంలోని ముస్తాబాద అనే గ్రామంలో ఉన్నది. 
ఈ క్షేత్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 
సహజంగా శివాలయాలలో లింగరాజు గర్భాలయం మధ్యలో కొలువుతీరి దర్శనమిస్తారు. కానీ ఇక్కడ స్వామి ఒక కొండ గుహలో ఎత్తైన పీఠం మీద , పవిత్రమైన బ్రహ్మసూత్రంతో దర్శనమిస్తారు. సదాశివుడు గుహలో కొలువై ఉన్న ప్రదేశాలు చాలా అరుదు. గుహాలయాలు శ్రీ నరసింహ స్వామి నిలయాలు.  
అక్కడే ప్రధమ పూజ్యుడు శ్రీ వినాయకుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు శ్రీ భ్రమరాంబ దేవి ఒక పక్క, శ్రీ వేంకటేశ్వరస్వామి మరో పక్క కొలువై దర్శనమిస్తారు. హరిహరులు ఒకే గుహలో కొలువై ఉండటం దరిదాపుగా ఎక్కడా కనపడదు. 
ఇది మరొక విశేషం.


















ఆలయ పురాణ గాథ 

రావణసంహారం అనంతరం శ్రీ రామచంద్ర మూర్తి అనేక ప్రాంతాలను సందర్శిస్తూ కృష్ణాతీరానికి వచ్చారట. పవిత్ర నదీ తీరంలో ఒక చిన్న కొండ మీద గుహలో ఒక శివ లింగాన్ని ప్రతిష్టించారట. శ్రీ రాముని ప్రతిష్ఠిత లింగం కావడాన స్వామిని శ్రీ రామలింగేశ్వరుడు అని పిలుస్తారు. 

ఆలయ విశేషాలు 

 ఊరి మధ్యలో ఉన్న చిన్న కొండ మీద ఉంటుందీ ఆలయం. పైకి వెళ్ళడానికి రహదారి, సోపాన మార్గం రెండూ ఉన్నాయి,
రహదారి వద్ద వర్ణమయ స్వాగత తోరణం ఏర్పాటు చేశారు.  
ప్రశాంత వాతావరణం. చక్కని పరిసరాలు. మెల్లగా వీచే గాలి. శబ్ద కాలుష్యం లేని ప్రాంగణం ఆహ్లాదకరంగా ఉంటుంది. 
ప్రాంగణంలో మొదటగా ఆకర్షించే మొదటి గుహాలయంలో శ్రీ భద్రాద్రి రాముని దివ్యమంగళ విగ్రహం. నూతనంగా ప్రతిష్టించారు. తెలుగువారి అయోధ్య భద్రాచలంలో మూలవిరాట్టు ఎలా ఉంటారో అదే విధంగా ఉంటుంది ఇక్కడ స్వామివారి రూపం. 
పక్కనే శ్రీ వినాయకుడు, పదునెట్టాంపడి మీద శ్రీ ధర్మశాస్త మరియు శ్రీ కుమారస్వామి కొలువై దర్శనమిస్తారు. 
వీరి సన్నిధికి ఎదురుగా కొద్దిగా దిగువన పుట్ట ఉంటుంది. సర్పదోషం కలిగినవారు, వివాహం కానివారు,సంతానం లేనివారు నియమంగా ప్రదక్షిణలు చేస్తుంటారు. 
ప్రాంగణంలో శ్రీ మేధో దక్షిణామూర్తి, శ్రీ వీరభద్రుడు, శ్రీ కాలభైరవుడు, శ్రీ సూర్యనారాయణ మూర్తి కొలువై దర్శనమిస్తారు. నవగ్రహ మండపం మరియు గోశాల కూడా ఉన్నాయి. వట వృక్షం క్రింద రాహు కేతువు లను ప్రతిష్టించారు.  
ప్రధాన గుహకు వెలుపల ఎత్తైన ధ్వజస్థంభం, ముఖ మండపంపైన మధ్యలో ఆదిదంపతులు కుమారులతో, ఒక పక్కన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు, మరో పక్క విద్యల తల్లి శ్రీ సరస్వతి  వర్ణశోభిత సుందర రూపాలు కనపడతాయి . 
ప్రవేశ ద్వారానికి ఇరుపక్కలా ద్వారపాలకులైన శృంగి మరియు బృంగి స్వామి సేవలో నిమగ్నమై ఉంటారు. 
అర్ధమండపంలో నందీశ్వరుడు ఉపస్థిత భంగిమలో స్వామివారి సేవకు సదా సిద్ధం అన్నట్లు కనిపిస్తాడు. 
ఎత్తైన పీఠం మీద శ్రీ రామలింగేశ్వర స్వామి పెద్ద లింగరూపంలో బ్రహ్మసూత్రం ధరించి చందన, కుంకుమ, విభూతి లేపనాలతో పుష్ప మాలలు మరియు నాగపడగ ధరించి నాయన మనోహరంగా దర్శనమిస్తారు. 
పక్కనే శ్రీ వినాయకుడు, అమ్మవారు శ్రీ భ్రమరాంబ దేవి, శ్రీ అలిమేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనుగ్రహిస్తారు. 
మరో ముఖ్య విషయం మరియు విశేషం ఏమిటంటే గర్భాలయం పడమర దిశగా ఉంటుంది. క్రింద దూరంగా మరుభూమి ఉంటుంది. మరణించిన వారికి జరిపే అగ్నిసంస్కారం తాలూకు జ్వాల శ్రీ రామలింగేశ్వర స్వామి లింగంలో ప్రతిఫలిస్తుందట. తద్వారా జీవి తన జీవన గమనంలో చేసిన పాప కర్మలు పూర్తిగా తొలగిపోతాయి అన్నది స్థానిక విశ్వాసం. 














కార్తీక దీపం 

కార్తీక మాసం అంతా దేవాలయాలలో ఆకాశ దీపం పెడతారు. నెలంతా భక్తులు మూడువందల వత్తుల అఖండ దీపాన్ని వెలిగిస్తుంటారు. కార్తీక పౌర్ణమి నాడు దీపాలతో అలంకరిస్తారు. తిరువణ్ణామలై (అరుణాచలం)లో పౌర్ణమినాడు గిరి పైన కార్తీక దీపం వెలిగిస్తారు. లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. 
ముస్తాబాద లో శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువైన పర్వతాన్ని "కైలాస గిరి" అని పిలుస్తారు. 
భక్తుల సహకారంతో శిఖరాన పదకొండు వందల అడుగుల ఎత్తున్న కొండ శిఖరాన ఒక పీఠం పైన  దీపస్తంభాన్ని నిర్మించారు. కార్తీక పౌర్ణమినాడు గ్రామస్థులు, వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన భక్తులు జ్యోతులతో ప్రదక్షిణ చేసి గిరి పైన కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. సాయంసంధ్యా సమయంలో జ్యోతి కాంతులతో కైలాసగిరి శోభ వర్ణింప శక్యం కానిది. 































పూజలు - ఉత్సవాలు 

నిత్యం నాలుగు పూజలు జరిగే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉదయం ఆరు నుండి పదకొండు వరకు తిరిగి సాయంత్రం అయిదు గంటల నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల దర్శనార్ధం తెరిచి ఉంటుంది. ఉత్సవాలలో, ప్రత్యేక రోజులలో, పర్వదినాలలో ఉంటుంది. 
ప్రతి  సోమవారం, అమావాస్య, పౌర్ణమి, మాస శివరాత్రి రోజులలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. 
ఉగాది లాంటి పర్వదినాలలో, కార్తీక మాసంలో విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు చేస్తారు. 
ముఖ్యంగా  మంగళ వారం మరియు ఆదివారం భక్తులు ఇక్కడ వివాహం, సంతానం కొరకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి  ప్రత్యేక పూజలు చేయించుకొంటుంటారు. పుట్టకు ప్రదక్షిణలు చేస్తారు.  
శ్రీ వినాయక చవితి, శ్రీ సుబ్రహ్మణ్య షష్టి, శ్రీ రామనవమి, దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 
మహాశివరాత్రి ఉత్సవాలు ఈ ఆలయంలో రంగరంగ వైభవంగా జరుపుతారు. 
ప్రభలు కట్టుకొని దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు. నృత్య గానాలు, గ్రామోత్సవం, రధోత్సవం, అన్నదానం అన్నీ పెద్ద ఎత్తున భక్తుల సహాయసహకారాలతో ఘనంగా చేస్తారు. 
ఇన్ని విశేషాలకు నిలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువైన ముస్తాబాద విజయవాడ పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సు సౌకర్యం లభిస్తుంది. 
వసతి సౌకర్యాలు విజయవాడ పట్టణంలో దండిగా లభిస్తాయి. 
ఆలయ సందర్శనాభిలాష ఉన్నవారు తప్పనిసరిగా సందర్శించవలసిన క్షేత్రం శ్రీ రామలింగేశ్వరస్వామి కొలువు తీరిన ముస్తాబాద. 

నమః శివాయ !!!!








 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...