కోటలకు కోట కొండవీటి కోట
ఆంధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్విత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాప రుద్రుడు ఒకరు.
రాణీ రుద్రమదేవి మనుమడైన ప్రతాప రుద్రుడు మూడున్నర దశాబ్దాల పాటు ఓరుగల్లు (వరంగల్) రాజధానిగా చేసుకొని తెలుగు వారి కీర్తి బావుటాను ఎగురవేశారు. /
ఢిల్లీ నవాబు తుగ్లక్ సేనల చేతిలో ఓటమిపాలై శత్రువులకు బందీగా చిక్కి అవమానభారం తట్టుకోలేక నర్మదాతీరంలో ఆత్మహత్య చేసుకొన్నారన్నది శాసనాలు, చరిత్రకారులు చెబుతున్నది.
ప్రతాపరుద్రుని తరువాత కాకతీయ సామ్రాజ్యం పూర్తిగా పతనమైపోయింది.
శ్రీ మూలాంకులేశ్వరి అమ్మవారి దేవాలయం, అమీనాబాద
ఆ తరువాత కొంత కాలం ఆంధ్రజాతి సరైన పాలకులు లేక యుద్ధాలతో అల్లకల్లోలంగా మారిపోయింది అని చరిత్ర చెబుతున్న విషయం.
ఆ సమయంలో ముసునూరి నాయక మరియు రాచర్ల నాయక వంశాలు నేటి తెలంగాణా లో మొగ్గతొడిగాయి. కాకతీయ పాలకుల వద్ద సైనాపతులుగా ఎన్నో యుద్ధాలలో పాల్గొన్న రెడ్డి వంశం వారుఆంధ్రప్రాంతానికి వచ్చి నేటి ప్రకాశం జిల్లాలోని అద్దంకిని రాజధానిగా చేసుకొని రెడ్డి రాజుల సామ్రాజ్యానికి పునాది వేశారు.
మహామండలేశ్వర గా పిలవబడిన ప్రతాప రుద్రుని డెబ్బై ఏడుమంది నాయకులలో ప్రముఖులు ముసునూరి వంశ పాలనకు మూలమైన కాయప నాయకుడు మరియు రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమా రెడ్డి.
ముసునూరి వారు మరియు రాచర్ల వారు కొద్దికాలమే పాలన చేయగలిగారు.
రెడ్డి రాజులు మాత్రం సుమారు శతాబ్ద కాలానికి పైగానే తమ ప్రభావాన్ని ఆంధ్ర ప్రాంతాలలో కాకుండా తమిళ మరియు ఓడ్ర దేశాల పైన కూడా చూపించారు అని శాసనాధారాలు తెలుపుతున్నాయి.
కొండవీడు కోట
తొలుత అద్దంకిని రాజధానిగా చేసుకొన్నా రాజకీయంగా అది సరైన ప్రాంతం కాదని తగిన అనువైన ప్రదేశం కోసం అన్వేషించి చివరకు చుట్టూ పర్వతాలతో సురక్షితమైన కొండవీటి ప్రాంతాన్ని ఎంచుకొన్నారు. పటిష్టమైన కోటను నిర్మించుకున్నారు.
వారి అంచనా తప్పలేదు. ఆనతి కాలంలోనే కొండవీడు శత్రుదుర్భేద్యం అన్నపేరు పొందినది.
రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమా రెడ్డి తప్ప మిగిలినవారు అంతా మిగిలివారంతా ఈ కోట నుండే పాలన సాగించారు.
తొమ్మిది మంది రెడ్డి రాజులలో ఎనిమిది మంది కొండవీడును తమ రాజధానిగా చేసుకొని కంచి నుంచి కటకం వరకు సువిశాల ప్రాంతాన్ని పరిపాలించారు. ప్రోలయ వేమా రెడ్డి కుమారుడు అయిన "అనవోతా రెడ్డి" కాలంలో కొండవీటి కోట నిర్మాణం పూర్తి అయ్యి రాజధాని అద్దంకి నుండి కొండవీడు కు మార్చబడినది.
వీరిలో ప్రముఖుడు "అనవేమా రెడ్డి". ప్రోలయ వేమా రెడ్డి కనిష్ట పుత్రుడు. అనవోతా రెడ్డి గొప్ప యోధుడు.కవి, పండితుడు. ప్రజారంజకంగా పాలన సాగించిన ప్రభువు.
వీరిలో చివరి పాలకుడు వీరభద్రా రెడ్డి. ఈయనతో రెడ్డి రాజ్యం కనుమరుగైనది.
రెడ్డి రాజులు - ఆలయాలు
రెడ్డి రాజులు శైవమతాభిమానులు. హిందూధర్మం పట్ల గౌరవం కలిగినవారు. వీరి కులదేవత శ్రీ మూలాంకులేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కొండవీడు కు సమీపంలోని అమీనాబాదు గ్రామంలో నేటికీ సందర్శించుకోవచ్చును.
అమరావతి , శ్రీశైల మరియు శ్రీ అహోబిల నారసింహ ఆలయాలను పునర్నిర్మించారని అక్కడి శాసనాలు తెలుపుతున్నాయి.
కొండవీడు చుట్టుపక్కల చాలా పురాతన ఆలయాలను నేటికీ సందర్శించుకోవచ్చును.
కొండ మీద ఉన్న కోటకు వెళ్లే మార్గంలో శ్రీ వెన్నముద్ద శ్రీ కృష్ణ ఆలయం అరుదైనది. ఇది విజయనగర రాజుల కాలంలో నిర్మించబడినది.
రెడ్డి రాజుల తరువాత కొండవీడు విజయనగర రాజుల అధీనం లోనికి వెళ్ళింది. వారి నుండి ఫ్రెంచ్ వారు చివరగా ఆంగ్లేయులు కొండవీడు కోట మీద ఆధిపత్యం వహించారు. ఆంగ్లేయులు మరింత సౌకర్యవంతమైన ప్రదేశం లభించడంతో అక్కడికి తరలి పోయారు. అది నేటి విజయవాడ కు సమీపంలోని కొండపల్లి.
ఈ కోట కూడా రెడ్డి రాజులు నిర్మించినదే కావడం విశేషం.
ఆంగ్లేయులు వదిలేసిన తరువాత కొండవీడు కోట క్రమేణా తన గతవైభవాలను నెమ్మదిగా కోల్పోయినది అని చెప్పవచ్చును.
కొండవీటి రెడ్డి రాజుల ప్రదర్శనశాల
కత్తుల బావి
శ్రీ వెన్నముద్ద శ్రీ కృష్ణ ఆలయం, చెంఘిస్ ఖాన్ పేట
కొండవీడు కోట
ఒకప్పుడు అంటే సుమారు ముప్పై సంవత్సరాల క్రిందట కొండపైకి వెళ్లాలంటే నడిచి ఎక్కవలసి ఉండేది. అదొక అద్భుత అనుభూతి.
ప్రస్తుతం చక్కటి రహదారి ఏర్పాటు చేశారు. ఈ మలుపుల దారిలో వాహనంలో శిఖరానికి చేరుకోవడం మరో విధమైన ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
గమనిస్తే నాటి నిర్మాణ గొప్పదనం నేటికీ అంటే ఏడువందల సంవత్సరాల తరువాత కూడా కోట ప్రహారీగోడ పటుత్వం ఆశ్చర్యం కలిగిస్తుంది. పరాయి పాలకుల దాడులలో నష్టం జరిగినా, కొన్ని దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైనా ఆ నిర్మాణాలలో మునుపటి బలం, దర్పం నేటికీ స్పష్టంగా కనిపించడం నాటి పాలకుల ముందు చూపుకు మరియు శిల్పుల గొప్పదనాన్ని నిదర్శనంగా చెప్పుకోవాలి.
మరో గొప్ప విశేషం కొండవీడు కోటలో కనిపిస్తుంది.
నీరు మానవ మనుగడకు తప్పనిసరి.
రాళ్ళ గుట్టలతో నిండిన కొండ మీద నీరు ఎక్కడ నుండి లభిస్తుంది ?
దానికి నాటి నిపుణులు ఒక గొప్ప పరిష్కారాన్ని కనుగొన్నారు. మూడు పెద్ద చెరువులను కోటలో త్రవ్వారు. ఊట మరియు వర్షపు నీరుతో నిండిన ఈ చెరువులు శత్రువులు కోటను పూర్తిగా చుట్టుముట్టి నెలల తరబడి నిర్బంధం చేసినా లోపలి వారి నీటి అవసరాలను తీర్చేవి.
నేటికీ ఈ చెరువులలో నీటిని చూడవచ్చును. ఇంకా ఎన్నో శిధిల గృహాలు, బురుజులు, వంపులు తిరుగుతూ సాగిన కోట గోడ. ఇవనీ ఆ కాలపు వైభవాన్ని మన కనుల ముందునిలుపుతాయి.
కొండపై నుండి చూస్తే పొలాలు వాటి మధ్య బొమ్మల కొలువులాగా కనిపించే పల్లెలు. జోరుగా వీచే స్వచ్ఛమైన గాలి,గతంలో మహారాజులు, మహా కవి పండితులు మరియు మహావీరులు నడయాడిన ప్రదేశములో నెలకొన్న గంభీరత సందర్శకులను మైమరపిస్తాయి.
కొండవీడు పక్కన ఉన్న పుట్టకోట మీద శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అమీనాబాదులో రెడ్డి రాజుల కులదైవం శ్రీ మూలంకులేశ్వరి అమ్మవారి సన్నిధి, సమీపంలోని వేములూరిపాడు గ్రామంలో పదవ శతాబ్దానికి చెందిన చోళ రాజుల నిర్మిత శ్రీ జలపాలేశ్వర స్వామి కోవెల, గురువు కొండ లో శ్రీ ఆంజనేయస్వామి మందిరం, చెంఘిష్ ఖాన్ పేట లో శ్రీ వెన్నముద్ద శ్రీ కృష్ణుని ఆలయం, కోటకు వెళ్లే దారిలో కత్తులబావి మరియు రెడ్డిరాజుల మ్యూజియం చూడదగ్గవి.
రాష్ట్ర పురావస్తుశాఖ వారు ప్రస్తుతం పురాతన శిధిల నిర్మాణాలను పురుద్దరించడంతో పాటు నూతన నిర్మాణాలను చేపట్టడం కొండవీడు కోటకు మరో సారి పునర్వైభవాన్ని తేవడమే !!
రానున్న కాలంలో కొండవీడు కోట మరింత సుందరంగా రూపుదిద్దుకొని పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించాలని మనసారా కోరుకుందాము.
అవకాశం ఉన్నవారు కనీసం ఒక్కసారైనా ఈ చారిత్రాత్మక కోట సందర్శించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి