శిల్పకళా భాండారం ఈ ఆలయం
అద్భుతం !
పరమాద్భుతం !!
భగవంతుని పట్ల భక్తి అనాలా !
ప్రజల పట్ల అభిమానం అనాలా !!
తమ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న కోరికా !
నేర్పరులైన శిల్పులకు ప్రోత్సాహం ఇవ్వడమా !!
ఇవన్నీ కొంత విశ్లేషాత్మక దృష్టితో చేసేవారికి వచ్చే ఆలోచనలు.
సామాన్య సందర్శకులకు చాలా గొప్పగా ఉన్నది. ఎలా కట్టారో !
అంతే !!
అయినా సందర్శించిన ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందగలిగే అద్భుత నిర్మాణాలు.
ఇంత చెప్తున్నది మన రాష్ట్రంలో ఉన్న రెండు అద్భుత ఆలయాల గురించి.
అవి శ్రీ చింతల వెంకట రమణ స్వామి ఆలయం మరొకటి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. రెండూ కూడా ఒక కిలోమీటరు దూరంలో ఒకే ఊరిలో ఉండటం మరింత అద్భుతం.
అనంతపురం జిల్లాలో పెన్నా నదీతీరంలోని తాడిపత్రి పట్టణంలో ఉన్నశివ కేశవ ఆలయాలు రెండు అత్యంత సుందరమైనవిగా ప్రసిద్ధి చెందాయి. మన రాష్ట్రంలో ఇలాంటి ఆలయాలు మరెక్కడా లేవు.
ప్రభుత్వం ఈ రెండు ఆలయాలను రక్షిత కట్టడాలుగా గుర్తించి పురావస్తు శాఖవారి అధీనంలో ఉంచడం జరిగింది.
క్షేత్ర గాధ
విజయనగర సమయంలో విజయనగర రాజుల గురువైన "విద్యారణ్య స్వామి" ఒక బ్రాహ్మణునికి ఈ ప్రాంతాన్ని రాజుల చేత దానంగా ఇప్పించారట. తాటి మరియు చింత తోపులతో నిండి ఉన్న ప్రాంతాన్ని "తాళ్ళపల్లి" అని పిలిచేవారట. క్రమంగా ఒక గ్రామం ఏర్పడి పట్టణంగా మారింది.
అనంతర కాలంలో పట్టణంగా "తాడిపత్రి గా పిలవసాగారు.
విజయనగర రాజుల పాలనలో ఈ ప్రాంతం గండికోట మండలాధీశుల అధికార పరిధిలో ఉండేది.
ఆలయ గాధ
సుమారు పదహారవ శతాబ్ద మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్య మండలాధీశులైన పెమ్మసాని నాయక రాజులు పరిపాలించేవారు.
పెమ్మసాని తిమ్మనాయుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రోజులలో ఒక విశేషం చోటు చేసుకొన్నదట. చింత చెట్టు ఒకటి అకస్మాత్తుగా నిట్టనిలువుగా చీలి పోయిందట. కాండం మధ్యలో కలియుగ వరదుని దివ్య మంగళ రూపం సాక్షాత్కరించినదట.
నాటి రాత్రి తిమ్మనాయుకుని కలలో స్వామి దర్శనమిచ్చి ఆ స్థలంలో తనకొక ఆలయాన్ని నిర్మించమని ఆఙ్ఞాపించారట. మరునాడు తాడిపత్రి చేరుకొని శ్రీవారికి పూజలు చేసి, చక్రవర్తి అనుమతితో ఆలయం నిర్మించారట.
స్వామి వారి విశేషాలు
చింత చెట్టులో కనిపించిన స్వామిని "చింతల తిరు వెంగళ నాధుడు" అని పిలిచేవారట. కానీ కాలక్రమంలో వెంకట రమణ గా మారింది. సహస్రనామధారి భక్తితో ఏ పేరుతొ పిలిచినా పలుకుతారు. భక్తుల చింతలను దూరం చేసే వానిగా శ్రీ వెంకట రమణ స్వామి ప్రసిద్ధి.
గర్భాలయంలో స్వామి నయనమనోహరమైన అలంకరణలో నేత్రపర్వంగా స్థానక భంగిమలో దర్శనమిస్తారు.
ఆలయ విశేషాలు
ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభం అయ్యే సమయానికి హంపిలో ప్రసిద్ధ శ్రీ విజయ విఠల ఆలయ నిర్మాణం జరుగుతున్నది. శిల్పులు అక్కడి విధానాన్ని గమనించడానికి వెళ్లారట. అందువలన కొన్ని విషయాలలో రెండు ఆలయాలకు సమీప పోలికలు కనిపించడం గమనించవలసిన విషయం.
సుమారు అయిదు ఎకరాల ప్రాంగణంలో నిర్మించబడిన ఆలయానికి తూర్పున అయిదు అంతస్థుల రాజగోపురం నిర్మించబడినది. అక్కడే విజయస్థంభం, తులాభార మండపం ఉంటాయి. రాజగోపురం పైన చక్కని శిల్పాలు, తెలుగు శాసనాలు కనిపిస్తాయి.
గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే అద్భుత శిల్ప ప్రపంచం లోనికి వెళ్లిన అనుభూతి కనిపిస్తుంది. పెద్ద పెద్ద విగ్రహాల నుండి అతి చిన్న జీవాలు, పూవులు, లతలు, ఇతర రూపాలను అయిదు వందల సంవత్సరాల క్రిందట స్పష్టాతి స్పష్టంగా చెక్కిన విధానం అబ్బురపరుస్తుంది. కొన్ని శిల్పాలలో విజయనగర శైలితో పాటుగా చాళుక్యుల నిర్మాణశైలి కనిపించడం ప్రత్యేకం.
నాటి పాలకులు తమకు భగవంతుని పట్ల గల అచంచల విశ్వాసాన్ని, నేర్పరులైన శిల్పుల చేత నాటి ప్రజలకే కాదు ఈనాటి వరకు ప్రతి ఒక్కరికీ మన పురాణ ఇతిహాసాలను శిల్పాల రూపంలో పొందుపరిచి అందించారు. వారికి మన సంస్కృతి గొప్పదాన్ని తెలిపే ప్రయత్నంలో శాశ్విత కీర్తిని పొందారు. విదేశీ పాలకుల దాడులలో కొంత నష్టం జరిగినా నేటికీ
ప్రాంగణంలో మొదట కనిపించేది బలి పీఠం,ఎత్తైన ధ్వజస్థంభం పక్కన రధం ఆకారంలో నిర్మించిన శ్రీ గరుడాళ్వార్ సన్నిధి.
బలిపీఠం మీద చిన్న రాతి చక్రం ఉంటుంది. బహుశా పరాయి పాలకుల పాలనకు ముందు అక్కడ ఏదన్న దేవత విగ్రహం ఉండేదేమో! విగ్రహాన్ని తొలగించగలిగారు కానీ శిల్పుల గొప్పదనాన్ని కాదు. నేటికీ ఆ రాతి చక్రం తిప్పితే గిరగిరా తిరుగుతుంది. అలా తిప్పుతూ మనసులోని కోర్కెలు చెప్పుకుంటే తొందరగా నెరవేరతాయని నమ్ముతారు.
హంపి శ్రీ విజయ విఠల ఆలయం లోని రాతి రధం ప్రపంచప్రఖ్యాతమైనది.
శ్రీ చింతల వెంకట రమణ స్వామి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధి అదే మాదిరి రధం ఆకారంలో చెక్కబడినది. కానీ ఆకారంలో చిన్నది ఆలయం ముఖమండపానికి ఆనుకొని ఉంటుంది.
ముఖ మండపంలో నలభై స్తంభాలు ఉంటాయి. విజయనగర శైలిలో కనిపించే ఈ స్థంభాలపైన దశావతారాలను,రకరకాల విష్ణు రూపాలను,నాట్యగత్తెల భంగిమలను,పురాణ కాలంనాటి జంతువులను జీవం ఉట్టిపడేలా చెక్కారు. రంగమండపం ద్వారం పైన అనేక విష్ణు రూపాలను అత్యంత సుందరంగా నిలిపారు.
రంగమండపం, అర్ధ మండపం మరియు గర్భాలయ వెలుపలి గోడలపైన రామాయణ, భాగవత గాధల ముఖ్యఘట్టాలను జీవం ఉట్టిపడేలా మలిచారు. ఇలాంటిది మనం హంపీలోని హాజరరామ ఆలయంలో చూడగలం.
పక్షులు పుష్పాలు, జంతువులు ముఖ్యంగా ఏనుగులు, గుర్రాల సూక్ష్మ రూపాలలో కనపడే స్పష్టత, జీవం అనిర్వచనీయం. అతి తక్కువ సౌకర్యాలు ఉన్న రోజులలో రాతిని ఇలా మలిచిన వారి నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే !
ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వెలకట్టలేని శిల్ప భాండారం శ్రీ చింతల వెంకట రమణ స్వామి ఆలయం.
దీనికి ఒక చిన్న ఉదాహరణగా ఆలయంలోని తులసి కోటను చూపించవచ్చును.
ఏకశిల మీద ఎంతో ఏకాగ్రతతో తన విద్యను పూర్తిస్థాయిలో శిల్పశాస్త్రం ప్రకారం ఆ శిల్పి ఈ తులసి కోటలో ప్రదర్శించారు.
వారి విద్యకు, అప్పగించిన పనికి పూర్తిస్థాయిలో న్యాయం చేసిన వారి కృషికి వందనాలు అర్పించాలి ప్రతి ఒక్కరూ !
అమ్మవారు విడిగా సన్నిధిలో దర్శనమిస్తారు.
ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉపాలయం ఉంటుంది. శ్రీ రామానుజాచార్యుల మరియు శ్రీ వేదాంత దేశికుల వారి సన్నిధులు కూడా ఉంటాయి.
అంజనాతనయుడు మరొక ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు.
మరో విశేషం ఏమిటంటే సహజంగా శివాలయాలలో కనిపించే నాగ ప్రతిష్టలు ఈ ఆలయంలో కనిపించడం. శ్రీవారు సంతానప్రదాత అన్నది భక్తుల విశ్వాసం.
ఆలయ పూజలు - ఉత్సవాలు
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలు గంటల నుండి రాత్రి ఎనిమిది వరకు స్వామివారి దర్శనం లభించే ఈ ఆలయంలో నిత్యం నియమంగా పూజలు, అర్చనలు, అలంకారాలు జరుపుతారు.
శ్రీ కృష్ణాష్టమి, శ్రీ రామనవమి, తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, అన్ని వైష్ణవ సంప్రదాయం ప్రకారం నిర్ణయించిన పర్వదినాలను, ఉగాది ఇతర హిందూ పర్వదినాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఆశ్వయుజ మాసం (అక్టోబర్ - నవంబర్) లో ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
పురాతన ఆలయాల సందర్శన పట్ల అనురక్తి కలిగినవారు, ఆలయాల దర్శనం పట్ల ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా సందర్శించవలసినది చింతల శ్రీ వెంకట రమణ స్వామి ఆలయం, తాడిపత్రి.
అనంతపురానికి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిపత్రిలో వసతి మరియు భోజన సౌకర్యాలు తగుమాత్రంగా లభిస్తాయి. అనంతపురం నుండి బస్సులు లభిస్తాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి