6, జనవరి 2022, గురువారం

Uttamar Koil, Tirukarambanur, Trichi

 

                       ఉత్తమార్ కోవిల్ (తిరుకరంబనూర్)


శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో మూడో స్థానం లో ఉన్న "తిరుకరంబనూర్ లేదా ఉత్తమార్ కోవిల్" అత్యంత అరుదైన క్షేత్రంగా ప్రసిద్ధి. 
తిరుకరంబనూర్, కదంబవన క్షేత్రం, ఉత్తమార్ కోవిల్, బిక్షందార్ కోవిల్ ఇలా ఎన్నో పేర్లతో పిలవబడే ఈ క్షేత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణ, సర్వేశ్వరుడు ముగ్గురూ తమ ధర్మపత్నులతో కలిసి కొలువై దర్శనమిస్తారు. ఈ  పేర్లకు,స్థల పురాణానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. 
శ్రీ హరి దర్శనాన్ని అపేక్షిస్తూ కదంబముని ఇక్కడ తపస్సు చేసి శ్రీవారి సాక్షాత్కారాన్ని  పొందారట.  అలా "తిరుకరంబనూర్ " అన్న పేరు వచ్చింది. గతంలో ఈ ప్రాంతం పెద్ద కదంబ వనం. అందువలన "కదంబవన క్షేత్రం" అని పిలిచేవారు. 
శ్రీ పురుషోత్తమ పెరుమాళ్ ఈ దివ్యదేశ మూలవిరాట్టు. పురుషోత్తమన్ అన్న సంస్కృత పదానికి తమిళంలో " ఉత్తమార్" అన్నది సరైన పదం. అలా అధిక భాషాభిమానం కలిగిన తమిళ ప్రజలు "ఉత్తమార్ కోవిల్ అని పిలుస్తారు. 
కైలాస వాసుడైన పరమశివుడు బిక్ష స్వీకరించినది ఇక్కడే ! ఈ కారణంగా భిక్షందార్ కోవిల్ అని కూడాపిలుస్తారు. ఇక్కడ కొలువైన త్రిమూర్తులకు సమాన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఒకొక్కరు ఒక్కో దిశగా కొలువై ఉండటం మరో విశేషం. 

శ్రీ పురుషోత్తమన్ సన్నిధి 

జానకీ మాత జనకుడైన జనక మహారాజు దక్షిణ భారత దేశ యాత్రకు బయలుదేరి, సకుటుంబ, సపరివార సమేతంగా కదంబవనంలో విడిది చేశారట. ఆయనతో యాత్రలు చేస్తున్న గౌతమ మరియు కశ్యప మహర్షులు ఈ స్థల ప్రాశస్త్యం గ్రహించి జనక మహారాజుని శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందడానికి యాగాన్ని చేయమని సూచించారట. వారి సూచన మేరకు యాగాన్ని ఆరంభించారట మహారాజు. కానీ ఎంతాకాలం గడిచినా ఫలితం రాకపోడం మహర్షులను ఆశ్చర్య పరచిందిట. కారణం ఏమిటా అని దివ్యదృష్టితో చూసిన వారికి ఒక శునకం యాగ ద్రవ్యాలను అపవిత్రం చేసినట్లుగా కనపడినదట. 
తెలియక జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసి, కొత్త ద్రవ్యాలతో తిరిగి యాగాన్ని ప్రారంభించారట. ఫలితం కూడా త్వరగానే లభించిందట. తమ ముందు విశ్వరూపంలో దర్శనమిచ్చిన పురుషోత్తముని ఇక్కడే పాలకడలిలో శేషశయనునిగా కొలువు చేయమని ప్రార్ధించారట జనక మహారాజు మరియు మహర్షులు. వారి కోరిక మేరకు శ్రీవారు ఇక్కడ అనంతశయనునిగా అవతరించారు. 
తొలి ఆలయాన్ని కూడా జనక మహారాజే నిర్మించారట. తరువాత యుగానికి చెందిన "సత్యకీర్తివర్ధన్" అనే పాలకునికి సంతానం లేకపోవడంతో శ్రీ పురుషోత్తమ పెరుమాళ్ ని ఆశ్రయించారట. స్వామివారి  అనుగ్రహంతో  బిడ్డలు కలగడంతో కృతజ్ఞతగా ఆలయానికి నిలువెత్తు ప్రహరీ గోడను, గర్భాలయం పైన "ఉద్యోగ విమానాన్ని"నిర్మించారట . కలియుగంలో చోళులు, పాండ్యులు, విజయనగర మరియు నాయక రాజులు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేసినట్లుగా శాసనాలు తెలియజేస్తున్నాయి. 
గర్భాలయంలో శ్రీ పురుషోత్తమ పెరుమాళ్ ఆదిశేషుని మీద శయన భంగిమలో, సుందర  పుష్ప, న స్వర్ణాభరణాల అలంకారంలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. అమ్మవారు "పూర్ణాదేవి". ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. పక్కనే శ్రీ గరుడాళ్వార్ మరియు శ్రీ ఆంజనేయ సన్నిధులు కూడా ఉంటాయి. 

భిక్షందార్ సన్నిధి 

విధాత చేసిన తప్పుకు ఆగ్రహించిన లయకారుడు ఆయన అయిదవ శిరస్సును ఖండించారు. దానితో పరమేశ్వరునికి బ్రహ్మహత్యా దోషం సంక్రమించింది. దాని వలన బ్రహ్మ అయిదవ తలా ఆయన చేతికి అంటుకొని పోయిందిట. ఏమి చేసినా ఊడి రాలేదట. చివరకు శ్రీమహావిష్ణువు చెప్పిన సలహా మేరకు మహేశ్వరుడు ఆ కపాలాన్నే భిక్షాపాత్ర గా చేసుకొని ఎన్నో ప్రదేశాలలో భిక్ష స్వీకరించారట. కానీ కపాలం నిండలేదు. ఊడి రాలేదు. 
చివరికి ఈ ఆలయం వద్దకు రాగా అమ్మవారు అందించిన భిక్షతో పాత్ర నిండటమే కాక చేతి నుండి ఊడి పోయిందట. దానితో ఈశ్వరుని వేధించిన బ్రహ్మహత్యా పాతకం తొలగిపోయిందట. 
అందుకనే ఈ క్షేత్రం లోని అమ్మవారిని పూర్ణా దేవి అంటారు. 
తనకు అంటిన పాతకం తొలగి పోయిన పావన క్షేత్రంలో కొలువు తీరాలని నిర్ణయించుకొని ఇక్కడే స్థిరపడిపోయారు  కైలాసవాసుడు. పార్వతి దేవికి ప్రత్యేక సన్నిధి కలదు. ఇక్కడ ఉన్న మరో శివ లింగాన్ని దశరధ మహారాజు ప్రతిష్టించినట్లుగా చెబుతారు. 
జనకుడు యాగం చేసిన స్థలం, దశరధ మహారాజు లింగాన్ని ప్రతిష్టించిన క్షేత్రం ఏనాటిది ? ఎంతటి పవిత్రమైనది !

విధాత ఆలయం   

మహర్షి శాపం కారణంగా సృష్టికర్త బ్రహ్మదేవునికి పుడమిలో చాలా తక్కువ ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో ప్రముఖమైనది రాజస్థాన్ రాష్ట్రంలోని "పుష్కర్" వద్ద కలదు. 
కానీ తమిళనాడులోని  దివ్యదేశాలలో మరియు పడాల్ పెట్ర స్థలాలలో కొన్ని చోట్ల బ్రహ్మదేవుడు ఉప ఆలయాలలో కొలువు తీరి దర్శనమిస్తారు. అలాంటి వాటిల్లో ఈ ఉత్తమార్ కోవిల్ ఒకటి. 
ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి కూడా హంసవాహనుని పక్కన ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉండటం. కమలసంభవుడు ఈ క్షేత్రంలో కొలువు తీరడానికి సంబంధించిన పౌరాణిక గాధ ఇలా ఉన్నది. 
సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడు వైకుంఠవాసుని సహాయం అర్థిస్తూ ఆయన ఆదేశం మేరకు కదంబవనానికి వచ్చి తదేకదీక్షతో అష్టాక్షరీ మంత్రం జపిస్తూ తపస్సు చేశారట. ఆయన దీక్షకు సంతసించిన శ్రీమన్నారాయణుడు దర్శనం అనుగ్రహించి ఆశీర్వదించారట. తనకి అంతటి అపూర్వ యోగాన్ని పొందే యోగాన్ని ప్రసాదించిన ఈ క్షేత్రం పట్ల ఆప్యాయత పెంచుకున్న విరంచి సతీ సమేతంగా స్థిరపడిపోయారు. 
అలా సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులు కొలువు తీరడం వలన తిరుకరంబనూర్ త్రిమూర్తి క్షేత్రంగా పేరొందినది. 

ఆలయ విశేషాలు 

విశాల ప్రాంగణం రెండు భాగాలుగా విభజించబడింది. ఒక పక్కన విష్ణాలయం మరో పక్క శివాలయం ఉంటాయి. ఉపాలయాలలో విఘ్ననాయకుడు వినాయకుడు కూడా ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తారు. 
రాజగోపురం కూడా లేని ఈ ఆలయంలో పెద్ద ఆకర్షణీయ శిల్పాలు కనపడవు. త్రిమూర్తుల దర్శనమే ఉత్తమార్ కోవిల్ లో కన్నుల పండుగ. 
ప్రాంగణంలో, ఆలయ గోడల మీద ఉన్న చోళ, పాండ్య రాజుల శాసనాలు ఆలయ విశిష్టత గురించి తెలియచేస్తాయి. 

చరిత్రలో తిరుకరంబనూర్ 

పౌరాణికంగానే కాదు, చారిత్రకంగా కూడా ప్రత్యేక స్థానం కలిగి ఉండటం విశేషం. ప్రెంచివారు, పోర్చుగీసు వారు, ఆంగ్లేయులు మన దేశము లోనికి వ్యాపారార్ధం ప్రవేశించారు. క్రమంగా స్థానిక పాలకుల బలహీనతలను, వారి మధ్య ఉన్న విభేదాలను ఉపయోగించుకొని చాప క్రింది నీరు లాగ ఒక్క రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. కానీ వారి మధ్య ఆధిపత్య విబేధాలు తలెత్తాయి.ముఖ్యంగా ప్రెంచివారు మరియు ఆంగ్లేయుల మధ్య అది తారాస్థాయికి చేరుకొన్నది. ఇరువర్గాలు అనేక సార్లు వివిధ ప్రాంతాలలో ఆధిపత్య పోరులకు తలపడ్డాయి. 
పద్దెనిమిదో శతాబ్దంలో 1751 మరియు 1760 వ సంవత్సరాలలో వారి మధ్య జరిగిన యుద్దాల్లో ఉత్తమార్ కోవిల్ ను ఫ్రెంచి వారు తమ విడిదిగా ఉపయోగించుకొన్నారట.  
మొదటి రెండు సార్లు వారిని ఏమీ చేయలేని ఆంగ్లేయులు మూడోసారి మాత్రం ఆలయం మీదకు ఫిరంగులతో దాడి చేయాలని నిర్ణయించుకున్నారట. మరుసటి రోజు వారు ఫిరంగులతో సిద్ధం అయ్యేసరికి ఆలయంలో నుండి ఉరుములాంటి భీకర శబ్దంతో కూడిన అగ్నివర్షం వారిమీద కురిసి గాయపరచినదట. దానితో భయభ్రాంతులైన వారు పలాయనం చిత్తగించారట. 

మంగళాశాసనం 

గాయక భక్తులైన పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ఒక్క తిరుమంగై ఆళ్వార్ మాత్రమే శ్రీ పురుషోత్తమన్ పెరుమాళ్  మీద ఒక పాశుర గానం చేశారట. శ్రీ రంగ ఆలయ గోపుర మరియు ప్రాకార నిర్మాణ సమయంలో తిరుమంగై ఆళ్వార్ ఉత్తమార్ కోవిల్ లోనే విడిది చేశారట. శ్రీ రంగ ఆలయ నిర్మాణంలో ఈయన కూడా గణనీయమైన పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. 
తన పాశురంలో ఆళ్వార్ అనేక క్షేత్రాలలో కొలువైన నీవు ముల్లోకాలను మహా ప్రళయ సమయంలో కాపాడి లోకసంరక్షకునిగా కీర్తించబడుతున్నావు. సామాన్య మానవులైన మేము నీనుంచి ఇంతకన్నా ఏమి కోరుకొంటాము. అంతటి దయామయుడవైన నిన్ను నేను అనేక క్షేత్రాలలో దర్శించుకొని ధన్యుడనయ్యాను అని పేర్కొన్నారు. 

శ్రీ రంగం చుట్టుపక్కల మరెన్నో విశేష ఆలయాలు ఉన్నాయి. అన్నీ దర్శనీయమైనవే !

జై శ్రీమన్నారాయణ !!!!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...