15, జనవరి 2022, శనివారం

Sri Mahamaya Temple, Ratanpur, Chattisgarh

                      ముగురమ్మల రూపం మహామాయ దేవి 





ఉత్తరాదిన చాలా రాష్ట్రాలలో దేవదేవి కొలువైన క్షేత్రాలను "శక్తి పీఠాలు"గా పేర్కొంటారు. కానీ వీటిల్లో అధిక శాతం యాభై రెండు శక్తి పీఠాల్లో కనపడవు. అయినా వీటిని శక్తి పీఠాలుగా పిలవడానికి ప్రధాన కారణం ఆ క్షేత్రాలన్నింటిలో అమ్మవారు స్వయంవ్యక్తగా కొలువు తీరడమే ! మరో విశేషం ఏమిటంటే వీటిల్లో చాలా చోట్ల జగజ్జనని లింగ రూపంలో ఉండటం.  అంతే కాకుండా ఆమె మహా సరస్వతి, మహా లక్ష్మి మరియు మహా కాళిగా ముగురమ్మల ఏక రూపిగా పూజలందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. అలాగని అక్కడ మూడు రూపాలు ఉంటాయి అనుకొంటే పొరబడినట్లే ! మూడు లింగ రూపాలు మాత్రమే ఉంటాయి. వాటికి పైన అలంకరణ చేసి అమ్మవార్లను ఆవాహన చేస్తారు. 
ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో అనేక అమ్మవారి ఆలయాలు కనపడతాయి. దంతెవాడ శ్రీ దంతేశ్వరి దేవి, డోంగర్ గఢ్ మా బమలేశ్వరి దేవి విశిష్టమైనవి. వీటిల్లో చాలా మటుకు అక్కడ పాలించిన రాజ వంశాల వారి కులదేవతలుగా ప్రసిద్ధి. ఆలయాలను కూడా ఆ వంశాల వారే నిమించినట్లుగా తెలియవస్తోంది. 
అలాంటి పవిత్ర క్షేత్రాలలో ఒకటి శ్రీ మహామాయ దేవి కొలువు తీరిన రతన్ పూర్. 

ఆలయ చరిత్ర 

క్రీస్తు శకం పదో శతాబ్దం నుండి పన్నెండో శతాబ్దం దాకా ఈ ప్రాంతాన్ని పాలించారు  కాలచూరి రాజ వంశీయులు. తొలుత వీరి రాజధాని నేటి కోర్బా కి సమీపంలోని "తుమన్". కాలచూరి వారు హైహేయ రాజులను ఓడించి అదే ఊరిని తమ రాజధానిగా కొనసాగించారు. కానీ కాలక్రమంలో వివిధ రాజకీయ కారణాలతో రాజధానిని తుమన్ నుండి మార్చవలసిన పరిస్థితులు వచ్చాయి. రాజా రతన్ దేవ్ అనువైన ప్రాంతాన్ని అన్వేషిస్తూ ఇక్కడికి వచ్చారు. నాటి రాత్రి కలలో  అమ్మవారు మహామాయ దర్శనమిచ్చి ఇది తన స్థలమని తనకు ఆలయం నిర్మించి, రాజధాని నిర్మించుకోమని ఆదేశించారు. 



















అమ్మవారి ఆజ్ఞ తల దాల్చి రతన్ దేవ్ అమ్మవారికి ఆలయాన్ని నిర్మించి రాజధానిని ఇక్కడికి మార్చారు. అలా క్రీస్తు శకం 1050వ సంవత్సరం నుండి ఈ ప్రాంతాన్ని రాజు పేరు మీద రతన్ పూర్ అని పిలవసాగారు. 
కాలక్రమంలో కాలచూరి వంశ ప్రాభవం తరిగిపోయింది. వారు అనేక ఉపశాఖలుగా విడిపోయి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. రాజ కోట మరియు  ఆలయం శిథిలావస్థకు చేరుకొన్నాయి. పదిహేనవ శతాబ్దంలో  ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొన్న రాజా బాహర్ సాయి ఆలయాన్ని పునః నిర్మించారు. 
ఈ ప్రదేశంలో సతీదేవి కాళీ గజ్జెలు పడటం వలన ఇది శక్తి పీఠంగా పిలవబడుతోంది అని అంటారు స్థానికులు. తొలి మందిరాన్ని రాజా విక్రమాదిత్య క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. 

 ఆలయ విశేషాలు 

సువిశాల ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు ఎన్నో ఉపాలయాలు, మండపాలు మరియు కోనేరులు ఉంటాయి. 
నగారా శైలిలో నిర్మించబడిన ప్రధాన మరియు ఇతర నిర్మాణాలు ఆకర్షణీయంగా కనపడతాయి.  
మహామాయ దేవి కొలువు తీరిన మందిరానికి ఎదురుగా కొద్దిగా ఎత్తైన పీఠం పైన "కాంతి దేవళ సన్నిధి" ఉంటుంది. పరమశివుడు కొలువైన ఈ పురాతన మందిరం పక్కన మరో మందిరం కూడా కనపడుతుంది. ఇక్కడ లింగానికి పాలు మరియు మంచినీటితో అభిషేకం చేస్తే సకల గ్రహ దోషాలు తొలగిపోయి సర్వసంపదలు లభిస్తాయని చెబుతారు. 
ఇలాంటి మరికొన్ని పురాతన శిధిల నిర్మాణాలు చాలా రతన్ పూర్ లో కనపడతాయి. కాంతి దేవళ మందిరం నగారా మరియు మొఘల్ నిర్మాణ శైలిలో కట్టబడినది. వెలుపలి గోడలకు చెక్కిన సాలభంజికలు నేటికీ ఎంతో సుందరంగా జీవం ఉట్టిపడుతూ కనపడటం విశేషం. 
శ్రీ కాల భైరవుడు ఈ క్షేత్ర పాలకుడు. ప్రధాన ఆలయానికి వెలుపల రహదారి మీద ఒక సన్నిధి, మహామాయ దేవి కొలువైన మందిరానికి దక్షిణం పక్కన మరో సన్నిధిలో భైరవుడు కొలువు తీరి భక్తుల ప్రధమ పూజలు అందుకొంటుంటారు. 














పక్కనే అఖండ జ్యోతి ఇప్పటికి ముప్పై నాలుగేళ్లుగా వెలుగుతూనే ఉన్నది. మరో వైపు శ్రీ మహిసాసుర మర్ధిని, శ్రీ భద్రకాళీ అమ్మ కూడా ఆలయ వెలుపలి గోడలలో కనపడతారు. ఆలయానికి ఉత్తరం పక్కన ఉన్న పెద్ద మండపంలో అనేక మంది దేవీదేవతలు కొలువై ఉంటారు. 
ఉపాలయాలలో ప్రధానమైనవి శ్రీ గణపతి, శ్రీ హనుమాన్, శ్రీ సూర్య, శ్రీ మహావిష్ణు కొలువైనవి. 
లోపలి దారి తీసే ద్వారం చాలా చిన్నగా ఉండి ఇరుకుగా ఉంటుంది. తోలుతో చేసిన వస్తువులను ధరించి ఆలయం లోనికి వెళ్లనీయరు. గర్భాలయంలో రెండు అర్చనామూర్తులు ఒకదాని వెనుక కొలువై కనపడతాయి. ముందు ఉన్న విగ్రహాన్ని శ్రీ మహిషాసురమర్ధినిగా వెనుక ఉన్న రూపాన్ని శ్రీ మహా సరస్వతి మరియు శ్రీ మహా లక్ష్మి ఏక రూపంగాను పేర్కొంటారు. వెలుపల అమ్మవారి వాహనం అయిన మృగరాజు ఉపస్థిత భంగిమలో కనపడతారు. 
ప్రతి నిత్యం నియమంగా నాలుగు పూజలు జరుగుతాయి అమ్మవారికి. అన్ని హిందూ పండగల సందర్భంగా వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా నవరాత్రులలో లక్షలాదిగా భక్తులు "అఖండ మనోకామ్న నవరాత్ర జ్యోతి కలశ" లను తీసుకొని వస్తారు. ప్రత్యేకమైన కోరిక కోరుకొని ఈ జ్యోతి కలశ తీసుకొని వచ్చే భక్తులను అమ్మవారు తప్పక అనుగ్రహిస్తుంది అని విశ్వసిస్తారు. 
































ప్రాంగణంలో నేపాలీ శైలిలో నిర్మించిన మందిరం ఒకటి కనపడుతుంది. అందులో సర్వేశ్వరుని పంచ ముఖాలైన ఈశాన, తత్పురుష, వామదేవ, సద్యోజాత మరియు అఘోర ల ప్రతీకగా పంచ ముఖ లింగం కొద్దిగా ఎత్తైన పీఠం మీద దర్శనమిస్తుంది. ఈ లింగాన్ని భక్తులు మహా మృత్యుంజయ పంచ ముఖ మహాదేవ అని పిలుచుకొంటూ  పరమ పవిత్రమైనదిగా ఇహపర కోర్కెలను నెరవేర్చిదిగా నమ్ముతారు. ఎవరైనా మహా మృత్యుంజయ పంచ ముఖ మహాదేవ  లింగానికి అభిషేకం చేసి, మనస్సులోని కోరిక తెలుపుకొని ఒక కొబ్బరి కాయను ఎఱ్ఱటి వస్త్రంలో కట్టి సన్నిధిలో ఉంచితే మండలం రోజులలో అది నెరవేరుతుంది అంటారు. మనోభీష్టం పూర్తి అయిన తరువాత మరో సారి ఆలయానికి వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా మరో మారు అభిషేకం జరిపించుకొని ఇంతకు ముందు పెట్టిన కొబ్బరి కాయను ప్రసాదంగా స్వీకరించాలి. 
ఎఱ్ఱ వస్త్రంలో చుట్టి పెట్టిన కొన్ని వందల కొబ్బరి కాయలు కనపడతాయి అంటే స్వామి పట్ల భక్తులకు గల అనన్య విశ్వాసాన్ని అర్ధం చేసుకోవచ్చును. 















ప్రాంగణమంతా చిన్న చిన్న మందిరాలలో ఎన్నో దేవతా సన్నిధులు కనపడతాయి. భక్తులకు కావలసిన పూజాద్రవ్యాలు, పిల్లలు కోరుకొనే ఆట వస్తువులను అమ్మే దుకాణాలు ప్రాంగణంలో ఎన్నో కనపడతాయి. 
చక్కని పరిశుభ్ర వాతావరణంలో ఉంటె శ్రీ మహామాయ దేవి ఆలయం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి రెండు గంటల నుండి రాత్రి పది గంటల వరకు భక్తుల కొరకు తెరచి ఉంటుంది. 
ఆలయానికి కొద్ది దూరంలో ప్రధాన రహదారి మీద కాల చూరి రాజుల పురాతన కోట శిధిలావస్థలో కనపడుతుంది. 











నామమాత్రంగా మిగిలిన ప్రవేశ ద్వారాలు, పునాదులు, కొన్ని చిన్న మందిరాలు మాత్రమే కనపడతాయి. ద్వారం అమర్చబడిన గోడ పైన సుందర శిల్పాలు ఆకర్షిస్తాయి. పూర్తిగా ఎఱ్ఱ ఇసుక రాతితో ఈ కోట నిర్మించబడినట్లుగా తెలుస్తుంది. శ్రీలక్ష్మీ నారాయణ, శ్రీ ఆంజనేయ మందిరాలు పై భాగాన ఉంటాయి. 
ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న కోటను వారు చక్కగా సంరక్షిస్తున్నారు. 
కోటకు కొద్ది దూరంలో చిన్న కొండ మీద శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుల వారి ఆలయం ఉంటుంది. దూరంగా మరో పర్వతం మీద నిలువెత్తు హనుమాన్ విగ్రహం కనపడుతుంది. 
రతన్ పూర్ లో మాత్రమే నెలకొని ఉన్న విశేషం, ఆకర్షణ ప్రపంచంలో మరెక్కడా కనపడదు. అదే స్త్రీ రూపంలో దర్శనమిచ్చే శ్రీ అంజనా సుతుడు కొలువైన మందిరం. 
శ్రీ మహామాయ దేవి ఆలయం నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఈ విశేష ఆలయం. 




























ఇంతటి చారిత్రక విశేషాల నిలయమైన రతన్ పూర్ ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలో ఒకటైన బిలాస్ పూర్ కి పాతిక కిలోమీటర్ల దూరంలో అంబికా పూర్ వెళ్లే మార్గంలో ఉన్నది. బస్సులు లభిస్తాయి. ఉండటానికి పరిమిత సంఖ్యలో వసతి సౌకర్యాలు కలవు. 

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే 

శరణ్యే త్రయంబికే దేవీ నారాయణి నమోస్తుతే !!!!!


































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...