Urayur Divya Desam, Trichi

                                 ఉరయూర్ దివ్యదేశం  

శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాలలో అగ్రస్థానం శ్రీ రంగనాధుడు కొలువు తీరిన శ్రీ రంగానిదే !
పవిత్ర కావేరీ నదీ తీరంలోని ఈ క్షేత్రానికి చుట్టుపక్కల తరువాత స్థానాలలో ఉన్న అయిదు క్షేత్రాలు నెలకొని ఉన్నాయి. 
అవి వరుసగా "తిరుకోళి(ఉరయూర్), తిరుకరంబనూర్ (ఉత్తమార్ కోయిల్), తిరువెళ్ళరాయి, తిరుఅంబిల్, తిరుప్పరనగర్(కొయిలాడి). ఈ అయిదు క్షేత్రాలు విశేష పౌరాణిక నేపథ్యం, ఎన్నో శతాబ్దాల చరిత్రకు నిలయాలు. 
ప్రస్తుతం ఉరయూర్ గా పిలవబడుతున్న తిరుచ్చి నగర శివారు ప్రాంతం గతంలో చోళ రాజుల తొలి రాజధానిగా "నిచ్చలా పురి లేదా తిరుకోళి"గా పిలువబడింది. ఉరయూర్ హరిహర క్షేత్రం. దివ్యదేశం గానే కాకుండా శైవులకు దర్శనీయ స్థలాలైన పడాల్ పెట్ర స్థలాలలో ఒకటిగా గుర్తింపు పొందినది. 
ఇక్కడి విష్ణాలయాన్ని మరియు శివాలయాన్ని చోళులే నిర్మించారని శాసనాధారాలు తెలుపుతున్నాయి. 
శ్రీ అళగియ మానవళ్ పెరుమాళ్(సుందరమైన పెండ్లికుమారుడు) గా వైకుంఠ వాసుడు పూజలందుకొంటున్న స్వామి వారికి శ్రీ మహాలక్ష్మితో కళ్యాణం జరిగిన పవిత్ర వేదిక ఉరయూర్. లోకనాథుడైన  శ్రీ రంగనాథుడు నాటికి, నేటికీ శ్రీ రంగం లోనే ప్రత్యక్షంగా ఉన్నారు అనడానికి నిదర్శనం ఉరయూర్ స్థల పురాణం. 
తొలి చోళ రాజైన ధర్మవర్మ చోళుడు ఒకసారి కావేరి తీరంలోని "కారారణ్యం"లో వేట నిమిత్తం వెళ్లారట. అప్పట్లో ఆ అరణ్యం ఒక ముని వాటిక. ఎందరో మునులు, పండితులు, ఇక్కడ యజ్ఞయాగాదులు, ధ్యానం, తపస్సు మరియు వేదాధ్యయనం చేస్తుండేవారు. 
కారారణ్యంలో కనిపించిన పవిత్ర, శాంతి వాతావరణం చోళుని మనస్సును వేట నుండి మరల్చివేసినది. ఆయన అక్కడి వారికి నమస్కరించి ఒక రాజుగా తాను వారికి చేయగలిగిన సహాయం ఏమన్నా ఉన్నదా ? అని అడిగారట. 
మహారాజును సముచితంగా ఆహ్వానించినా వారు తమ నిత్య కర్మలకు అవరోధాలు కలిగిస్తున్న అసుర మూకను అంతం చేయవలసినదిగా కోరారు. వారి కోరికను మన్నించిన  రాజు ముష్కరులను వధించి వారికి భద్రతను కల్పించారు. 
ఈ క్రమంలో రాజుగారు అక్కడ ఉండటానికి చేసుకొన్న ఏర్పాట్ల వలన అక్కడ ఒక చిన్న పట్టణం ఏర్పడింది. రాణీగారి పేరు మీద "నిచ్చలా పురి" అని పిలవసాగారు. రాజు గారు అక్కడే ఉండటంతో  మంత్రులు, సామంతులు, అధికారులు  అక్కడికే రాసాగారు. క్రమంగా అదే రాజధానిగా మారిపోయింది. 
అన్నీ ఉన్న మనిషికి ఏదో ఒక చింత మనస్సుకు శాంతి లేకుండా చేస్తుంది. అదే విధంగా రాజ దంపతులకు సంతానం లేకపోవడం అనే బాధ వేధించేది. వారు సంతానం పొందటానికి ఏదన్నా మార్గం ఉంటే తెలుపమని మునులను అభ్యర్ధించారు. 
మహర్షులు గ్రంధాలను వెతికి చివరికి రాజా దంపతుల జాతకాలు సరిపోయేది " లక్ష్మీ తంత్ర యాగం " అని నిర్ణయించారు. ఆనందించిన రాజు రాణితో కలిసి శ్రద్ధాభక్తులతో యాగాన్ని నిర్వహించారు. పూర్ణాహుతి సమయంలో అశరీరవాణి " మహారాజా ! యాగాన్ని నియమనిష్టలతో చేసినందున శ్రీ మహాలక్ష్మి నీ ఇంట జన్మించబోతోంది. ఆమెకు శ్రీ మహావిష్ణువే భర్త. తగిన సమయానికి ఆయనే వస్తారు. అలాగే కుమార్తె తరువాత నీకొక కుమారుడు కూడా జన్మిస్తాడు" అని తెలిపిందట. 
శ్రీదేవి అంశతో జన్మించిన బిడ్డకు "వాస లక్ష్మి" అని, కుమారునికి " చంద్ర తిలకన్" అని పేర్లు పెట్టారు. యుక్తవయస్సుకు వచ్చిన కుమార్తెకు వివాహం చేయనెంచిన రాజు స్వయంవరం ప్రకటించగా అనేక మంది రాజకుమారులతో పాటు శ్రీ రంగనాధుడు కూడా మారువేషంలో వచ్చారట. 
శ్రీ మహాలక్ష్మి అవతారం, చిన్ననాటి నుండి వింటున్న శ్రీహరి గాధలు ఆమెను మారువేషంలో ఉన్న శ్రీరంగని గుర్తించేలా చేశాయి. వరమాల మెడలో వేయగానే స్వామి తన నిజరూపంలో దర్శనమిచ్చారట. అందరూ భక్తితో స్వామిని కీర్తించి సతీ సమేతంగా ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకొమ్మని అర్ధించారట. వారి కోరికను మన్నించి స్వామి ఇక్కడ " మానవళ్ పెరుమాళ్ " గా వెలిశారు. అమ్మవారు శ్రీ కమలవల్లి నాంచారి. ఈమెను " వాసలక్ష్మి లేదా ఉరయూర్ వల్లి" అని కూడా పిలుస్తారు. 

ఆలయ విశేషాలు   

సుమారు రెండువేల సంవత్సరాల క్రిందటి ఆలయంగా భక్తులు భావిస్తారు. కానీ కాలక్రమంలో అనేక మార్పులు, కొత్త నిర్మాణాలు, పునః నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. గడచిన శతాబ్ద కాలంలో ఏర్పరచిన శిల్పాలలో " సైకిల్ , రాకెట్ " లాంటివి ఉండటం విశేషం. 
మండప స్థంభాలమీద శ్రీవిష్ణు లీలలను సుందరంగా చిత్రీకరించారు. ఈ ఆలయంలో వాయునందనుడు శ్రీ ఆంజనేయునికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. అనేక స్తంభాల మీద ఆయన రూపాలను చెక్కారు. 
రాజగోపురం వద్ద ఒక ప్రత్యేక సన్నిధిని కూడా అంజనాసుతునకు ఏర్పాటు చేశారు. 
ఈ ఆలయం స్వామివారి కళ్యాణవేడుక సందర్బంగా ఏర్పాటు చేసినది కావడం వలన అమ్మవారు విడిగా కొలువు తీరి ఉండరు. గర్భాలయంలో అళగియ మానవళ్ పెరుమాళ్ తో పాటు ఉపస్థిత భంగిమలో పెండ్లి కుమార్తె ఎలా కూర్చొని ఉంటారో అలా ఉంటారు. స్వామి స్థానక ప్రయోగ చక్ర  
 భంగిమలో దర్శనమిస్తారు. గమనించవలసిన అంశం ఏమిటంటే గర్భాలయం ఉత్తర దిశగా ఉండటం. 
ఐదు అంతస్థుల రాజగోపురం భాగవత ఘట్టాల శిల్పాలతో సుందరంగా నిర్మించబడినది. ఆలయానికి నలుదిక్కులా ఎత్తైన ప్రహరీ నిర్మించారు.  ప్రాంగణంలోనే ఉంటుంది "సూర్య పుష్కరణి". ఇది శ్రీవారి కళ్యాణం జరిగిన ప్రదేశంలో  నిర్మించిన ఆలయం కావడం వలన గర్భాలయ పైన ఉన్న దానిని కళ్యాణ విమానం అని పిలుస్తారు. 
తొలుత చోళ రాజులచే నిర్మించబడిన ఈ ఆలయం అనంతర కాలంలో పాండ్య, విజయనగర, నాయక రాజులు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేశారు. 
ఇక్కడ అమ్మవారిని కొలిస్తే భార్యాభర్తలు మధ్య ఎలాంటి కలహాలు లేకుండా అన్యోన్యంగా ఉండే విధంగా
దీవిస్తారని స్థానిక విశ్వాసం. 
ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఉత్సవిగ్రహాలు ఉండవు. ఉత్సవాల సమయంలో శ్రీరంగం ఆలయం నుండి తీసుకొని వస్తారు. ఇక్కడ వెలసినది శ్రీ రంగనాధుడే కదా !

ఉపాలయాలు 

 శ్రీ ఆండాళ్, శ్రీ రామానుజాచార్యులు, నమ్మాళ్వార్ మరియు తిరుప్పాన్ ఆళ్వార్ సన్నిధులు ఉన్నాయి. పన్నిద్దరు ఆళ్వారులలో ఒకరైన శ్రీ తిరుప్పాన్ ఆళ్వార్ జన్మస్థానం ఉరయూర్. 
ఆలయ గోడలకు దశావతార, విష్ణు లీలా చిత్రాలను సహజ వర్ణాలతో చిత్రించారు. 

ఉత్సవాలు   

ప్రతి నిత్యం నియమంగా ఆరు పూజలు నిర్వహిస్తారు. ఫాల్గుణమాసంలో పదిరోజుల కళ్యాణ ఉత్సవం ఘనంగా జరుపుతారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి, అష్టమి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ రామ నవమి సందర్భాలలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. 

మంగళ శాసనం 

శ్రీ అళగియ మానవళ్ పెరుమాళ్ ని కీర్తిస్తూ కులశేఖర ఆళ్వార్ పన్నెండు పాశురాలను, తిరుమంగై ఆళ్వార్ పదమూడు పాశురాలను గానం చేశారు. ఈ పాశురాల కారణంగా ఉరయూర్ శ్రీ అళగియ మానవళ పెరుమాళ్ ఆలయం శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాలలో శాశ్విత స్థానం పొందినది. 
  
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహాన్నం పన్నెండు వరకు, తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల దర్శనార్ధం తెరిచి ఉండే ఈ ఆయానికి  తిరుచ్చి సత్రం బస్సు  స్టాండ్ లేదా శ్రీరంగం ఆలయం నుండి సులభంగా చేరుకోడానికి సిటీ బస్సులు లభిస్తాయి. 
అళగియ మానవళ్ పెరుమాళ్ ఆలయానికి దగ్గరలోనే శ్రీ పంచవర్ణేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. తప్పక సందర్శించవలసిన ఆలయం. 


జై శ్రీమన్నారాయణ !



                         




To

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore