6, జనవరి 2022, గురువారం

Pandava Theertham, Thiruvannamalai

 

పాండవ తీర్థం, తిరువణ్ణామలై

మహాభారతం ఆది కావ్యంగా పేరొందినది. వ్యాస భగవానుడు ప్రధాన పాత్ర పోషిస్తూ స్వయంగా తెలుపగా విఘ్ననాయకుడు  శ్రీ గణపతి అక్షరీకరించిన  మహా కావ్యంలో అన్ని యుగాలకు మరియు కాలాలకు సంబంధించిన విషయాలు వివరంగా ఉండటం విశేషం. అందుకే పెద్దలు  అంటారు మహా భారతంలో లేనిది లేదు అని. రాజకీయం, కుట్రలు, కుతంత్రాలు, యుద్దాలు, ప్రజల జీవన శైలి, నీతి  నియమాలు, న్యాయ, అన్యాయాలు, ధర్మ, అధర్మాలు,స్త్రీ గౌరవం, ఎంతటి వారినైనా వదలని కర్మ ఫలం ఇలా ఎన్నో పంచమ వేదం లో కనిపిస్తాయి. 
 ఈ మహా పురాణంలో ప్రధాన పాత్రలు కౌరవులు మరియు పాండవులు. వీరు దండయాత్రల పేరిట, యాత్రల నిమిత్తం మరియు ఇతర కార్యక్రమాల కొరకు భారతదేశ నలుమూలలా తిరుగాడినట్లుగా తెలుస్తోంది.   




అందుకే భారత దేశంలోని ప్రతి  రాష్ట్రం లోని ఏదో ఒక చోట వీరితో ముడిపడి ఉన్న ప్రదేశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పాండవులు లక్క దహనం తరువాత,మాయా జూదంలో ఓటమి పాలు అయిన తరువాత  చేసిన పుష్కర కాల అజ్ఞాత వాసంలో అనేక ప్రాంతాలలో నివసించినట్లుగా అనేక స్థానిక కధనాలు తెలుపుతున్నాయి. అక్కడి వారు  వాటికి తగిన ఆధారాలను కూడా చూపిస్తారు. 
అలాంటి వాటిల్లో పంచ భూత స్థలాలలో అగ్ని క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన తిరువణ్ణామలై ఒకటి. భక్తులలో అపరిమిత ఆదరణ కలిగిన జ్యోతిర్లింగాలకు బీజం పడినది ఇక్కడే అని పురాణాలు తెలుపుతున్నాయి. శ్రీ మహా విష్ణు మరియు విధాత బ్రహ్మదేవుని మధ్య అహంకారంతో తలెత్తిన   ఆధిపత్య పోరును తొలగించడానికి శ్రీ పరమేశ్వరుడు జ్యోతి రూపంలో వారికి దర్శనమిచ్చి, జ్ఞానాన్ని ప్రసాదించినది కూడా ఇక్కడే అని అరుణాచల పురాణం పేర్కొంటోంది. వారివురి కోరిక   మేరకు కైలాసనాధుడు కొండగా కొలువైనది ఇక్కడే అన్న విశ్వాసంతో భక్తులు పర్వతం చుట్టూ పదునాలుగు కిలోమీటర్ల దూరం నియమంగా భక్తిశ్రద్దలతో ప్రదక్షిణ చేస్తుంటారు. గిరి ప్రదక్షిణ  అరుణాచల యాత్ర పరిపూర్ణం కాదని నమ్ముతారు.      
గిరి ప్రదక్షిణ మార్గంలో ఎనిమిది దిక్పాలక లింగాలు, లోకాలకు  వెలుగును ప్రసాదించే సూర్య మరియు చంద్ర లింగాలు మరియు శ్రీ దూర్వాస, శ్రీ గౌతమ మరియు శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్థ్య మహర్షుల సన్నిధులు  ఉంటాయి. ఇలాంటి విశేష ఆలయాలను మరెక్కడా చూడలేము. ఈ పదునాలుగు కిలోమీటర్ల మార్గంలో అనేక  కనపడుతుంటాయి. అన్నీ కూడా అరుణగిరిని చూస్తూ ఉండటం మరో ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మార్గంలో శ్రీ కన్నప్ప నయనార్ మరియు శ్రీ ఆది అణ్ణామలై ఆలయాలు అరుదైనవి. పురాతనమైనవి. 
భక్తులు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో  కనుక చూస్తే అనేక రూపాలలో కనిపిస్తుంది. వీటన్నిటి లోనికి కుబేర  తరువాత వచ్చే పంచ ముఖ దర్శనం ముఖ్యమైనది. ఇక్కడే మహనీయులు శ్రీ ఇసక్కి  జీవ సమాధి కలదు. సుమారు ఆరు దశాబ్దాల క్రిందట  వందల సార్లు గిరికి అంగప్రదక్షిణ చేసిన మహానుభావులు వీరు. 
ఇవన్నీ తిరువణ్ణామలై తరుచుగా సందర్శించే వారికి తెలిసినవే ! తెలియని రెండు ముఖ్య విశేషాల గురించి తెలుసుకొందాము. 

పాండవ తీర్థం    

లక్క ఇంటి అగ్ని ప్రమాదం  నుండి తప్పించుకున్న పాండవులు కొంత కాలం కాలం వివిధ ప్రాంతాలలో తలదాచుకున్నారు. ఆ క్రమంలో కొన్ని రోజులు వారు  తిరువణ్ణామలై లో కూడా ఉన్నారని చెబుతారు. విశ్వసించిన వారిని విశ్వనాధుడే విపత్తుల బారి నుండి విముక్తి కలిగిస్థాడన్న లోకోక్తి ఉన్నదికదా ! దానిని పూర్తిగా విశ్వసించిన పాండు పుత్రులు ఈ  క్షేత్రంలో ఉన్నన్ని రోజులు  నిత్య పూజల నిమిత్తం  లింగాన్ని ప్రతిష్ఠించు కొన్నారట. అభిషేకాదుల కొరకు  ఒక కొలను కూడా  నిర్మించారట.  













అవే నేడు పాండవ లింగం  పాండవ తీర్థం అని పిలవబడుతున్నాయి. 
చాలా మంది  తిరువణ్ణామలై నివాసులకు కూడా వీటి గురించి తెలియదు. 
బాగా వర్షాలు కురిస్తే పర్వత  పాదాల వద్ద ఉండటంతో పాండవతీర్థం కూడా పూర్తిగా నిండి పోయి కనపడుతుంది. కొండ వాలులో నివసిస్తున్న వారికి పాండవ తీర్ధమే ప్రధాన నీటి వనరు. నీరు స్వచ్ఛంగా ఉంటుంది. గట్టున ఉన్న ఆలయంలో సర్వేశ్వరుడు పాండవ లింగ రూపంలో కొలువై ఉంటారు.  
గర్భాలయంలో శ్రీ పాండవ లింగేశ్వరుడు పక్కన ఉన్న సన్నిధులలో శ్రీ పార్వతీ దేవి మరియు  శ్రీ గణపతి కొలువుతీరి దర్శనమిస్తారు. ప్రతి రోజు ఉదయం పూట మాత్రమే  నిర్వహిస్తారు. శనివారం మాత్రం సాయం సంధ్యా సమయంలో ప్రత్యేక పూజ  చేస్తారు. 
 ఆలయానికి కొద్దిగా దిగువన మరో కోనేరు కనపడుతుంది. ఆకారంలో చిన్నదైన  రెండో కోనేరు పేరు"భీమ పుష్కరణి"ట. దానిని వాయుపుత్రుడు, అమిత బలవంతుడైన  భీమసేనుడు తమ నిత్యకృత్యాలకు మరియు  ప్రజల నీటి అవసరాల నిమిత్తం నిర్మించడం వలన ఆయన పేరుతోనే పిలుస్తున్నారట. పరమేశ్వరుని పూజాదికాల ప్రయోజనార్ధం నిర్మించబడిన పాండవ తీర్థ పవిత్రతను కాపాడటానికి దీనిని నిర్మించారట. కానీ నేడు ఈ భీమ పుష్కరిణి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనది. బాగుచేయడం అత్యంత ఆవశక్యంగ అనిపిస్తుంది చూడగానే !
మరో  విశేషం ఏమిటంటే నియమంగా ప్రతి నిత్యం సూర్యాస్తమయ కాలంలో రెండు కృష్ణ గరుడ పక్షులు వచ్చి శ్రీ పాండవ లింగేశ్వరునికి ఆకాశంలో ప్రదక్షిణాలు చేయడం. 
పవిత్ర అరుణాచల పర్వత పాదాల వద్ద నలువైపులా పరుచుకున్న పచ్చని చల్లని వాతావరణంలో శ్రీ పాండవ లింగేశ్వరుని దర్శించుకోవడం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. 
అగ్ని లింగం నుండి సుమారు రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. అగ్ని లింగం దగ్గర అడిగితే దారి చూపుతారు. 

శ్రీ దూర్వాస మహాముని సన్నిధి 

 మనుకున్న అనేక మంది మహర్షులలో శ్రీ దూర్వాసమహాముని స్థానం ప్రత్యేకమైనది. ఈయన ముక్కోపి. ఆ కోపకారణంగా అనేక మంది జీవితాలు రకరకాల మార్పులకు లోను కావడం మన పురాణాలలో కనపడుతుంది. కానీ అవన్నీ కూడా ఆయా వ్యక్తులలో కావలసిన మార్పు తేవడానికి లేక జీవిత గమనాన్ని సన్మార్గంలో ప్రయాణించడానికో కారణమవ్వడం విశేషం. అలా ఆయన ఆగ్రహానికి గురి కాకుండా అనుగ్రహాన్ని పొందిన ఒకే ఒక్కరు పాండవ మాత కుంతీదేవి. వివాహానికి పూర్వం తమ రాజ్యానికి విచ్చేసిన మహర్షికి తండ్రి కుంతిభోజుని ఆజ్ఞ మేరకు సముచిత అతిధి సేవలు అందించి ఆయనను సంతోషపరచినది. ఆనందంతో మహర్షి ఆమెకు ప్రసాదించిన వర ప్రభావంతో వివాహానికి ముందు ప్రత్యక్ష నారాయణుని అనుగ్రహంతో కర్ణుని, వివాహానంతరం ధర్మ, భీమ,అర్జనులను కుమారులుగా పొందడం మహాభారత  కథా గమనాన్ని మార్చడం వేరే విషయం. 
యోగ క్షేత్రం అయిన తిరువణ్ణామలైలో తాను సంతానాన్ని పొందడానికి పరోక్షంగా సహాయపడిన మహర్షి యొక్క ఆలయాన్ని నిర్మించాలన్న తలంపు కలిగిందట కుంతీదేవికి. 
తల్లి కోరిక తెలుసుకొన్న కుమారులు పవిత్ర గిరి మార్గంలో తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసి మహాముని విగ్రహాన్ని ప్రతిష్టించారట. 






అలా అరుణగిరి ప్రదక్షిణా మార్గంలో  ఇద్దరు మహర్షులతో పాటు శ్రీ దూర్వాస మహర్షి సన్నిధి ఏర్పడినది. ముఖ మండపం మరియు గర్భాలయం మాత్రమే  చిన్న ఆలయంలో శ్రీ దూర్వాస మహాముని పద్మాసనంలో ధ్యాన ముద్రలో ఉపస్థిత భంగిమలో దర్శనమిస్తారు. ఆలయానికి వెలుపల ఉన్నచిన్నరాతి మండపంలో కనిపించే పాద ముద్రలు కుంతీదేవివి అని చెబుతారు.  భక్తులు మహామునికి పసుపుతో అర్చన చేసి, నివేదన సమర్పించుకొంటారు. అనంతరం ఆలయానికి వెనుక ఉన్న వేప చెట్టుకు  పూసిన కొత్త గుడ్డను కడతారు. దీని వలన వివాహం వారికి వివాహం, సంతానం  వారికి సంతాన యోగం మహర్షి అనుగ్రహంతో కలుతాయన్నది తరతరాల విశ్వాసం. పౌర్ణమి, పర్వదినాలలో, ఆదివారాలు కొందరు స్త్రీలు వీటిని అక్కడ అమ్ముతుంటారు. అదేవిధంగా వేపచెట్టు పక్కన ఉన్న విశాల స్థలంలో సొంత ఇంటి కల నిజం కావాలన్న ఆశతో,దానికి మహర్షి ఆశీర్వాదాలు లభిస్తాయన్న తలంపుతో రాతిని రాతి పైన పేరుస్తారు భక్తులు.   
శ్రీ దూర్వాస మహాముని ఆలయం ప్ నుండి చీలి గిరి వెనుక ఉన్న మార్గంలో వచ్చే రెండో నంది విగ్రహానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుండి అరుణాచల దక్షిణ వాలుకు చూస్తే సహజసిద్ధంగా రాళ్లతో ఏర్పడిన నంది ముఖ దర్శనం లభిస్తుంది. 
అద్భుతాలకు నిలయమైన తిరువణ్ణామలై లో ఉన్న అనేక అద్భుతాలలో పైన పేర్కొన్న రెండూ కూడా చాలామందికి తెలియని అరుదైన ప్రదేశాలుగా పేర్కొనవచ్చును . 

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల  !!!

1 కామెంట్‌:

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...